Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘మేక్ ఇన్ ఇండియా వీక్’ ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం

‘మేక్ ఇన్ ఇండియా వీక్’ ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం

‘మేక్ ఇన్ ఇండియా వీక్’ ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం


హిజ్ ఎక్స్‌లెన్సీ, ద‌ ప్రైమ్ మినిస్ట‌ర్ ఆఫ్ స్వీడ‌న్‌

హిజ్ ఎక్స్‌లెన్సీ, ద‌ ప్రైమ్ మినిస్ట‌ర్ ఆఫ్ ఫిన్లాండ్‌

హిజ్ ఎక్స్‌లెన్సీ, ద‌ ఫ‌స్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోలాండ్‌

ప‌లు దేశాల‌ నుంచి వ‌చ్చిన మంత్రులు, ప్ర‌ముఖులు, గౌర‌వ‌నీయ ప్ర‌తినిధులారా..

మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌,

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి,

కేంద్ర వాణిజ్య ప‌రిశ్ర‌మ‌ల శాఖ స‌హాయ మంత్రి,

ఆహ్వానితులు, ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు,

లేడీస్ అండ్‌ జంటిల్ మ‌న్..

‘మేక్ ఇన్ ఇండియా వీక్’ లో పాల్గొంటున్నందుకు నేను ఎంతోగానో సంతోషిస్తున్నాను. భార‌త‌దేశ వాణిజ్య రాజ‌ధానిగా పేరు పొందిన ముంబ‌యికి మీకంద‌రికీ ఘ‌న‌ స్వాగ‌తం ప‌లుకుతున్నాను. ముఖ్యంగా విదేశాల‌ నుంచి వ‌చ్చి ఈ కార్య‌క్ర‌మంలోపాల్గొంటున్న‌ మ‌న‌ స్నేహితుల‌కు ఇదే మా స్వాగ‌తం.. సుస్వాగ‌తం. ఇంత‌టి ఘ‌న‌మైన కార్య‌క్ర‌మానికి ఆతిథ్య‌మిస్తున్నందుకు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి అభినంద‌నలు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్న ప‌లు ఇత‌ర రాష్ట్రాల‌కు నా అభినంద‌న‌లు.

స్నేహితులారా!

సంవ‌త్స‌రం క్రితం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన‌ నాటి రోజుల‌ను గుర్తు చేసుకుంటే, నా మ‌దిలో మా దేశ యువ‌త ఆకాంక్ష‌లు మెదులుతున్నాయి. దేశ జ‌నాభాలోని 65 శాతం మంది ప్ర‌జ‌లు 35 సంవ‌త్స‌రాల‌ లోపు వ‌య‌స్సు ఉన్న‌ వారే. ఈ యువ‌ శ‌క్తే మా దేశానికి గ‌ల అత్యంత గొప్ప శ‌క్తి.

దేశంలో ఉద్యోగాల క‌ల్ప‌న పెంపొందింప‌చేయ‌డానికి, మ‌న యువ‌త స్వ‌తంత్రోపాధి అవ‌కాశాల‌ను పొంద‌డానికి మేం మేక్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాం. భార‌త‌దేశాన్ని అంత‌ర్జాతీయ త‌యారీ కేంద్రంగా మార్చ‌డానికి ఎంతో తీవ్రంగా శ్రమిస్తున్నాం. రాబోయే రోజుల్లో భార‌త‌దేశ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో త‌యారీ రంగం వాటాను 25 శాతానికి చేర్చాల‌నుకుంటున్నాం.

మేక్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మం స‌ఫ‌లం కావాలంటే ప్ర‌భుత్వ యంత్రాంగం అనేక మార్పు చేర్పులు.. ముఖ్యంగా విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో.. చేసుకోవాలి.

వ్యాపారం చేయ‌డానికి అనువైన ప్రాంతంగా దేశాన్ని తీర్చిదిద్ద‌డానికి మేం నిబ‌ద్ధ‌త‌తో కృషి చేస్తున్నాం.

త‌యారీలో, డిజైన్‌లో, ప‌రిశోధ‌నల వికాసంలో అనేక అవ‌కాశాలు భార‌త‌దేశంలో ఉన్నాయ‌నే విష‌యాన్ని ప్ర‌పంచం తెలుసుకోవడానికి వీలుగా అనేక చ‌ర్య‌లు చేప‌ట్టాం.

అలాంటి చ‌ర్య‌ల్లో ఒక‌టి ఈ ‘మేక్ ఇన్ ఇండియా వీక్’. ఇంత‌వ‌ర‌కు ఏం సాధించాం, ఇక ముందు ఎలా ప్ర‌యాణించాలి? త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకోవ‌డానికి ఈ వారోత్స‌వం ఉప‌యోగ‌ప‌డుతుంది.

