నమస్కారం,
నా ప్రియమైన మిత్రులారా.. సోదర సోదరీమణులారా..
ఉంగాలిల్ పాలార్ తమిళ్ నట్టై సెంథవర్గల్
మీలో చాలామంది తమిళనాడు నుంచి వచ్చినవాళ్లు
ఉంగల్ అనైవరుక్కుమ్ వణక్కమ్.
మీకందరికీ నమస్కారం
ఇండియావిన్ వలర్చియిల్ తమిళ్నట్టిన్ ముక్కైమ్
భారతదేశ అభివృద్ధిలో తమిళనాడు పాత్ర అత్యంత కీలకం
నమస్కార్,
మలేసియాలో పర్యటిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే, ఇంత పెద్ద సభలో మీతో సమావేశం కావడం నాకు నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.
నా ఉద్దేశంలో, భారతదేశం తన భూభాగానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ప్రతి భాగంలోనూ ఉన్న భారతీయులందరిలోనూ భారతదేశం ఉంది. భారత్ అంటేనే మీరు.
నేను మీ ముందు నుంచుని మాట్లాడుతున్నప్పుడు, ప్రఖ్యాత తమిళ కవి తిరువళ్లువర్ చెప్పిన మాటలు నాకు గుర్తుకు వస్తున్నాయి.
‘‘స్నేహం అంటే కేవలం ముఖం మీద చిరునవ్వు మాత్రమే కాదు. అది ఆనందపు హృదయాంతరాళాల్లోంచి వచ్చేది’’
మహాత్మ గాంధీ ఒకసారి ఏం చెప్పారంటే, తిరువళ్లువర్ రచించిన తిరుక్కురళ్ ను దాని అసలు రూపంలోనే చదవాలని ఉందని, అందుకు తమిళ్ నేర్చుకోవాలని ఉందని చెప్పారు. తిరువళ్లువర్ మనకు ఇచ్చినన్ని జ్ఞాన సంపదను మరెవరూ ఇవ్వలేదు.
నేను మలేసియా వచ్చిన ప్రతిసారీ మిత్రత్వానికి సంబంధించి ఆ మహాత్ముడు చెప్పిన మాటలే నాలో మార్మోగుతూ ఉంటాయి.
నేను ఇక్కడికి ఇప్పుడు భారతదేశానికి ప్రధాన మంత్రిగా వచ్చానా లేక అధికారం ఏమీ లేకుండా వచ్చానా అన్న దానితో ఏమాత్రం సంబంధం లేదు.
నేను అదే స్నేహ సౌరభాలను, సాదర స్వాగతాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. మలేసియా భారతీయుల ప్రేమానురాగాలు, స్నేహానికి నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుంది.
కొన్ని తరాల కిందట, మీలో చాలామంది పూర్వీకులు తమకు ఏమాత్రం తెలియని భూ భాగానికి వచ్చారు.
మన సరళీకరణ ప్రపంచ చలనశీలతలో భాగంగా ఇటీవలి కాలంలోనే మీలో చాలామంది ఇక్కడికి వచ్చారు.
మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా.. మీరు వచ్చినప్పుడు పరిస్థితులు ఎటువంటివైనా.. కాలం కానీ సమయం కానీ భారతదేశంపై మీ ప్రేమను ఏమాత్రం తగ్గించలేకపోయాయి.
పండుగల దీప కాంతుల్లో దీనిని నేను గమనించాను. ఎప్పటికంటే ఎక్కువగా అవి మరిన్ని వెలుగులు విరజిమ్ముతున్నాయి.
సంగీత సుస్వరాల్లో, నాట్యకారుడి నాజూకుతనంలో, గుడి గంటల్లో మరియు దైవ ప్రార్థనల్లో వీటన్నిటినీ నేను చూశాను.
మరియు, భారతదేశంలో ఏటా నిర్వహించే ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో అతి పెద్ద భాగస్వాములు కూడా మలేసియా భారతీయులే.
అలాగే, వైబ్రంట్ గుజరాత్ సదస్సును మలేసియా భారతీయులు మరింత కాంతిమంతం చేశారు.
భారత్ మరియు మలేసియాలు ఒకప్పుడు ఒకే వలస రాజ్యం కింద మగ్గిపోయాయి. ఒక దశాబ్దం కాలంలోనే రెండు దేశాలూ స్వేచ్ఛా స్వతంత్ర్యాలను పీల్చుకున్నాయి.
అంతేనా, స్వతంత్ర భారతదేశం మలేసియా భారతీయులకు ఎంతో రుణ పడి ఉంది. మలేసియా భారతీయుల పోరాటాలు, త్యాగాల ఆధారంగానే, కొంత వరకూ అయినా, భారతదేశ స్వతంత్ర పోరాట కీర్తి ప్రతిష్ఠలు లిఖించబడ్డాయి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరడానికి వేలాదిమంది మీ తాతలు ముత్తాతలు ముందుకు వచ్చారు. మహిళలు అయితే పెద్ద సంఖ్యలో వెల్లువెత్తారు. ఇంట్లో సుఖవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ తో భుజం భుజం కలిపి నడిచారు.
కెప్టెన్ లక్ష్మీ సెహగల్ కు డిప్యూటీగా వ్యవహరించిన పాన్ శ్రీ కెప్టెన్ జానకీ అథి నాహప్పన్ కు ఈ సందర్భంగా నేను ప్రత్యేక నివాళిని అర్పిస్తున్నాను.
