ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నోయిడా- గ్రేటర్ నోయిడా మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. 29.707 కిలో మీటర్ల పొడవుతో ఉండే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయం రూ. 5,503 కోట్లు.
నోయిడా, గ్రేటర్ నోయిడాలను కలుపుతూ సాగే ఈ మెట్రో రైలు మార్గం ప్రజలకు చక్కని ప్రయాణ సాధనంగా ఉండడంతో పాటు, ఢిల్లీ కి చుట్టుపక్కల నెలకొన్న పట్టణాలకు మరింత మంది ప్రజలు రాకపోకలు జరపడానికి అనువుగా కూడా ఉంటుంది. తత్ఫలితంగా ఢిల్లీలో రద్దీ తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ ప్రాంతంలో మరిన్ని నివాస భవన సముదాయాలు, వాణిజ్య భవన సముదాయాలు కూడా ఏర్పడుతాయి. మెట్రో రైల్ కార్యరూపం దాల్చాక రహదారి మార్గాల మీద వాహనాల రాకపోకలు తగ్గి ప్రయాణానికి పట్టే కాలం, అయ్యే వ్యయం, శిలాజ ఇంధన వినియోగం, పర్యావరణ కాలుష్యం.. ఇవన్నీ కూడా తగ్గుతాయి. దాదాపుగా 7.50 లక్షల సంఖ్యలో ఉన్న నోయిడా- గ్రేటర్ నోయిడా ప్రజలే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు సైతం ఈ మెట్రో మార్గం ద్వారా ప్రయోజనం పొందుతారు.
ఈ ప్రాజెక్టును నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అమలుచేస్తుంది. ఈ ప్రాజెక్టులో భారత ప్రభుత్వం మరియు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా 50:50 యాజమాన్యాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్ పివి) గా ఉన్నటువంటి నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎమ్ఆర్ సి ఎల్)ను ఈ పథకం అమలు కోసం భారత ప్రభుత్వం మరియు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రెండింటితోనూ కూడిన ఒక సంయుక్త ఎస్ పివిగా మార్పు చేయడం జరుగుతుంది.
ఈ ప్రాజెక్టు నిపుణులైన, అర్థ నైపుణ్యం కలిగిన మరియు నైపుణ్యరహిత వర్గాల శ్రామికులకు చెప్పుకోదగిన రీతిలో ప్రత్యక్ష ఉపాధిని, పరోక్ష ఉపాధిని అందిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణ దశలోను, కార్యకలాపాల నిర్వహణ దశలోను పరోక్ష ఉపాధి అవకాశాలు గణనీయ సంఖ్యలో సమకూరుతాయి.
డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్)లో పేర్కొన్న ప్రకారం ఈ ప్రాజెక్టు 2018 ఏప్రిల్ కల్లా పూర్తి కావలసి ఉంటుంది. ప్రాజెక్టుకు చెందిన సివిల్ వర్క్ లో సుమారు 70 శాతం పురోగతి, మొత్తం మీద ఆర్థిక విషయాలలో పురోగతి 40 శాతం ఇప్పటికే నమోదైంది.
సెంట్రల్ మెట్రో యాక్ట్ స్, మెట్రో రైల్వేస్ (కన్ స్ట్రక్షన్ ఆఫ్ వర్క్స్) యాక్ట్, 1978 మరియు ది మెట్రో రైల్వేస్ (ఆపరేషన్ అండ్ మెయిన్ టెనెన్స్) యాక్ట్, 2002 లలో పేర్కొన్న లీగల్ ఫ్రేమ్ వర్క్- ఎప్పటికప్పుడు చేసే సవరణలతో సహా- ఈ ప్రాజెక్టుకు వర్తిస్తుంది.
పూర్వరంగం:
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో నెలకొన్న నోయిడా సిటీని ఉత్తర్ ప్రదేశ్ పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి చట్టంలో భాగంగా ఏర్పాటుచేశారు. ఈ నగరంలో అన్ని ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఈ నగరం నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్ సి ఆర్)లోని ఢిల్లీకి చెందిన అత్యంత ఆధునిక శివారు ప్రాంతాలలో ఒకటిగా నోయిడా పేరు తెచ్చుకుంది. 2011 సంవత్సర సెన్సస్ ప్రకారం నోయిడా మరియు గ్రేటర్ నోయిడా ల జన సంఖ్య దాదాపుగా 7,50,000. ఇది 2021 సంవత్సరానికల్లా 19,00,000 లక్షలకు పెరగవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి నోయిడా వైపు మొగ్గు చూపుతున్నారు. నోయిడాలో సుమారు 10,000 పారిశ్రామిక యూనిట్లను నెలకొల్పే అవకాశం ఉండగా, ప్రస్తుతం సుమారు 7,500 యూనిట్లు అభివృద్ధి చెంది కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఈ పారిశ్రామిక యూనిట్ల కారణంగా ఈ ప్రాంతంలో 2,00,000 మందికి పైగా నోయిడా ఉద్యోగాలను కల్పిస్తోంది. ఈ నగరం ప్రధానంగా ఢిల్లీ తోను, పక్కనే ఉన్నటువంటి ఉత్తర్ ప్రదేశ్ మరియు హరియాణా రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలతోను రహదారి సంబంధాలను కలిగి ఉంది. నోయిడాలో రైల్వే స్టేషన్ లేదు. అయితే, దాదాపు 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఈ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. నోయిడా నుండి దాదాపు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం ఈ ప్రాంతంలో అత్యంత సమీప విమానాశ్రయం అని చెప్పాలి.
ఢిల్లీకి ప్రజల వలసలను నియంత్రించాలనే ఉద్దేశంతో ఒక శాటిలైట్ టౌన్ గా గ్రేటర్ నోయిడాను నిర్మించతలపెట్టారు. ఈ నగరం 2021 కల్లా 4,50,000 మందికి ఉద్యోగాలను అందించ గలుగుతుందని ఆశిస్తున్నారు. గ్రేటర్ నోయిడాలో జనావాసాలు ఏర్పడడం ఆరంభమైనప్పటికీ, అది ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉంది. గ్రేటర్ నోయిడాకు నోయిడా తోను, ఢిల్లీ తోను మరింత ఎక్కువ అనుసంధాన సదుపాయాలు ఏర్పడవలసిన అవసరం ఉంది. గ్రేటర్ నోయిడాలో గృహ నిర్మాణ వ్యయాలు సాపేక్షంగా తక్కువగా ఉన్న కారణంగా ప్రజలు గ్రేటర్ నోయిడాలో మకాం పెట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అక్కడి నుండి బతుకు తెరువు కోసం నోయిడాకు, ఢిల్లీకి వెళ్ళి తిరిగి రావాలనేది వారి సంకల్పం. అటు నోయిడా, ఇటు ఢిల్లీ ఈ రెండింటితో రాకపోకలకు గాను గ్రేటర్ నోయిడా ప్రధానంగా రోడ్డు మార్గాల పైనే ఆధారపడుతోంది. గ్రేటర్ నోయిడాలో రైల్వే స్టేషన్ లేదు. ప్రతిపాదిత మెట్రో స్టేషన్ టర్మినల్ నుండి 3 కిలో మీటర్లు వెళ్ళాక వచ్చే బొరాకి రైల్వే స్టేషన్ ఇక్కడికి అత్యంత సమీపంలోని రైల్వే స్టేషన్ అని చెప్పాలి. గ్రేటర్ నోయిడా నుండి సుమారు 45 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం ఇక్కడికి అత్యంత సమీపంలోని విమానాశ్రయం. రానున్న కాలంలో నోయిడా – గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జన సంఖ్య బాగా ఎక్కువ స్థాయిలో వృద్ధి చెందుతుందని అంచనా.