భార‌త‌దేశం సాధించిన ప్ర‌గ‌తిలోని ప‌లు కోణాల‌ను ఈ వారోత్స‌వం క‌ళ్ల‌కు క‌డుతుంది.. దేశంలో ఇదివ‌ర‌కు ఎన్నడూ లేని విధంగా ప‌లు రంగాల‌తో కూడిన అతి పెద్ద ప్ర‌ద‌ర్శన ఇది. భార‌త‌దేశం ప్ర‌యాణిస్తున్న దిశ‌ను మీరు స్వ‌యంగా చూడాల‌ని నేను కోరుతున్నాను.

ఈ సంద‌ర్భంగా నా ఆలోచ‌న‌ల్ని మీతో పంచుకోవాల‌నుకుంటున్నాను.

· ‘మేక్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మం’ మునుపు ఎన్న‌డూ లేని విధంగా ఏడాది స‌మ‌యంలోనే ఒక అతి పెద్ద బ్రాండుగా అవ‌త‌రించింది. దేశం లోప‌ల‌, దేశం వెలుప‌ల‌ ఈ కార్య‌క్ర‌మం అనేక మంది ప్ర‌జ‌ల‌, సంస్థ‌ల‌, ప‌రిశ్ర‌మ‌ల‌, మీడియా సంస్థ‌ల‌, రాజ‌కీయ అధినేత‌ల దృష్టిని ఆక‌ర్షించింది.

· ఈ విజ‌యం ఎలా సాధించ‌గ‌లిగామంటే.. మేక్ ఇన్ ఇండియా అనేది ప్ర‌జ‌లంద‌రి ల‌క్ష్యం. దీని ద్వారా ఉత్ప‌త్తి కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని అంద‌రూ బ‌లంగా భావిస్తున్నారు. అంతే కాదు త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తువులు, సేవ‌లు కావాల‌నే అంత‌ర్జాతీయ డిమాండ్ ను ఇది ప్ర‌తిఫ‌లిస్తోంది.

· మేక్ ఇన్ ఇండియా అనే కార్య‌క్ర‌మం వ‌ల్ల మేం మార్పుచేర్పులు చేసుకొని సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. భార‌త‌దేశం ఇత‌ర దేశాల‌తో స‌మానంగా రూపొందడానికి, అంత‌ర్జాతీయంగా అంద‌రితో క‌లిసిపోగ‌లిగే స్థాయికి చేరుకోవ‌డానికి మేక్ ఇన్ ఇండియా దోహ‌ద‌ప‌డుతుంది.

ఇంత‌వ‌ర‌కూ మేం సాధించినదానికి సంబంధించి కొన్ని బ‌ల‌మైన ఉదాహ‌ర‌ణ‌ల్ని మీకు చెప్పాలి.

. ఎఫ్ డి ఐ ల విష‌యంలో బ‌హుశా ప్ర‌పంచంలోనే భార‌త‌దేశం ఎంతో ఉదార‌త‌ క‌లిగిన దేశంగా గుర్తింపు పొందింది. ఎఫ్ డి ఐల‌కు సంబంధించిన రంగాల్లో చాలావ‌ర‌కు ఆటోమేటిగ్గా ఆమోదం పొందుతున్నాయి.

· మా ప్ర‌భుత్వం ప‌రిపాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టినప్ప‌టి నుంచి చూస్తే దేశంలోకి ఎఫ్ డి ఐ ల ప్ర‌వాహం పెరుగుతూ వ‌స్తోంది. ఇవి ఇంత‌వ‌ర‌కు 48 శాతం పెరిగాయి. గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ లో మునుపు ఎన్న‌డూ లేని విధంగా దేశంలోకి అధిక మొత్తంలో ఎఫ్ డి ఐ వ‌చ్చింది. ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఎఫ్ డి ఐ గ‌ణ‌నీయంగా త‌గ్గిపోతున్న సమ‌యంలో భార‌త‌దేశంలో ఎఫ్ డి ఐ పెరుగుతూ రావ‌డం గ‌మ‌నార్హం.

· టాక్సుల రంగంలో అనేక‌ సంస్క‌ర‌ణ‌లు తెచ్చాం. రెట్రోస్పెక్టివ్ టాక్సేష‌న్ చేప‌ట్ట‌బోమ‌ని ఇదివ‌ర‌కే చెప్పాం. ఈ మాట మీద‌నే నిల‌బ‌డ‌తామ‌ని ఈ సంద‌ర్భంగా మ‌రోసారి నేను స్ప‌ష్టం చేస్తున్నాను. మా ప‌న్నుల వ్య‌వ‌స్థ పార‌ద‌ర్శ‌కంగా, స్థిరంగా, స్ప‌ష్టంగా ఉండ‌డానికి చాలా వేగంగా అన్నిర‌కాల చ‌ర్యలు తీసుకుంటున్నాం.

