Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మైసూరులో జరిగిన ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ 103వ స‌ద‌స్సులో ప్రధాని ప్రారంభోత్సవ ఉప‌న్యాస‌ం పూర్తి పాఠం

మైసూరులో జరిగిన ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ 103వ స‌ద‌స్సులో ప్రధాని ప్రారంభోత్సవ ఉప‌న్యాస‌ం పూర్తి పాఠం

మైసూరులో జరిగిన ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ 103వ స‌ద‌స్సులో ప్రధాని ప్రారంభోత్సవ ఉప‌న్యాస‌ం పూర్తి పాఠం

మైసూరులో జరిగిన ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ 103వ స‌ద‌స్సులో ప్రధాని ప్రారంభోత్సవ ఉప‌న్యాస‌ం పూర్తి పాఠం

మైసూరులో జరిగిన ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ 103వ స‌ద‌స్సులో ప్రధాని ప్రారంభోత్సవ ఉప‌న్యాస‌ం పూర్తి పాఠం

మైసూరులో జరిగిన ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ 103వ స‌ద‌స్సులో ప్రధాని ప్రారంభోత్సవ ఉప‌న్యాస‌ం పూర్తి పాఠం

మైసూరులో జరిగిన ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ 103వ స‌ద‌స్సులో ప్రధాని ప్రారంభోత్సవ ఉప‌న్యాస‌ం పూర్తి పాఠం


మైసూరు విశ్వ విద్యాలయం లో ఈ రోజు (3 జ‌న‌వ‌రి, 2016న‌) జరిగిన ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్‌సీ) 103వ స‌ద‌స్సులో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాల్గొని, ప్రారంభోత్స‌వ ఉప‌న్యాసమిచ్చారు. ఈ ఏడాది కాంగ్రెస్ ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశం ” సైన్స్ మ‌రియు టెక్నాల‌జీ సాయంతో దేశాభివృద్ధి సాధన ” అనేది.

ప్రధాన మంత్రి ఈ సంద‌ర్భంగా 103వ ఐఎస్‌సీ ప్లీన‌రీ ప్రొసీడింగ్స్‌, టెక్నాల‌జీ విజ‌న్ డాక్యుమెంట్‌- 2035ని విడుదల చేశారు. 2015-16 సంవ‌త్స‌ర ఐఎస్‌సీఏ అవార్డుల‌ను ప్రదానం చేశారు.

ప్రధాన మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం ఈ కింది విధంగా ఉంది.. :

క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ శ్రీ వజూభాయ్ వాలా, క‌ర్నాట‌క ముఖ్య‌మ‌త్రి శ్రీ సిద్ద‌రామ‌య్య‌,
నా మంత్రివర్గ స‌హ‌చ‌రులు డాక్టర్ శ్రీ హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌, శ్రీ వై.ఎస్. చౌద‌రి, భార‌త ర‌త్న ప్రొఫెస‌ర్ సి.ఎన్‌.ఆర్‌. రావు, ప్రొఫెస‌ర్ ఎ.కె. స‌క్సేనా, ప్రొపెస‌ర్ కె.ఎస్‌. రంగ‌ప్ప‌, నోబెల్ లారియేట్స్‌, ఫీల్డ్ మెడలిస్ట్, ప్రముఖ శాస్త్రవేత్త‌లు, మరియు ప్ర‌తినిధులారా..

సైన్స్ మ‌రియు టెక్నాల‌జీ కి సంబంధించిన దేశ, విదేశ ప్ర‌ముఖులతో కలసి ఈ స‌ంవత్సరం మొదట్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన‌డం నాకెంతో సంతోషంగా ఉంది. భార‌తదేశానికి బంగారు భ‌విష్య‌త్తు ఉంద‌న్న న‌మ్మ‌కం మీపై మాకున్న విశ్వాసం నుంచే క‌లుగుతోంది.

మైసూరు విశ్వ‌విద్యాల‌యం వంద సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భంగా నిర్వ‌హించిన వార్షికోత్స‌వ స‌ద‌స్సులో పాల్గొని ఈ కార్యక్రమాన్నిఉద్దేశించి ప్ర‌సంగించ‌డం నాకు ఎంతో గౌర‌వ‌మే కాకుండా, ఒక ప్ర‌త్యేక‌త‌ను కూడా సంత‌రిస్తున్న‌ది. భార‌త‌దేశంలో అత్యున్న‌త స్థానాల‌కు ఎదిగిన నాయ‌కులలో కొంద‌రు గౌర‌వ‌ప్ర‌ద‌మైన‌ ఈ విశ్వ‌విద్యాల‌యం నుంచి వచ్చిన వారే. అటువంటి వారిలో గొప్ప తత్వవేత్త, భారత దేశ రెండో రాష్ట్రప‌తి డాక్ట‌ర్ రాధాకృష్ణ‌న్, భారత రత్న ప్రొఫెస‌ర్ సి.ఎన్‌.ఆర్‌. రావు లాంటి మ‌హ‌నీయులుండటం విశేషం.

