గౌరవనీయ మారిషస్ ప్రధానమంత్రి శ్రీ నవీన్ చంద్ర రాంగూలాం, శ్రీమతి వీణా రాంగూలాం, ఉప ప్రధానమంత్రి శ్రీ పాల్ బెరెంజే గార్లూ, గౌరవనీయ మంత్రులూ, సోదర సోదరీమణులు అందరికీ నమస్కారం, బాన్ జూర్!
ముందస్తుగా ప్రధానమంత్రి భావోద్వేగపూరిత, స్ఫూర్తిదాయక ప్రసంగానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఘనమైన ఆత్మీయ స్వాగతమిచ్చిన ప్రధానమంత్రికి, ఈ దేశ ప్రజలకు కృతఙ్ఞతలు! మారిషస్ పర్యటన అంటే భారత ప్రధానమంత్రికి ఎప్పుడూ ప్రత్యేకమైనదే! దీనిని దౌత్యపరమైన పర్యటనగా కాక సొంత కుటుంబాన్ని కలుసుకునే అవకాశంగా మేం భావిస్తాం. మారిషస్ నేలపై తొలిసారి అడుగు పెట్టినప్పుడే ఈ అనుబంధం ప్రత్యేకత నాకు అవగతమైంది. నేను వెళ్ళిన ప్రతి చోటా ఈ కుటుంబ భావన నన్ను పలకరించింది. అటువంటి సమయాల్లో దౌత్యపరమైన కట్టుదిట్టాలు, నియమాలు మనకు స్ఫురించవు. మారిషస్ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా మరోసారి పిలుపు అందుకోవడాన్ని నేను గొప్ప గౌరవంగా భావిస్తాను. ఈ శుభ సందర్భంలో 140 కోట్ల భారతీయుల తరుఫున మీ అందరికీ శుభాకాంక్షలు!
ప్రధానమంత్రి గారూ…
మారిషస్ ప్రజలు మిమ్మల్ని తమ ప్రధానమంత్రిగా నాలుగో సారి ఎన్నుకున్నారు. గతేడాది నా దేశప్రజలు నాకు మూడోసారి సేవ చేసే అవకాశాన్ని కల్పించారు. మరోసారి అధికార బాధ్యతలు నెరవేరుస్తున్న ఈ సమయంలో మీవంటి సీనియర్ నేత, అనుభవజ్ఞుడితో కలిసి పని చేసే అవకాశాన్ని నాకు కలిగిన అదృష్టంగా భావిస్తాను. భారత్-మారిషస్ అనుబంధాన్ని నూతన శిఖరాలకు చేర్చే గొప్ప అవకాశం మనకు దక్కింది. ఇరు దేశాల అనుబంధం కేవలం చారిత్రకమైనదే కాదు, ఒకేరకమైన విలువల పట్ల నమ్మకం, పరస్పర విశ్వాసం, భవిష్యత్తు పట్ల ఉమ్మడి ఆకాంక్షలు కూడా మనల్ని కలిపి ఉంచే అంశాలే! మీ నాయకత్వం ఈ బంధానికి దన్నుగా నిలిచి బలోపేతం చేస్తోంది, అనేక రంగాలకు ఈ అనుబంధం విస్తరించేందుకు దోహదపడుతోంది. ప్రగతి పథంలో మారిషస్ చేస్తున్న ప్రయాణంలో విశ్వసనీయ భాగస్వామి హోదాలో భారత్ తోడు నిలవడం మాకు గర్వకారణం. మనం కలిసి చేపట్టిన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మారిషస్ ముఖచిత్రంపై చెదిరిపోని బలమైన ముద్రను వేస్తున్నాయి. కీలక వ్యవస్థల నిర్మాణం, మానవ వనరుల అభివృద్ధిలో పరస్పర సహకారం అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగాల్లో కూడా చక్కని ఫలితాలను చూపుతోంది. ప్రకృతి విలయం కావచ్చు, కోవిడ్ మహమ్మారి కావచ్చు, సంక్షోభ సమయాల్లో మనం ఒకే కుటుంబం మాదిరి ఒకరికొకరం తోడుగా ఉన్నాం. ఈరోజున మన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు సమగ్ర భాగస్వామ్యంగా పరివర్తన చెందాయి.
మిత్రులారా…
నౌకాయాన పరంగా భారత్ కు పొరుగు దేశమైన మారిషస్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. నా గత పర్యటన సందర్భంగా నేను ‘విజన్ సాగర్’ను మీతో పంచుకున్నాను. ప్రాంతీయ అభివృద్ధి, భద్రత, ఉమ్మడి ప్రగతి నా ప్రస్తావన కీలక లక్ష్యాలు. అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాలు కలిసికట్టుగా ఏకకంఠంతో తమ అభిప్రాయాలను వెల్లడించాలని మేం గట్టిగా నమ్ముతున్నాం. ఇదే ఉద్దేశంతో మా జి-20 అధ్యక్షత సమయంలో ‘గ్లోబల్ సౌత్’ ని ప్రధాన అంశంగా తెరపైకి తెచ్చాం. అదే సందర్భంలో మారిషస్ ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాం.
మిత్రులారా…
నేను ఇంతకుముందు చెప్పినట్టే, భారత్ పై హక్కుగల దేశమేదైనా ఉందీ అంటే, అది మారిషస్ మాత్రమే! మన రెండు దేశాల మధ్య అనుబంధం పరిమితులు లేనిది. అదే విధంగా ఇరుదేశాల సంబంధాల పట్ల మన ఆశలూ ఆకాంక్షలూ ఎల్లలు లేనివే! ఇరుదేశాల ప్రజల శాంతి సౌభాగ్యాల కోసం, ఈ మొత్తం ప్రాంత భద్రత కోసం భవిష్యత్తులో కూడా ఈ సహకారాన్ని కొనసాగిద్దాం. ఇదే సద్భావనతో ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రాంగూలాం, శ్రీమతి వీణా రాంగూలాం గార్ల సంపూర్ణ ఆయురారోగ్యాల కోసం అభినందనలు తెలుపుదాం… భారత్-మారిషస్ దేశాల మధ్య స్నేహం కొనసాగాలని, ఇరుదేశాల ప్రజలూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిద్దాం.
జై హింద్! వీవ్ మోరీస్!
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
My remarks during the banquet hosted by PM @Ramgoolam_Dr of Mauritius. https://t.co/l9bg6Q70iC
— Narendra Modi (@narendramodi) March 11, 2025