ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 30న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పర్యటించనున్నారు. ఆయన నాగపూర్ వెళ్లి ఉదయం సుమారు 9 గంటలకు స్మృతి మందిర్‌లో దర్శన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత దీక్షాభూమిని సందర్శిస్తారు.
ఉదయం సుమారు 10 గంటలకు, నాగపూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటరుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ జరిగే బహిరంగ సభను ఉద్దేశించి కూడా ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు.
మధ్యాహ్నం దాదాపు 12:30 గంటలకు నాగపూర్‌లో సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లో యూఏవీలకు ఉద్దేశించిన లాయిటరింగ్ మ్యూనిషన్ టెస్టింగ్ రేంజును, రన్‌వే సదుపాయాన్ని ప్రధాని ప్రారంభిస్తారు.
ప్రధాని మధ్యాహ్నం దాదాపు 3:30 గంటలకు బిలాస్‌పూర్‌కు వెళ్తారు. రూ.33,700 కోట్లకు పైగా వ్యయమయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. కొన్ని ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించడంతోపాటు, కొన్నింటిని జాతికి అంకితం చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
మహారాష్ట్రలో ప్రధాని:
హిందూ నూతన సంవత్సరాది ఆరంభానికి సూచకంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎష్) నిర్వహించే ప్రతిపద కార్యక్రమంతోపాటు స్మృతి మందిర్‌లో దర్శన కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరు కానున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులకు ప్రధాని శ్రద్ధాంజలి సమర్పిస్తారు. ఆయన దీక్షాభూమికి వెళ్లి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తన వేల మంది అనుయాయులతో కలిసి 1956లో బౌద్ధధర్మాన్ని స్వీకరించింది ఈ దీక్షాభూమిలోనే.
మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటరు నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇది మాధవ్ నేత్రాలయ ఐ ఇనిస్టిట్యూట్–రిసెర్చ్ సెంటరుకు చెందిన కొత్త విస్తారిత భవనం. 2014లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ, నాగపూర్‌లో నెలకొన్న ఒక ప్రధాన సూపర్–స్పెషాలిటీ కంటి వైద్య కేంద్రంగా సేవలందిస్తోంది. ఈ సంస్థను గురూజీ మాధవ్‌రావ్ సదాశివ్‌రావ్ గోల్వాల్కర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. త్వరలో రూపుదిద్దుకోనున్న ప్రాజెక్టులో 250 పడకలతో కూడిన ఆసుపత్రి, 14 అవుట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్ల (ఓపీడీస్)తోపాటు 14 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ సదుపాయాలుంటాయి. ప్రజలకు చౌకైన, ప్రపంచ స్థాయి కంటి చికిత్స సేవలను అందించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.
నాగపూర్‌లో సోలార్ డిఫెన్స్–ఏరోస్పేస్2కు చెందిన ఆయుధ కర్మాగారాన్ని ప్రధానమంత్రి సందర్శించనున్నారు. అన్ఆర్మ్డ్ ఏరియల్ వెహికిల్స్ (యూఏవీస్) కోసం కొత్తగా నిర్మించిన, 1250 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో ఉన్న ఎయిర్ స్ట్రిప్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. లాయిటరింగ్ మ్యూనిషన్, తదితర నిర్దేశిత ఆయుధాలను పరీక్షించడానికి లైవ్ మ్యూనిషన్–వార్‌హెడ్ టెస్టింగ్ సదుపాయాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో ప్రధానమంత్రి:
మౌలిక సదుపాయాలకల్పననూ, స్థిర జీవనోపాధినీ ప్రోత్సహించాలన్న తన నిబద్దతకు అనుగుణంగా, ప్రధానమంత్రి బిలాస్‌పూర్‌లో రూ.33,700 కోట్లకు పైగా వ్యయమయ్యే విద్యుత్తు, చమురు, గ్యాస్, రైలు, రోడ్డు, విద్య, గృహనిర్మాణ రంగాలకు సంబంధించిన అనేక అభివృద్ది ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనచేయడం ద్వారా వాటిని జాతికి అంకితం చేయనున్నారు.
దేశవ్యాప్తంగా విద్యుత్తు రంగం పనితీరును మెరుగుపరచాలని ప్రధానమంత్రి భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే చౌకైన, ఆధారపడదగిన విద్యుత్తును అందుబాటులో ఉంచడానికి అనేక చర్యలు చేపట్టనున్నారు. బిలాస్పూర్ జిల్లాలో ఎన్‌టీపీసీకి చెందిన సీపత్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు మూడో దశకు (1X800 మెగావాట్లు) ప్రధాని శంకుస్థాపన చేస్తారు. దీని నిర్మాణ వ్యయం రూ.9,790 కోట్లకు పైనే. ఈ పిట్ హెడ్ ప్రాజెక్టు అధిక విద్యుత్తు ఉత్పాదన సామర్థ్యంతోపాటు అత్యాధునిక అల్ట్రా–సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ (సీఎస్‌పీజీసీఎల్)కు చెందిన, రూ.15,800 కోట్లకుపైగా వ్యయమయ్యే మొదటి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు (2X660 మెగావాట్లు). నిర్మాణ పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. పశ్చిమ ప్రాంత విస్తరణ పథకం (డబ్ల్యూఆర్ఈఎస్)లో భాగంగా రూ.560 కోట్లకు పైగా ఖర్చయ్యే ‘పవర్‌గ్రిడ్’కు చెందిన మూడు విద్యుత్తు సరఫరా ప్రాజెక్టులను కూడా జాతికి ప్రధానమంత్రి అంకితం చేస్తారు.
