ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో మూడో రాకెట్ ప్రయోగ కేంద్రం (టీఎల్పీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
ఇస్రోకు చెందిన తదుపరి తరం వాహక నౌకల ప్రయోగం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను శ్రీహరికోటలో క్పలించడానికీ, అలాగే శ్రీహరికోటలోని రెండో ప్రయోగ కేంద్రానికి అదనపు వేదికగా ఈ మూడో రాకెట్ ప్రయోగ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో భారత మానవ అంతరిక్ష యాత్రల ప్రయోగ సామర్థ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఇది జాతీయ ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టు.
అమలు వ్యూహం, లక్ష్యాలు:
సార్వత్రికమైనదిగానూ… ఎన్జీఎల్వీకి మాత్రమే కాకుండా సెమీ క్రయోజనిక్ దశతో ఎల్వీఎం-3 వాహనాలకూ, అలాగే ఉన్నతీకరించిన ఎన్జీఎల్వీ ఆకృతులకూ అనుకూలమైనదిగానూ మూడో ప్రయోగ కేంద్రాన్ని రూపొందించారు. గత ప్రయోగకేంద్రాల ఏర్పాటులో ఇస్రో అనుభవాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకునేలా గరిష్ట పారిశ్రామిక భాగస్వామ్యంతోపాటు ప్రస్తుత ప్రయోగ సముదాయాల్లోని సదుపాయాలను కొత్త కేంద్రంతో సాధ్యమైనంతగా పంచుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.
నాలుగేళ్లలో మూడో ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వ్యయం:
కొత్త రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు, సంబంధిత సదుపాయాల ఏర్పాటుకు అవసరమైన మొత్తం నిధులు రూ.3984.86 కోట్లు.
ప్రయోగాల సంఖ్యను పెంచడం, అలాగే మానవ అంతరిక్ష యాత్రలు – అన్వేషణ కార్యక్రమాలను చేపట్టడంలో దేశ సమర్థతను పెంచడం ద్వారా ఈ ప్రాజెక్టు భారత అంతరిక్ష రంగానికి ఊతమిస్తుంది.
నేపథ్యం:
ప్రస్తుతానికి భారత అంతరిక్ష రవాణా వ్యవస్థలు పూర్తిగా మొదటి, రెండో ప్రయోగ కేంద్రాలు రెండింటిపైనే ఆధారపడి ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం పీఎస్ఎల్వీ కోసం మొదటి ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అది పీఎస్ఎల్వీ, ఎస్ఎస్ఎల్వీ ప్రయోగాలకు సహాయపడుతూ వస్తోంది. రెండో ప్రయోగ కేంద్రాన్ని ప్రధానంగా జీఎస్ఎల్వీ, ఎల్వీఎం-3 కోసం ఏర్పాటు చేశారు. ఇది పీఎస్ఎల్వీకి అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది. రెండో ప్రయోగ కేంద్రం దాదాపు 20 ఏళ్లుగా పనిచేస్తోంది. చంద్రయాన్-3 మిషన్ సహా పలు జాతీయ కార్యక్రమాలతోపాటు.. వాణిజ్య మిషన్లను చేపట్టగలిగేలా పీఎస్ఎల్వీ/ఎల్వీఎం-3 మిషన్ల ప్రయోగ సామర్థ్యాన్ని ఇది పెంపొందించింది. గగన్ యాన్ మిషన్ల కోసం మానవ సహిత ఎల్వీఎం-3ని ప్రయోగించగల సామర్థ్యాన్ని కూడా రెండో ప్రయోగ కేంద్రం సంతరించుకుంటోంది.
అమృత కాలమైన ఈ సమయంలో భారత అంతరిక్ష దార్శనికత మరింతగా విస్తరించింది. అందులో భాగంగా 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్), 2040 నాటికి భారత వ్యోమగాముల బృందం చంద్రుడిపై దిగడం సాధ్యపడాలంటే సరికొత్త చోదక వ్యవస్థలతో కూడిన అధునాతన భారీ ప్రయోగ వాహక నౌకలు అవసరం. ప్రస్తుత ప్రయోగ కేంద్రాలు ఆ అవసరాన్ని తీర్చలేవు. తదుపరి తరం భారీ వాహక నౌకల అవసరాలను తీర్చేలా, అలాగే రెండో ప్రయోగ కేంద్రానికి అదనంగా మూడో ప్రయోగ కేంద్రాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయడం అత్యావశ్యకం. తద్వారా మరో 25 నుంచి 30 ఏళ్ల పాటు మారుతున్న అంతరిక్ష రవాణా అవసరాలను తీర్చవచ్చు.
****
Today's Cabinet decision on establishing the Third Launch Pad at Sriharikota, Andhra Pradesh will strengthen our space sector and encourage our scientists. https://t.co/lS20yZXPJ5
— Narendra Modi (@narendramodi) January 16, 2025