మసూరీ లోని లాల్ బహాదుర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమి (ఎల్ బిఎస్ఎన్ఎఎ), మరియు నమీబియా లోని నమీబియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్ మెంట్ (ఎన్ఐపిఎఎమ్) ల మధ్య అవగాహన పూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ అవగాహన పూర్వక ఒప్పందం నమీబియా లోని అధికారుల కెపాసిటీ బిల్డింగ్ తో పాటు, ఈ రెండు సంస్థలు లాభ పడేందుకు ఉద్దేశించినటువంటి ఇతర శిక్షణ కార్యక్రమాలకు సంబంధించింది.
దేశంలో ఉన్నతమైన పౌర సేవలకు సంబంధించిన శిక్షణ సంస్థను నడపడంలో లాల్ బహాదుర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమి తనకు ఉన్న అనుభవాన్ని ఎన్ఐపిఎఎమ్ కు అందించడానికి ఈ ఎమ్ఒయు తోడ్పడుతుంది. ప్రజా పాలన మరియు కెపాసిటీ బిల్డింగ్ రంగంలో సహకారాత్మక కార్యకలాపాలను నిర్వహించుకోవడంలో ఈ ఎమ్ఒయు ఇరు పక్షాలకు ఉపయోగపడుతుంది కూడా.