ప్రస్తుతం ఉన్న ఆర్డినెన్స్ స్థానంలో రానున్న పార్లమెంటు సమావేశాలలో ఈ బిల్లును ప్రతిపాదించనున్నారు. ఇది భారతదేశాన్నిఅంతర్జాతీయం మధ్యవర్తిత్వ పరిష్కార కేంద్రంగా తీర్చిదిద్దుతుంది. ఈ దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం చూపిన అద్భుత చొరవగా దీనిని చెప్పుకోవచ్చు.
ఈ దిశగా ఒక స్వతంత్ర వ్యవస్థ దేశీయ, అంతర్జాతీయ మధ్యవర్తిత్వ పరిష్కారాలకు ఏర్పాటు అవుతుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎన్ డిఐఎసి) బిల్లు 2019 ను రానున్న పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది.
ప్రభావం….
సంస్థాగత ఆర్బిట్రేషన్ ప్రయోజనాలు అటు ప్రభుత్వానికి , దాని ఏజెన్సీకి అలాగే వివాదంలోని పార్టీలకు బహుళ ప్రయోజనకారిగా ఉంటుంది.
ఫలితంగా భారతదేశంలో మధ్యవర్తిత్వపరిష్కారాలకు నిపుణులైన వారు అందుబాటులో ఉంటారు. అలాగే ఖర్చు విషయంలో కూడా కలిసి వస్తుంది. ఇది సంస్థాగత ఆర్బిట్రేషన్‌కు భారతదేశం ఒక కేంద్రంగా మారడానికి వీలు కల్పిస్తుంది.
పర్యవసానాలు:
సంస్థాగత మధ్యవర్తిత్వ పరిష్కారాలకు ఒక స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్పూట్ రెజల్యూషన్ ( ఐసిఎడిఆర్) కింద హామీలను న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ అర్బిట్రేషన్ సెంటర్ (ఎన్‌డిఐసి)కి 2019 మార్చి 2 నుంచి బదలాయింపు, సేకరణకు ఇది వీలు కల్పిస్తుంది.
అమలు:
ఈ బిల్లు , న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఆర్డినెన్స్ , 2019 స్థానంలో కొత్తగా తీసుకురావడం జరుగుతుంది. ఈ ఆర్డినెన్సును 02-03-2019న రాష్ట్రపతి జారీ చేశారు. భారతదేశాన్ని దేశీయ, అంతర్జాతీయ సంస్థాగత మధ్యవర్తిత్వ వివాదాల పరిష్కారం విషయంలో అంతర్జాతీయ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఈ ఆర్డినెన్సును నిర్దేశించారు.
ఈ బిల్లు న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఆర్డినెన్స్ 2019ని రద్దుచేస్తుంది. అలాగే ఈ ఆర్డినెన్సు కింద చేపట్టిన చర్యలను రక్షించి ఈ బిల్లులోని ప్రొవిజన్ల కింద చేపట్టిన చర్యలుగా పరిగణిస్తుంది.
నేపథ్యం :
ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థ (ఎడిఆర్) ద్వారా అంతర్జాతీయ,దేశీయ వాణిజ్యవివాదాలను సత్వరం పరిష్కరించేందుకు ఒక స్వతంత్ర ప్రతిపత్తికలిగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది భారత ప్రభుత్వ కృషిగా ఉంటూ వచ్చింది. ఈ దిశగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్. కృష్ణ నాయకత్వంలో 2017 వ సంవత్సరంలో ఒక ఉన్నత స్థాయికమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ ఉన్నత స్థాయికమిటీ కీలక సిఫార్సుచేసింది. దీనిప్రకారం, 1995 వ సంవత్సరంలో ప్రభుత్వ నిధులతో ఏర్పడి కొనసాగుతునన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్పూట్ రెజల్యూషన్ ( ఐసిఎడిఆర్)ను ప్రభుత్వం తీసుకుని దానిని జాతీయ ప్రాధాన్యత గల సంస్థగా తీర్చిదిద్దాలని సిఫార్సు చేసింది.
ఈ ఉన్నత స్థాయి కమిటీ సిపార్సులను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం,న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎన్‌డిఐఎసి) బిల్ 2018కి రూపకల్పన చేసింది. దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు 2017 డిసెంబర్ 15న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. అప్పట్లో ఈ బిల్లును 2018 డిసెంబర్ 5న లోక్‌సభలో ప్రవేశపెట్టగా 2019 జనవరి 4 వ తేదీన లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. అయితే న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ బిల్ 2018ని ఆమోదం కోసం రాజ్యసభ 248 వ సెషనలో దీనిని చేపట్ట లేక పోయింది. ఆ తర్వాత పార్లమెంటు 2019 ఫిబ్రవరి 13 వ తేదీకి నిరవధికంగా వాయిదా పడింది.
