అంతరిక్షంలో అన్వేషణ, శాంతి ప్రయోజనాల కోసం రోదసీని వినియోగించుకోవడంలో సహకరించుకోవడం కోసం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐ ఎస్ ఆర్ ఒ.. ‘ఇస్రో’) కు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్పేస్ ఏజెన్సీ (యు ఎ ఇ ఎస్ ఎ) కి మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పందం పత్రం (ఎమ్ ఒ యు)పై సంతకాలు జరిగిన విషయాన్ని కేంద్ర మంత్రి మండలికి ఈ రోజు నివేదించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఇస్రో, యు ఎ ఇ ఎస్ ఎ లకు చెందిన సభ్యులతో ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడానికి ఎమ్ ఒ యు వీలు కల్పిస్తుంది. ఈ బృందం ఎంఓయూను అమలు చేసేందుకు ఏ ఏ మార్గాలను అవలంబించవచ్చు
, అందుకు ఎంత కాలావధి అవసరం వంటివి సూచిస్తూ ఒక ప్రణాళికను రూపొందిస్తుంది.
పూర్వ రంగం :
భారతదేశ ప్రధాన మంత్రి 2015, ఆగస్టులో యుఎఇలో పర్యటించినప్పుడు, ఇండియా – యుఎఇ జాయింట్ కమిషన్ ఫర్ ఎకనామిక్ అండ్ టెక్నికల్ కో-ఆపరేషన్ 11వ సమావేశం న్యూఢిల్లీలో 2015 సెప్టెంబర్‌లో జరిగినప్పుడు భారతదేశం మరియు యుఎఇల మధ్య అంతరిక్ష రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆ తరువాత యు ఎ ఇ ఎస్ ఎ ప్రతినిధి బృందం 2015 సెప్టెంబర్ 16న ఇస్రోలో సాంకేతిక సదుపాయాలను సందర్శించి, ఒక ఎమ్ ఒ యు ను కుదుర్చుకోవడంతో సహా అంతరిక్ష సహకారానికి సంబంధించిన అవకాశాలను వినియోగంచుకోవడంపై చర్చలు జరిపింది. దానికి అనుగుణంగానే ఇస్రో, యు ఎ ఇ ఎస్ ఎ లు శాంతియుత ప్రయోజనాల కోసం రోదసి కి సంబంధించిన సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకునే పద్ధతులను విస్తరించుకోవాలని 2016 ఫిబ్రవరి 11న ఒక ఎమ్ ఒ యు పైన సంతకాలు చేశాయి.