ముంబైలో నగర పరిధిలోని తూర్పు గోరేగావ్‌లో ఇవాళ నిర్వహించిన వికసిత భారతం సంకల్ప యాత్రలో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 1500 మందికిపైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య కార్యదర్శి వారందరి చేత వికసిత భారతం సంకల్ప సాధన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ‘నా కథ-నా గళం’ (మేరీ కహానీ-మేరీ జుబానీ) కార్యక్రమం కింద తమ అనుభవాలను, విజయగాథలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ముందుగా రికార్డు చేసిన ప్రధానమంత్రి సందేశం వీడియోతోపాటు వికసిత భారతం సంకల్ప యాత్ర లక్ష్యాలపై ఒక చిత్రం కూడా ప్రదర్శించబడింది.
అలాగే ముద్ర యోజన, పిఎం స్వానిధి తదితర పథకాల లబ్ధిదారులకు ముఖ్య కార్యదర్శి ధ్రువీకరణ పత్రాలు ప్రయోజనాలను పంపిణీ చేశారు.
దేశంలో ఇప్పటిదాకా ఈ పథకాల ప్రయోజనాలు అందనివారికి లబ్ధి చేకూర్చడంతోపాటు కీలక ప్రభుత్వ పథకాల అమలులో సంతృప్త స్థాయి సాధన దిశగా వాటిపై అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన స్టాళ్లను కూడా ముఖ్యకార్యదర్శి సందర్శించారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారినుద్దేశించి ముఖ్య కార్యదర్శి ప్రసంగించారు. వికసిత భారతంపై ప్రధానమంత్రి దృక్కోణాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. పౌరులంతా ఈ యాత్రలో పాల్గొని దీన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమలులో సంతృప్తత సాధన, చిట్టచివరి అంచెలోని వ్యక్తికీ లబ్ధి చేరడం గురించి ఆయన విశదీకరించారు.
ముంబై నగరంలో వికసిత భారతం సంకల్ప యాత్రను విజయవంతంగా నిర్వహించడంపై ‘బిఎంసి’ పాలన యంత్రాంగాన్ని ముఖ్య కార్యదర్శి అభినందించారు.
***
DS/LP