ఈ అంశానికిగల ప్రాధాన్యత దృష్ట్యా, అలాగే భారతదేశాన్ని సంస్థాగత ఆర్బిట్రేషన్‌లో అంతర్జాతీయ హబ్‌గా సత్వరం తీర్చిదిద్దాలన్న సంకల్పంతో, భారతదేశంలో సులభతర వాణిజ్యాన్ని పెంపొందించేందుకు వీలుగా ద న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ అర్బిట్రేషన్ సెంటర్ ఆర్డినెన్సు 2019ని 2019 మార్చి 2 వ తేదీన రాష్ట్రపతి తీసుకువచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 107 (5), ఆర్టికల్ 123 (2) ప్రకారం న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ బిల్, 2019ని రానున్న పార్లమెంటు సమావేశాలలో న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఆర్డినెన్స్ 2019 కి బదులుగా ప్రవేశపెట్టనున్నారు.
ఎన్‌డిఐఎసి- మధ్యవర్తిత్వ పరిష్కారాలకు భవిష్యత్ అంతర్జాతీయ కేంద్రం:
న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ( ఎన్‌డిఐఎసి) కి ఛైర్ పర్సన్ నాయకత్వం వహిస్తారు. వీరు సుప్రీంకోర్టు జడ్జి కానీ లేదా హైకోర్టు జడ్జి కానీ లేదా మేనేజ్‌మెంట్, న్యాయం, మధ్యవర్తిత్వ పరిష్కారాల నిర్వహణ వంటి విషయాలలో అపార అనుభవం, పరిజ్ఞానం కలిగిన ప్రముఖ వ్యక్తిని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. దీనితోపాటు ఈ సంస్థలో ఇద్దరు పూర్తి కాలపు లేదా పార్ట్ టైమ్ సభ్యులు ఉంటారు. వీరు కూడా దేశీయ, అంతర్జాతీయ సంస్థాగత ఆర్బిట్రేషన్ వ్యవహారాలలో నిష్ణాతులు, అనుభవజ్ఞులై ఉంటారు. అదనంగా వాణిజ్య , పరిశ్రమ రంగాలకు చెందిన గుర్తింపు పొందిన సంస్థ ప్రతినిధి ఒకరు సభ్యులుగా ఉంటారు. వీరిని పార్ట్ టైమ్ సభ్యులుగా రొటేషనల్ పద్ధతిపై ప్రభుత్వం నియమిస్తుంది. చట్టం, న్యాయ మంత్రి త్వశాఖకు చెందిన న్యాయవ్యవహారాల విభాగానికి చెందిన కార్యదర్శి, ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన డిపార్టమెంట్ ఆఫ్ ఎక్స్‌పెండీచర్ చే నామినేట్ చేయబడిన ఆర్థిక సలహాదారు, ఎన్‌డిఐఎసి ఛీఫ్ ఎక్సిక్యూటివ్ అధికారి, వీరు ఇందులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు.
ఎన్‌డిఐఎసి ఉద్దేశాలు, లక్ష్యాలు–
(ఎ) అంతర్జాతీయ,దేశీయ మధ్యవర్తిత్వ పరిష్కారాల నిర్వహణకు ఒక ప్రముఖ సంస్థగా దీనిని అభివృద్ధి చేసేందుకు లక్షిత సంస్కరణలు తీసుకురావడం.
(బి) కన్సీలియేషన్, మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియకు అవసరమైన నిర్వహణాపరమైన సహాయానికి అవసరమైన సదుపాయాలు కల్పించడం
(సి) గుర్తింపు పొందిన ఆర్బిట్రేటర్లు, కన్సీలియేటర్లు, మీడియేటర్ల ప్యానళ్లను జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం, లేదా సర్వేయర్లు , ఇన్వెస్టిగేటర్ల వంటి ప్రత్యేక నిపుణుల ప్యానళ్లను నిర్వహించడం
(డి) దేశీయ, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, కన్సీలియేషన్ వ్యవహారాలను అత్యంత ప్రొఫెషనల్ పద్ధతిలో నిర్వహించేందుకు వీలు కల్పించడం.
(ఇ) దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్, కన్సీలియేషన్ సేవలను తక్కువ ఖర్చుతో , సకాలంలో అందించడం
(ఎఫ్) ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాలు, సంబంధింత విషయాలలో అధ్యయనాన్నిప్రోత్సహించడం, వివాదాల పరిష్కార వ్యవస్థలలో సంస్కరణలను ప్రోత్సహించడం.
(జి) ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలను ప్రోత్సహించేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గల సంఘాలు, సంస్థలు, వ్యవస్థలతో పరస్పర సహకారం కలిగి ఉండడం.