సైన్స్ కాంగ్రెస్, మైసూరు విశ్వ‌ విద్యాలయం.. ఈ రెండిటి చరిత్ర ఒకే సమయంలో శ్రీకారం చుట్టుకుంది. భారతదేశంలో ఒక‌ స‌రికొత్త చైతన్యం మొగ్గ తొడిగిన తరుణమది. ఆ వేళ‌ భార‌తదేశానికి స్వాతంత్ర్యంతో పాటు మాన‌వాబివృద్ధి కూడా సిద్ధించాలని కోరుకున్నది. అది కేవలం స్వతంత్ర భారతావనినే కోరుకోలేదు; తన మాన‌వ వ‌న‌రులు, శాస్త్రీయ విజ్ఞానం, పారిశ్రామిక పురోగతి వంటి అండదండలతో సొంత కాళ్ల మీద నిలువగల భారతదేశం కోసం వాంఛించింది. భార‌తీయుల ఘనమైన దూర దృష్టికి ఈ యూనివ‌ర్విటీ ఓ నిదర్శనం. ఇప్పుడిక‌ మనం భారతదేశంలో మరొక సాధికార‌త‌, అవకాశాల విప్లవాన్ని తీసుకువస్తున్నాం. సామాజిక సంక్షేమం, ఆర్థికాభివృద్ధి వంటి మన లక్ష్యాల‌ను అందుకోవడానికి మన సైంటిస్టులు , ఇన్నొవేట‌ర్ల‌ సేవలను పొందాలని భావిస్తున్నాం. తెలియ‌ని విష‌యాల‌ను తెలుసుకోవాల‌న్న జిజ్ఞాసే కాకుండా మనుషులు ఎదుర్కొంటున్న ప‌లు స‌వాళ్ల‌ను పరిష్కరించాలనే తపన కూడా ప్ర‌పంచాన్ని ముందుకు న‌డుపుతున్నది. ఈ స్ఫూర్తిని ప్ర‌తిబింబించడంలో పూర్వ రాష్ట్రప‌తి డాక్ట‌ర్ ఎ.పి.జె. అబ్దుల్ క‌లాంను మించిన వారు మ‌రొక‌రు లేరు. సైన్స్ ప‌రంగా గొప్ప విజ‌యాలు సాధించిన జీవితం ఆయ‌న‌ది. అంతే కాదు, మాన‌వాళి కోసం ఆయ‌న చూపిన ద‌య‌, ప‌రితాపం అంతులేనివి. బ‌ల‌హీనులు, అణగారిన వర్గాల వారు, యువ‌త.. వీరి జీవనాన్ని పూర్తిగా మార్చివేయడమే సైన్స్ పరమార్థం కావాలి అని ఆయ‌న ఎపుడూ ఆకాంక్షించే వారు. స‌మర్థ‌త , స్వావ‌లంబ‌న‌ క‌లిగిన, తన లోటుపాట్లను తానే తీర్చుకోగలిగిన దేశంగాను, శక్తిమంతమై తన ప్రజల బాగోగులు తానే చూసూకోగలిగిన దేశంగాను భారత్ రూపొందాలనేది ఆయ‌న జీవితాశ‌యం. ఆయ‌న‌ దృక్ప‌థానికి ఈ స‌ద‌స్సు ఇతివృత్తం దీటైన నివాళి.

ప్రొఫెస‌ర్ రావు, రాష్ట్రప‌తి కలాం వంటి నాయకులు, మీ వంటి శాస్త్రవేత్త‌లు భారతదేశాన్ని అనేక సంవత్సరాలుగా శాస్త్ర, సాంకేతిక రంగాల‌లోని అనేక క్షేత్రాల‌లో ముందువ‌రుస‌లో నిల‌బెట్టారు.

చిన్నఅణువు కేంద్రక స్థానం నుంచి మొదలుపెట్టి సువిశాలమైన అంతరిక్షం వ‌ర‌కు చూస్తే.. మన విజయాలు పరివ్యాప్తమైనాయి. ఆహార భద్రతను, ఆరోగ్య భద్రతను మనం పెంపొందింపచేసుకున్నాం ; ప్రపంచంలో ఇత‌రులు కూడా మెరుగైన జీవ‌నం అందుకొనేందుకు మ‌నం ఆశాకిర‌ణంగా నిలిచాం. మనం మన ప్రజల ఆకాంక్ష‌ల స్థాయిని పెంచుతున్న‌ట్లే, మ‌నం మ‌న ప్ర‌య‌త్నాల స్థాయిని కూడా పెంచుకోవ‌ల‌సి ఉంది. కాబట్టి, నా దృష్టిలో మంచి ఏలుబ‌డి అంటే విధానాలు రూపొందించడం, పారదర్శకంగా నడుచుకోవడం, జవాబుదారుతనం.. ఇవి మాత్ర‌మే కాదు ; మ‌నం తీసుకొనే నిర్ణ‌యాల‌లో, మనం అనుసరించే వ్యూహాలలో సైన్సును, టెక్నాల‌జీని మిళితం చేయడం కూడా. ప్రజా సేవల నాణ్యతను, వాటి పరిధిని, పేదలకు సామాజిక ప్రయోజనాలను మన డిజిట‌ల్ నెట్ వర్క్ లు విస్తరిస్తూ పోతున్నాయి. మొట్టమొద‌టి నేష‌న‌ల్ స్పేస్ కాన్ఫ‌రెన్సులో పరిపాలన, అభివృద్ధి, ప‌రిర‌క్ష‌ణ‌ల తాలూకు దాదాపు ప్రతి ఒక్క అంశాన్ని స్ప‌ర్శించ‌డం జ‌రిగింది. ఇలా 170 అప్లికేషన్లను గుర్తించాం.

