Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త్‌లో మాల్దీవ్స్ అధ్య‌క్షుడి అధికార ప‌ర్యటన సంద‌ర్భంగా భార‌త్‌-మాల్దీవ్స్ సంయుక్త ప్రకటన


  1. గణతంత్ర మాల్దీవ్స్ అధ్యక్షులు, మాననీయ ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, గణతంత్ర భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారతదేశంలో అధికార పర్యటనకు వచ్చారు.
  2. మాల్దీవ్స్ అధ్యక్షులుగా 2018 నవంబరు 17న పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోలిహ్ భారతదేశంలో పర్యటించడం ఇది మూడోసారి. అధ్యక్షులు సోలిహ్‌తోపాటు గౌరవనీయులైన ద్రవ్యశాఖ మంత్రి ఇబ్రహీం అమీర్, ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి ఫయాజ్ ఇస్మాయిల్, గౌరవనీయ ఆరోగ్య-సాంఘికసేవ-లింగ సమానత్వ శాఖ మంత్రి ఐషాత్‌ మొహమ్మద్‌ దిదిసహా వాణిజ్య ప్రతినిధులతో కూడిన ఉన్నతస్థాయి బృందం కూడా ఈ పర్యనటలో పాల్గొంటోంది.
  3. అధ్యక్షుడు సోలిహ్ న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో ప్రత్యక్ష, ప్రతినిధులస్థాయి చర్చలకు ఈ పర్యటనను పరిమితం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సోలిహ్ సహా ఆయనతోపాటు హాజరైన ప్రతినిధి బృందానికి ప్రధాని మోదీ అధికారిక మధ్యాహ్న విందు ఏర్పాటు చేశారు.
  4. ఈ పర్యటనలో భాగంగా అధ్యక్షులు సోలిహ్ భారత గణతంత్ర రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో కూడా సమావేశమయ్యారు. భారత 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించడంపై ముర్ముకు ఆయన అభినందనలు తెలిపారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ కూడా అధ్యక్షుడు సోలిహ్‌ను కలుసుకున్నారు. అనంతరం ముంబైలో పర్యటించిన అధ్యక్షులు సోలిహ్‌ను మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ కలుసుకున్నారు.
  5. భారత్‌-మాల్దీవుల ద్వైపాక్షిక భాగస్వామ్యం భౌగోళిక సామీప్యం, చారిత్రక-సాంస్కృతిక సంబంధాలు, ఉమ్మడి విలువలతో ముడిపడి ఉంది. భారతీయుల హృదయాలలోనే కాకుండా “పొరుగుకు ప్రాధాన్యం” అనే భారత విధానంలోనూ మాల్దీవ్స్‌కు ప్రత్యేక స్థానం ఉందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. అధ్యక్షుడు సోలిహ్ తన ప్రభుత్వ “భారత్-మొదటి విధానం”ని పునరుద్ఘాటించారు. ఇటీవలి సంవత్సరాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్య సత్వర  విస్తరణ రెండు దేశాల పౌరులకూ ప్రయోజనం చేకూర్చడంపై దేశాధినేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరస్పర ప్రయోజన సమగ్ర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని వారు పునరుద్ఘాటించారు.
  6. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మాల్దీవ్స్‌ ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలవడంపై ప్రధాని మోదీకి, భారత ప్రభుత్వానికి అధ్యక్షుడు సోలిహ్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, మహమ్మారి విసిరిన ఆరోగ్య సవాలును ఎదుర్కొనడంతోపాటు ఆర్థిక పతనాన్ని అధిగమించడంలో భారత్‌ నుంచి అందిన వైద్య-ఆర్థిక సహాయం మాల్దీవ్స్‌కు ఎంతగానో తోడ్పడింది. మాల్దీవ్స్‌కు కోవిడ్-19 టీకాలను బహూకరించిన తొలి భాగస్వామి భారతదేశమే. ఈ నేపథ్యంలో టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడమే కాకుండా మహమ్మారి అనంతర పటిష్ట ఆర్థిక పునరుద్ధరణలో చూపిన దీక్ష, పట్టుదలపై అధ్యక్షుడు సోలిహ్‌తోపాటు మాల్దీవ్స్‌ ప్రజలను ప్రధాని మోదీ అభినందించారు.
  7. రక్షణ, భద్రత, పెట్టుబడులకు ప్రోత్సాహం, మానవ వనరుల అభివృద్ధి, వాతావరణం, ఇంధనంసహా మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగాల్లో సహకారం దిశగా సంస్థాగత సంబంధాలను మరింత విస్తరించడానికి ప్రధాని మోదీ-అధ్యక్షులు సోలిహ్ అంగీకరించారు.