· భార‌త‌దేశంలో వ్యాపారం చేయ‌డానికి అన్నివిధాలా అనుకూల‌మైన ప‌రిస్థితులుండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. త‌యారీ రంగంలో నిర్ణ‌యాత్మ‌క‌మైన అడుగులు వేస్తున్నాం. విధి విధానాల‌ను సుల‌భ‌త‌రం చేశాం. వాటిని శాస్త్రీయంగా తీర్చిదిద్దాం. లైసెన్సులు ఇవ్వ‌డం, స‌రిహ‌ద్దు దేశాల‌తో వ్యాపారం, భ‌ద్ర‌తాప‌రంగా, ప‌ర్యావ‌ర‌ణ‌ప‌రంగా ఆమోదాలు తెల‌ప‌డంలో విధి విధానాల‌ను స‌ర‌ళ‌త‌రం చేశాం.

· ఎల‌క్ట్రానిక్స్‌, టెక్స్‌టైల్స్ రంగాల‌తో స‌హా ప‌లు రంగాలో ఆక‌ర్ష‌ణీయ‌మైన ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టాం.

· ర‌క్ష‌ణ‌ రంగంలో చెప్పుకోద‌గ్గ స్థాయిలో విధాన‌ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌లు తెచ్చాం. లైసెన్సులు ఇవ్వడం, ఇత‌ర దేశాల‌ కంపెనీల‌కు మ‌న వ‌స్తువుల్ని అమ్మ‌డం, అందుకు ప్ర‌తిగా వారి ద‌గ్గ‌ర‌ నుంచి కొన‌డానికి సంబంధించిన ఆఫ్‌సెట్ విధానంలో, ఎగుమ‌తుల విధానంలో.. ర‌క్ష‌ణ‌ శాఖ ఆశిస్తున్న విధంగా మార్పులు చేర్పులు చేయ‌డం జ‌రిగింది.

· స‌హ‌జ వ‌నరుల కేటాయింపులో పార‌ద‌ర్శ‌క‌త‌ను పాటిస్తూ చాలా సున్నితంగా వ్య‌వ‌హ‌రించాం. దీనివ‌ల్ల మ‌న‌కు రెండు విధాల ప్ర‌యోజ‌నాలు సిద్దిస్తాయి. ఒక వైపున అలాంటి వ‌న‌రుల ఉత్ప‌త్తి పెరుగుతుంది.

· మ‌రో వైపున పార‌ద‌ర్శ‌క విధానం కార‌ణంగా వినియోగ‌దారులు, భాగ‌స్వాములు అంద‌రూ స‌మానంగా ల‌బ్ధి పొందుతారు.

· ఈ సంవ‌త్స‌రం రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్ప‌త్తిని సాధించ‌బోతున్నాం.

· అంతే కాదు, 2015లో మునుపెన్నడు లేనివిధంగా ఎల‌క్ట్రిసిటీని ఉత్ప‌త్తి చేసి రికార్డు నెలకొల్పాం.

· ఆస్తుల భ‌ద్ర‌త‌, హ‌క్కుల విష‌యాన్ని తీసుకుంటే.. దీనికి సంబంధించి ఒక చ‌ట్టం ఇప్ప‌టికే ప్ర‌వేశ‌పెట్టాం. వీటికి సంబంధించిన కేసులు వేగంగా ఒక కొలిక్కి వ‌చ్చే విధంగా ఈ చ‌ట్టాన్ని తేవ‌డం జ‌రిగింది. అంకిత‌ భావంతో ప‌ని చేసే క‌మ‌ర్షియ‌ల్ కోర్టుల‌ను, క‌మ‌ర్షియ‌ల్ విభాగాల‌ను హైకోర్టుల‌ ప‌రిధిలో ఏర్పాటు చేస్తున్నాం. కంపెనీ లా ట్రిబ్యున‌ల్ ఏర్పాటు ప్ర‌క్రియ చివ‌రి ద‌శ‌లో ఉంది.

· త్వ‌ర‌లోనే మేలైన ఐపిఆర్ విధానాన్ని, పేటెంట్ వ్య‌వ‌స్థ‌ను నెల‌కొల్ప‌బోతున్నాం. ప్ర‌స్తుతం పార్ల‌మెంటులో ఉన్న దివాళా బిల్లు త‌ర్వ‌లోనే ఆమోదం పొందుతుంద‌ని ఆశిస్తున్నాం.

విధివిధానాల ప్ర‌కారం చూస్తే మేం మా వ్య‌వ‌స్థ‌ల్ని సంస్క‌రించుకొని సులువైన‌విగా, బాధ్య‌తాయుతంగా మెలిగేలా, వ్యాపార‌వాణిజ్యాల‌కు అనువైన‌విగా రూపొందించాం.

స‌ర్కార్ ప‌రంగా క‌ల‌గ‌జేసుకోవ‌డాలు త‌క్కువ‌గా ఉండేలా చూసుకుంటూనే పూర్తి స్థాయిలో ప‌రిపాల‌న‌ను అంద‌జేయాల‌నే సూత్రాన్ని నేను న‌మ్ముతాను. కాబ‌ట్టి ప్ర‌తి రోజూ మేం పెట్టుబ‌డుల‌ను, వాటి వృద్ధిని అడ్డుకునే స‌మ‌స్య‌ల‌ను వెను వెంట‌నే ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం.