భారతదేశ స్వతంత్ర పోరాటంలో మరో కలికితురాయి ఝాన్సీ లక్ష్మీ బాయి పేరిట ఏర్పాటు చేసిన రెజిమెంట్ లో వారు పని చేశారు.
భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి తమ జీవితాలను త్యాగం చేసిన గుర్తు తెలియని, గుర్తించని మలేసియా భారతీయులుందరికీ ప్రతి భారతీయుడి తరఫునా నేను కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
వారి పిల్లలు, మనవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను.
ఇక, ఇక్కడ కౌలాలంపూర్ లో, మన ఇండియన్ కల్చరల్ సెంటర్ కు మనం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పేరును పెట్టుకున్నాం.
ఏడు దశాబ్దాల కిందట అత్యంత విషాదకరమైన, అత్యంత దారుణమైన ప్రపంచ యుద్ధం ముగిసింది.
మలేసియా యుద్ధ క్షేత్రాల్లో అసువులు బాసిన లక్షలాదిమంది భారతీయ సైనికులకు కూడా నేను ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఆ యుద్ధాల్లో తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిలో అత్యధికులు సిక్కులు.
వారి రక్తం శాశ్వతంగా మలేసియా గడ్డతో మమేకం అయిపోయింది. మన రెండు దేశాలకూ ఎంతో ముఖ్యమైనది ఆ యుద్ధం. ఎందుకంటే, మలేసియా గడ్డతో మమేకం అయిపోని వారి రుధిర ధారలే ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలుగా ఏర్పడ్డాయి. వాటిని చెరిపివేయడం ఎవరి తరమూ కాదు.
అంతేనా.. వారు చూపిన ధైర్య సాహసాలు, కర్తవ్య దీక్ష భారతదేశంలోని పంజాబ్ రెజిమెంట్, సిక్ రెజిమెంట్, జాట్ రెజిమెంట్ మరియు డోగ్రా రెజిమెంట్ స్ఫూర్తిల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి.
అసువులు బాసిన మన సైనికులకు పెరెక్ లోని బ్యాటిల్ ఆఫ్ కాంపర్ ప్రాంతంలో యుద్ధ స్మారకం నిర్మించడానికి మలేసియా ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.
సోదర సోదరీమణులారా..
నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపునకు ధైర్య సాహసాలు, ఆవేశంతో స్పందించిన మలేసియా భారతీయులు, మహాత్మ గాంధీ మిషన్, జీవితం నుంచి కూడా అంతే స్ఫర్తి పొందారు.
సుంగై పితానిలోని భారతీయ సమాజానికి నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే, గాంధీ మహాత్ముడు మరణించిన కొన్ని సంవత్సరాలకే వారు ఇక్కడ గాంధీ స్మారక సమావేశ మందిరాన్ని నిర్మించుకున్నారు.
గాంధీజీని మీరెప్పుడూ కలుసుకోలేదు. గాంధీజీ ఎన్నడూ మలేసియాలో పర్యటించలేదు. కానీ, ఆయన మీ హృదయ వీణలను మీటారు.
అలాగే, ఒక సమాజంగా, మహాత్ముడి స్మారకాన్ని మీ అంతట మీరు సొంతంగా నిర్మించుకున్నారు. ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఆయన సిద్ధాంతాలను గౌరవించారు. భారత మాతకు, మొత్తం మానవ జాతికి ఆయన చేసిన మేలుకు ఘన నివాళి అర్పించారు.
దీని కంటే కూడా నన్ను కదిలించే అంశాలు మరికొన్ని ఉన్నాయి. అవి.. నిశ్శబ్ద నివాళిని మీరు కార్యాచరణలోనే చూపించారు. సజీవ స్మారకాన్ని నిర్మించారు.
గాంధీ మెమోరియల్ హాల్ లో గాంధీజీ ఊర్ధ్వ భాగ ప్రతిమను ఏర్పాటు చేస్తామని సగౌరవంగా మనవి చేసుకుంటున్నాను.
సేవ చేయాలనే మీ స్ఫూర్తి అత్యంత బలీయమైనది. అలాగే, 2001లో నా రాష్ట్రమైన గుజరాత్ ను భూకంపం కుదిపేస్తే, అక్కడ మళ్లీ బాధితుల్లో జీవితాన్ని పునరుద్ధరించడానికి, వారికి సహాయం చేయడానికి మలేసియా భారతీయులు వారంతట వారే నిధులు సేకరించడానికి ముందుకు వచ్చారు.
స్వాతంత్ర్య పోరాటానికి మీ క్రియాశీల భాగస్వామ్యం నుంచే మీ సంస్కారంలోని ఔన్నత్యం పెంపొందుతూ వస్తోంది. మీ హృదయాల్లోనే భారతదేశం జీవిస్తోంది.
మా ఆలోచనల్లో మీకెప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటూనే ఉంటుంది.
నా ప్రియమైన సోదర సోదరీమణులారా,
మీరు చేసే పనుల్లోనే భారతదేశ స్ఫూర్తి కళ్లకు కడుతూ ఉంటుంది.
భాషలు, మతాలు, సంస్కృతుల్లో భారతదేశ వైవిధ్యాన్ని మీరు ప్రతిబింబింపజేస్తూ ఉంటారు. సామరస్య స్ఫూర్తిలోనూ మీకు మీరే సాటి. కేవలం మలేసియా భారతీయులు మాత్రమే కాదు మొత్తం మలేసియా ప్రజలకు కూడా ఇది వర్తిస్తుంది.
