Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మణిపుర్ నీటి సరఫరా ప్రాజెక్టు కు శంకుస్థాపన చేసిన సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగం


మణిపుర్ గవర్నర్ శ్రీమతి నజ్ మా హెఫ్తుల్లా గారు, ప్రజాదరణ గల ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బిరేన్ సింహ్ గారు, నా మంత్రివర్గ సహచరులు శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్ గారు, రతన్ లాల్ కటారియా గారు, మణిపుర్ కు చెందిన అందరు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు మరియు నా ప్రియమైన సోదరీమణులు, ఇంకా నా ప్రియమైన సోదరులారా,

కరోనా సంక్షోభ కాలం లో కూడా దేశం ఆగిపోలేదనడానికి మణిపుర్ లో ఈ రోజు న జరుగుతున్న ఈ కార్యక్రమం ఒక ఉదాహరణ.  దేశం ఏ మాత్రం అలసిపోలేదు.  టీకామందు వచ్చే వరకు మనం తీవ్రం గా పోరాడడమే కాదు, విజయాన్ని కూడా సాధించాలి.  అదే సమయం లో అభివృద్ధి పనుల ను సంపూర్ణమైన శక్తి తో ముందుకు నడిపించాలి.  ప్రస్తుతం ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతం ఒక విధం గా రెండు సవాళ్ల ను ఎదుర్కొంటున్నాయి.  ఈ సంవత్సరం ఈశాన్య రాష్ట్రాల ను మరో సారి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.  వరదల బీభత్సం లో ఎందరో ప్రాణాల ను కోల్పోయారు, మరెందరో ఇళ్లను వీడి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.  బాధిత కుటుంబాలన్నిటికి నా ప్రగాఢ సానుభూతి ని వ్యక్తం చేస్తున్నాను.  ఈ కష్ట కాలం లో యావత్తు దేశం వారి ని వెన్నంటి నిలబడుతుందని నేను మీకు భరోసా ను ఇస్తున్నాను.   అవసరమైన పనులన్నిటిని చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలన్నిటి తోను భారత ప్రభుత్వం భుజం భుజం కలిపి  నిరంతరాయం గా కృషి చేస్తోంది.

మిత్రులారా,

మణిపుర్ లో కరోనా వైరస్ వ్యాప్తి ని, వేగాన్ని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేయింబవళ్లు శ్రమించి పోరాడుతోంది.  లాక్ డౌన్ సమయం లో మణిపుర్ ప్రజల కు అవసరమైన సహాయాన్ని అందించేందుకు, ఇతర ప్రాంతాలలో చిక్కుకు పోయిన వారిని తిరిగి తీసుకు వచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం వీలైనన్ని చర్యల ను తీసుకొంది.  ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన లో భాగం గా  5-6 లక్షల కుటుంబాలకు చెందిన 25 లక్షల మంది మణిపుర్ సోదర సోదరీమణులు ఉచిత ఆహార ధాన్యాలను అందుకొన్నారు. అలాగే ఉజ్వల పథకం లో భాగం గా 1.5 లక్షల కన్నా ఎక్కువ మంది సోదరీమణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా అయ్యాయి.  ఈ సంక్షోభ కాలం లో పేద ప్రజల కు ఇదే తరహా లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అండగా ఉంటాయని నేను హామీ ఇస్తున్నాను.

మిత్రులారా,

మణిపుర్ కు చెందిన లక్షలాది మిత్రులకు, ప్రత్యేకించి ఇమ్ఫాల్ కు చెందిన వారికి, ఇంకా ప్రత్యేకించి సోదరీమణులకు ఇది ఎంతో ముఖ్యమైన రోజు.  రాఖీ సమయం లో మణిపుర్ సోదరీమణులకు మంచి బహుమతి అందింది.  రూ.3,000 కోట్ల వ్యయం తో చేపట్టిన మణిపుర్ నీటి సరఫరా ప్రాజెక్టు పూర్తయితే ప్రజల నీటి ఎద్దడి సమస్యలన్నీ తగ్గుతాయి.  ఈ ప్రాజెక్టు లోని నీరు గ్రేటర్ ఇమ్ఫాల్ సహా  25 నగరాల కు మరియు పట్టణాలకు, అలాగే 1700 పైగా గ్రామాల కు ప్రాణాధారం గా నిలుస్తుంది.  మరీ ముఖ్యం గా, ఈ ప్రాజెక్టు ను వర్తమాన అవసరాలనే కాక రాబోయే 20-22 సంవత్సరాల అవసరాల ను కూడా దృష్టి లో పెట్టుకొని డిజైన్ చేయడం జరిగింది.

ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ప్రజల కు స్వచ్ఛమైన మంచినీరు అందుబాటు లోకి రావడమే కాకుండా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది.  స్వచ్ఛమైన నీటి ని త్రాగడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరిగి వ్యాధుల నుంచి తట్టుకునే సామర్థ్యం వస్తుందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే.  అందుకే ఈ ప్రాజెక్టు లోని నీరు గొట్టపుమార్గా ల ద్వారా సరఫరాకే పరిమితం కాదు. ప్రతి ఒక్క ఇంటి కి పైప్ ల ద్వారా సురక్షితమైన మంచినీటి ని అందించాలన్న మా సమగ్ర లక్ష్యాని కి ఇది వేగం తెస్తుంది.  ఈ నీటి ప్రాజెక్టు విషయం లో మణిపుర్ మాతృమూర్తులను, మణిపుర్ సోదరీమణులను నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా,

గత ఏడాది జల్ జీవన్ మిశన్ ను ప్రారంభించినప్పుడు, గతం లోని ప్రభుత్వాల కన్నా ఎన్నో రెట్లు వేగం గా మనం పని చేయవలసి ఉంటుందని నేను చెప్పాను.  ఈ రోజు న 15 కోట్ల ఇళ్ల కు పైప్ ల ద్వారా మంచినీరు అందించగల స్థాయి ఏర్పడినప్పుడు కూడా ఒక్క క్షణం విరామాన్ని తీసుకోవాలని మేము భావించడంలేదు.  అందుకే లాక్ డౌన్ కాలం లో కూడా గొట్టపుమార్గాల పనుల ను కొనసాగించి పంచాయతీ ల సహాయం తో ప్రజల ను చైతన్యవంతం చేసే కృషి ని కొనసాగించాము.

ఈ రోజు న దేశం లో రోజు కు లక్ష నీటి కనెక్శన్ లను ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాము.  ఆ రకంగా ప్రతి రోజూ లక్ష మంది కి పైగా తల్లులు, సోదరీమణుల నీటి ఒత్తిడి ని తగ్గించగలుగుతున్నాము.  ఒక లక్ష కుటుంబాల కు చెందిన తల్లులు, సోదరీమణుల జీవితాలు మెరుగుపడుతున్నాయి.  జల్ జీవన్ మిశన్ ఒక ప్రజాకార్యక్రమంగా మారుతున్నందు వల్లనే ఇది సాధ్యమయింది.  ఈ రోజు న గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ప్రత్యేకించి సోదరీమణులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పైపుల ను ఎక్కడెక్కడ వేయాలి, ఎక్కడ నుండి నీటిని తీసుకోవాలి, ఎక్కడ ట్యాంకు ను నిర్మించాలి, ఎంత బడ్జెటు అవసరం అనే విషయాల ను నిర్ణయించగలుగుతున్నారు.

మిత్రులారా,

ప్రభుత్వ యంత్రాంగం లో వికేంద్రీకరణ, గ్రామీణ స్థాయి లో సాధికారిత ఏర్పడడంతో నీటి శక్తి ఎంతటిదో మీరు ఊహించవచ్చు.

మిత్రులారా,

మెరుగైన జీవనాని కి సులభతర జీవనం ఒక అవసరం.  డబ్బు రావచ్చు లేదా పోవచ్చు, కానీ సులభతర జీవనం ప్రతి ఒక్కరి, ప్రత్యేకించి ప్రతి ఒక్క సోదరుడు, తల్లి, సోదరి, దళితుడు, వెనుకబడిన తరగతి, గిరిజనుల యొక్క హక్కు.