సంస్క‌ర‌ణ‌లు, మార్పులు చేర్పులు అనేవి కేంద్ర ప్ర‌భుత్వ స్థాయిలోనే కాదు భార‌త‌దేశంలోని ఆయా రాష్ట్రాల స్థాయిలో కూడా జ‌రగ‌డం ఎంతో సంతోషించ‌ద‌గ్గ విష‌యం. వ్యాపార, వాణిజ్యాలు సులువుగా జ‌ర‌గ‌డానికి వీలుగా, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో రాష్ట్రాల మ‌ధ్య‌ ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ నెల‌కొంది.

మొత్తం మీద వ‌స్తున్న ఫ‌లితాలు ప్రోత్సాహ‌క‌రంగా ఉన్నాయి.

· ప్ర‌పంచంలోనే భార‌త‌దేశ ఆర్థిక‌ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారీ ఆర్థిక రంగంగా గుర్తింపు పొందింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం అంతానికి మేం 7 శాతానికి పైగానే జిడిపిని సాధించ‌గ‌లుగుతాం. ఈ విష‌యంలో ఐఎంఎఫ్‌, ప్ర‌పంచ బ్యాంకు, ఒ ఇ సి డి, ఎ డి బి లు మ‌రింత మెరుగైన వృద్ధిని అంచ‌నా వేశాయి.

· 2014- 15 సంవ‌త్స‌రంలో ప్ర‌పంచ‌ వృద్ధిలో భార‌త‌దేశ వాటా 12.5 శాతం. ప్ర‌పంచ ఆర్థిక రంగంలో భార‌త‌దేశ వాటాతో పోల్చిన‌ప్పుడు ప్ర‌పంచ వృద్ధిలో భార‌త‌దేశం వాటా అనేది 68 శాతం అధికంగా ఉంది.

ఇక్క‌డ నేను మ‌రి కొన్ని సూచిక‌ల‌ను ప్ర‌స్తావించ‌ద‌ల్చుకున్నాను.

· ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూసిన‌ప్పుడు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి భార‌త‌దేశం అత్య‌ధిక ఆక‌ర్ష‌ణీయ‌మైన దేశంగా ప‌రిగ‌ణిస్తూ ప్ర‌పంచ‌లోని ప‌లు ఆర్థిక సంస్థ‌లు, ఏజెన్సీలు ఇప్ప‌టికే ప‌లు మార్లు ప‌దే ప‌దే పేర్కొన్నాయి.

· వ్యాపారం చేయ‌డానికి అనుకూల‌మైన దేశాల విష‌యంలో ప్ర‌పంచ‌ బ్యాంకు ప్ర‌క‌టించిన ర్యాంకింగ్‌లో భార‌త‌దేశం స్థానం మెరుగైంది. గ‌తంతో పోలిస్తే 12 స్థానాల‌కు పైగా ఎగ‌బాకింది. · పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణీయ‌త‌కు సంబంధించిన ర్యాంకింగ్‌ను యుఎన్ సిటిఎడి ప్ర‌క‌టించింది. ఇందులో భార‌త‌దేశం స్థానం 15నుంచి 9కి ఎగ‌బాకింది.

· వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్ ప్ర‌క‌టించిన గ్లోబ‌ల్ కాంపిటిటివ్ ఇండెక్స్‌లో 16 స్థానాల‌కు పైగా ఎగ‌బాకింది.

· మూడీజ్ కూడా త‌న రేటింగును అప్‌గ్రేడ్ చేస్తూ ఇండియా రేటింగును పాజిటివ్‌గా పేర్కొంది.

మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ ఉధృతి మాలో విశ్వాసాన్ని పెంచింది. మా విధి విధానాల‌ను మ‌రింత స‌ర‌ళీకృతం చేయ‌డానికి, స్నేహ‌పూర్వ‌కంగా ఉండ‌డానికి ఈ క్యాంపెయిన్ దోహ‌దం చేసింది.

ఈ నేప‌థ్యంలో మీరు ఇండియాను మీ కార్యక్షేత్రంగానే కాదు, మీ నివాస స్థ‌లంగా కూడా చేసుకోవాల‌ని నేను ఆహ్వానిస్తున్నాను.

స్నేహితులారా!

త‌రువాతి త‌రాల అవ‌స‌రాల‌ను తీర్చ‌గ‌లిగే మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో పెట్టుబ‌డుల‌ను అధికం చేయ‌డంపై మేం దృష్టి పెట్టాం. ఇందులో ర‌హ‌దారులు, నౌకాశ్ర‌యాలు, రైల్వేలు, విమానాశ్ర‌యాలు, డిజిట‌ల్ వ్య‌వ‌స్థ‌లు, స్వ‌చ్ఛ శ‌క్తి రంగాలు ఉన్నాయి.