మీరు సాధించిన ఘనతలు మమ్మల్ని తలెత్తుకునేలా చేశాయి. మీ చేతులతో మీరు శ్రమించారు. ఎంతో హుందాగా సగౌరవంగా మీరు ఇక్కడ జీవిస్తున్నారు.
అలాగే, ప్రతి తరంలోనూ, రాజకీయాలు, ప్రజా సేవ, ప్రభుత్వ పాలన, మరియు ప్రొఫెషనల్ సర్వీసుల్లో మీరు మరిన్ని విజయాలు సాధించారు.
వ్యాపార వాణిజ్యాల్లో మీరు సంపన్నులుగా ఎదిగారు. మరియు, ప్లాంటేషన్ ఉత్పత్తులను మీరు ఇక్కడ తయారు చేస్తున్నారు.
మలేసియా ఒక చలనశీల, ఆధునిక దేశంగా మరియు ఆర్థిక శక్తిగా రూపుదిద్దుకోవడానికి మీరు ఎంతో కృషి చేశారు.
అలాగే, భారత్, మలేసియా మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి మీరు మరింత సహకరిస్తూనే ఉన్నారు.
మలేసియా ఆరోగ్య శాఖ కేబినెట్ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం చేసిన పనుల్లో నేను ఈ విషయాన్ని గమనించాను. మలేసియా భారతీయులు డాక్టర్లు కావడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కనక మలేసియా భారతీయుడు మాత్రమే ఆ పదవిని చేపట్టడం ఎంతో సబబుగా ఉంది.
అలాగే, భారతదేశం, దక్షిణాసియా మధ్య సహకారం, మౌలిక సదుపాయాల కల్పనకు మలేసియా ప్రత్యేక రాయబారిగా ప్రఖ్యాత మలేసియా భారతీయుడు దాతు సామి వేలు ఉండడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది.
నా ప్రియమైన సోదర సోదరీమణులారా,
మన రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలకు మీరు సజీవ తార్కాణాలు.
భారతదేశం మరియు మలేసియా మధ్య సంబంధాలు మన భూభాగం అంత పురాతనమైనది. దానిని మీరు ప్రతిబింబిస్తున్నారు.
కోరమాండల్, కళింగ తీరం నుంచి మలేసియా ద్వీపానికి బంగాళాఖాతం వ్యాపారం, వాణిజ్యం మరియు సంస్కృతిని మోసుకుని వస్తోంది.
అక్కడ వ్యాపారం ఉందంటే, గుజరాత్ ఎంత మాత్రమూ వెనక సీటులో ఉండదు. అందుకే వ్యాపారంలో గుజరాతీలు కూడా భాగస్వాములయ్యారు.
కేదా రాష్ట్రంలోని భుజంగ వ్యాలీ శిథిలాల నుంచి తమిళనాడులోని పల్లవులు, చోళ సామ్రాజ్యాల గత వైభవాన్ని మేం చూస్తున్నాం.
అలాగే, మన రెండు దేశాలనూ కలిపిన సుగంధ మార్గం మన ఆహారానికి కూడా అదే రుచులను తెచ్చిపెట్టింది.
బుద్ధుడి నేల నుంచి ఆగ్నేయాసియాకు శాంతి సందేశాన్ని మోసుకొచ్చిన సాధువుల అడుగు జాడల్లో మన సంబంధ బాంధవ్యాలను చూడవచ్చు.
మన సాంస్కృతిక వారసత్వ గొప్పదనం ఇదే. మన ఆధునిక సంబంద బాంధవ్యాలకు పురాతన కాలంలో వేసిన పునాది ఇది.
రామకృష్ణ మిషన్ ను సందర్శించి అక్కడ స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించే మహద్భాగ్యం ఈరోజు నాకు కలిగింది.
ఇది వ్యక్తిగతంగా నాకు మాత్రమే ఆధ్యాత్మిక సంఘటన కాదు.. శతాబ్దం కిందట ఆయన తన ప్రాంతం నుంచి అమెరికాకు చేసిన అద్భుత ప్రయాణాన్ని అది మనకు గుర్తు చేస్తుంది.
భారతదేశ ప్రాచీన విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని అక్కడ ఆయన ప్రపంచ ఐక్యతకు ఆవేశపూరిత పిలుపు ఇచ్చారు. ఏషియన్ స్ఫూర్తి గురించి ఆయన మాట్లాడారు. ఇప్పుడు మనం ఏసియన్ శతాబ్దం గురించి కలలు కంటున్నాం. ప్రస్తుత సమయంలో మనకు ఆయన ఇచ్చిన స్ఫూర్తియే కావాలి.
ప్రపంచవ్యాప్తంగా భారీ సవాళ్లు విసురుతున్న ప్రస్తుత తరుణంలోనే, మలేసియా గడ్డపై ప్రతిష్టించిన ఈ విగ్రహం ప్రపంచానికి విలువలను గుర్తు చేస్తూ ఉంటుంది. సమాజాలను చిన్నభిన్నం చేసిన అడ్డదోవలను సరి చేయడానికి ఇప్పుడు మనకు ఇవి అవసరం.
అలాగే, ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ తో కలిసి రేపు నేను బ్రిక్ ఫీల్డ్స్ లోని లిటిల్ ఇండియా సమీపంలోని టోరానా గేట్ ను సంయుక్తంగా ఆవిష్కరించనున్నాను.
