Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌తదేశం లో పోర్చుగ‌ల్ ప్ర‌ధాని ఆధికారిక ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప‌త్రికా ప్ర‌క‌ట‌న (జ‌న‌వ‌రి 07, 2017)

భార‌తదేశం లో పోర్చుగ‌ల్ ప్ర‌ధాని ఆధికారిక ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప‌త్రికా ప్ర‌క‌ట‌న (జ‌న‌వ‌రి 07, 2017)

భార‌తదేశం లో పోర్చుగ‌ల్ ప్ర‌ధాని ఆధికారిక ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప‌త్రికా ప్ర‌క‌ట‌న (జ‌న‌వ‌రి 07, 2017)


విశిష్టుడైన ప్ర‌ధాని శ్రీ ఏంటోనియో కోస్టా,
మీడియా ప్ర‌ముఖులు,
మిత్రులారా,
మీ అంద‌రికీ ఈ సాయంత్ర వేళ శుభాభినంద‌న‌లు.

విశిష్ట మ‌హోద‌యా,

మీకు, మీ ప్ర‌తినిధివ‌ర్గం స‌భ్యుల‌కు భార‌తదేశానికి స్వాగ‌తం ప‌ల‌క‌డం నాకు గొప్ప సంతోషాన్నిస్తోంది. ఇది భార‌త్ కు మీ తొలి ఆధికారిక ప‌ర్య‌ట‌న కావ‌చ్చు గాని, భార‌త‌దేశానికి మీరు కొత్త వ్య‌క్తి కానే కాదు. అలాగే భార‌తదేశం కూడా మీకు తెలియ‌ని దేశం కాదు. చ‌లిగాలుల‌తో కూడిన ఈ సాయంత్ర వేళ‌లో మీకు హార్దిక‌ స్వాగ‌తం ప‌లుకుతున్నాను. తిరిగి స్వాగతం అని నేను చెప్పాలి. బెంగళూరులో జ‌రుగుతున్న ప్రవాసీ భార‌తీయ దివ‌స్ కు అతిథిగా మీకు పంపిన ఆహ్వానాన్ని ఆమోదించ‌డం మాకు చాలా గౌర‌వ‌ప్రదం. భార‌తదేశం లోనే కుటుంబ మూలాలు గల విశిష్ట నాయ‌కునిగా మీరు సాధించిన విజ‌యాలను రేపు పండుగగా జరుపుకోవడం మాకు ప్ర‌త్యేక గౌర‌వం. ప్ర‌ధానిగా మీ నాయ‌క‌త్వంలో పోర్చుగ‌ల్ సాధించిన ప‌లు విజ‌యాల‌కుగాను నేను అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నాను. మీ నాయ‌క‌త్వంలో పోర్చుగీస్ ఆర్థిక వ్య‌వ‌స్థ స‌రైన దిశ‌లో నిల‌క‌డ‌గా ముందుకు సాగుతోంది.

మిత్రులారా,

భార‌త‌దేశం, పోర్చుగ‌ల్ లు ఉమ్మ‌డి చారిత్ర‌క అనుసంధానం పునాదుల‌పై ఆధునిక ద్వైపాక్షిక బంధాన్నినిర్మించుకొన్నాయి. ఐక్య‌ రాజ్య‌ స‌మితితో స‌హా ప‌లు ప్ర‌పంచ స‌మ‌స్య‌ల‌పై బ‌ల‌మైన ఏకీభావం మ‌న భాగ‌స్వామ్యంలో బ‌లం.

ప్ర‌ధాని శ్రీ కోస్టాతో ఈ రోజు నేను జ‌రిపిన విస్తృత చ‌ర్చ‌లలో వివిధ రంగాలలో భార‌త‌- పోర్చుగ‌ల్ సంబంధాల‌పై పూర్తి స్థాయిలో స‌మీక్షించాం. ఉభ‌య దేశాల‌ భాగ‌స్వామ్యంలోని ఆర్థిక‌ప‌ర‌మైన అవ‌కాశాల‌ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు కార్యాచ‌ర‌ణ ఆధారిత చ‌ర్య‌ల‌పై దృష్టి సారించాల‌ని ఉభ‌యులం అంగీకారానికి వ‌చ్చాం. ఆ దిశ‌గా మా ఉమ్మ‌డి తీర్మానానికి సంకేత‌మే ఈ రోజు సంత‌కాలు పూర్తి అయిన ఒప్పందాలు.

