మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి మా హృదయాలను తీవ్రంగా కలచివేసింది. ఆయన మృతి దేశానికి తీరని లోటు. విభజన సమయంలో ఎంతో నష్టపోయి భారత్ కు వచ్చి, జీవితంలోని ప్రతీ దశలో ఘన విజయాన్ని సాధించడం మామూలు విషయం కాదు. ప్రతికూలతలనూ, సవాళ్లనూ అధిగమించి ఉన్నత స్థానాలకు ఎలా ఎదగవచ్చో తెలియజెప్పిన ఆయన జీవితం భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
సుహృద్భావం కలిగిన వ్యక్తిగా, నిపుణుడైన ఆర్థిక వేత్తగా, సంస్కరణలపట్ల నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆయన ఎన్నటికీ గుర్తుండిపోతారు. ఆర్థికవేత్తగా కేంద్ర ప్రభుత్వానికి వివిధ హోదాల్లో ఆయన సేవలందించారు. క్లిష్ట సమయంలో ఆయన భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా ఉన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ పి.వి.నరసింహారావు గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా దేశాన్ని సంక్షోభం నుంచి బయటకు తెచ్చి సరికొత్త ఆర్థిక పథంలో దిశానిర్దేశం చేశారు. దేశ అభివృద్ధి, పురోగతి కోసం ప్రధానిగా ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివి.
ప్రజల, దేశ అభివృద్ధి పట్ల ఆయన చూపిన నిబద్ధత ఎన్నటికీ శ్లాఘనీయమైనదే. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జీవితం నిజాయితీకి, నిరాడంబరతకు ప్రతిరూపం. ఆయన అత్యుత్తమ పార్లమెంటేరియన్. నిగర్విగా, సౌమ్యుడిగా, మేధావిగా తన పార్లమెంటరీ జీవితాన్ని ఆయన తీర్చిదిద్దుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో రాజ్యసభలో ఆయన పదవీకాలం ముగిసిన సందర్భంలో.. పార్లమెంటు సభ్యుడిగా ఆయన నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్న విషయం నాకు గుర్తుంది. పార్లమెంటు సమావేశాల కీలక సమయాల్లో ఆయన చక్రాల కుర్చీలో సభకు హాజరై తన పార్లమెంటరీ విధులు నిర్వర్తించారు.
ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థల్లో విద్యనభ్యసించి, ప్రభుత్వంలో అనేక ఉన్నత పదవులు నిర్వహించినప్పటికీ.. తన నేపథ్యాన్ని ఎన్నడూ మరచిపోకుండా విలువలు కొనసాగించారు. పక్షపాత రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులతో ఆయన సత్సంబంధాలను కొనసాగించారు. అందరికీ అందుబాటులో ఉండేవారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో వివిధ జాతీయ, అంతర్జాతీయ అంశాలపై బహిరంగంగా చర్చలు జరిపాను. ఢిల్లీకి వచ్చిన తర్వాత కూడా ఆయనను తరచూ కలిసి మాట్లాడేవాడిని. దేశం గురించి మా చర్చలను, మా సమావేశాలను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను ఆయనతో మాట్లాడాను.
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. దేశ ప్రజలందరి తరఫునా డాక్టర్ మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పిస్తున్నాను.
***
The passing away of Dr. Manmohan Singh Ji is deeply saddening. I extend my condolences to his family and admirers.https://t.co/6YhbaT99dq
— Narendra Modi (@narendramodi) December 27, 2024