ఎయిర్ పోర్ట్ స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ)కి చెందిన 1.6 ఎకరాల భూమిని తీసుకొని అందుకు బదులుగా అంతే భూమిని ఒడిశా ప్రభుత్వం ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఎఎఐ కి చెందిన 1.6 ఎకరాల భూమికి బదులుగా అంతే వైశాల్యం కలిగిన భూమిని ఇవ్వడానికి, ఎఎఐ స్థలంలో ఇప్పుడు ఉన్న మౌలిక సదుపాయాలను తన సొంత ఖర్చుతో వేరే చోటుకు మార్చే పనిని చేపట్టడానికి ఒడిశా ప్రభుత్వం ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వజూపుతున్న భూమి ప్రస్తుత విమానాశ్రయాన్ని ఆనుకొనే ఉంది. సమాంతర టాక్సీ మార్గాన్ని నిర్మించడం కోసం ఎఎఐ దీనిని ఉపయోగించుకోనుంది. ఈ భూమి మారకం రాష్ట్ర ప్రభుత్వం, ఎఎఐ ప్రయోజనాలకే కాకుండా ప్రజలకు కూడా ప్రయోజనకరమే కానుంది.
భువనేశ్వర్ విమానాశ్రయం సమీపంలోని రాష్ట్ర ప్రభుత్వ రహదారిని (ఇది Ekamara Marg/Palashpalli Road గా కూడా ప్రసిద్ధం) విస్తరించాలని ఒడిశా ప్రభుత్వం కోరుకుంటోంది. ప్రముఖుల రాకపోకలకు చేయవలసిన భద్రతా ఏర్పాట్లను క్రమబద్ధం చేయడంతో పాటు, ప్రజల ఉపయోగార్థం ఒక బఫర్ జోన్ ను ఏర్పాటుచేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. ఇందుకోసం ఎఎఐ కి చెందిన 1.6 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం అవుతోంది.