ఆర్థిక సహకారం… ప్రజల మధ్య సంబంధాలు

  1. వీసా రహిత ప్రయాణం, మెరుగైన విమాన సంధానం, ఆదానప్రదాన కార్యక్రమాలు, సాంస్కృతిక-ఆర్థిక సంబంధాల ద్వారా రెండుదేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు  వృద్ధి చెందడంపై దేశాధినేతలిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. కాగా, మాల్దీవ్స్‌ పర్యాటక మార్కెట్‌కు భారతదేశం ప్రధాన వనరుగా ఆవిర్భవించడమే కాకుండా ఆర్థిక పునరుద్ధరణకు దోహదం చేస్తోంది. పర్యాటక సంబంధాల విస్తరణలో భాగంగా మహమ్మారి సమయంలో సృష్టించబడిన ద్వైపాక్షిక విమాన ప్రయాణ ఒప్పందాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. అలాగే మాల్దీవ్స్‌లో ‘రూపే’ కార్డు వినియోగం అమలుకు కొనసాగుతున్న కృషిపై వారు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ద్వైపాక్షిక ప్రయాణ, పర్యాటక, ఆర్థిక అంతర అనుసంధానాల విస్తరణ దిశగా చేపట్టాల్సిన తదుపరి చర్యల పరిశీలనపై అంగీకారానికి వచ్చారు. మాల్దీవ్స్‌లోని భారత ఉపాధ్యాయులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, వైద్యులు, కార్మికులు, నిపుణుల విలువైన సహకారాన్ని దేశాధినేతలిద్దరూ అభినందించారు. మాల్దీవ్స్‌లో ఇటీవల ‘నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్‌’ను  ప్రారంభించడంపై వారు హర్షం వెలిబుచ్చారు. రెండు దేశాల్లో అంతర్గతంగా దాని పరిధి  విస్తరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
  2. ఈ పర్యటనలో భాగంగా రెండు దేశాల వ్యాణిజ్య ప్రముఖుల మధ్య చర్చలపై  దేశాధినేతలిద్దరూ హర్షం ప్రకటించారు. రెండు దేశాల నడుమ ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టమయ్యే దిశగా పరస్పర పెట్టుబడులు, భాగస్వామ్యాలకు మత్స్య, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం, ఆరోగ్యం, సమాచార సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాలు కీలకమైనవని వారు పేర్కొన్నారు. ‘సాఫ్టా’ కింద మాల్దీవ్స్‌ ‘ట్యూనా’ ఉత్పత్తులకు సరిహద్దు మార్కెట్‌గా భారతదేశం సామర్థ్యాన్ని నాయకులిద్దరూ గుర్తించారు. మొత్తంమీద 2019 నుంచి ద్వైపాక్షిక వాణిజ్యంలో వృద్ధిపై దేశాధినేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌-మాల్దీవ్స్‌ మధ్య 2020 సెప్టెంబర్ నుంచి ప్రత్యక్ష సరకు రవాణా నౌకల కార్యకలాపాలపై ప్రధాని మోదీ, అధ్యక్షులు సోలిహ్ హర్షం వ్యక్తం చేశారు.  ద్వైపాక్షిక వాణిజ్య విస్తరణలో ఈ సేవలు మరింత దోహదం చేయాలని ఆకాంక్షించారు.