ఇపుడు స్టార్ట‌ప్ ఇండియా అనే స‌రికొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నాం. దీని ద్వారా నవ కల్పన‌, నూత‌న సంస్థ‌ల‌ను ప్రోత్స‌హిస్తాం. విద్యాసంస్థ‌ల‌లో టెక్నాల‌జీ ఇంక్యుబేట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నాం. ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, సైంటిఫిక్ డిపార్ట్ మెంట్లలో సైంటిఫిక్ ఆడిట్ విధానాన్ని అమ‌లు చేయాల‌ని నేను కోరాను. అదే విధంగా కేంద్ర‌- రాష్ర్టాల‌ మధ్య మరింత అధిక శాస్త్రీయ స‌మ‌న్వ‌యం ఉండేటట్లు నేను ప్రోత్సహిస్తున్నాను.

సైన్స్ వనరుల స్థాయిని పెంచుకోవడానికి కృషి చేద్దాం. వాటిని మన వ్యూహాత్మక ప్రాధాన్యాల‌కు అనుగుణంగా వినియోగించుదాం. భారత దేశంలో సైన్స్, పరిశోధన ప్రక్రియలను సులభతరంగా మార్చుదాం. సైన్స్ అడ్మినిస్ర్టేషన ను మెరుగుపరుద్దాం. మంచి సైన్స్ ఎడ్యుకేష‌న్ ను, సైంటిఫిక్ రీసర్చ్ ను అందిద్దాం. అదే సమయంలో, నవ కల్పన (ఇన్నొవేష‌న్‌) ఒక్క‌టే సైన్స్ ధ్యేయం కాకూడదు; సైంటిఫిక్ ప్రాసెస్ ను కూడా ఇన్నొవేష‌న్ ముందుకు నడపాలి. తక్కువ ఖర్చులతో ఇన్నొవేష‌న్, క్రౌడ్ సోర్సింగ్ అనేవి సమర్థమైన, ప్రభావశీలమైన సైంటిఫిక్ ఎంట‌ర్‌ప్రైజ్‌కు ఉదాహ‌ర‌ణ‌లుగా నిలుస్తాయి. ధోరణిలో ఇన్నొవేష‌న్ అనేది ప్రభుత్వ కర్తవ్యం మాత్రమే కాదు, అది ప్రయివేటు రంగం, విద్యావేత్తల బాధ్యత కూడా అని మర్చిపోకూడదు. పరిమితంగా ఉన్న వ‌న‌రులు, పోటాపోటీ క్లెయిములు దాఖ‌లు అవుతున్న ప్రపంచంలో మనం మన ప్రాధాన్యాలను నిర్వచించుకోవడంలో ఎంతో బుద్ధి కుశ‌ల‌త‌ను చూపాలి. ఇది భార‌త్‌లో మరీ ముఖ్యం. మన దేశంలో సవాళ్లు అనేకం. వాటి పరిమాణం కూడా ఎంతో- ప్ర‌ధానంగా ఆరోగ్యం మొద‌లు ఆక‌లి, ఇంధ‌నం, ఆర్థిక వ్య‌వ‌స్థ‌- ఇలా దేనిని తీసుకున్నా.

పేరు పొందిన ప్ర‌తినిధులారా..

ఈ రోజు, ప్ర‌పంచ‌లోని పెను సవాళ్లలో ఒక స‌వాలును మీ ముందుకు తెస్తున్నా. గ‌త సంవ‌త్స‌రంలో ఇది ప్ర‌పంచ దృష్టిని త‌న వైపున‌కు తిప్పుకొంది. మరింత సంపన్నమైన ప్రపంచానికి దారి ఏద‌న్న‌ది మీరు చూప‌గ‌ల‌గాలి. మన భూగ్రహానికి మరింత స్థిరమైన భవితను మీరు కనుగొనాలి.