ఇది భారతదేశం ఇచ్చే బహుమతి. భారతదేశంలోని సాంచీ స్థూపం వద్ద ఉన్న గేటును ఇది తలపిస్తుంది. దానిని దాదాపు రెండు వేల ఏళ్ల కిందట నిర్మించారు. ప్రపంచంలోని బుద్ధిజం స్థలాలకు సంబంధించి అత్యంత పూజనీయ స్థలాల్లో ఇది ఒకటి.
అందుకే, లిటిల్ ఇండియాకు వచ్చిన ప్రతి పర్యాటకుడికి ప్రజల మధ్య శాంతికి సంబంధించిన సందేశాన్ని; మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న సౌభ్రాత్రాన్ని; మన రెండు గొప్ప దేశాల ప్రజల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను ఇది గుర్తు చేస్తుంది.
వాటన్నిటికీ మించి, వివేకానందుడి విగ్రహం, ఈ గేటు మలేసియా వైవిధ్యానికి, సామరస్యానికి ప్రతీకలుగా మిగిలిపోతాయి.
నా ప్రియమైన సోదర సోదరీమణులారా..
మాలేసియా సాధించిన ఘనతలను మాటల్లో చెప్పలేం. స్వాతంత్ర్యాన్ని సముపార్జించిన కేవలం ఆరు దశాబ్దాల్లోనే మూడు కోట్ల మంది జనాభా కలిగిన ఈ దేశం ఒక గర్వకారణంగా నిలిచింది.
ఈ దేశం పేదరికాన్ని దాదాపుగా నిర్మూలించింది. దేశంలోని ప్రజలందరికీ మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచింది. అంతేనా ఈ దేశం నూటికి నూరు శాతం అక్షరాస్యతను సాధించింది. అలాగే, ఉద్యోగం కోరుకునే వాళ్లకు, ఉద్యోగం కావాల్సిన వాళ్లకు ప్రతి ఒక్కరికీ ఈ దేశం ఉద్యోగాలను అందిస్తోంది.
మలేసియా పర్యాటక రంగం జేగీయమానంగా వెలుగొందుతోంది. అంతేనా.. ప్రకృతి అందించిన అందమైన బహుమతులను ఈ దేశం జాగ్రత్తగా కాపాడుకుంటోంది.
మలేసియాలోని మౌలిక సదుపాయాలు ప్రపంచస్థాయిలో ఉంటాయి. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మలేసియా చాలా అత్యుత్తమ ర్యాంకును కలిగి ఉంటోంది. అలాగే, దాదాపు ఐదు దశాబ్దాలుగా, ఏడాదికి దాదాపు ఆరు శాతం సగటు వృద్ధి రేటుతో పురోగమిస్తోంది.
ఏ దేశ విషయంలో చూసుకున్నా.. నిజంగానే ఇది అత్యద్బుతమైన ఘనత.
మలేసియా ప్రఖ్యాత పర్యాటక నినాదాల్లో ఒకటైన ‘మలేసియా, ట్రూలీ ఏసియా’ ఒకటి.
మలేసియా నిజంగా తన ఇమేజ్ కు తగినట్లుగానే జీవిస్తూ ఉంటుంది: వైవిధ్యంలోనూ సామరస్యంగా జీవిస్తుంది. ఆధునికతతో సంప్రదాయాన్ని మేళవిస్తుంది. ఈ ప్రాంతంలో సృజనాత్మకత, కష్టపడే తత్వం, శాంతి భావన పరిఢవిల్లుతాయి.
మిత్రులారా,
మీ సాంస్కృతిక వారసత్వానికి పురిటిగడ్డ అయిన భారతదేశం, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అత్యద్భుత విజయాలను సాధించింది.
స్వతంత్ర్య దేశంగా పుట్టుకతోనే వలసవాదం బలహీనపరచిన, విభజనతో ముక్కలు చేసిన దేశాల్లో ఇది ఒకటి.
తిరుగులేని వైవిధ్యానికి మరియు విస్తృత సామాజిక, రాజకీయ సవాళ్లకు ఇది పురిటిగడ్డ.
ఈ బాల భారతం కనీసం యువ భారత్ గా అయినా అడుగులు వేయగలదా అనే సందేహాలు అప్పట్లో వెల్లువెత్తాయి. భారతదేశం అలా యువ భారత్ గా అడుగులు వేయకూడదని కోరుకున్న వాళ్లు కూడా కొంతమంది ఉన్నారు.
కానీ, ఇప్పుడు భారతదేశం ఐక్యంగా ఉండడమే కాదు, తన వైవిధ్యం నుంచే శక్తిని కూడగట్టుకుంటోంది.
ఆవిర్భవించినప్పుడే ఇక్కడ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న చాలా దేశాలు ఆ తర్వాత కాల క్రమంలో కనుమరుగు అయిపోయాయి.
భారతదేశం మాత్రం 125 కోట్ల ప్రజలతో కూడిన ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం. ఇక్కడి ప్రజలందరికీ తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.
ఇది యువ భారత్. దాదాపు 80 కోట్ల మంది యువత ఇక్కడ 35 ఏళ్లకు లోపు వయసు వారే.
ప్రతి పౌరుడూ కట్టుబడి ఉండే; రాజ్యాంగం ప్రకారం, ప్రతి పౌరుడికి సమాన హక్కులు కలిగిన దేశం ఇది. వాటిని కోర్టులు రక్షిస్తాయి. ప్రభుత్వం కాపాడుతుంది.
మనం ఎన్నో ఘనతలను మన ఖాతాలో వేసుకున్నాం. ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలకు సంబంధించి మనం అతి పెద్ద ఉత్పత్తిదారు.