· దేశ ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన జీవితాన్ని అందివ్వ‌డానికి, వారి ఆదాయాలు పెంచ‌డానికి సామాజిక‌, పారిశ్రామిక‌, వ్య‌వ‌సాయ రంగాల‌కు సంబంధించిన మౌలిక వ‌స‌తుల‌ క‌ల్ప‌న‌లో పెట్టుబ‌డులు పెడుతున్నాం.

· ఇంత‌వ‌ర‌కు అమ‌లు చేయ‌గ‌లిగే సామ‌ర్థ్య‌మే అతి పెద్ద అవ‌రోధంగా నిలిచింది. విధానాల్ని వేగ‌వంతం చేశాం. త‌ద్వారా ప్రాజెక్టులు వేగవంతం అయ్యాయి.

· 2015లో మునుపెన్న‌డూ లేని విధంగా కొత్తగా అత్య‌ధిక కిలోమీట‌ర్ల‌ మేర‌ ప్ర‌ధాన ర‌హ‌దారుల ప్రాజెక్టుల‌ను చేప‌ట్ట‌డం జ‌రిగింది.

· అదే విధంగా ఈ సంవ‌త్స‌రం రైల్వే కాపిట‌ల్ వ్య‌యంలో అత్య‌ధిక పెరుగుద‌ల ఉండేలా చూశాం.

· భౌతిక మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కావ‌చ్చు, సామాజిక మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కావ‌చ్చు; వాటిని చేప‌ట్ట‌డంలో, నిర్వ‌హించ‌డంలో మునుపెన్న‌డూ లేని విధంగా స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్నాం.

· మ‌రొక అవ‌రోధం ఆర్థిక స‌హాయం. ఆర్థిక‌ సాయాన్ని పెంచ‌డానికి వినూత్న‌మైన విధానాల్ని అనుస‌రిస్తున్నాం. ప్రభుత్వ‌- ప్రైవేట్ భాగ‌స్వామ్యం కోసం మా గ్రీన్‌ఫీల్డ్‌, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టుల‌ను అందుబాటులోకి తెచ్చాం. బ‌ల‌మైన ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌తో, లీకేజీల‌ను అరిక‌డుతూ మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు గాను మ‌రిన్ని వన‌రుల‌ను అందించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం.

· జాతీయ పెట్టుబ‌డుల‌, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న నిధిని ఏర్పాటు చేసుకున్నాం. రైల్వేలు, ర‌హ‌దారులు, నీటి పారుద‌ల రంగాల్లో ప్రాజెక్టులు చేప‌ట్ట‌డానికి వీలుగా ప‌న్నుర‌హిత మౌలిక వ‌స‌తుల బాండ్ల‌ వ్య‌వ‌స్థ‌ను రూపొందించాం.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల‌తో, ఆర్థిక మార్కెట్లు, నిధుల సంస్థ‌లతో చ‌ర్చించి ఆర్థిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తున్నాం.

లేడీస్ అండ్ జెంటిల్ మ‌న్..

భార‌త‌దేశం అనేక అవ‌కాశాల‌కు నిల‌య‌మైన దేశం. దేశంలోని యాభై న‌గ‌రాలు మెట్రో రైలు వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నాయి. అంతే కాదు యాభై మిలియ‌న్ గృహాల్ని నిర్మించుకోవాల్సి ఉంది. వీటి కోసం ర‌హ‌దారులు, రైల్వేలు, నీటి వ‌సతుల క‌ల్ప‌న చేయాలి. నెమ్మ‌దిగా మార్పుల‌ను చేయ‌డానికి ఇది స‌మ‌యం కాదు. ఇప్పుడు ఎంతో వేగంగా క‌దిలి అభివృద్ధిని సాధించాల్సి ఉంది.

ఈ ప‌నిని ప‌ర్యావ‌ర‌ణానికి అనుకూలంగా, ఆరోగ్య‌కరంగా ఉండేలా చేయాల‌ని నిర్ణ‌యించాం. ఈ విష‌యంలో మేం ఇప్ప‌టికే ఈ మ‌ధ్య‌నే పారిస్ లో ముగిసిన సి ఒ పి- 21 స‌ద‌స్సులో నిబ‌ద్ధ‌త‌తో కూడిన నిర్ణ‌యాన్ని తీసుకున్నాం. పునర్వినియోగ ఇంధ‌నాన్ని 175 గిగావాట్ల స్థాయిలో ఉత్ప‌త్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించాం.