2015లో ప్ర‌పంచం రెండు చ‌రిత్రాత్మ‌క‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకుంది. వాటిలో ఒక‌టోది 2030 అభివృద్ది అజెండాను ఐక్య‌రాజ్య‌స‌మితి గ‌త సెప్టెంబ‌రులో ఆమోదించింది. 2030లోగా ఆర్థికాభివృద్ధి ని సాధించి, ప్ర‌పంచ దేశాల నుంచి పేద‌రికాన్ని పార‌దోలాలన్న అంశాన్ని అది మన ప్రాధాన్యాలన్నింటి కన్నా పైన నిలుపుతోంది. అదే తరుణంలో, మనం మన పర్యావరణాన్ని, జనవాస ప్రాంతాలను స్థిరంగా కాపాడుకోవాల‌ని కూడా చెబుతోంది. ఇంకా రెండోది ఏమిటంటే, ఎట్ట‌కేల‌కు, గ‌త న‌వంబ‌రులో ప్యారిస్‌లో భూగ్రహం గతిని మార్చివేసే ఒక చ‌రిత్రాత్మ‌క ఒప్పందంపై ప్ర‌పంచ దేశాలు ఒక్క‌తాటి మీద నిలిచాయి. అయితే, ఇంతే ముఖ్య‌మైన మ‌రొక దానిని మ‌నం సాధించ‌గ‌లిగాం.

వాతావరణ మార్పునకు ఇన్నొవేష‌న్‌, టెక్నాల‌జీ ల‌ను వినియోగించాలని చాటడంలో మనం కృత‌కృత్యులం అయ్యాం. లక్ష్యాలు, ప‌రిమితుల గురించి మాట్లాడ‌డంతోనే స‌రిపోదు, శుద్ధ‌మైన శ‌క్తి (క్లీన్ ఎన‌ర్జీ) వైపున‌కు సుల‌భంగా సాగిపోగ‌ల‌గడానికి కావలసిన సమాధానాలను అన్వేషించడం ముఖ్యమనే సందేశాన్ని అందించాం.

ఇన్నొవేష‌న్ అనేది వాతావ‌ర‌ణ మార్పుపై పోరాడ‌టానికి మాత్ర‌మే ముఖ్యమైంది కాదు, వాతావరణ న్యాయం సమకూరడానికి కూడా అది ముఖ్యమైనదే అని నేను ప్యారిస్ లో చెప్పాను. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎద‌గ‌డానికి వాటి అవసరాల కోసం తగినంత కార్బన్ స్పేస్ ను అభివృద్ధి చెందిన దేశాలు వదలివేయాలన్నాను. ఇది జ‌ర‌గాలంటే, అందరికీ వారి తాహతుకు తగినంతలో శుద్ధ‌మైన శక్తి (క్లీన్ ఎన‌ర్జీ) అందుబాటులోకి రావ‌డం కోసం మనం పరిశోధనలను, ఇన్నొవేష‌న్ ను కొనసాగించాలి. ప్యారిస్ లో ఓ ఇన్నొవేష‌న్ సమ్మిట్ కోసం అధ్యక్షుడు హోలాండ్‌, అధ్య‌క్షుడు ఒబామాల‌తో పాటు, నేను, ఇత‌ర ప్ర‌పంచ నాయ‌కులు క‌ల‌సి పనిచేశాం. స‌రికొత్త ప‌రిశోధన‌ల కోసం జాతీయ పెట్టుబడులను రెట్టింపు చేయాలని ప్రతిన పూనాం ; దీంతో పాటే ప్ర‌యివేటు రంగంలో స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌లు సాధ్యం అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవడానికి ప్రభుత్వాలు కూడా భుజం భుజం కలిపి ప్రపంచ స్థాయిలో భాగస్వామ్యాన్ని నిర్మించాలని సైతం ప్రతిన చేశాం. మనం శ‌క్తి (ఎన‌ర్జీ)ని త‌యారు చేసుకునే, పంపిణి చేసుకునే, వినియోగించుకునే ప‌ద్ధ‌తుల‌ను రాగల పదేళ్లలో సమూలంగా మార్చివేయడంపైన దృష్టిని కేంద్రీక‌రించే 30-40 ల్యాబ్‌లు, యూనివ‌ర్సిటీలతో కూడిన అంత‌ర్జాతీయ‌ నెట్ వర్క్ ను నెలకొల్పాలని కూడా నేను సూచ‌న చేశాను. దీనిపైన మళ్లీ జి-20 లోనూ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌బోతున్నాం.

