Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మూడ‌వ భార‌త ఆఫ్రికా శిఖ‌రాగ్ర స‌ద‌స్సుకు స‌న్నాహాల‌ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌


భార‌త ఆఫ్రికా ఫోర‌మ్ మూడో శిఖ‌రాగ్ర స‌ద‌స్సును ఈ నెల 26 నుంచి 29 వ‌ర‌కు న్యూఢిల్లీలో నిర్వ‌హించే అవ‌కాశం రావ‌డం భార‌త్‌కు గ‌ర్వ‌కార‌ణం. ఈ సారి ఆ స‌మావేశాల స్థాయిని మ‌రింత‌గా విస్త‌రించ‌డం జ‌రిగింది. మొత్తం 54 ఆఫ్రికా దేశాల నాయ‌కుల‌ను, ఆఫ్రికా యూనియ‌న్‌ను ఈ స‌మావేశాల‌కు ఆహ్వానించాం.

ఆఫ్రికాకు వెలుప‌ల జ‌రిగిన అతి పెద్ద ఆఫ్రికా దేశాల కూట‌మి స‌ద‌స్సుగా ఇది చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది. మ‌రింత మెరుగైన భ‌విష్య‌త్తు కోసం స‌న్నిహితంగా స‌హ‌క‌రించుకోవాల‌న్న ఆఫ్రికా, భార‌త్‌ల దృఢ సంక‌ల్పానికి ఇది ద‌ర్ప‌ణం ప‌డుతుంది.

ప‌ర‌స్ప‌ర గౌర‌వం, విశ్వాసం, సంఘీభావం ఆధారంగా ఏర్ప‌డిన చారిత్ర‌క మైత్రి ఇది. ఇటీవ‌ల కాలంలో ఈ మైత్రి మ‌రింత‌గా విస్త‌రించి ఉభ‌యులకు మ‌రింత లాభ‌దాయ‌క‌మైన భాగ‌స్వామ్యానికి దోహ‌ద‌ప‌డే మైత్రిగా రూపు దిద్దుకుంది.

ఆఫ్రికా దేశాల్లో భార‌త్ అతి పెద్ద ఇన్వెస్ట‌ర్‌గా ఉంది. ఆఫ్రికా దేశాల్లో భార‌త పెట్టుబ‌డుల ప‌రిమాణం 30 బిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల మేర‌కు ఉంది. ఆఫ్రికాలో భారీ సంఖ్య‌లో ఉపాధి క‌ల్ప‌న‌కు దోహ‌ద‌ప‌డింది.

ఉభ‌య ప్రాంతాల‌కు చెందిన నాయ‌కులు, మేధావులు మ‌రింత స‌న్నిహితంగా స‌హ‌క‌రించుకునేందుకు స‌మావేశ‌మ‌వుతున్న ఈ ఐఎఎఫ్ఎస్ 3 వేదిక మ‌రింత ప‌టిష్ఠ‌మైన సంబంధాలు ఏర్పాటు చేసుకునే దిశ‌గా భార‌త‌, ఆఫ్రికా దేశాలు చేస్తున్న ప్ర‌యాణంలో ఒక చారిత్ర‌క ఘ‌ట్టంగా నిలిచిపోతుంది.

ఈ ఇండియా ఆఫ్రికా ఫోర‌మ్ స‌మావేశాల సంద‌ర్భంగా స‌మాంత‌రంగా ప‌లు కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ కు కూడా స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. భార‌త‌, ఆఫ్రికా దేశాల‌కు చెందిన వాణిజ్య మంత్రులు వ్యాపార ప్ర‌తినిధి వ‌ర్గాల‌తో క‌లిసి ఈ నెల 23న స‌మావేశం కాబోతున్నారు. 27 నుంచి 29 తేదీల మ‌ధ్య కాలంలో భార‌త్‌కు చెందిన అగ్ర‌గామి వ్యాపార, పారిశ్రామిక మండ‌లుల స‌మాఖ్య‌లు ఒక ట్రేడ్ ఎగ్జిబిష‌న్ కూడా నిర్వ‌హిస్తున్నాయి. భార‌త ఆఫ్రికా స‌హ‌కారం ప్ర‌ధానాంశంగా సిబిఎస్ఇ నిర్వ‌హిస్తున్న వివిధ పోటీల్లో 16 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారు.