Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాతృత్వ ప్ర‌యోజ‌నాల చ‌ట్టం, 1961 కి స‌వ‌ర‌ణ‌లు


మాతృత్వ ప్ర‌యోజ‌నాల చ‌ట్టం ,1961లో అవ‌స‌ర‌మైన స‌వ‌ర‌ణ‌ల‌తో మాతృత్వ ప్ర‌యోజ‌నాల (స‌వ‌ర‌ణ‌) బిల్లు, 2016ని పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

మాతృత్వ ప్ర‌యోజ‌నాల చ‌ట్టం, 1961 కింద గ‌ర్భవతులయిన మ‌హిళ‌ల ఉపాధిని ప‌రిర‌క్షించేందుకు తగు నియ‌మ‌నిబంధ‌న‌లు రూపొందించింది. ప్ర‌స‌వం అనంత‌రం పుట్టిన శిశువు సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లు తీసుకునేందుకు ఉద్యోగానికి వెళ్ళ‌ని రోజుల‌న్నింటినీ పూర్తి వేత‌నం ఇచ్చే సెల‌వుగా ప‌రిగ‌ణించి మాతృత్వ‌పు ప్ర‌యోజ‌నం క‌ల్పించింది. 10 మంది, లేదా అంత‌కు మించిన ఉద్యోగులు ప‌ని చేసే సంస్థ‌ల‌న్నింటికీ ఈ చ‌ట్టం వ‌ర్తిస్తుంది. తాజాగా ఈ చ‌ట్టానికి ప్ర‌వేశ‌పెడుతున్న స‌వ‌ర‌ణ‌ల వ‌ల్ల వ్య‌వ‌స్థీకృత రంగంలో ప‌ని చేస్తున్న సుమారు 1.8 మిలియ‌న్ మందికి ప్ర‌యోజ‌నం చేకూరుతుంది.

మాతృత్వ ప్ర‌యోజ‌నాల చ‌ట్టం, 1961 కి చేయ తలపెట్టిన స‌వ‌ర‌ణ‌లు ఈ కింది విధంగా ఉన్నాయి :

• ఇద్ద‌రు పిల్ల‌ల వ‌ర‌కు మాతృత్వ ప్ర‌యోజ‌నం కింద ఇచ్చే సెల‌వు 12 వారాల నుండి 26 వారాల‌కు పెంపు; ఇద్ద‌రు క‌న్నా ఎక్కువ మంది పిల్ల‌ల విష‌యంలో మాతృత్వ‌పు సెల‌వు 12 వారాల‌కు ప‌రిమితం.

• ‘పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్న’ లేదా ‘ఇత‌రులకు గ‌ర్భం అద్దెకిచ్చి వారి పిల్ల‌ల‌ను మోస్తున్న’ త‌ల్లుల‌కు 12 వారాల మాతృత్వ‌పు సెల‌వు.

• ఇంటి వద్దే ఉండి ప‌ని చేసే సౌకర్యం (వ‌ర్క్ ఫ్రం హోమ్).

• 50 మంది, అంతకు పైబ‌డిన ఉద్యోగులు ప‌ని చేస్తున్న సంస్థ‌లలో బాలల‌ సంర‌క్ష‌ణ కేంద్రాలు (క్రెశె) ఏర్పాటు.

న్యాయ‌బ‌ద్ధ‌త‌:

• పిల్ల‌ల ప‌రిప‌క్వ‌త‌, అభివృద్ధికి శైశ‌వ ద‌శ‌లో త‌ల్లుల శ్ర‌ద్ధ చాలా అవ‌స‌రం.

• 44వ, 45వ, 46వ భారతీయ కార్మిక స‌మ్మేళ‌నాలలో ప్రసూతి సెల‌వు ప్రయోజనాలను 24 వారాల‌కు పెంచాల‌ని సిఫార‌సు చేశారు.

• మాతృత్వ‌పు ప్ర‌యోజ‌నాల‌ను 8 నెల‌ల‌కు పెంచాల‌ని మ‌హిళా, శిశు అభివృద్ధి శాఖ ప్ర‌తిపాదించింది.

• మాతృత్వ‌పు సెల‌వు పెంపునకు సంబంధించిన ప్రతిపాదనకు త్రైపాక్షిక సంప్రదింపులలో సంబంధిత వర్గాలు అన్నీ తమ మ‌ద్ద‌తును తెలియజేశాయి.

***