ఎలాంటి పొర‌పాట్ల‌కు తావులేని, ఎలాంటి దుష్ప్ర‌భావాల‌కు కార‌ణం కాని త‌యారీయే ల‌క్ష్యంగా మేం ప‌ని చేస్తున్నాం. ఇంధ‌న సామ‌ర్థ్యాన్ని పెంపొందించ‌డం పైన‌, నీటి శుద్ధి విధానం పైన‌, వ్య‌ర్థాల‌ నుంచి ఇంధ‌న ఉత్ప‌త్తి, స్వ‌చ్ఛ‌ భార‌త్‌, న‌దుల ప్ర‌క్షాళ‌న మొద‌లైన కార్య‌క్ర‌మాల‌ పైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ప‌నుల‌ను చేస్తున్నాం. ఈ కార్య‌క్ర‌మాల‌ వ‌ల్ల నగ‌రాల్లో, గ్రామాల్లో జీవ‌న నాణ్య‌త మెరుగ‌వ్వాల‌నేది మా ల‌క్ష్యం. ఈ కార్య‌క్ర‌మాల్లో మీరు భాగ‌స్వాములై సాంకేతిప‌రంగా, సేవ‌ల‌ప‌రంగా, మాన‌వ‌వ‌న‌రుల పరంగా పెట్టుబ‌డులు పెట్ట‌డానికి అవ‌కాశ‌ముంది.

స్నేహితులారా..

భార‌త‌దేశానికి మూడు ‘డి’ లు అండ‌గా ఉన్నాయి. అవి ప్ర‌జాస్వామ్యం (డెమోక్ర‌సీ), జ‌నాభాప‌రంగా వైవిధ్యం (డెమోగ్ర‌ఫీ), డిమాండ్. వీటికి మేం మ‌రో ‘డి’ని అద‌నంగా చేరుస్తున్నాం. అది డి-రెగ్యులేష‌న్‌. క‌ఠిన‌మైన నియ‌మ‌ నిబంధ‌న‌ల స‌ర‌ళీక‌ర‌ణే డి-రెగ్యులేష‌న్‌. ఈ నాలుగు ‘డి’ల‌తో ఇప్పుడు భార‌త‌దేశం నాలుగు డైమ‌న్ష‌న్స్ ఉన్న దేశంగా అవ‌త‌రించింది.

· మా న్యాయ‌ వ్య‌వ‌స్థ‌లు స్వ‌యంప్ర‌తిప‌త్తిని క‌లిగి ఉన్నాయి. అవి కాల‌క్ర‌మంలో అనేక ఆటుపోట్ల‌ను ఎదుర్కొని నిలిచిన వ్య‌వ‌స్థ‌లు.

ఇలాంటి ల‌క్ష‌ణాల‌ను మీరు ప్ర‌పంచంలో మరేదేశంలోను చూడ‌లేరు.

అనేక బ‌ల‌మైన అంశాల‌తోతో ఇప్పుడు మీకు భార‌త‌దేశం ఒక దృఢ‌మైన వేదిక‌ను అందిస్తోంది. ఈ వేదిక‌ పైన మీరు మీ త‌యారీ, డిజైన్ సామర్థ్యాల‌ను ఆవిష్క‌రించండి. మా నౌకాశ్ర‌యాలు, జ‌ల‌ ర‌వాణా వ‌స‌తుల‌తో మీ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌పంచంలోని ఇత‌ర ఖండాల‌కు సులువుగా త‌ర‌లించ‌వ‌చ్చు.

· దేశంలోని సామ‌ర్థ్యాన్ని సంపూర్ణంగా ఉప‌యోగించుకోవ‌డానికి మునుపెన్న‌డూ చేప‌ట్టని కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నాం. డిజిట‌ల్ ఇండియా, స్కిల్ ఇండియా ల వంటి క్యాంపెయిన్లను డిజైన్ చేసి, మేక్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తున్నాం.

· అలాగే ఆర్థిక ప‌రంగా సాయం చేయ‌డానికి వీలుగా ప‌లు ప‌థ‌కాల‌ను చేప‌ట్టి ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నాం. ముద్రా బ్యాంకు ద్వారా త‌న‌ఖా లేకుండా రుణాల‌ను ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీల‌కు చెందిన యువ ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌ను, మ‌హిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి బ్యాంకులు చేస్తున్న కృషి అభినంద‌నీయం.

· మ‌హాత్మా గాంధీ క‌ల‌లుగ‌న్న‌ట్టుగా గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల‌ను మేక్ ఇన్ ఇండియా ద్వారానే నెల‌కొల్ప‌గ‌లం.

· డాక్ట‌ర్ భీంరావ్ అంబేద్క‌ర్ ఆశించిన‌ట్టుగా వ్య‌వ‌సాయ‌ రంగంలో, ఇంకా ఇత‌ర వృత్తుల్లో అద‌నంగా ఉన్న మాన‌వ‌ వ‌న‌రుల్ని మేక్ ఇన్ ఇండియా ద్వారానే ఉప‌యోగించుకోగ‌లం.