మన ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచడానికి మన శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిజ్ఞానాన్ని సముపార్జించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు.
ఇంధనం, వైద్య రంగాలకు సంబంధించి హద్దుల్లేని అణువు శక్తి విషయంలో మనం మాస్టర్ చేశాం.
మనం వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాం. ఆరోగ్య రంగాన్ని నిరుపేదలకు అందుబాటులో ఉంచేలా మందులనూ అభివృద్ధి చేస్తున్నాం.
ప్రపంచంలోనే అత్యద్భుత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులను మనం ఉత్పత్తి చేస్తున్నాం.
ప్రపంచానికి సేవ చేసే డాక్టర్లు, ఇంజనీర్లను మనం ఉత్పత్తి చేస్తున్నాం.
అలాగే, ప్రపంచ మార్కెట్లో చోటు సంపాదించే ఉత్పత్తులను మనం ఉత్పత్తి చేస్తున్నాం.
మన విదేశీ సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా శాంతిని పురోగమింపజేస్తున్నాయి.
ఈ ప్రాంతం శాంతి సుస్థిరతలకు భారతీయ సైనిక దళాలు తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయి. ఎవరి జాతీయత ఏమిటి అనే ప్రశ్నకు తావు లేకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన అన్ని దేశాల్లోనూ అవి తమ సేవలను అందిస్తున్నాయి.
అంతేనా, ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షక దళాల్లో మన బలగాలు భాగస్వాములు అవుతున్నాయి.
మనల్ని ఇంత దూరం తీసుకు వచ్చినందుకు ఎన్నో తరాల నాయకులకు మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంది.
కానీ, మనకు తెలుసు. మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని. మనం ఎదుర్కోవాల్సిన సవాళ్లు, మనం అధిగమించాల్సిన లక్ష్యాలు మన గ్రామాలు, నగరాల్లో సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితిని మార్చడానికే నాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
బ్యాంకులు, బీమా వంటి రంగాలను లెక్కలేనన్ని కార్యక్రమాలతో ఉక్కిరిబిక్కిరి చేయడం కాకుండా, వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా ఆధునిక ఆర్థిక వ్యవస్థ ఫలాలను మన ప్రజలకు చేరువ చేయడం ద్వారా మేం పేదరికాన్ని నిర్మూలిస్తున్నాం.
కేవలం కొన్ని నెలల్లోనే 19 కోట్ల బ్యాంకు అకౌంట్లను తెరిచిన దేశాన్ని ప్రపంచంలో ఎక్కడైనా చూపిస్తారా?
నైపుణ్యాలు మరియు విద్య ఆధారంగా మేం వారికి సాధికారత కల్పిస్తున్నాం.
వ్యాపార దక్షత పెరిగే వాతావరణాన్ని మేం వారికి కల్పిస్తున్నాం. తద్వారా, తమ తమ ఆర్థిక స్థాయులను పెంచుకునేందుకు ప్రజలకు మేం అవకాశాలు కల్పిస్తున్నాం.
ఇల్లు, మంచినీళ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, పాఠశాలలు మరియు ఆరోగ్య సహకారం వంటి మౌలిక సదుపాయాలను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచేలా మౌలిక సదుపాయాలను మేం కల్పిస్తున్నాం.
వ్యాపారం చేసుకోవడానికి మేం సదుపాయాలు కల్పిస్తున్నాం. అంతేనా, ఆలోచనలు, సమాచారం, కమ్యూనికేషన్, వ్యాపారం మరియు సృజనాత్మకతలు సైబర్ స్పేస్ లో స్వేచ్ఛగా ప్రసారం చేసుకోవడానికి వీలుగా జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలను మేం కల్పిస్తున్నాం.
దేశంలో సరికొత్త ఆర్థిక విప్లవానికి వేదికగా మన రైల్వేలను మేం రూపొందిస్తున్నాం. అలాగే, మన విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను సంపద మార్గాలుగా మేం మారుస్తున్నాం.
మన నగరాలను పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా తీర్చిదిద్దాలని మేం ప్రతిజ్ఞ చేశాం. మన నదులను పునరుద్ధరించాలని కంకణం కట్టుకున్నాం. మన గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దాలను సంకల్పించాం.
అంతేనా, పర్యాటకులంతా చూసి ఆనందించడానికి.. మన భావి తరాలు కళ్లారా చూడడానికి వీలుగా మన ప్రకృతి సంపదలను మేం కాపాడతాం.
అయితే, ఇదంతా చెప్పినంత సులభం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది 125 కోట్ల ప్రజల గురించి.. 500 ప్రధాన నగరాల గురించి.. ఆరు లక్షల గ్రామాల గురించి.
అయితే, భారతీయుల ప్రవీణ్యం, వ్యాపార దక్షతపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఒకరికి మరొకరుగా చేతులు కలిపిన మన ప్రజల శక్తి సామర్థ్యాలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది.
అందుకే, అది జరిగి తీరుతుంది. మార్పు రథ చక్రాలు కదలడం ప్రారంభించాయి. ఇక అవి ఇప్పుడు వేగాన్ని అందుకుంటున్నాయి.
దానిని ఇప్పుడు గణాంక సహితంగా వివరిస్తాను.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక వేగంతో అభివృద్ధి చెందుతున్న భారీ ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఇప్పుడు మీరంతా చాలా గర్వంగా భావిస్తారని నాకు తెలుసు.