అందుకే గత ఆరేళ్లు గా సులభతర జీవనం దేశం లో ఒక ప్రజాఉద్యమం గా మారింది.  భారతదేశం తన పౌరుల కు అవసరమైన అన్ని సదుపాయాల ను కల్పించే ప్రయత్నం చేస్తోంది.  గత ఆరేళ్లు గా ప్రతి ఒక్క రంగం లో అన్ని కార్యక్రమాల ను ప్రజాఉద్యమం గా మార్చి ముందుకు పురోగమించేలా పేదల ను ప్రోత్సహిస్తున్నాము. ఈ రోజు న మణిపుర్ సహా దేశం యావత్తు బహిరంగ ప్రదేశాల లో మల మూత్రాదుల విసర్జన రహితం గా మారిపోయింది.  ఈ రోజు న ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క కుటుంబాని కి విద్యుత్తు సరఫరా అందుబాటు లో ఉంది. నిరుపేదలందరి వంటగదుల కు ఎల్ పిజి గ్యాస్ అందుబాటు లోకి వచ్చింది.  ప్రతి ఒక్క గ్రామానికి మంచి రోడ్ల నెట్ వర్క్ ఏర్పడింది.  నిరాశ్రయులైన ప్రతి ఒక్క పేద కు ఇంటి వసతి ఏర్పడింది.  అయినా స్వచ్ఛమైన మంచినీటి కి మాత్రం భారీ గా కొరత ఉంది.  అందుకే ఉద్యమ స్ఫూర్తి తో మంచినీటి సరఫరా పనుల ను చేపట్టాము.

మిత్రులారా,

మెరుగైన జీవనం, పురోగతి, సుసంపన్నత అన్నింటికీ కనెక్టివిటీతోనే ముడిపడి ఉంది.  ఈ ప్రాంత ప్రజల జీవన సౌలభ్యం ఇక్కడ ఉన్న ప్రజల జీవనానికే కాదు, సురక్షితమైన, స్వయంసమృద్ధియుత భారత దేశం అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా చాలా ప్రధానం.  ఈ కనెక్టివిటీ వల్ల మయన్మార్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ లతో సామాజిక వాణిజ్య సంబంధాలు బలోపేతం కావడమే కాదు భారతదేశం అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలిసీ కి కూడా ఉత్తేజం లభిస్తుంది.

ఒక విధంగా తూర్పు ఆసియా ప్రాంతం తో మన ప్రాచీన సాంస్కృతిక సంబంధాలకు ఈశాన్య ప్రాంతం ఒక గేట్ వే మాత్రమే కాదు, వాణిజ్యం, ప్రయాణ, పర్యాటక రంగాల భవిష్యత్తు కు కూడా ప్రధానం. మణిపుర్ సహా యావత్తు ఈశాన్య ప్రాంతం లో కనెక్టివిటీ ని పెంచడానికి ప్రయత్నిస్తున్నాము. రోడ్ వేస్, రాజమార్గాలు, ఎయిర్ వేస్, వాటర్ వేస్, ఐవేలతో పాటు గ్యాస్ పైప్ లైన్, ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్, పవర్ గ్రిడ్ ల వంటి ఆధునిక మౌలిక వసతులు కూడా ఈశాన్య భారతావని లో నిర్మాణం లో ఉన్నాయి.

గత ఆరేళ్లు గా ఈశాన్య ప్రాంతాలలో మౌలిక వసతుల నిర్మాణానికి వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాము. ఈశాన్య ప్రాంత రాజధానులన్నింటినీ నాలుగు లేన్ ల రోడ్లు, జిల్లా ప్రధాన కేంద్రాలన్నింటినీ రెండు లేన్ ల రహదారులు, గ్రామాలన్నింటికీ అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే రోడ్ల నిర్మాణానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ఇప్పటికే ఈ ప్రాజెక్టు లో భాగం గా 3000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి కాగా, దాదాపు 6000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం త్వరిత గతి న సాగుతోంది.

