శ్రేష్ఠుడైన ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్,
ప్రసార మాధ్యమాల సభ్యులు,
సోదర సోదరీమణులారా,
ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ ను, ఆయన ప్రతినిధివర్గాన్ని భారతదేశానికి ఆహ్వానిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో మారిషస్ ప్రధానిగా కొత్త పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి విదేశీ పర్యటనకు మీరు భారతదేశాన్ని ఎంచుకోవడం మాకు నిజమైన గౌరవంగా భావిస్తున్నాము. రెండు శతాబ్దాలుగా ఎన్ని కష్టాలనైనా భరిస్తూ మన మధ్య నెలకొన్న పటిష్ఠమైన, విస్తృత బంధానికి మీ పర్యటన ఒక చిహ్నంగా నిలుస్తుంది. లోతుగా వేళ్ళూనుకున్న బంధం ప్రజలు, సమాజానికి కూడా విస్తరించి వారికి కూడా గర్వకారణంగా నిలిచింది. కాలానికి, దూరానికి కూడా తట్టుకుని మన బంధం మనుగడ సాగించింది. ఈ రోజు ఆ తాను భిన్న రంగాల్లో బలంగా అల్లుకుపోయింది.
మిత్రులారా,
ప్రధాని శ్రీ జగన్నాథ్ తో నా చర్చలు ఎంతో సుహృద్భావపూరకంగాను, ఉత్పాదకంగాను సాగాయి. మా మధ్య జరిగిన చర్చలు 2015 మార్చి నెలలో చిరకాలం జ్ఞాపకం ఉండిపోయే విధంగా సాగిన నా మారిషస్ పర్యటనను గుర్తుకు తెచ్చాయి. హిందూ మహాసముద్ర ప్రాంత దేశంలో నేను సాగించిన నా తొలి పర్యటన సహకారానికి ఒక సువిశాలమైన అజెండాను అందించింది. విలువలు, ప్రయోజనాలు, కృషి అన్నింటిలోనూ మన మధ్య గల సమానత్వ ధోరణులకు అది దర్పణం పట్టింది.
మిత్రులారా,
ఈ రోజు, మన ద్వైపాక్షిక అజెండాలో మరో పెద్ద అడుగు పడింది. హిందూ మహా సముద్రంలో అగ్రగామి దేశాలుగా మన కోస్తా ప్రాంతాలు, మన ఇఇజడ్ ల చుట్టూ పటిష్ఠమైన ఉమ్మడి సాగర భద్రతా వలయాన్ని నిర్మించాల్సిన బాధ్యత ఉన్నదని ప్రధాని శ్రీ జగన్నాథ్, నేను అంగీకారానికి వచ్చాం. ఆర్థిక అవకాశాలు పూర్తి స్థాయిలో అందుకునేందుకు కృషి చేయాలన్నా, మన జాతుల జీవనోపాధిని పరిరక్షించాలన్నా, మన ప్రజలకు భద్రత కల్పించాలన్నా మనకు సాంప్రదాయికంగాను, సాంప్రదాయేతరంగాను ఎదురవుతున్న ముప్పును దీటుగా ఎదుర్కొనవలసి ఉంటుందని కూడా మేం అంగీకారానికి వచ్చాం. ఇందులో భారతదేశం, మారిషస్ ల సహకారం అత్యంత కీలకం.
మనం
– వాణిజ్యం, పర్యాటకం రెండింటికీ ఎదురవుతున్న పైరసీ ముప్పు;
– మాదక ద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణా;
– అక్రమ చేపల వేట;
– ఇతర సముద్ర వనరుల అక్రమ దోపిడీ
అంశాలపైన గట్టి నిఘా పెట్టవలసిన అవసరం ఉంది.
ఈ రోజు ముగిసిన సాగర భద్రతా ఒప్పందం మన మధ్య పరస్పర సహాకారాన్ని, సామర్థ్యాలను పటిష్ఠం చేస్తుంది. సాగర తీరాన్ని మరింత భద్రమైందిగాను, శాంతియుతమైందిగాను తీర్చి దిద్దాలంటే సాగరజలాల సర్వేక్షణలో సహకారాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని మేం అంగీకరించాం. ‘ప్రాజెక్ట్ ట్రైడెంట్’ ద్వారా మారిషస్ జాతీయ సాగర రక్షణ దళం సామర్థ్యాలను పెంచుకొనేందుకు భారతదేశం మద్దతు ఇస్తుంది. గ్రాంట్ సహాయ కార్యక్రమం కింద మారిషస్‌కు అందించిన సాగర రక్షక నౌక గార్డియన్ జీవిత కాలాన్ని పెంచాలని కూడా మేం నిర్ణయించాం.