ఇప్పుడు మనం ఏడాదికి 7.5 శాతం వృద్ధి రేటుతో ముందుకు వెళుతున్నాం. రాబోయే సంవత్సరాల్లో ఇది మరింత వేగంగా పెరగనుంది.
భారతదేశం శక్తిమంతంగా వృద్ధి సాధిస్తోందని ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ ప్రతి ఒక్కటీ స్పష్టంగా చెబుతున్నాయి. ఇది కూడా ఎప్పుడంటే, మిగిలిన ప్రపంచం అంతా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు కూడా మాంద్యంలో కూరుకుపోయిన సమయంలో భారతదేశం వృద్ధి చెందుతోందని చెబుతున్నాయి.
నగరాల్లో ఇప్పుడు మార్పులు వస్తున్నాయి. గ్రామాల్లో కదలిక వస్తోంది. మన పౌరుల్లో మరీ ముఖ్యంగా యువతలో ఇప్పుడు ఆత్మ విశ్వాసం కనిపిస్తోంది.
ఇంకా చెప్పాలంటే, ప్రభుత్వ పనితీరులోనే మార్పు వచ్చింది.
ప్రభుత్వ పాలనలో మేం పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చాం. అన్ని స్థాయుల్లోనూ అవినీతిని మేం నిర్మూలిస్తున్నాం. వ్యక్తుల ఇష్టాయిష్టాల ప్రకారం కాకుండా విధానాలు, వ్యవస్థలు ప్రభుత్వ పాలనను నడిపించేలా మేం చర్యలు తీసుకుంటున్నాం.
ప్రభుత్వం, పౌరులు ఒకరిని మరొకరు సంప్రదించుకునే విధానంలోనే మేం మార్పు తీసుకొచ్చాం. అలాగే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానితో మరొకటి కలిసి పని చేసే తీరులో కూడా మార్పులు తీసుకొచ్చాం.
రాష్ట్రాలు ఇప్పుడు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ఇది ఆరోగ్యకరం కూడా.
నా ప్రియ మిత్రులారా,
మనం ఒకరిపై మరొకరు ఆధారపడే ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎక్కడో దూరంగా ఉన్న దేశంలో జరిగిన ఘటన కూడా మరొక దేశంలో ఉన్న కార్మికుల జీవనోపాధిపై ప్రభావం చూపుతోంది.
ఐక్య రాజ్య సమితి లేదా డబ్ల్యూటీవోలోని కాన్ఫరెన్స్ హాలులో కూర్చుని తీసుకునే నిర్ణయం కూడా భారతదేశంలోని గ్రామంలో ఉన్న రైతు జీవితం మీద ప్రభావం చూపుతోంది.
ప్రపంచంలోని ఒకవైపు ప్రజల జీవన సరళి ప్రపంచంలోనే మరో భాగంలో ఉన్న వాతావరణం, వ్యవసాయంపై ప్రభావం చూపుతోంది.
ఒకరికి ఒకరి మార్కెట్లు, వనరులు మనకు కావాలి
అందుకే, అంతర్జాతీయ భాగస్వామ్యాల విజయం, శక్తియుక్తుల మీదే మన జాతీయ ప్రగతి ఆధారపడి ఉంటుంది.
మన మిత్రులు, భాగస్వాములను గుర్తించడానికి మనం ఎంతో దూరం పరుగు పెట్టాల్సిన పని లేదు.
భూమి మీద, సముద్రం మీద కూడా ఆగ్నేయాసియా మన ఇరుగుపొరుగు. ప్రపంచంలోనే ప్రగతిశీల శాంతియుత ప్రాంతాల్లో ఇది ఒకటి. సంస్కృతి, నైపుణ్యం, వ్యాపార దక్షత, కష్టించి పని చేసే ప్రాంతమిది.
ఆగ్నేయాసియా దేశాలు అన్నిటితోనూ భారతదేశానికి అత్యద్భుత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి.
ఏసియాన్తో మనది బలమైన భాగస్వామ్యం. ఇప్పుడే ఇండియా-ఏసియాన్ సదస్సును ముగించుకుని నేను వస్తున్నాను.
మన ఆర్థిక సంబంధాలు అత్యధిక వేగంగా పెరుగుతున్న ప్రాంతాల్లో ఇది ఒకటి. అలాగే, అత్యధిక సంఖ్యలో భారతీయ పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం కూడా ఇదే.
మిత్రులారా,
ఈ ప్రాంతంలోని మాకున్న సన్నిహిత మిత్రుల్లో, బలమైన భాగస్వాముల్లో మలేసియా ఒకటని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను.
మౌలిక సదుపాయాల్లో మలేసియా కంపెనీలు అద్భుతం. మలేసియా బయట అవి ఎక్కువగా కంపెనీలను స్థాపించింది కూడా భారత్లోనే.
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికం మార్కెట్ అయిన భారతదేశంలోనే మలేసియా పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు పెట్టారు.
భారతదేశానికి చెందిన ఇర్కాన్ కంపెనీ మలేసియాలో రైల్వే మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి సహాయం చేస్తోంది.
మలేసియాలో దాదాపు 150కిపైగా భారతీయ కంపెనీలు ఉన్నాయి. దాదాపు 50కిపైగా ఐటీ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి.
ఏసియాన్లో మాకున్న అతి పెద్ద వ్యాపార భాగస్వాముల్లో మలేసియా ఒకటి. అయితే, దీనిని మరింత పెంచాలన్నదే మా ధ్యేయం.