మిత్రులారా,

ఈశాన్య రాష్ట్రాల లో రైల్ కనెక్టివిటీ లో కూడా ఎంతో మార్పు రావడాన్ని ఎవరైనా గమనించవచ్చు.  ఒకపక్క ఈశాన్య ప్రాంతం లో రైళ్లు కొత్త స్టేశన్ లకు చేరుతుండగా మరో పక్క రైలు మార్గాలన్నింటిని బ్రాడ్ గేజ్ గా మారుస్తున్నారు.  మీరందరూ ఈ మార్పు ను స్పష్టం గా చూడవచ్చు. రూ.14,000 కోట్ల వ్యయం తో నిర్మిస్తున్న జిరీబామ్-ఇమ్ఫాల్ రైల్వేలైను మణిపుర్ ముఖచిత్రాన్నే మార్చేస్తుంది.  వచ్చే రెండేళ్ల కాలం లో ఈశాన్య  రాష్ట్రాల రాజధానులన్నింటిని మంచి రైల్ నెట్ వర్క్ తో అనుసంధానం చేసే కృషి త్వరిత గతి న జరుగుతోంది.

మిత్రులారా,

ఈశాన్య రాష్ట్రాల లో రోడ్డు కనెక్టివిటీ తో పాటు రైల్వే, విమాన కనెక్టివిటీ కూడా అంతే ప్రధానం. ఈ రోజు న ఈశాన్య రాష్ట్రాల లో పెద్దవి, చిన్నవి కలిపి 13 విమానాశ్రయాలు పని చేస్తున్నాయి.  3,000 కోట్ల రూపాయల వ్యయం తో ఈశాన్య రాష్ట్రాల లో ఇమ్ఫాల్ విమానాశ్రయం సహా వివిధ విమానాశ్రయాల విస్తరణ, ఆధునిక వసతుల కల్పన జరుగుతోంది.

మిత్రులారా,

ఈశాన్య రాష్ట్రాల లో అంతర్గత జలమార్గాల అభివృద్ధి మరో పెద్ద ప్రయత్నం.  అందులో అతి పెద్ద విప్లవాన్ని నేను చూడగలుగుతున్నాను.  ఇక్కడ 20 కి పైగా జాతీయ జలమార్గాలు నిర్మాణం లో ఉన్నాయి.  రాబోయే రోజుల లో ఈ కనెక్టివిటీ కేవలం సిలీగుడీ కారిడోర్ కు పరిమితం కాదు. ఇప్పుడు సాగర, నదీ మార్గాల ద్వారా నిరంతరాయం గా కనెక్టివిటీ ని కల్పించే నెట్ వర్క్ నిర్మాణం జరుగుతోంది. పెరిగిన కనెక్టివిటీ తో మన నవ పారిశ్రామికుల కు మరియు రైతుల కు అపారమైన ప్రయోజనం లభిస్తున్నది.  ఈశాన్య రాష్ట్రాల లో రవాణా సమయం కూడా ఎంతో ఆదా అవుతోంది.  ఈశాన్య రాష్ట్రాల కు చెందిన గ్రామాలు, రైతులు ఉత్పత్తి చేసే పాలు, కూరగాయలు, ఖనిజాలు వంటి ఉత్పత్తుల కు దేశ విదేశాల్లోని పెద్ద మార్కెట్ లు ప్రత్యక్షం గా అందుబాటు లోకి వచ్చాయి.