ఇప్ప‌టిక‌న్నా చౌక‌గా, మ‌రింత ఆధార‌ప‌డ‌త‌గ్గ‌దిగా, ట్రాన్స్ మిష‌న్ గ్రిడ్ ల‌కు సుల‌భంగా అనుసంధానం అయ్యేదిగా ఉండేట‌టువంటి పునరుద్ధరణ యోగ్యమైన శక్తిని (రెన్యూవబుల్ ఎన‌ర్జీ) సాధించే దిశగా మనం నవకల్పన (ఇన్నొవేష‌న్)కు పూనుకోవలసి ఉంది. 2022 కల్లా అదనంగా 175 జీడ‌బ్ల్యూ రెన్యూవబుల్ ఎన‌ర్జీ ని సాధించాలని పెట్టుకున్న లక్ష్యాన్ని నెర‌వేర్చుకోవాల‌నుకుంటున్న భార‌త్ కు ఇది మ‌రింత కీల‌క‌మైన వ్యూహాత్మక అంశం. మనం బొగ్గు వంటి శిలాజ ఇంధ‌నాల‌ను మ‌రింత స్వ‌చ్ఛంగా, మ‌రింత స‌మ‌ర్ధంగా మ‌ల‌చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అంతే కాదు, సాగరపుటల‌లు ఆధారంగా, ఇంకా జియోథ‌ర్మ‌ల్ ఎన‌ర్జీ ని ఉత్ప‌త్తి చేసుకోవాలి. పారిశ్రామిక అభివృద్ధికి ఊతంగా నిలిచిన శ‌క్తి వ‌న‌రులు మన భూగోళాన్ని ప్ర‌మాదంలో ప‌డేస్తున్న వేళ‌.. అభివృద్ధి చెందుతున్న దేశాలు కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ను ఐశ్వ‌ర్యం ముంగిట నిల‌పాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న వేళ‌.. ప్ర‌పంచ దేశాలు భ‌విష్య‌త్తును తీర్చిదిద్దుకోవ‌డానికి సూర్యుడి వైపున‌కు తమ దృష్టిని సారించ‌వ‌ల‌సి ఉంది.

అందుకని, ఇప్ప‌టికే సౌర శక్తిని బాగా వాడుకుంటున్న దేశాల భాగ‌స్వామ్యం ద్వారా ఒక అంత‌ర్జాతీయ సౌర కూట‌మి (ఇంట‌ర్‌నేష‌న‌ల్ సోలార్ అల‌యెన్స్) కు భారత్ ప్యారిస్ వేదికగా రూపకల్పన చేసింది.

శుద్ధమైన శక్తి (క్లీన్ ఎన‌ర్జీ )ని ఉత్ప‌త్తి చేయ‌డానికి సైన్స్, టెక్నాల‌జీ మ‌న‌కు అవ‌స‌రం. అంతే కాదు, మన జీవితాలపై వాతావరణ మార్పు కలగించే ప్రభావంతో పోరాడటానికి కూడా సైన్స్, టెక్నాలజీల సాయాన్నితీసుకోవలసిన అవసరం ఉంది. వాతావరణ శీతోష్ణ స్థితులలో మార్పులకు త‌ట్టుకొన‌గ‌లిగే వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌ను మ‌నం రూపొందించుకోవ‌ల‌సి ఉంది. మన శీతోష్ణ స్థితులు, జీవ వైవిధ్యం (బయోడైవర్సిటీ), హిమానీ నదాలు, సముద్రాలపై వాతావరణ మార్పు కలగజేసే ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవలసి ఉంది; వాటితో ఎలా స‌ర్దుకుపోవాలో కూడా తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ప్రకృతి విప‌త్తులను ముందుగా అంచనా వేసే సామర్థ్యానికి పదును పెట్టుకోవలసిన అవసరం కూడా ఉంది.

ప్ర‌తినిధులారా..

శీఘ్ర న‌గ‌రీక‌ర‌ణ‌తో పాటే చుట్టుముడుతున్న స‌వాళ్ళ‌ను కూడా మనం తిప్పికొట్టవలసి ఉంది. ప్రపంచం మనుగడ స్థిరంగా సాగాలంటే, ఇది ఎంతో కీల‌కం కానుంది.

మానవాళి చరిత్రలో మొట్టమొదటిసారి మనం అర్బన్ సెంచురీలోకి అడుగుపెట్టాం. ఈ శతాబ్దం మధ్యకల్లా, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల ప్రజలు నగరాలలోనే జీవిస్తారు. ఈస‌రికే పట్టణ మురికివాడ లలో నివసిస్తున్న 3.5 బిలియన్ కోట్ల మంది ప్రజలకు కొత్తగా 3 బిలియన్ కు కాస్తంత తక్కువ సంఖ్యలో ప్రజలు తోడవనున్నారు. కొత్తగా జత కలిసే వారిలో నూటికి తొంభై మంది అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచే రానున్నారు. ఆసియాలో చాలా వ‌ర‌కు అర్బ‌న్ క్ల‌స్ట‌ర్ లు ప్ర‌పంచంలోని ఇత‌ర మధ్య సైజు దేశాల జ‌నాభానే మించిపోనున్నాయి.

