ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మహారాష్ట్ర లోని థానేలో రూ.32,800 కోట్ల కు పైగా విలువ చేసే వివిధ పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాంతంలో పట్టణ రవాణకు ఊతం ఇచ్చే ప్రధాన దృష్టితో ఈ ప్రాజెక్టులను చేపట్టారు.
ప్రధానమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మరాఠీకి ప్రాచీన భాష హోదా ఇచ్చిందని, ఇది మహారాష్ట్ర , మరాఠీ భాషల పట్ల గౌరవం మాత్రమే కాదని, భారత దేశానికి సుసంపన్న జ్ఞానం, తత్త్వశాస్త్రం, ఆధ్యాత్మికత, సాహిత్యాల గొప్ప సంస్కృతిని అందించిన సంప్రదాయానికి నివాళి అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మరాఠీ భాష మాట్లాడే వారందరికీ శ్రీ మోదీ అభినందనలు తెలిపారు.
నవరాత్రుల సందర్భంగా వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ప్రస్తావిస్తూ, ఈ రోజు వాషిమ్ ను సందర్శించానని, అక్కడ దేశంలోని 9.5 కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను విడుదల చేశానని, అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించానని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర ఆధునిక అభివృద్ధి దిశగా థానేలో కొత్తగా కీలకమైన విజయాలను సాధిస్తున్నామని, నేటి సందర్భం రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. రూ.30,000 కోట్లకు పైగా విలువైన ముంబయి ఎంఎంఆర్ ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభమయ్యాయని, రూ.12,000 కోట్లకు పైగా విలువైన థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఈ రోజు శంకుస్థాపన జరిగిందని శ్రీ మోదీ తెలిపారు. నేటి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ, ఇవి ముంబయి, థానేలకు ఆధునిక గుర్తింపును ఇస్తాయని ప్రధాన మంత్రి అన్నారు. ముంబయిలోని ఆరే నుంచి బీకేసీ వరకు ఆక్వా లైన్ మెట్రో కూడా ఈ రోజు ప్రారంభమయిందని ప్రధాని ప్రకటించారు. ఈ మెట్రో మార్గం కోసం ముంబయి ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఆక్వా మెట్రో మార్గానికి సహకరించిన జపాన్ ప్రభుత్వానికి, జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ (జైకా) కి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అందువల్ల, ఈ మెట్రో మార్గం భారత–జపాన్ దేశాల స్నేహానికి చిహ్నమని ఆయన అన్నారు.
శ్రీ బాలా సాహెబ్ ఠాక్రేకు థానే అంటే ప్రత్యేకమైన అభిమానమని శ్రీ మోదీ గుర్తు చేశారు. థానే.. దివంగత శ్రీ ఆనంద్ దిఘే నగరం కూడా అని ఆయన అన్నారు. “థానే భారతదేశపు మొట్టమొదటి మహిళా వైద్యురాలు డాక్టర్ ఆనందీ భాయ్ జోషిని ఇచ్చింది” అని శ్రీ మోదీ అన్నారు. ఈ రోజు అభివృద్ధి పనులతో ఈ దార్శనికులందరి కలలను సాకారం చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ రోజు ప్రారంభించిన అభివృద్ధి పనులకు గాను థానే, ముంబై, మహారాష్ట్ర ప్రజలకు ప్రధాని అభినందనలు తెలిపారు.
“వికసిత్ భారత్ ఈ రోజు ప్రతి భారతీయుడి లక్ష్యం” అని శ్రీ మోదీ ఉద్వేగంగా అన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం, సంకల్పం, కల వికసిత్ భారత్ కు అంకితమని ఆయన చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి ముంబయి, థానే వంటి నగరాలను భవిష్యత్తుకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. అభివృద్ధిని సంరక్షించడం , గత ప్రభుత్వాల లోపాలను సమర్థవంతంగా అధిగమించడం కోసం ప్రభుత్వం తన ప్రయత్నాలను ద్విగుణీకృతం చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ముంబయిలో పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఎటువంటి పరిష్కారాలు చేపట్టలేదని ఆయన అన్నారు. పెరుగుతున్న సమస్యల కారణంగా భారతదేశ ఆర్థిక రాజధాని ముంబయిని స్తంభింపచేస్తారనే భయాలున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోందని, ఈ రోజు 300 కిలోమీటర్ల మెట్రో నెట్ వర్క్ ను అభివృద్ధి చేస్తున్నామని శ్రీ మోదీ తెలిపారు. తీరప్రాంత రహదారి కారణంగా మెరైన్ డ్రైవ్ నుండి బాంద్రాకు ప్రయాణించడానికి పట్టే సమయం 12 నిమిషాలకు తగ్గిందని, అటల్ సేతు ఉత్తర, దక్షిణ ముంబై మధ్య దూరాన్ని తగ్గించిందని అన్నారు. ఆరెంజ్ గేట్ టు మెరైన్ డ్రైవ్ భూగర్భ సొరంగం ప్రాజెక్టు కూడా ఊపందుకుందని ఆయన పేర్కొన్నారు. వెర్సోవా నుండి బాంద్రా సీ బ్రిడ్జ్ ప్రాజెక్ట్, ఈస్టర్న్ ఫ్రీ వే, థానే–బోరివాలి టన్నెల్, థానే సర్క్యులర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ వంటి నగరంలోని వివిధ ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ, ఈ అభివృద్ధి ప్రాజెక్టులు ముంబయి ముఖచిత్రాన్ని మారుస్తున్నాయని, ముంబయి చుట్టుపక్కల నగరాల సమస్యలను తగ్గించడం ద్వారా ముంబయి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు పరిశ్రమల వృద్ధితో పాటు కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తాయని ఆయన అన్నారు.