మిత్రులారా,

ఈశాన్య రాష్ట్రాల లోని ప్రకృతి సిద్ధమైన, సాంస్కృతికమైన వైవిధ్యం ఈ ప్రాంతం లోని సాంస్కృతిక బలానికి నిదర్శనం.  భారతదేశానికే అది గర్వకారణం.  ఇటువంటి వాతావరణం లో ఆధునిక మౌలిక వసతులు నిర్మించినట్టయితే టూరిజం కూడా ఉత్తేజితమవుతుంది.  మణిపుర్ సహా ఈశాన్య ప్రాంతాల్లోని పర్యాటక సామర్థ్యం పూర్తిగా వెలుగులోకి రాలేదు.  ఇప్పుడు సోశల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ ల ద్వారా ఈశాన్య రాష్ట్రాల లోని పర్యాటక ప్రాంతాలు దేశంలోని ప్రతి ఒక్క ఇంటికి చేరుతున్నాయి.  ఇంతవరకు ఎవరూ వెళ్లని పలు ప్రాంతాల వీడియోలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.  అసలు ఇటువంటి ప్రదేశాలు మన దేశంలోనే ఉన్నాయా అని కూడా విస్మయం చెందుతున్నారు. ఈ శక్తిని ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా ఉపయోగించుకుని లబ్ధి ని పొందాలి.  ఈ ప్రాంతాలకు చెందిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పలు ప్రభుత్వ ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి.

మిత్రులారా,

దేశ ఆర్థికాభివృద్ధికి చోదక శక్తి గా నిలవగల సామర్థ్యం ఈశాన్య ప్రాంతానికి ఉంది.  యావత్తు ఈశాన్య ప్రాంతం లో క్రమక్రమంగా శాంతి నెలకొంటున్నందు వల్ల రోజురోజుకు నా విశ్వాసం బలోపేతం అవుతోంది.  గతంలో ప్రతికూల వార్తల తో ప్రతిధ్వనించిన ఈ శాన్యం ఒప్పుడు శాంతి తో, పురోగతితో మరియు సౌభాగ్యం తో అలరారుతోంది.

ఈ రోజున మణిపుర్ లో దిగ్బంధాలు అనేవి చరిత్ర లో ఒక భాగం గా మారిపోయాయి.  మరి ముఖ్యమంత్రి కాసేపటి క్రితం ఇదే మాట అన్నారు.  ఇందుకు నేను ఈశాన్య ప్రాంత పౌరులందరినీ ప్రత్యేకించి మణిపుర్ర ప్రజల ను అభినందిస్తున్నాను.  మీ మద్దతు, ప్రోత్సాహం వల్లనే ఈ దిగ్బంధం గత చరిత్ర గా మారిపోయాయి.  అసమ్ లో దశాబ్దాలు గా సాగుతున్న దౌర్జన్యకాండ అంతరించిపోయింది.  త్రిపుర, మిజోరం రెండు రాష్ట్రాల లో యువత అహింసా మార్గాన్ని వదలివేశారు. శరణార్థులు క్రమంగా మెరుగైన జీవితంలోకి అడుగు పెడుతున్నారు.

మిత్రులారా,

మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ, శాంతి స్థాపన లతో పెట్టుబడి అవకాశాలు కూడా ఎన్నో రెట్లు పెరిగాయి.  ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ను ముందుకు నడిపించడం లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రధానమైన సేంద్రియ ఉత్పత్తులు, వెదురు.. ఈ రెండూ కీలకంగా నిలిచే ఆస్కారం ఉంది.  ఈ రోజు న నేను ఈశాన్య రాష్ట్రాల కు చెందిన రైతు సోదరులు మరియు రైతు సోదరీమణుల తో మాట్లాడాలనుకుంటున్నాను.  ఈశాన్య ప్రాంతం సేంద్రియ రాజధాని అని నాకు తరచు చెబుతూ ఉంటారు.  నేను మరో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను.  నేను ముందు రోజు వ్యవసాయ శాస్త్రవేత్తలను, వ్యవసాయ ఆర్థికవేత్తలను కలిశాను.  వారు నాకు ఆసక్తికరమైన విషయం చెప్పారు.  ఈశాన్య ప్రాంత రైతులు పామోలిన్ ను పండించగలిగితే వారు ఎంతో లాభపడతారని శాస్త్రవేత్త లు నాకు తెలిపారు.  ఈ రోజు పామోలిన్ ఆయిల్ కు భారతదేశం లో మంచి మార్కెట్ ఉంది.  వారు సేంద్రియ పంటలను పండించగలిగితే దేశానికి ఎంత పెద్ద ప్రయోజనాన్ని చేకూరుస్తారో మీరు ఊహించుకోవచ్చు.  మన ఆర్థిక వ్యవస్థ కు కొత్త ఉత్తేజాన్ని ఎలా కల్పించాలి?  ప్రతి ఒక్క రాష్ట్రం లో పామోలిన్ ఉద్యమాన్ని చేపట్టవలసింది గా ముఖ్యమంత్రులందరి కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.  ఈ విషయం లో ప్రజల ను విద్యావంతుల ను చేసి ఉత్తేజపరుద్దాము.  మనందరం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రయత్నం లో రైతుల కు ఏ విధం గా సహాయం చేయాలన్న ప్రణాళిక ను రూపొందిద్దాము.  ఈ దిశ గా ఆలోచిద్దామని ఈ రోజు మణిపుర్ కు చెందిన సోదరులకు మరియు సోదరీమణుల కు నేను తెలియజేస్తున్నాను.