వాయు కాలుష్యాన్ని తగ్గించాలని, స్వచ్ఛ ఇంధన వనరులను అందించాలని, ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకుపోవాలన్న భారత్ లక్ష్యలకు అనుగుణంగా కోరా, సూరజ్‌పూర్, బల్రాంపూర్, సర్గుజా జిల్లాల్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)కు చెందిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 200 కి.మీ.కి పైగా అధిక పీడనశక్తి కలిగిన ఎండీపీఈ (మీడియం డెన్సిటీ పాలిఎథిలీన్) గొట్టపుమార్గం ఇందులో ఓ భాగంగా ఉంది. రూ.1,285 కోట్లకు పైగా విలువైన అనేక సీఎన్‌జీ పంపిణీ కేంద్రాలు దీనిలో కలిసి ఉన్నాయి. ప్రధాని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)కు చెందిన, రూ.2,210 కోట్లకు పైగా విలువైన 540 కి.మీ. పొడవు కలిగిన విశాఖ్–రాయ్‌పూర్ పైప్‌లైను (వీఆర్‌పీఎల్) ప్రాజెక్టుకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ బహుళ ఉత్పాదనల (పెట్రోలు, డీజిల్,కిరోసిన్) పైప్‌లైనుకు 3 మిలియన్ మెట్రిక్ టన్నులకన్నా ఎక్కువ సామర్థ్యం ఉంటుంది.
ఈ ప్రాంతంలో సంధానాన్ని మెరుగుపరచడంపై దృష్టిని కేంద్రీకరిస్తూ, ప్రధానమంత్రి మొత్తం 108 కిలోమీటర్ల పొడవైన ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. రూ.2,690 కోట్లకు పైచిలుకు వ్యయంతో నిర్మించిన 111 కి.మీ. పొడవైన మూడు రైల్వే ప్రాజెక్టులను జాతికి ఆయన అంకితం చేస్తారు. మందిర్ హసౌద్ మీదుగా వెళ్లే మార్గంలో అభన్పూర్–రాయ్‌పూర్ సెక్షన్‌లో ఎంఈఎంయూ (MEMU) ట్రైన్ సర్వీసుకు పచ్చజెండాను చూపిస్తారు. ఆయన ఛత్తీస్‌గఢ్‌లో భారతీయ రైల్వేల రైల్ నెట్‌వర్కుకు చెందిన 100 శాతం విద్యుతీకరణ పనిని కూడా జాతికి అంకితం చేస్తారు. ఈ వివిధ ప్రాజెక్టులతో రద్దీ తగ్గుతుంది, సంధానం మెరుగుపడడంతోపాటు ఆ ప్రాంతం అంతటా సామాజిక, ఆర్థిక వృద్దికి దన్ను లభిస్తుంది.
ఈ ప్రాంతంలో రహదారులకు సంబంధించిన మౌలిక సదుపాయాలను పెంచడానికి, జాతీయ రహదారి (ఎన్‌హెచ్)-930లో (37 కిలోమీటర్ల) మేర ఉన్నతీకరించిన ఝల్‌మల్– షెర్‌పార్ సెక్షనుతోపాటు జాతీయ రహదారి (ఎన్‌హెచ్)-43 లో (75 కి.మీ.ల మేర) అంబికాపూర్–పత్థల్గావ్ సెక్షనును 2 మార్గాలుతో కూడిన పక్కా రోడ్లతో సహా ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని జాతీయ రహదారి (ఎన్‌హెచ్)-130డి (47.5 కి.మీ.) మేర కొండగావ్–నారాయణ్‌పూర్ సెక్షనును పక్కా రహదారులతో సహా 2 మార్గాలుగా విస్తరించే పనికి శంకుస్థాపన కూడా చేస్తారు. రూ.1,270 కోట్లకు పైగా వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుతో గిరిజన, పారిశ్రామిక ప్రాంతాలకు చేరుకోవడం చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడనుంది. ఇది ఈ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది.
విద్యాబోధనను అందరి అందుబాటులోకి తీసుకుపోవాలన్న తన నిబద్ధతకు అనుగుణంగా, రెండు ప్రధాన విద్యా కార్యక్రమాలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. వీటిలో రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 130 పీఎం శ్రీ పాఠశాలలతోపాటు రాయ్‌పూర్‌లో విద్యా సమీక్షా కేంద్రం (వీఎస్కే) భాగంగా ఉన్నాయి. ‘పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా’ పథకంలో భాగంగా 130 పాఠశాలలను ఉన్నతీకరిస్తారు. ఈ బడులు సువ్యవస్థిత మౌలిక సదుపాయాలు, స్మార్ట్ బోర్డులు, ఆధునిక ప్రయోగశాలలతోపాటు గ్రంథాలయాల ద్వారా అధిక నాణ్యత కలిగిన విద్యను బోధించడంలో తోడ్పడతాయి. రాయ్‌పూర్‌లో విద్యా సమీక్ష కేంద్రం విద్యకు సంబంధించిన ప్రభుత్వ వివిధ పథకాల ఆన్‌లైన్ పర్యవేక్షణకు, సమాచార విశ్లేషణకు మార్గాన్ని సుగమం చేస్తుంది.
గ్రామీణ కుటుంబాలకు మంచి గృహవసతిని అందుబాటులోకి తీసుకురావడానికీ, వారి ఆరోగ్యం, భద్రత, జీవన సమగ్ర నాణ్యతను మెరుగుపరచడానికి చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (పీఎంఎవై–జీ) లో భాగంగా 3 లక్షల మంది లబ్ధిదారులకు సంబంధించిన ‘గృహప్రవేశ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ పథకంలో కొందరు లబ్ధిదారులకు ఇంటి తాళంచెవులను ప్రధానమంత్రి అప్పగిస్తారు.
****