· స్టాండ‌ప్ ఇండియా కింద మేక్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌బోతున్నాం.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అస్థిర‌త వున్న‌ప్ప‌టికీ భార‌తీయ ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డిదారులు ధీమాగా, ఆశాభావంతో ఉన్నారని నేను భావిస్తున్నాను.

మేం మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ ను మొద‌లుపెట్టిన‌ప్పుడు

· దేశంలో త‌యారీ రంగం వృద్ధి 1.7 శాతం మాత్ర‌మే. ఈ సంవ‌త్స‌రం ఇది గ‌ణ‌నీయంగా వృద్ధి చెందింది. ప్ర‌స్తుతం త‌యారీ రంగం వృద్ధి 12.6 శాతంగా ఉంటుంద‌ని అంచ‌నా వేయ‌డం జ‌రిగింది.

· కాంపోజిట్ పిఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ 2016 జ‌న‌వ‌రి నాటికి 53.3 శాతం చేరుకుంది. గ‌త 11 నెల‌ల్లో ఇదే అత్య‌ధికం.

· చివ‌రి ఎనిమిది నెల‌ల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే పెట్టుబ‌డుల ప్ర‌తిపాద‌న‌ల్లో 27 శాతం పెరుగుద‌ల క‌నిపించింది.

· 2015లో మోటార్ వాహ‌నాల ఉత్ప‌త్తి మునుపెన్న‌డూ లేనంత‌గా రికార్డుస్థాయిలో జ‌రిగింది.

· గ‌త ప‌ది సంవ‌త్స‌రాల్లో భార‌త‌దేశంలో యాభై దాకా మొబైల్ ఫ్యాక్ట‌రీల‌ను నెలకొల్ప‌డం జ‌రిగింది.

· ఎల‌క్ట్రానిక్ రంగంలో త‌యారీ ఆరు రెట్లు పెరిగి, 18 మిలియ‌న్ల‌కు చేరుకుంది.

· ఇ ఎస్ డిఎం యూనిట్లుగా పేరొందిన ఎల‌క్ట్రానిక్ సిస్ట‌మ్ డిజైన్, మాన్యుఫాక్స‌రింగ్ యూనిట్ల‌ను 2015లో 159 దాకా స్థాపించ‌డం జ‌రిగింది.

· కొన్ని ఏజెన్సీల అంచనాల ప్ర‌కారం భార‌తదేశ జాబ్ మార్కెట్ చాలా బ‌లంగా ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు ఈ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి నాటికి ది మాన్‌స్ట‌ర్ ఎంప్లాయ్ మెంట్ ఇండెక్స్ ఫ‌ర్ ఇండియా ప్ర‌కారం ఈ సూచిక 229. గ‌త సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి నాటి సూచిక‌తో పోలిస్తే ఇందులో 52 శాతం వృద్ధి క‌నిపించింది.

అలాగే, వాణిజ్య రంగాన్ని తీసుకుంటే..

· మునుపెన్న‌డూ లేని విధంగా 2015లో భార‌త‌దేశ సాఫ్ట్ వేర్ ఉత్ప‌త్తుల ఎగుమ‌తి రికార్డు స్థాయిలో జ‌రిగింది.

· 2015లో మా నౌకాశ్ర‌యాలు మునుపెన్న‌డూ లేనంత‌గా వ‌స్తు ర‌వాణాను చేప‌ట్టాయి.

ఇవ‌న్నీ శుభ‌సూచ‌న‌లు. మ‌న పారిశ్రామిక రంగానికి నేను ఒక స్నేహ‌పూర్వ‌క స‌ల‌హా ఇవ్వ‌ద‌లుచుకున్నాను. మీరు వేచి చూడ‌కండి.. విశ్రాంతి తీసుకోవ‌ద్దు. ఇప్పుడు భార‌త‌దేశంలో క‌నీవినీ ఎర‌గ‌ని అవ‌కాశాలు మీ కోసం ఎదురు చూస్తున్నాయి. భార‌త‌దేశంలో ప‌ని చేయ‌డానికి స‌రికొత్త ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్న‌ అంత‌ర్జాతీయ సంస్థ‌ల ద్వారా ల‌బ్ధిని పొందండి. ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌లు సాంకేతిక‌ ప‌రంగా, ఆర్థిక‌ ప‌రంగా భార‌తీయ భాగ‌స్వాముల‌ కోసం వెతుకుతున్నారు. హైటెక్ రంగాలతో పాటు అత్య‌ధిక విలువ‌ గ‌ల రంగాలైన ర‌క్ష‌ణ‌ రంగ ఉత్ప‌త్తుల‌ వ‌ర‌కు ప‌లు రంగాల ద్వారా మీరు ల‌బ్ధి పొంద‌వ‌చ్చు. మీరు ఒక‌డుగు ముందుకు వేస్తే , మీ కోసం మేం రెండు అడుగులు న‌డుస్తామ‌నే హామీని నేను ఇస్తున్నాను. ఈ పోటీ ప్ర‌పంచంలో నిర్వ‌హ‌ణ ప‌ర‌మైన‌, సాంకేతిక‌ ప‌ర‌మైన సామ‌ర్థ్యాల‌ను పెంపొందించుకోవ‌డం చాలా ముఖ్యం. అప్పుడే మ‌నుగ‌డ సాగిస్తూ వృద్ధిని సాధించ‌గ‌లం. అంత‌రిక్ష నౌక‌ల‌ నుంచి కాలుష్య నియంత్ర‌ణ దాకా, ఆరోగ్య‌ రంగం నుంచి విద్యారంగం దాకా, వ్య‌వ‌సాయ‌ రంగం నుంచి సేవ‌ల రంగం దాకా మ‌న ఔత్సాహిక పారిశ్రామిక సంస్థ‌లు, స్టార్ట‌ప్ కంపెనీలు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్నాయి. ఉత్ప‌త్తిలో, డెలివ‌రీలో వేగంగా అడుగులు వేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. వారిని ప్రోత్స‌హించ‌డానికి వారి శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను దేశం కోసం ఉప‌యోగించుకోవ‌డానికి మా ప్ర‌భుత్వం నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేస్తోంది. మ‌న యువ‌త ఉద్యోగాన్వేష‌ణకు కాకుండా ఉద్యోగాల క‌ల్ప‌న చేయాల‌నేది నా ఆకాంక్ష‌. అందుకే మేం స్టార్ట‌ప్ ఇండియా క్యాంపెయిన్ ను ప్రారంభించాం.