ప్రగతి భాగస్వామ్యం

  1. కోవిడ్‌-19 మహమ్మారితోపాటు ఇతర అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రగతి భాగస్వామ్యంలో రెండు దేశాలూ సాధించిన అద్భుత పురోగమనాన్ని ప్రధాని మోదీ, అధ్యక్షులు సోలిహ్ సమీక్షించారు. భారత్‌-మాల్దీవ్స్‌ అభివృద్ధి భాగస్వామ్యం ఇటీవలి సంవత్సరాలలో సత్వర వృద్ధిని సాధించింది. అంతేకాకుండా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక-స్థాయి ఆర్థిక సహాయ ప్రాజెక్టులు, సామర్థ్య వికాస  కార్యక్రమాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా మాల్దీవ్స్‌ అవసరాల ప్రాతిపదికగలవి కాగా- రెండు ప్రభుత్వాల నడుమ పారదర్శక ప్రక్రియలు, పరస్పర సహకార స్ఫూర్తితో అమలు చేయబడినవి కావడం విశేషం.
  2. భారత ఆర్థిక సహాయం, రాయితీ రుణాల తోడ్పాటుతో నిర్మించే 500 మిలియన్‌ డాలర్ల విలువైన ‘గ్రేటర్ మాలె’ అనుసంధాన ప్రాజెక్టుకు “ఆరంభ కాంక్రీట్‌ పోత” కార్యక్రమంలో నాయకులిద్దరూ వర్చువల్ మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. మాల్దీవ్స్‌లో కీలకమైన ఈ అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయాలని వారిద్దరూ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మాలె- విల్లింగ్లి, గుల్హిఫల్హు, తిలాఫుషి దీవుల మధ్య రవాణా కార్యకలాపాలు పుంజుకుంటాయి. దీంతోపాటు రవాణా వ్యయం గణనీయంగా తగ్గి, ప్రజాకేంద్రక ఆర్థికవృద్ధికి చేయూత లభిస్తుంది. అలాగే రెండు దేశాల మధ్య శాశ్వత స్నేహానికి ఇదొక సంకేతంగా నిలుస్తుంది.
  3. మాల్దీవ్స్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం దిశగా 100 మిలియన్‌ అమెరికా డాలర్ల విలువైన భారత ప్రభుత్వ కొత్త దశలవారీ రుణ వితరణకు ప్రధాని మోదీ సుముఖత ప్రకటించారు. దీనిపై అధ్యక్షులు సోలిహ్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దీంతోపాటు వివిధ దశల్లోగల అనేక భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సాకారం కావడంలో ఈ అదనపు నిధులు తోడ్పడగలవని విశ్వాసం వ్యక్తం చేశారు.
  4. కొనుగోలుదారులకు రుణ సహాయం కింద ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిన రుణంతో గ్రేటర్ మాలెలో నిర్మిస్తున్న 4,000 సామాజిక ఇళ్ల నిర్మాణ పురోగతిని దేశాధినేతలిద్దరూ సమీక్షించారు. పౌరులకు సరసమైన ధరతో గృహవసతి కల్పించాలన్న మాల్దీవ్స్‌ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ ఇళ్లు నిర్మితమవుతున్నాయి.
  5. గ్రేటర్ మాల్‌లో మరో 2000 సామాజిక ఇళ్ల నిర్మాణానికీ కొనుగోలుదారులకు రుణ సహాయం కింద ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 119 మిలియన్‌ అమెరికా డాలర్ల మేర రుణ మంజూరుకు ఆమోదం తెలపడంపై అధినేతలిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాల్దీవ్స్‌ ప్రభుత్వం మధ్య ఆసక్తి వ్యక్తీకరణ లేఖల పరస్పర ప్రదానం పూర్తయింది. ఈ నేపథ్యంలో అదనపు గృహవసతి కల్పనకు ఉదారంగా సహాయం చేసినందుకు అధ్యక్షులు సోలిహ్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
  6. ‘అడ్డూ రహదారుల ప్రాజెక్టు, 34 దీవులలో నీటి సరఫరా-మురుగు పారుదల సౌకర్యాల కల్పన, హుకురు మిసికీ (శుక్రవారం మసీదు) పునరుద్ధరణ సహా భారత ఆర్థిక సహాయంతో చేపట్టిన ప్రాజెక్టుల పురోగమనంపై దేశాధినేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. గుల్హిఫల్హు ఓడరేవు సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)కు ఆమోదంపై నాయకులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఓడరేవు స్థానంలో గ్రేటర్ మాలె నగరానికి అంతర్జాతీయ స్థాయి ఓడరేవు సదుపాయం కల్పించి, మాలె నగరం నుంచి సౌకర్యాలను బదలాయించే ఈ ప్రాజెక్టు పనులను త్వరగా ప్రారంభించాలని వారు అధికారులను ఆదేశించారు. హనిమాధూ విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్ట్ ‘ఈపీసీ’ కాంట్రాక్టుకు భారత్‌ తుది ఆమోదంపై సంతకాలు పూర్తి కావడంమీద నాయకులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ఇది త్వరలోనే అమలులోకి రాగలదని ఆశాభావం వెలిబుచ్చారు. అలాగే లాములోని కేన్సర్ ఆస్పత్రి నిర్మాణ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్య నివేదిక ఖరారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దశలవారీ రుణంద్వారా ఆర్థిక సహాయం ఖరారు చేయడంపై అధినేతలిద్దరూ సంతృప్తి వెలిబుచ్చారు.
  7. భారతదేశం నుంచి ఆర్థిక సహాయం ద్వారా అమలు చేయబడిన 45 సామాజిక అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ద్వీప సమాజాలకు సానుకూల సహకారం లభించడంపై అధినేతలిద్దరూ హర్షం వ్యక్తం చేశారు.
  8. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యానికి కొన్నేళ్లుగా సామర్థ్య వికాసం, శిక్షణ కీలక స్తంభాలుగా ఆవిర్భవించాయని ప్రధాని మోదీ, అధ్యక్షులు సోలిహ్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ‘ఐటీఈసీ’ శిక్షణ పథకంతోపాటు వందలాది మాల్దీవ్స్‌ యువత భారత్‌లో ప్రత్యేక సానుకూల శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణకు పౌర-కస్టమ్స్ సేవలు, పార్లమెంట్లు, న్యాయవ్యవస్థలు, మాధ్యమాలు, ఆరోగ్య-విద్యా సంస్థలు, రక్షణ-భద్రత  సంస్థలు వగైరాల మధ్య సంస్థాగత అనుసంధానం ద్వారా సౌలభ్యం కల్పించబడింది. మరోవైపు మాల్దీవ్స్‌లోని స్థానిక ప్రభుత్వ సంస్థల సామర్థ్యాల బలోపేతానికి మాల్దీవ్స్‌ స్థానిక ప్రభుత్వ ప్రాధికార సంస్థ, భారత జాతీయ గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్‌ సంస్థల మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు పూర్తి కావడంపై దేశాధినేతలిద్దరూ హర్షం వెలిబుచ్చారు.

