21వ భారత లా కమిషన్ ను మూడేళ్ల కాల వ్యవధితో ఏర్పాటుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ కమిషన్ సెప్టెంబరు 1, 2015 నుంచి ఆగస్టు 31, 2018 వరకు అమల్లో ఉంటుంది.
ఈ లా కమిషన్ సభ్యులు:
1. పూర్తికాలం పనిచేసే అధ్యక్షుడు ఒకరు
2. నలుగురు పూర్తికాలం పనిచేసే సభ్యులు, అందులో ఒకరు సభ్య కార్యదర్శి
3. న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఎక్స్ అఫిషియో సభ్యుడు
4. శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఎక్స్ అఫిషియో సభ్యుడు
5. ఐదుకు మించకుండా తాత్కాలిక సభ్యులు
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కేసులు, సుమొటో కేసులను లా కమిషన్ స్వీకరించి ఇప్పుడున్న చట్టాలతో వాటిని పోల్చుకుని పరిశోధన చేయటం.. మార్పులు అవసరం అనుకుంటే కొత్త చట్టాల అమలుపై సూచనలు చేయాల్సి ఉంటుంది. న్యాయ వ్యవస్థలో రోజు రోజుకూ పెరిగిపోతున్న కేసులను త్వరత్వరగా పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వేగవంతమైన విచారణ, వివాదాల కారణంగా పెరుగుతున్న ఖర్చును తగ్గించటంపై పరిశోధనలు చేయాలి.
ఇతర విషయాల్లో న్యాయ కమిషన్ చేయాల్సిన పనులు కింది విధంగా ఉన్నాయి –
1. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం వినియోగించేందుకు వీలులేని, అవసరం లేని, చెల్లని చట్టాలను గుర్తించటం
2. రాజ్యాంగ పీఠికలో సూచించిన ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త చట్టాల రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వానికి తగు సూచనలు చేయటం
3. కేంద్ర న్యాయ శాఖ నిర్దేశించిన కేసుల్లో ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో అవసరమైన న్యాయ సలహాలు, సూచనలు ఇవ్వటం పాలనలో న్యాయ పరమైన ఇబ్బందులు రాకుండా సూచనలు చేయటం.
4. కేంద్ర న్యాయ శాఖ సూచనలకు అనుగుణంగా విదేశాలకు న్యాయ పరమైన పరిశోధనల్లో సహకరించటం.
5. చేస్తున్న పరిశోధనల వివరాలు, అధ్యయన వివరాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియచేస్తూ.. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయపరమైన సలహాలివ్వటం.
6. కేంద్ర ప్రభుత్వం అప్పగించిన ఇతర పనులేమైనా ఉంటే వాటిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించటం
ప్రతిపాదనలను బలపరిచేముందు సదరు మంత్రిత్వ శాఖ (న్యాయ శాఖ)ను సంప్రదించటం, కమిషన్ లోని ఇతర భాగస్వాములతో చర్చించుకోవాల్సి ఉంటుంది.