మిత్రులారా,
మారిషస్ తో బలీయమైన అభివృద్ధి భాగస్వామ్యం ఉభయ దేశాల సంబంధాల్లో ప్రధానాంశం. మారిషస్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యకలాపాల్లో చురుకైన భాగస్వామి కావడం భారతదేశానికి గర్వకారణం. ఈ రోజు మారిషస్ కు భారతదేశం ప్రకటించిన 500 మిలియన్ డాలర్ల రుణ సహాయం ఆ దేశాభివృద్ధి పట్ల మాకు గల బలమైన, కొనసాగుతున్న కట్టుబాటుకు నిదర్శనం. ప్రాధాన్యతాపూర్వకమైన ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా అది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిని ప్రధాని శ్రీ జగన్నాథ్, నేను స్వాగతిస్తున్నాం. ఉభయ దేశాలు ప్రత్యేకంగా గుర్తించిన ప్రాజెక్టులు సరైన సమయంలో పూర్తి చేయడానికి భారతదేశం పూర్తి మద్దతును ఇస్తుంది. ఈ ప్రాజెక్టులు మారిషస్ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయడమే కాకుండా ఉభయ దేశాల సంబంధాల్లో గుణాత్మక పరివర్తనకు చిహ్నంగా నిలుస్తాయి. మారిషస్ కు నైపుణ్యాల అభివృద్ధిలో కూడా సహకారాన్ని పెంచడంపై మా చర్చల్లో దృష్టి కేంద్రీకరించాం. మారిషస్ తో బహుముఖీన సామర్థ్యాల నిర్మాణ కార్యక్రమం కింద ఆ దేశంతో సాగిస్తున్న చర్చల్లో క్రియాశీలమైన అడుగు ఇది. ఈ విభాగంలో మరింత లోతైన సహకారాన్ని ఏర్పరచుకోవడం మాకు చాలా ఆనందదాయకం.
మిత్రులారా,
పునరుత్పాదక ఇంధన ప్రాధాన్యం పట్ల అందరి దృష్టిని ఆకర్షించడంలో ప్రధాని శ్రీ జగన్నాథ్ నాయకత్వ సమర్థతను మే ప్రశంసిస్తున్నాం. ఇంటర్ నేషనల్ సోలార్ అలయన్స్ ఒప్పందాన్ని మారిషస్ ధ్రువీకరించి సంతకాలు చేయడం వల్ల సౌర శక్తి రంగంలో ఉభయ దేశాల ప్రాంతీయ భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించుకొనేందుకు కొత్త మార్గాలను తెరిచాయి.
మిత్రులారా,
మారిషస్ లో నివసిస్తున్న భారతీయ సంతతి మారిషస్ జాతీయ జీవనానికి సౌర శక్తి విభాగంలో అందించిన సహకారం మాకు గర్వకారణం. మారిషస్ లోని భారతీయ సంతతితో నానాటికీ పెరుగుతున్న బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునే క్రమంలో ఈ జనవరిలో కేవలం మారిషస్ కు ప్రత్యేకంగా రూపొందించిన ఒసిఐ కార్డులు అందించనున్నట్టు ప్రకటించింది. కొత్త గమ్యాలకు కోడ్ షేరింగ్ ఒప్పందాలను విస్తరించుకునేందుకు మా ప్రధాన విమానయాన సంస్థలు అంగీకరించాయి. ఇది కూడా ఉభయ దేశాల ప్రజల మధ్య బంధం పటిష్ఠం కావడానికి, పర్యాటకం మరింతగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది.
మిత్రులారా,
ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రధాని శ్రీ జగన్నాథ్, నేను పలు ప్రాంతీయ, ప్రపంచ స్థాయి అంశాలపై మా అభిప్రాయాలు తెలియచేసుకున్నాం. ఉభయ దేశాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్ళు, ప్రయోజనాల విషయంలో సన్నిహితంగా సహకరించుకోవాలని, బహుముఖీన వేదికలపై పరస్పరం మద్దతు ఇచ్చుకోవాలని మేం అంగీకారానికి వచ్చాం. సాంప్రదాయికంగా మన మధ్య గల అనుబంధం అనే పునాదులపై మన బంధాన్ని మరింత ఎత్తులకు తీసుకువెళ్ళేందుకు ప్రధాని శ్రీ జగన్నాథ్ పర్యటన దోహదకారిగా నిలుస్తుంది. మన బంధం పట్ల గల విజన్ కు, మద్దతుకు ప్రధాని శ్రీ జగన్నాథ్ కు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ రోజు తీసుకున్న నిర్ణయాలను రానున్న మాసాల్లో ఆచరణలో పెట్టే విషయంలో ఆయనతో మరింత సన్నిహితంగా పని చేసేందుకు నేను ఎదురు చూస్తున్నాను. మరో సారి ప్రధాని శ్రీ జగన్నాథ్ కు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఆయన భారత పర్యటన ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
మీకు ఇవే నా ధన్యవాదాలు.
అనేకానేక ధన్యవాదాలు.
*****