భూటాన్ కు చెందిన డ్రక్ న్యామ్‌రూప్ త్సోగ్‌పా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లోటె శెరింగ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు. భూటాన్ మూడో సార్వత్రిక ఎన్నికల లో డ్రక్ న్యామ్‌రూప్ త్సోగ్‌పా పార్టీ గెలుపొందినందుకు, శెరింగ్ జాతీయ చట్ట సభ కు ఎన్నికైనందుకు ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. భూటాన్ లో సాధారణ ఎన్నికలను సాఫీ గా నిర్వహించడాన్ని స్వాగతిస్తూ, ఇది భూటాన్ లో ప్రజాస్వామ్యం సుస్థిరం కావడానికి దోహదపడగలదని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
భూటాన్ తో పరస్పర సహకారానికి, స్నేహ సంబంధాలకు భారతదేశం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని, ఇది ఉమ్మడి విలువలు, ఉమ్మడి ప్రయోజనాలు, అత్యంత విశ్వసనీయత, సౌహార్దం, పరస్పర అవగాహన ల ఆధారంగా ఉంటుందని ప్రధాన మంత్రి తెలియజేశారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల స్వర్ణోత్సవాన్ని గుర్తుకు తెస్తూ , భూటాన్ నూతన ప్రభుత్వం ఆ దేశ సామాజిక ఆర్థిక పరివర్తన కై చేసే కృషి లో భారత ప్రభుత్వం భూటాన్ ప్రజల ప్రయోజనాలకు, ప్రాధాన్యాలకు అనుగుణంగా దృఢ దీక్షతో కలసి పనిచేస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు. భారతదేశాన్ని సందర్శించవలసింది గా డాక్టర్ లోటే శెరింగ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
అభినందనల పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి డాక్టర్ లోటే ధన్యావాదాలు తెలిపారు. భారతదేశాన్ని సందర్శించాలంటూ ప్రధాన మంత్రి అందించినటువంటి ఆహ్వానాన్ని డాక్టర్ లోటే స్వీకరిస్తూ వీలైనంత త్వరలో భారతదేశాన్ని సందర్శిస్తానన్నారు. భూటాన్, భారతదేశం ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఇరువురు నేతలూ అంగీకారాన్ని వ్యక్తం చేశారు.
**