భార‌త్ విష‌యానికి వ‌స్తే 2050 నాటికి 50 శాతం కన్నాఎక్కువ జ‌నాభా ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లోనే తలదాచుకుంటారు. 2025 కల్లా ప్రపంచంవ్యాప్త పట్టణ జనాభాలో 10 శాతానికి పైగా భారత్ లోనే వుండే అవకాశం ఉంది. ప్ర‌పంచంలో ప‌ట్ట‌ణాల‌లో ఉండే 40 శాతం మంది క‌నీస వ‌సతులు లేక జీవిస్తున్నార‌ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆర్థిక వృద్దికి, ఉద్యోగావకాశాలకు, సంప‌ద‌కు ప‌ట్ట‌ణాలే కేంద్ర బిందువులు. అలాగే, ప్రపంచంలోని మూడింట రెండు వంతుల విద్యుత్తును వినియోగించుకుంటున్నది కూడా ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర ప్రాంతాలే. ఫ‌లితంగా 80 శాతం గ్లోబ‌ల్ గ్రీన్ హౌ్స్ గ్యాస్ ఉద్గారాలు నగర ప్రాంతాల ఖాతాలోకే వస్తున్నాయి. అందువ‌ల్లే స్మార్టు సిటీస్ కు పెద్ద పీట వేస్తున్నాను.

మరింత సామర్థ్యం, సేవల అందజేతలో మంచి, మెరుగైన నగరాలుగానే కాకుండా మరింత స్థిరమైన అభివృద్ధి క‌లిగిన న‌గ‌రాలుగాను మన ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగానూ, ఆరోగ్యదాయకమైన జీవనాన్ని ప్రసాదించేదిగాను, ఈ నగరాలను తీర్చిదిద్దాలనేది ప్రణాళిక. ఈ ల‌క్ష్యాల‌ను సాధించ‌డానికి చక్కటి విధానాలు కావాలి. కానీ, మేము సృజ‌నాత్మ‌క‌మైన ప‌రిష్కారాల కోసం సైన్స్‌, టెక్నాల‌జీపై ఆధార‌ప‌డ ద‌ల‌చుకున్నాం. వారసత్వ కట్టడాలను ప‌రిర‌క్షిస్తూనే / స్థానిక పర్యావరణానికి చెరుపు చేయకుండానే / ప్రజా రవాణా గిరాకీని కొంత తగ్గించే / రద్దీని కుదించే / మెరుగైన రవాణా సదుపాయాలతో కూడిన నగరాల భవిష్యత్తును నిర్దేశించే శాస్త్రీయ మార్గాలను అన్వేషించవలసి ఉంది. నగర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించడం ఇంకా పూర్తి కాలేదు. స్థానికంగా దొరికే సామాగ్రిని శాస్త్రీయపరంగా వీలైనంత గరిష్ఠంగా ఉపయోగించుకోవాలి. భవనాలను మరింత తక్కువ శక్తిని వినియోగించుకునేలా తీర్చి దిద్దాలి. ఘన వ్యర్థాలను తగిన విధంగా, తక్కువ ఖర్చుతో వాడుకొనే మార్గాలను అన్వేషించాలి. వ్య‌ర్థ ప‌దార్థాలు భ‌వ‌న నిర్మాణాల‌కు వాడే ప‌ద్ద‌తుల‌ను రూపొందించాలి. వృథా జ‌లాల‌ను తిరిగి ఉప‌యోగించుకొనేటట్లు చూడాలి. రీసైక్లింగ్ అవ‌స‌రం. ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో శుభ్రంగా ఉండే గాలి ప‌ట్ట‌ణ వాసుల‌కు కావాలి. ప్ర‌కృతి వైప‌రీత్యాల‌కు త‌ట్టుకుని నిల‌బ‌డే భ‌వ‌నాలూ అవ‌స‌రమే.

పేరు పొందిన ప్ర‌తినిధులారా..

మ‌న భ‌విష్య‌త్తు మ‌నం వాడే భూమిపైన, స‌ముద్ర జలాల‌పైన ఆధార‌ప‌డి ఉంది. స‌ముద్రాలు 70 శాతం భూమిని ఆక్ర‌మించాయి. 40 శాతం మంది, ప్ర‌పంచంలోని 60 శాతం ప‌ట్ట‌ణ వాసులు సముద్ర తీరానికి వంద కిలోమీట‌ర్ల‌ దూరంలో నివసిస్తున్నారు. మ‌నం స‌రికొత్త యుగంలో ఉంటున్నాం. ఆర్థిక స్థితి గ‌తులు స‌ముద్ర జ‌లాల‌పై ఆధార‌ప‌డి ఉంటున్నాయి. స‌ముద్ర జ‌లాల వినియోగాల వ‌ల్ల సంప‌ద ఒన‌గూరుతోంది. ఆహార భ‌ద్ర‌త‌, మ‌త్స్య స‌ంపద‌, క్లీన్ ఎన‌ర్జీతో పాటు స‌రికొత్త మందులు .. ఇవ‌న్నీ కూడా స‌ముద్రాల నుంచి ల‌భిస్తున్నాయి. అందుకే చిన్నవైన ఐలాండ్ స్టేట్స్‌ను, పెద్ద సముద్ర దేశాలుగా నేను పేర్కొంటాను. భార‌త్ భ‌విష్యత్ కూడా స‌ముద్రాల‌పై ఆధార‌పడి ఉంది.