రక్షణ… భద్రత

  1. భారత-మాల్దీవ్స్‌ రక్షణ-భద్రత భాగస్వామ్యం కాలపరీక్షను ఎదుర్కొని నిలిచింది. అలాగే  అంతర్జాతీయ నేరాలు-విపత్తు సహాయక రంగాల్లో ప్రాంతీయ సహకారానికి నిజమైన నిదర్శనంగా నిలిచింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వానికి ఈ భాగస్వామ్యం ఒక శక్తివంటిది. భారత, మాల్దీవ్స్‌ భద్రత పరస్పర అనుసంధానితాలు. ఈ వాస్తవాన్ని గుర్తిస్తూ ఈ ప్రాంతం భద్రత-స్థిరత్వంపై పరస్పరం అభిప్రాయాలు, ఆందోళనలను పంచుకోవాల్సిన అవసరం ఉందని నాయకులిద్దరూ అంగీకరిస్తూ ఈ దిశగా భరోసాను పునరుద్ఘాటించారు. ఈ కర్తవ్యంలో భాగంగా తమతమ భూభాగాలను మరొక దేశానికి హాని కలిగించే శక్తులకు వేదిక కానివ్వరాదని ప్రతినబూనారు.
  2. కొనసాగుతున్న ప్రాజెక్టులు, సామర్థ్య వికాస కార్యక్రమాల అమలు ద్వారా సముద్ర-భూభాగ భద్రత, సముద్ర రంగంలో అవగాహన, మానవతా సహాయం, విపత్తు నివారణ సహకారాన్ని శక్తిమంతం చేయడంపై అధినేతలిద్దరూ అంగీకారానికి వచ్చారు. భారతదేశ భద్రత, ఈ ప్రాంతంలో అందరికీ ప్రగతి (సాగర్) దృక్కోణానికి అనుగుణంగా సహకార  బలోపేతానికి భారత కట్టుబాటును ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
  3. ‘సిఫావరు’ వద్ద తీర రక్షకదళ నౌకాశ్రయ నిర్మాణ పూర్వదశ పనుల్లో సత్వర ప్రగతిపై నాయకులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. సముద్ర అధికార పరిధి వినియోగంతోపాటు తన ‘ఈఈజడ్‌’, ద్వీప తీరాలలో నిఘా నిర్వహణ దిశగా జాతీయ రక్షణ దళం (ఎంఎన్‌డీఎఫ్‌) సామర్థ్యం పెంపుద్వారా మాల్దీవ్స్‌ ప్రభుత్వానికి ఈ నౌకాశ్రయం తోడ్పాటునిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలని దేశాధినేతలిద్దరూ అధికారులను ఆదేశించారు.
  4. మాల్దీవ్స్‌ జాతీయ రక్షణ దళాల కోసం సాయుధ బలగాలను తరలించే మరొక ‘ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్‌’ (ఎల్‌సీఏ)తోపాటు ఇంతకుముందు అందజేసిన ‘సీజీఎస్‌ హురావీ’ స్థానంలో ప్రత్యామ్నాయ నౌకను అందజేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అలాగే మాల్దీవ్స్‌ జాతీయ రక్షణ దళానికి భారత ప్రభుత్వం 24 యుటిలిటీ వాహనాలను బహూకరిస్తున్నట్లు కూడా ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. ఎంఎన్‌డీఎఫ్‌ మౌలిక సదుపాయాలు, పరికరాల ఆధునికీకరణకుతోపాటు రక్షణ ప్రాజెక్టుల కోసం ఆర్థిక సహాయమే కాకుండా 50 మిలియన్‌ అమెరికా డాలర్ల విలువైన దశలవారీ రుణ వితరణ ద్వారా భారతదేశం నిరంతర మద్దతు ఇస్తున్నందుకు ప్రధాని మోదీకి ఈ సందర్భంగా అధ్యక్షులు సోలిహ్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