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర అభివృద్ధే ఏకైక లక్ష్యంగా భావిస్తోందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్లే ముంబై మెట్రో రెండున్నరేళ్లు ఆలస్యమైందని, ఫలితంగా రూ.14 వేల కోట్ల వ్యయం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ డబ్బు మహారాష్ట్రలో కష్టపడి పనిచేసే పన్ను చెల్లింపుదారులకు చెందినది” అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు.
అటల్ సేతుకు వ్యతిరేకంగా నిరసనలు, ముంబయి–అహ్మదాబాద్ బుల్లెట్ రైలును మూసివేసేందుకు కుట్ర, రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో నీటి సంబంధిత ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి వాటికి గత ప్రభుత్వ ట్రాక్ రికార్డ్ నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలని, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడేవారిని ప్రధాని హెచ్చరించారు.
ప్రసంగాన్ని ముగిస్తూ, దేశానికి, మహారాష్ట్రకు నిజాయితీ, సుస్థిర విధానాలతో కూడిన ప్రభుత్వం అవసరమని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే కాకుండా సామాజిక మౌలిక సదుపాయాలను కూడా బలోపేతం చేసిందని ప్రధాని పేర్కొన్నారు. “హైవేలు, ఎక్స్ ప్రెస్ వేలు, రైల్వేలు, విమానాశ్రయాల అభివృద్ధిలో రికార్డు సృష్టించామని, 25 కోట్ల మందిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చామని చెప్పారు. మనం ఇంకా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది” అని ప్రధాన మంత్రి మహారాష్ట్రలోని ప్రతి పౌరుడు ఈ సంకల్పానికి మద్దతుగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ,శ్రీ అజిత్ పవార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
ఈ ప్రాంతంలో పట్టణ రవాణాను పెంపొందించడానికి ప్రధాన చర్యగా, ప్రధాన మంత్రి కీలకమైన మెట్రో , రోడ్డు ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన చేశారు. సుమారు రూ.14,120 కోట్ల విలువైన ముంయి మెట్రో లైన్ – 3లోని బీకేసీ నుంచి ఆరే జేవీఎల్ఆర్ సెక్షన్ ను ప్రధాని ప్రారంభించారు. ఈ విభాగంలో 10 స్టేషన్లు ఉంటాయి. వీటిలో 9 స్టేషన్లు భూగర్భంలో ఉంటాయి. ముంబయి మెట్రో లైన్ – 3 ఒక కీలకమైన ప్రజా రవాణా ప్రాజెక్టు. ఇది ముంబయి నగరం, శివారు ప్రాంతాల మధ్య ప్రయాణాన్ని మెరుగుపరుస్తుంది. పూర్తిస్థాయిలో పని చేసే లైన్-3 ద్వారా రోజుకు 12 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. సుమారు రూ.12,200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు మొత్తం పొడవు 29 కిలోమీటర్లు కాగా, 20 ఎలివేటెడ్, 2 భూగర్భ స్టేషన్లు ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా ఉన్న థానేలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి ఈ ప్రతిష్ఠాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఉపయోగపడుతుంది.
చద్దా నగర్ నుంచి థానేలోని ఆనంద్ నగర్ వరకు సుమారు రూ.3,310 కోట్ల విలువైన ఎలివేటెడ్ ఈస్ట్రన్ ఫ్రీవే ఎక్స్ టెన్షన్ కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు దక్షిణ ముంయి నుండి థానేకు అంతరాయం లేని అనుసంధానాన్ని అందిస్తుంది.
సుమారు రూ.2,550 కోట్ల విలువైన నవీ ముంబయి ఎయిర్ పోర్ట్ ఇన్ ఫ్లుయెన్స్ నోటిఫైడ్ ఏరియా (నైనా) ఫేజ్-1 ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ప్రధాన రహదారులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, ఇంటిగ్రేటెడ్ యుటిలిటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం ఈ ప్రాజెక్టులో భాగం.
దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించనున్న థానే మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రధాని శంకుస్థాపన చేశారు. థానే మునిసిపల్ కార్పొరేషన్ ఎత్తైన పరిపాలనా భవనం పలు మునిసిపల్ కార్యాలయాలకు కేంద్రీకృత భవనంగా థానే పౌరులకు ప్రయోజనాలను అందిస్తుంది.
मुंबई और आसपास के शहरों की कनेक्टिविटी को लेकर हमारी सरकार में अभूतपूर्व काम हुए हैं, जिनसे यहां के लोगों का जीवन बहुत आसान हुआ है। pic.twitter.com/MK5SedX3QK
— Narendra Modi (@narendramodi) October 5, 2024
मुंबई मेट्रो गवाह है कि कांग्रेस और महाअघाड़ी वाले महाराष्ट्र की प्रगति में कैसे रोड़ा अटकाते हैं। विकास के इन दुश्मनों को राज्य की सत्ता से सैकड़ों मील दूर रखना है। pic.twitter.com/njnoJ5cGLK
— Narendra Modi (@narendramodi) October 5, 2024
महाराष्ट्र की हमारी माताओं-बहनों को कांग्रेस और महाअघाड़ी वालों से इसलिए बहुत सावधान रहना है… pic.twitter.com/6LKP0CutWR
— Narendra Modi (@narendramodi) October 5, 2024
कांग्रेस और उसके साथियों का एक ही मिशन है- समाज और लोगों को बांटकर सत्ता पर कब्जा करो। इसलिए हमें ये याद रखना है… pic.twitter.com/yV7krIZALa
— Narendra Modi (@narendramodi) October 5, 2024