భార‌త్‌లో 1300 ద్వీపాలున్నాయి. 7500 కిలోమీటర్ల తీర ప్రాంత‌ముంది. 2.4 మిలియన్ చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల మేర ఎక్స్ క్లూజివ్ ఎక‌న‌మిక్ జోన్ ఉంది. అందుకే గ‌త ఏడాది బ్లూ ఎకాన‌మీకి ప్రాధాన్యం ఇచ్చాం.
భార‌త్‌లో మ‌రైన్ బ‌యాల‌జీ, బ‌యో టెక్నాల‌జీ రీసెర్చ్ సెంట‌ర్‌తో పాటు తీర ప్రాంతాలో రీసెర్ఛ్ సెంట‌ర్ల‌ను త్వ‌ర‌లో ఏర్పాటుచేస్తాం. మెరైన్ సైన్స్‌, ఓష‌న్ ఎకాన‌మీ లపై వివిధ దేశాల‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ‘ఓష‌న్ ఎకాన‌మీ, ప‌సిఫిక్ ఐలాండ్ కంట్రీస్’ అన్న అంశంపై అంత‌ర్జాతీయ స‌మావేశాన్ని నిర్వ‌హించబోతున్నాం.

మాన‌వ చ‌రిత్ర‌లో న‌దుల పాత్ర ఎంతో ఉంది. న‌దీన‌దాలు నాగ‌క‌రిక‌తకు పుట్టినిల్లుగా ఉన్నాయి. ఇప్పుడు చాలా వర‌కు నదులు క‌లుషిత‌మైనాయి. భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం వాటిని బాగు చేయాలి. అందుకోసం నియంత్ర‌ణ‌ వ‌ంటి విధానాలు. పెట్టుబ‌డులు, మేనేజిమెంటు త‌ప్ప‌నిస‌రి. నగరీకరణ ప్ర‌భావం, సాగు ప‌ద్ధ‌తులు, పారిశ్రామికాభివృద్ధి, భూగ‌ర్భ జ‌ల మ‌ట్టాలు వంటి విష‌యాల‌ను అధ్య‌య‌నం చేయాలి. ప్ర‌కృతికి న‌ది ఒక ఆత్మ‌గా ఉంటుంది. ప్ర‌కృతిలో భాగ‌మే స‌మాజం. ప్ర‌కృతిలో వివిధ రూపాల‌లో దైవ‌త్వం దాగి ఉంటుంది.

పేరు పొందిన ప్ర‌తినిధులారా..

మాన‌వాళి- ప్ర‌కృతి మ‌ధ్య స‌యోధ్య అవ‌స‌రం. అందుకోసం సంప్రదాయ విజ్ఞానాన్ని ఉప‌యోగించాలి. దీని ద్వారానే పూర్వీకులు విస్తారంగా సంప‌ద‌ను సాధించ‌గ‌లిగారు. ప్ర‌స్తుతం ఎదుర‌వుతున్న అనేక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు ప్ర‌కృతిలోనే ల‌భ్యం అవుతాయి. స‌నాత‌న విజ్ఞానం, ఆధునిక ప‌రిశీల‌న‌ల మ‌ధ్య అంతరాన్ని అధిగ‌మించి, స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాల‌ను క‌నుగొనాలి. ఉదాహ‌ర‌ణ‌కు వ్య‌వ‌సాయ రంగంలో అధికోత్ప‌త్తుల‌ను సాధించాలంటే, నీటిని ఆచితూచి వాడాలి. పోష‌క విలువ‌ల‌ను కాపాడాలి.. ఈ రంగంలో స‌త్‌ఫ‌లితాల‌ను సాధించాలంటే, పాత – కొత్త మెళుకువ‌ల‌ను వాడాలి. వైద్యంలో కూడా ఇదే ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రించాలి. సంప్ర‌దాయ మందులు, యోగాను పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ ప‌ద్ధ‌తుల మూలంగా ఆరోగ్యం ఒన‌గూరుతుంది. జీవనశైలి మారిన ఈరోజుల‌లో యోగా, ఇత‌ర ఆరోగ్య ప‌ద్ధతులు ప్ర‌జ‌ల‌కు మేలు చేకూరుస్తాయి.

ప్రసిద్ధి చెందిన ప్ర‌తినిధులారా..