  5. అడ్డూ నగరంలో 2022 మార్చి నుంచి పనిచేస్తున్న నేషనల్‌ కాలేజ్‌ ఫర్‌ పోలీసింగ్‌ అండ్‌ లా ఎన్ఫోర్స్‌మెంట్‌ (ఎన్‌సీపీఎల్‌ఈ) ఏర్పాటుకు సహాయం అందించడంపై ప్రధానమంత్రి మోదీకి అధ్యక్షులు సోలిహ్‌ కృతజ్ఞతలు తెలిపారు.
  6. మాల్దీవ్స్‌ అంతటా 61 పోలీసు మౌలిక సదుపాయాల రూపకల్పన, నిర్మాణానికి ‘కొనుగోలుదారు రుణ ఒప్పందం ఆదానప్రదానంపై నాయకులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ఇది మెరుగైన పోలీసింగ్‌ సహా ద్వీపాల్లోని సమాజాల భద్రత, రక్షణకు హామీ ఇవ్వడంలో దోహదం చేస్తుంది.
  7. ప్రాంతీయ, బహుపాక్షిక కార్యక్రమాల చట్రంలో ఈ రంగాలలో సాధించిన పురోగతిపై నాయకులిద్దరూ సంతోషం ప్రకటించారు. అయిదో కొలంబో భద్రత మహాసభ-2022ను మాల్దీవ్స్‌ విజయవంతంగా నిర్వహించడంపై అధ్యక్షులు సోలిహ్‌ను ప్రధాని మోదీ అభినందించారు. అలాగే ఈ మహాసభ ద్వారా సభ్యత్వ విస్తరణతోపాటు మానవతా సహాయం- విపత్తు ఉపశమనం పేరిట కొత్త స్తంభాన్ని జోడించడంలో మాల్దీవ్స్‌ చూపిన చొరవను ప్రశంసించారు.
  8. గత నెలలో కొచ్చిలో జరిగిన కొలంబో భద్రత మహాసభ సభ్యదేశాల 6వ డిప్యూటీ జాతీయ భద్రత సలహాదారుల సమావేశం విజయవంతం కావడంపై దేశాధినేతలిద్దరూ సంతృప్తి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాల్దీవ్స్‌ నిర్వహించే 7వ డిప్యూటీ జాతీయ భద్రత సలహాదారుల సమావేశం కూడా నిర్మాణాత్మక ఫలితాలు ఇవ్వగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
  9. విపత్తు నిర్వహణ రంగంలో సహకార బలోపేతం, సైబర్ భద్రతపై అవగాహన ఒప్పందాల మార్పిడిపై నాయకులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు.
  10. అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని దేశాధినేతలిద్దరూ ముక్తకంఠంతో ఖండించారు. అలాగే దుర్బోధలు, హింసాత్మక తీవ్రవాదం, ఉగ్రవాదం-మాదకద్రవ్య దొంగ రవాణా తదితరాలను అడ్డుకోవడానికి రెండు దేశాల భద్రత సంస్థల మధ్య సమన్వయం మెరుగుపరచాలని వారు పిలుపునిచ్చారు. లోగడ 2021 ఏప్రిల్‌లో ఉగ్రవాద నిరోధంపై సంయుక్త కార్యాచరణ బృందం తొలి సమావేశం జరిగినప్పటి నుంచి పురోగతిని ప్రశంసిస్తూ సైబర్-భద్రత సహా వివిధ రంగాలలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని దేశాధినేతలిద్దరూ అధికారులను ఆదేశించారు.