ఈశాన్య ప్రాంతాని కి చెందిన నా సోదరులు మరియు నా సోదరీమణులందరూ స్థానిక ఉత్పత్తుల కు అనుకూలంగా ఎప్పుడూ నినదిస్తూ ఉంటారు.  కాని వారిది కేవలం నినాదమేనా?  వారు స్థానికం అంటే ఎంతో గర్వపడతారు, అదే ప్రత్యేకత.  నేను ఈ రకమైన స్కార్ఫ్ ను కట్టుకున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు దానిని స్పష్టం గా గుర్తించడం నేను గమనించాను.  మీ వస్తువుల విషయం లో గర్వపడడం చాలా మంచి లక్షణం.  మీరు ఇప్పటికే నాలుగు అడుగులు ముందుకు వేసి ఉన్నారు, స్థానికం అంటే గర్వపడతారు గనుక స్థానికం పై మక్కువ ను పెంచుకోండి అని నేను వారికి వేరే చెప్పనక్కరలేదు.  స్థానికం అంటే గర్వపడడం పెద్ద బలం.

ఈశాన్యాని కి చెందిన అధిక శాతం ఉత్పత్తుల కు విలువ జోడింపు, ప్రోత్సాహం, విపణి లభ్యత లు తక్కువ. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగం గా స్థానిక ఉత్పత్తుల కు విలువ జోడింపు, మార్కెటింగ్ కోసం క్లస్టర్ లను ఏర్పాటు చేస్తున్న విషయం కూడా ఇక్కడి ప్రజల కు తెలియదు.  ఈ క్లస్టర్ లలో ఆగ్రో స్టార్ట్- అప్ లు, ఇతర పరిశ్రమల ఏర్పాటు కు అన్ని వసతులు అందుబాటు లో ఉంటాయి.  ఈశాన్య రాష్ట్రాలు కూడా తమ ఆర్గానిక్ ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాల కు, విదేశాల కు పంపడానికి అవసరం అయిన అన్ని వసతులు వాటిలో ఏర్పాటవుతాయి.

మిత్రులారా,

భారతదేశం వెదురు ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించి దాని స్థానం లో స్థానిక ఉత్పత్తుల ను ప్రవేశపెట్టగల సామర్థ్యం ఈశాన్య ప్రాంతాని కి ఉంది.  దేశం లో అగరుబత్తీల కు ఎంతో డిమాండు ఉంది. వాటి తయారీ కోసం కూడా ఏన్నో కోట్ల ఖర్చు తో వెదురు ను దిగుమతి చేసుకుంటున్నాము.  ఈ పరిస్థితి ని మార్చేందుకు ఎంతో కృషి జరుగుతోంది.  దీని వల్ల ఈశాన్య ప్రాంతానికి చెందిన ప్రజలు కూడా ఎంతో లాభపడతారు.