మలేసియాకు అత్యధికంగా పర్యాటకులు వెల్లువెత్తే దేశాల్లో భారతదేశం ఒకటి. ప్రతి వారంలో మలేసియా, భారత్ మధ్య దాదాపు 170 విమానాలు తిరుగుతూ ఉంటాయి.
సంప్రదాయ వైద్యాలైన ఆయుర్వేదం, యునానిల్లో మనకు అత్యద్భుత భాగస్వామ్యం మలేసియాతో ఉంది.
రెండు దేశాల పౌరులూ భద్రంగా ఉండడానికి మనం కలిసి పని చేస్తాం కూడా.
మన మధ్య పటిష్ఠమైన రక్షణ సంబంధాలు ఉన్నాయి. మలేసియా ఎయిర్ ఫోర్స్ లోని సిబ్బందికి రెండేళ్లపాటు భారతీయ ఎయిర్ ఫోర్స్ శిక్షణ ఇచ్చింది. భూమి మీద, సముద్రంలోనూ ఆకాశంలో కూడా మేం కలిసి మెలసి పని చేస్తూ ఉంటాం.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన భద్రతా దళాలు కలిసి మెలసి పని చేస్తూ ఉంటాయి. పటిష్ఠమైన భద్రతా సహకారాన్ని అందిస్తున్నందుకు మలేసియా ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను.
ప్రపంచానికి ఇప్పుడు పెను ముప్పు ఉగ్రవాదమే. దానికి సరిహద్దులేమీ లేవు. ప్రజలను ఆకర్షించడానికి అది మతాన్ని వాడుకుంటూ ఉంటుంది. కానీ, అది శుద్ధ అబద్ధం.
అన్ని మత విశ్వాసాలను ఆచరించే ప్రజలనూ అది చంపేస్తుంది. మతం నుంచి మనం ఉగ్రవాదాన్ని వేరు చేయాలి.
మానవత్వాన్ని విశ్వసించేవాళ్లు, మానవత్వంపై విశ్వాసం లేనివాళ్లు అన్న ఇద్దరి మధ్యనే ఇప్పుడు వివక్ష చూపాలి.
నేను ఇదే విషయాన్ని గతంలోనూ చెప్పాను. ఇక్కడ కూడా చెబుతున్నాను. ప్రస్తుతం మనకు ఎదురవుతున్న అది పెద్ద సవాలుపై ప్రపంచం మొత్తం ఒక్కుమ్మడిగా పోరాడాల్సి ఉంది.
నిఘా సహకారాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. సైనిక శక్తిని మనం ఉపయోగించాలి. సహకారం బలోపేతమయ్యేలా అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను మనం తీర్చిదిద్దుకోవాలి.
అయితే, ప్రపంచం అంతా కలిసి ముందుకు రావాలని నేను చెబితే, దానర్థం మరింత భద్రతా సహకారం గురించి మాత్రమే కాదు.
దానర్థం, ఏ దేశమూ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకూడదు. ఉగ్రవాదాన్ని ఉపయోగించుకోకూడదు. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇవ్వకూడదు. దానికి నిధులు ఇవ్వకూడదు. దానికి ఆయుధాలు ఇవ్వకూడదు.
అలాగే, మనమంతా మనం మన సమాజాలతో కలిసి పని చేయాలి. మన యువతతో కలిసి పని చేయాలి. తల్లిదండ్రులు, సమాజాలు, మత పెద్దల సహకారం మనకు అవసరం. అంతేనా, ఇంటర్నెట్ ఉగ్రవాదుల నియామక క్షేత్రం కాకుండా మనం చూడాల్సి ఉంది.
మన ప్రాంతంలో మనం శాంతియుత సంబంధాలు, పరస్పర అవగాహన మరియు సహకారాన్ని ప్రోత్సహించాలి. అద్వితీయ భవిష్యత్తుకు శాంతి మాత్రమే పునాది వేస్తుంది.
మనకు ఎన్నో ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. ఉమ్మడి సవాళ్లు ఉన్నాయి. అందుకే, మన ప్రాంతంలోని చిన్నా పెద్దా అన్ని దేశాలూ మన దేశాలు భద్రంగా ఉండేలా, మన సముద్రాలు భద్రంగా ఉండేలా మరియు స్వేచ్ఛా వాణిజ్యం జరిగేలా, మన ఆర్థిక వ్యవస్థలు సుసంపన్నం అయ్యేలా మనం కలిసి పని చేయాలి.
మిత్రులారా..
మన సంబంధ బాంధవ్యాలను మరింత ముందుకు తీసుకు వెళ్లడానికి గౌరవనీయ ప్రధాన మంత్రి నజీబ్ రజాక్తో నేను రేపు సమావేశమవుతున్నాను.
సన్నిహిత సంబంధాలతో భారత్, మలేసియా మరింత లబ్ధి పొందుతాయి.
మేం ఏం చేయాలని భావించినా, అందులో మీరు భాగస్వాములు అవుతారు.
భారత్, మలేసియా సంబంధాలతో మీరు మరింత శక్తియుక్తులు, జీవితాన్ని సాధిస్తారు.
భారత ప్రగతి ప్రయాణంలో మరియు ఈ ప్రత్యేక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మీ భాగస్వామ్యాన్ని మేం ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటాం.
అయితే, మన ఇద్దరినీ కలిపి ఉంచే ప్రేమానురాగాలకే మేం మరింత విలువ ఇస్తాం. ఇది అమూల్యమైనది, దీని విలువను కొలిచేందుకు ప్రమాణాలు అంటూ ఏమీ లేవు.