సహకార రంగంలో కొత్త సరిహద్దుల ఆవిర్భావం

  1. పర్యావరణం, పునరుత్పాదక ఇంధనం- వాతావరణ మార్పులతో సవాళ్లు పెరుగుతుండటాన్ని నాయకులిద్దరూ అంగీకరించారు. ఈ నేపథ్యంలో ద్వైపాక్షికంగా, విపత్తును తట్టుకోగల మౌలిక సదుపాయాల కోసం అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటు, దీని చట్రంలో ఉపశమన కల్పన, అనుసరణ దిశగా సహకార బలోపేతానికి వారు అంగీకరించారు. భారత ప్రభుత్వ రాయితీతో కూడిన దశలవారీ రుణ వితరణ కింద  34 ద్వీపాలలో చేపట్టిన తాగునీరు, పారిశుధ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం  అంతర్జాతీయ సహకారంతో మాల్దీవులలో చేపట్టిన అతిపెద్ద వాతావరణ అనుకూల ప్రాజెక్టు. ఈ నేపథ్యంలో 2030 నాటికి నికరశూన్య ఉద్గార హోదా సాధించాలని మాల్దీవ్స్‌ ప్రతిష్టాత్మక లక్ష్య నిర్దేశం చేసుకోవడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. దీనికి పూర్తి మద్దతు, హామీ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధనం, గ్రిడ్ అంతర సంధాన రంగంలో సహకారం బలోపేతం చేసుకోవాలని దేశాధినేతలిద్దరూ తమతమ అధికారులకు పిలుపునిచ్చారు.
  2. క్రీడలు – యువజన ప్రగతి: భారతదేశంలోని మాల్దీవ్స్‌ క్రీడాకారులకు క్రీడా పరికరాల బహూకరణ, శిక్షణ సహా క్రీడా సంబంధాల విస్తరణకు నాయకులిద్దరూ అంగీకరించారు. క్రీడా మౌలిక సౌకర్యాల అభివృద్ధికి సమకూరుస్తున్న 40 మిలియన్‌ డాలర్ల విలువైన దశలవారీ రాయితీ రుణ సదుపాయంతో మాల్దీవ్స్‌లో క్రీడా సదుపాయాల అభివృద్ధి ప్రాజక్టులను ముందుకు తీసుకెళ్లాలని వారు అధికారులను ఆదేశించారు. మాల్దీవ్స్‌లో ఆర్థిక సహాయంతో అమలవుతున్న ప్రాజెక్టులలో అనేక క్రీడా అభివృద్ధి ప్రాజెక్టులను చేర్చడాన్ని కూడా వారు అభినందించారు. క్రీడలు, యువజన వ్యవహారాల్లో సహకారంపై 2020లో సంతకం చేసిన అవగాహన ఒప్పందం కింద ఇరువైపుల యువత మధ్య ఆదానప్రదానాలను నేతలిద్దరూ ప్రశంసించారు.