మిత్రులారా,

ఈశాన్యం లో వెదురు పరిశ్రమ ను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేక వెదురు పారిశ్రామిక పార్క్ కు ఆమోదం కూడా ఇవ్వడం జరిగింది. వెదురు నుండి బయో ఇంధనాన్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ కూడా నుమాలీగఢ్ లో నిర్మాణం కాబోతోంది.  నేశనల్ బాంబూ మిశన్ లో భాగం గా వందలాది కోట్ల పెట్టుబడితో వెదురు రైతులు, కళాకారులు, దానికి సంబంధించిన హస్తకళా ఉత్పత్తుల తయారీదారుల ను ప్రోత్సహించడం, వాటికి సంబంధించిన పరిశ్రమల అభివృద్ధి కి ఎంతో కృషి జరుగుతోంది.  ఈశాన్య భారతం లో స్టార్ట్- అప్ లకు ఇది మంచి ఉత్తేజకరం.

మిత్రులారా,

ఈశాన్యంలో అమిత వేగం తో చోటు చేసుకొంటున్న ఈ మార్పుల ద్వారా చురుగ్గా ఉండే రాష్ట్రాలు మాత్రమే ప్రయోజనం పొందుతాయి. మణిపుర్ కు అపారమైన వనరులు అందుబాటులో ఉన్నాయి. మణిపుర్ ఈ అవకాశాన్ని చేజార్చుకోదని నేను భావిస్తున్నాను.  ఇక్కడి రైతులు, యువ పారిశ్రామికుల కు ఇది ఎంతో ప్రయోజనం కల్పిస్తుంది. మణిపుర్ యువత కు స్థానికంగానే ఉపాధి అవకాశాలు క్పలించాలన్నది మా ప్రయత్నం.  ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి విభాగాలలో ఎన్నో సంస్థలు, స్టార్ట్- అప్ లు, ఇతర శిక్షణ వసతులు ఇక్కడ ఏర్పాటవుతున్నాయి.

క్రీడా విశ్వవిద్యాలయం, ప్రపంచ శ్రేణి క్రీడా స్టేడియమ్ ల నిర్మాణం తో మణిపుర్ దేశానికి చెందిన క్రీడా ప్రతిభావంతుల కు ఒక ప్రధాన కేంద్రం గా మారనుంది.  అలాగే మణిపుర్ యువత తో పాటు దేశవ్యాప్తం గా యువత అందరికీ మంచి వసతిగృహాలు సహా మెరుగైన సౌకర్యాలు అందుబాటు లోకి రానున్నాయి.  మనం ఈ తరహా అభివృద్ధి ని, విశ్వాసాన్ని బలోపేతం చేయాలి.  మరోసారి ఈ నీటి ప్రాజెక్టు విషయం లో మీ అందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను.

ప్రతి ఒక్క ఇంటి కి నీటి సరఫరా ను అందుబాటులో ఉంచాలన్న మా లక్ష్యం నీరుగారకుండా నిర్దేశిత గడువు కన్నా ముందే అది అందుబాటులోకి తేవడం కోసం మణిపుర్ కు చెందిన తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదాలు నేను కోరుతున్నాను.  ఆ తల్లులు, సోదరీమణులు మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను.  మీ ఆశీస్సులే మాకు పెద్ద బలం.  రక్షాబంధన్ సమీపంలో ఉన్నందు వల్ల  కూడా మీ ఆశీస్సులు కోరుతున్నాను.  మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోండి.  స్వచ్ఛత విషయం లో ఈశాన్యం ఎప్పుడూ ముందు వరుస లో ఉంటుంది.  అది దేశానికే ఒక నమూనాగా నిలుస్తుంది.  మనం ఈ రోజు కరోనా తో పోరాడుతున్నాము. ‘దో గజ్ దూరీ’ (ఒక మనిషికి మరొక మనిషికి నడుమ రెండు గజాల ఎడం ను పాటించే) సూత్రం, ఫేస్ మాస్క్ ను ధరించడం, చేతుల ను శానిటైజ్ చేసుకోవడం.. వీటి ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి.  అలాగే బహిరంగ ప్రదేశాల లో ఉమ్మి వేయకండి.  కరోనా పై పోరాటానికి ప్రస్తుతం శక్తివంతమైన ఆయుధం ఇదే.  కరోనా తో పోరాడడం లో ఈ నియమాలు మీకు ఎల్లప్పటికీ సహాయపడతాయి.

అనేకానేక ధన్యవాదాలు.

https://youtu.be/KLRLB_wbN98

**