భార‌త్ ఇత‌ర ప్ర‌పంచ దేశాల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా ఉండాలి. సైన్స్ టెక్నాల‌జీ రంగాల‌లో కూడా అనేక విజ‌యాల‌ను సాధించింది. అయితే అదే సమయంలో చాలా మంది వారి జీవనంలో నిరాశ నిస్పృహ‌లు అలుముకొని ఒక ఆశాకిర‌ణం కోసం ఎదురుచూస్తున్నారు. హుందాగా బ‌తకాలని కోరుకుంటున్నారు. వారి ఆకాంక్ష‌ల‌ను మ‌నం నెర‌వేర్చాలి. స‌నాత‌న ధ‌ర్మాల‌కు, పురాత‌న వైద్యాల‌కు, ఆధునిక భావాల‌కు మారు పేరైన భార‌త్ వివిధ స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న వారిని ఆదుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ప్రపంచంలో ఆరింట ఒక వంతు జనాభా స్థితిగతులను ఉద్ధరించగలిగితే, అది ప్రపంచానికి గణనీయంగా మేలు చేయడమే అవుతుంది. ఇది మీ నాయకత్వం, మద్ధతు వల్లే సాద్యం అవుతుంది.

ఈ విష‌యంలో విక్రం సారాభాయ్ చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేస్తున్నా. “శాస్త్ర‌వేత్తలు వారికి అవగాహన ఉన్న రంగాలకు వెలుపల ఉండే ఇతర సమస్యల పట్ల ఆస‌క్తిని పెంచుకోవాల‌ని మేము వారిని ప్రోత్సహిస్తాము” అని ఆయన అనే వారు.

సైంటిస్టులు, టెక్నాలజిస్టులు కొన్ని సిద్ధాంతాలను (వీటిని నేను అయిదు E – లు అని అంటాను) అమ‌లు చేయడం వల్ల సైన్స్ కలుగజేసే ప్రభావం ఎంతో ఎక్కువగా ఉంటుంది.. :

Economy – స‌మ‌స్య‌ల‌కు త‌క్కువ ఖర్చుతో కూడిన ధ‌ర‌లు ప‌రిష్కారాలు ల‌భించిన‌పుడు ఎకాన‌మీ అంటాం.

Environment – మన కర్బన పాద ముద్ర ప్ర‌భావం అతి త‌క్కువ‌గా ఉన్న‌పుడు.. అది పర్యావరణంపై చూపే ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

Energy – శక్తిపై అతి తక్కువగా ఆధార‌ప‌డి మన సంపద వృద్ధి చెందుతూ ఉన్న‌ప్పుడు; మనం ఉప‌యోగించే ఇంధ‌నం ఆకాశాన్ని నీలంగాను, భూమిని ప‌చ్చ‌గాను ఉంచుతుంది.

Empathy – సామాజిక సవాళ్ళకు, పరిస్థితులకు, సంస్కృతి సంప్ర‌దాయాలకు అనుగుణ‌ంగా మన చ‌ర్య‌లున్న‌పుడు;

Equity – మ‌న శాస్త్ర విజ్ఞానం స‌మ్మిళిత అభివృద్ధికి దారితీసి బ‌డుగుల సంక్షేమాన్ని కాంక్షించిన‌ప్పుడు.

శాస్త్రీయ రంగంలో వంద సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న స‌మ‌యంలో ఈ ఏడాదికి అత్యంత ప్రాధాన్య‌ం ఉంది. 1916లో ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త ఐన్ స్టిన్ సాపేక్ష సిద్ధాంతానికి పునాది వేశారు. మ‌నిషి సాంకేతిక ప‌రిశీల‌న‌లు, ప‌రిశోధన‌లు ప‌ట్ల చూపించే శ్ర‌ద్ధాస‌క్తులు అత‌డి భ‌విష్య‌త్తును నిర్దారిస్తాయి అన్న ఐన్ స్టిన్ మాన‌వ‌తా వాదాన్ని ఇవాళ మ‌నం గుర్తు చేసుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. “మనిషి తన గురించి తాను ఆందోళన చెందాలి. సాంకేతికంగా వేసే ప్రతి ముందడుగూ ఆయన భావి గతిని నిర్దేశించేలా ఉండాలి”. మనం.. ప్రజాసేవలో ఉన్నా, లేదా ప్రైవేటు వ్యక్తులం అయినా, లేదా వ్యాపారం చేస్తున్నా, లేదా సైన్స్ లో పరిశోధనలు చేస్తూ ఉన్నా.. మన భ‌విష్య‌త్ త‌రాల కోసం భూ ప్రాంతాల‌ను కాపాడాలి. ధ్వంసం చేయ‌రాదు. ఇంత‌కు మించిన పరమ క‌ర్త‌వ్యం మ‌రొకటి ఉండ‌దు. ఈ ఉమ్మడి ల‌క్ష్య సాధ‌న‌కు సైన్స్, టెక్నాల‌జీ, ఇంజినీరింగ్ రంగాలకు చెందిన వేరు వేరు శాఖలు ఒక్క‌టిగా ఉప‌యోగ‌ప‌డాలి.

ధన్యవాదాలు.