మేక్ ఇన్ ఇండియా విజ‌య‌వంతం కావాలంటే..

· మ‌న మ‌న‌స్సులు మ‌న చేతుల్ని బ‌లోపేతం చేయాలి.

· మ‌న చేతులు మ‌న యంత్రాల‌ పైన ప‌ట్టు సాధించాలి.

· మ‌న యంత్రాలు అత్యుత్త‌మైన వ‌స్తువుల్ని ఉత్ప‌త్తి చేయాలి

· మ‌న ఉత్ప‌త్తులు ప్ర‌పంచంలోని ఇత‌ర ఉత్ప‌త్తుల‌ను అన్ని విధాలా మించిపోవాలి.

· భార‌త‌దేశంలోని సాధార‌ణ పౌరుడు ఇంత‌ కాలం చేస్తున్న డిమాండ్ల‌ను అందుకోవ‌డానికి మేక్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మం ఉప‌యోప‌గ‌డాలి. అంతే కాదు, నిరుద్యోగులకు ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించి, వారిని సాధికారిత‌ గ‌ల‌ వారిగా తీర్చిదిద్దాలి.

‘మేక్ ఇన్ ఇండియా’ పైన నేను చాలా ప‌ట్టుద‌ల‌గా ఉండ‌డానికి గ‌ల మ‌రో కార‌ణం.. ఈ కార్య‌క్ర‌మం ద్వారా మాన‌వ‌ వ‌న‌రుల ప‌రంగానే కాకుండా ఆయా రంగాల అవ‌స‌రాలు తీరుతాయి. ప‌లు అంత‌ర్జాతీయ కంపెనీలు ఆయా దేశాల్లో స్థానికంగా వ్య‌వ‌స్థ‌ల్ని ఏర్పాటు చేసుకోవ‌డానికి ప‌థ‌కాలు రూపొందించుకుంటున్న‌ట్టు నేను విన్నాను. కాబ‌ట్టి మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ త‌ప్ప‌కుండా భార‌తీయ ఆర్థిక రంగాన్ని బ‌లోపేతం చేస్తుంది; ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక రంగానికి వెలుగులు నింపుతుంది కూడా.

స్నేహితులారా!

ఈ శ‌తాబ్దం ఆసియా శ‌తాబ్ద‌మ‌నే విష‌యాన్ని నేను చెబుతూ వ‌స్తున్నాను. మీకు నా స‌ల‌హా ఏమిటంటే.. ఈ శ‌తాబ్దం మీ శ‌తాబ్దం కావాలంటే మీరు ఇండియాను మీ కేంద్ర కార్యాల‌యంగా చేసుకోండి. ఇక్క‌డ ఉన్న‌ వారితో పాటు ఇక్క‌డ లేని వారినంద‌రినీ కూడా ఆహ్వానిస్తున్నాను.. భార‌త‌దేశం ఆవిష్క‌రిస్తున్న క‌థ‌లో మీరు కూడా భాగ‌స్వాములు కండి అని.

· భార‌త‌దేశంలో మీరు కార్య‌క‌లాపాలు చేప‌ట్ట‌డానికి ఇంత‌కంటే మంచి స‌మ‌యం మునుపెన్న‌డూ లేదు.

· మేక్ ఇన్ ఇండియాలో భాగ‌స్వాములు కావ‌డానికి ఇది మ‌రింత మంచి స‌మ‌యం.

మీకు ఇవే నా ధ‌న్య‌వాద‌ములు.