దూరాభారాలు, నియమ నిబంధనల ఆటంకాలు ఉన్నప్పటికీ మీరు ఎప్పుడూ మాతో జత కలిసే ఉంటారు. మీరు మా వారసత్వానికి కిటికీ వంటి వాళ్లు. మా ప్రగతికి అద్దం వంటివారు.
భారతదేశానికి మీ దేశానికి మధ్య మీరు వారధులు వంటివారు.
భారతదేశంలోని కుటుంబాలు, సమాజాలకు మీరు మద్దతు ఇస్తారు. ఒక తల్లి వైద్యానికి సహాయం అవసరమైతే, ఒక చిన్నారి పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు ఆర్థిక సాయం చేస్తారు.
ఏదో అవార్డును ఆశించో లేదా పేపర్లో మీ పేరు వస్తుందనో ఆశ పడకుండానే మీరు ఈ సాయం చేస్తారు. అందుకే, మీకు ఏమి చేయగలమో దానినంతటినీ మేం చేస్తాం.
ఓసీఐ మరియు పీఐవో కార్డులను మేం విలీనం చేసేశాం. మీ వీసాలను జీవిత కాలం శాశ్వతం చేసేశాం. వీటికితోడు, ఇప్పుడు ఓసీఐగా నమోదు చేసుకోవడానికి నాలుగో తరం వరకు భారతీయ మూలాలు ఉంటే సరిపోతుంది. కొన్ని తరాల కిందటే మీమీ పూర్వీకులు ఇక్కడికి వచ్చిన మలేసియా భారతీయుల వంటి మీకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
ఇప్పుడు మైనర్లు అయిన చిన్నారులు, విదేశీయులు, విదేశీయులైన భార్యలు ఉన్నవాళ్లు కూడా ఓసీఐ హోదాను పొందవచ్చు.
మేం ఈ-వీసాను ప్రవేశపెట్టాం. దాంతో మీ ప్రయాణం మరింత సులభతరం అయిపోయింది.
ఇక్కడ, మలేసియాలో, మేం తొమ్మిది వీసా కలెక్షన్ కేంద్రాలను ప్రారంభించాం. కార్మికులు కొన్ని దేశాలకు సురక్షితంగా, సులభంగా వెళ్లడానికి ఈ-మైగ్రేట్ పోర్టల్ ను ప్రారంభించాం. విదేశాల్లో కేసులు నమోదైన యజమానులకు సంబంధించి కూడా ఈ పోర్టల్ హెచ్చరిస్తూ ఉంటుంది.
విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయ మహిళల కోసం ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ కూడా ఉంది.
భారతదేశం నుంచి వచ్చిన కార్మికులు ఇక్కడ ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి. వారి సంక్షేమం, భద్రత మా ప్రథమ కర్తవ్యం.
గత ఏడాది, దాదాపు 8000 మందికిపైగా భారతీయులు సురక్షితంగా భారత్ కు తిరిగి రావడానికి మేం సహకరించాం.
చదువుకోవడానికి డబ్బులు లేని మలేసియా భారతీయ చిన్నారులకు ఆర్థిక సహకారం అందించడానికి మలేసియాలో 1954లో ఇండియా స్టూడెంట్స్ ట్రస్ట్ ఫండ్ ను ప్రారంభించారు.
మలేసియాలోని ఒక వర్గం భారతీయ సమాజానికి ఈ ఫండ్ ఇప్పటికీ అవసరమే. ట్రస్ట్ కార్పస్ ఫండ్ కు అదనంగా పది లక్షల అమెరికన్ డాలర్ల అదనపు నిధులను విరాళంగా ఇస్తున్నామని ప్రకటించడానికి నేనెంతో ఆనందిస్తున్నాను.
వేలాదిమంది మీ చిన్నారులు డాక్టర్లు కావడానికి భారతదేశం వెళుతున్నారు. మన సమాజాలకు ప్రస్తుతం డాక్టర్లు అత్యంత అవసరమే. దానితోపాటు ఇతర రంగాల్లో కూడా చదువుకోవడానికి మీరు ప్రాధాన్యం ఇస్తారని నేను ఆశిస్తున్నాను.
మలేసియా, భారతదేశం ప్రదానం చేసిన డిగ్రీలను రెండు దేశాలూ వెన్వెంటనే గుర్తించాల్సి ఉంది. ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ దృష్టికి నేను తీసుకెళ్లే ముఖ్యమైన అంశాల్లో ఇది కూడా ఉంది.
చివరిగా, మీరు సాధించిన ఘనతలు, ఈ సమాజంలో మీ జీవన శైలి మరియు మీ ప్రత్యేకతలకు సంబంధించి మేమెంత గర్విస్తున్నామో నన్ను చెప్పనీయండి. సవాళ్లు నిరంతరం ఉంటూనే ఉంటాయి. అదే సమయంలో అక్కడే కలలు కూడా ఉంటాయి.
అయితే, వెనకటి తరాలన్నీ కూడా అవి ఎదుర్కొన్న సవాళ్ల కంటే కూడా వాటి విజయాల ద్వారానే అవి గుర్తింపు తెచ్చుకున్నాయి.
Splendid interaction with Malaysia's Indian community. They are the living bonds of India-Malaysia friendship. https://t.co/tffHywHfKz
— Narendra Modi (@narendramodi) November 22, 2015
We appreciate the love of Malaya Indians towards India. Remembered Subhas Babu & the INA, which was strengthened by many Malaya Indians.
— Narendra Modi (@narendramodi) November 22, 2015