బహుపాక్షిక వేదికలపై సహకారం

  1. ఐక్యరాజ్యసమితి సంస్థలు, ముఖ్యంగా భద్రత మండలిలో అత్యవసర సంస్కరణల ఆవశ్యకతపై నాయకులిద్దరూ అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు విస్తరించిన- సంస్కరించబడిన ఐరాస భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వం దిశగా భారత్‌ అభ్యర్థిత్వానికి మాల్దీవ్స్‌ మద్దతివ్వడాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఈ మేరకు ఐరాస 76వ సర్వసభ్య సమావేశం అధ్యక్ష పదవిపై మాల్దీవ్స్‌ అభ్యర్థిత్వానికి భారత్‌ మద్దతివ్వడంపైనా అధ్యక్షులు సోలిహ్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఐక్యరాజ్య సమితితోపాటు ఇతర అంతర్జాతీయ వేదికలపై ఉమ్మడి ప్రయోజన సంబంధిత బహుపాక్షిక అంశాలపై కృషి కొనసాగించాలని దేశాధినేతలిద్దరూ అంగీకరించారు.

ఒడంబడికలు – అవగాహన ఒప్పందాలు

  1. ఈ పర్యటన సందర్భంగా దేశాధినేతలిద్దరూ క్రింది రంగాలపై వివిధ అంశాలలో అవగాహన ఒప్పందాలు/ఒడంబడికలను మార్చుకున్నారు:
  • సంభావ్య మత్స్యమండలి, ముందస్తు అంచనాల సామర్థ్యం పెంపుపై సహకారం
  • సైబర్‌ భద్రత రంగంలో సహకారం
  • మహిళాభివృద్ధి కమిటీలు, స్థానిక పాలన మండళ్ల సామర్థ్య వికాసం
  • విపత్తుల నిర్వహణలో సహకారం
  • పోలీసు మౌలిక సదుపాయాల నిర్మాణానికి 41 మిలియన్‌ డాలర్ల కొనుగోలుదారు రుణ ఒప్పందం
  • కొనుగోలుదారు రుణవితరణ కింద 2,000 గృహాల నిర్మాణంపై ఆసక్తి వ్యక్తీకరణ లేఖ
  1. ఈ పర్యటనలో తనతోపాటు తమ ప్రతినిధి బృందంపై సహృదయంతో అపూర్వ గౌరవాదరాలు చూపడంతోపాటు అద్భుత ఆతిధ్యం ఇచ్చినందుకుగాను ప్రధాని మోదీకి అధ్యక్షులు సోలిహ్ ధన్యవాదాలు తెలిపారు.
  2. మాల్దీవ్స్‌లో పర్యటించాల్సిందిగా భారత రాష్ట్రపతిని అధ్యక్షులు సోలిహ్‌ సాదరంగా ఆహ్వానించారు. అలాగే తమ దేశం సందర్శించాలని ప్రధానమంత్రి మోదీకి కూడా అధ్యక్షులు సోలిహ్ ఆహ్వానం పలికారు.

***