మిత్రులారా,

ఉభ‌య దేశాల మ‌ధ్య వాణిజ్య‌, వ్యాపార‌, పెట్టుబ‌డి భాగ‌స్వామ్యాల‌ను మ‌రింత లోతుగా, మ‌రింత విస్తారంగా పెంచుకోవ‌డం మా ఉమ్మ‌డి ప్రాధాన్య‌ం. మౌలిక వ‌స‌తులు, వ్య‌ర్థాలు, వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, సౌర‌ విద్యుత్తు, ప‌వ‌న విద్యుత్తు, న‌వ‌క‌ల్ప‌న‌ లు ఉభ‌య దేశాల మ‌ధ్య బ‌లీయ‌మైన వాణిజ్య బంధానికి పూర్తి స్థాయి అవ‌కాశాలు ఉన్న రంగాలు. స్టార్ట్- అప్ ల‌కు అనుకూల‌మైన వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డంలో మా అనుభ‌వం ఈ ద్వైపాక్షిక ఒప్పందంలో ఆస‌క్తిక‌ర‌మైన అంశం. ఇది మ‌న ఉభ‌య దేశాల యువ వ్యాపార‌వేత్తలు, యువ పారిశ్రామిక‌వేత్త‌లు లాభ‌దాయ‌క‌మైన భాగ‌స్వామ్యాలు ఏర్పాటు చేసుకొనేందుకు, రెండు స‌మాజాల‌కు విలువ‌, సంప‌ద స‌మ‌కూర్చేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. ‘స్టార్ట్- అప్ పోర్చుగ‌ల్’, ‘స్టార్ట్- అప్ ఇండియా’ ల మ‌ధ్య కుదిరిన ఈ భాగ‌స్వామ్యం న‌వ‌క‌ల్ప‌న‌లు, పురోగ‌తిలో ముందుకు సాగాల‌న్న ఉభ‌యుల కోరిక సాకారం కావ‌డానికి స‌హాయ‌కారిగా నిలుస్తుంద‌న్న న‌మ్మ‌కం నాకుంది. ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త రంగాలలో కూడా భాగ‌స్వామ్యం మ‌రింత లోతుగా విస్త‌రించుకోవాల‌ని ప్ర‌ధాని శ్రీ కోస్టా, నేను అంగీకారానికి వ‌చ్చాం. ఈ రోజు సంత‌కాలు జరిగిన ర‌క్ష‌ణ శాఖ‌లో స‌హ‌కారానికి సంబంధించిన‌ అవ‌గాహ‌న పూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) ప‌ర‌స్ప‌రం లాభ‌దాయ‌క‌మైన రీతిలో ఉభ‌యుల‌కు గ‌ల బ‌లాల‌ను క్రోడీక‌రించుకోవ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది. ద్వైపాక్షిక సంబంధాల‌కు మ‌రింత భ‌రోసాను ఇచ్చే మ‌రో రంగం క్రీడ‌లు. విశిష్ట మ‌హోద‌యా, మీకు సాక‌ర్ అత్యంత అభిమాన‌పాత్ర‌మైన క్రీడ అన్న విష‌యం మాకు తెలుసు. ఫుట్ బాల్ లో పోర్చుగ‌ల్ కు గ‌ల ఈ బ‌లం, భార‌తదేశం లో ఈ క్రీడ త్వ‌రిత‌గ‌తిన అభివృద్ధి చెందుతూ ఉండ‌డం.. క్రీడారంగంలో మ‌న భాగ‌స్వామ్యానికి మూలంగా నిలువగలుగుతుంది.

మిత్రులారా,

ప‌లు అంత‌ర్జాతీయ అంశాలలో భార‌తదేశం, పోర్చుగ‌ల్ లు ఒకే ర‌క‌మైన ఉమ్మ‌డి అభిప్రాయాలను క‌లిగివున్నాయి. ఐక్య‌ రాజ్య‌ స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌తదేశం శాశ్వ‌త స‌భ్య‌త్వం కోసం నిరంత‌రం గ‌ట్టి మ‌ద్ద‌తు ఇస్తున్నందుకు  ప్ర‌ధాని శ్రీ కోస్టాకు నేను ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను. అలాగే క్షిప‌ణి సాంకేతిక ప‌రిజ్ఞానం అదుపు వ్య‌వ‌స్థ‌ లోను, పరమాణు స‌ర‌ఫ‌రాదారుల బృందం లోను భార‌త స‌భ్య‌త్వం కోసం ఎడ‌తెగ‌ని మ‌ద్ద‌తు ఇస్తున్నందుకు పోర్చుగ‌ల్ కు మేం హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేస్తున్నాం. నానాటికీ పెరిగిపోతున్న హింసాత్మక, ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌ను నిలువ‌రించేందుకు అంత‌ర్జాతీయ స‌మాజం స‌త్వ‌రం ప‌టిష్ఠ‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రంపై కూడా మేం చ‌ర్చించాం.

విశిష్ట మ‌హోద‌యా,

భార‌త‌దేశం, పోర్చుగ‌ల్ లు రెండింటికీ ఉమ్మ‌డి సాంస్కృతిక నేప‌థ్యం ఉంది. మీ తండ్రి గారు శ్రీ ఆర్లాండో కోస్టా ఈ రంగానికి, గోవా, భార‌త‌- పోర్చుగీస్ సాహిత్యానికి  చేసిన సేవ‌ల‌ను మేం ప్ర‌శంసిస్తున్నాం. ఈ రోజు మ‌నం రెండు నాట్య‌ రీతుల‌కు సంబంధించిన స్మార‌క త‌పాలా బిళ్ళ‌లను విడుద‌ల చేశాం. ఒక‌టి పోర్చుగీసుకు, మ‌రొక‌టి భార‌త్ కు చెందిన ఈ నాట్య‌ రీతులు మ‌న సాంస్కృతిక బంధానికి అద్భుత‌మైన ఉదాహ‌ర‌ణ‌లు.

విశిష్ట మ‌హోద‌యా,

రానున్న రెండు రోజులలో మీరు భార‌తదేశం లో పలు ప్రాంతాలు సంద‌ర్శించి ప‌లు కార్య‌క్ర‌మాలలో పాలుపంచుకోబోతున్నారు. బెంగ‌ళూరు, గుజ‌రాత్, గోవా సంద‌ర్శ‌న‌లు మీకు, మీ ప్ర‌తినిధి వ‌ర్గానికి అద్భుత‌మైన అనుభూతిని అందించాల‌ని నేను ఆకాంక్షిస్తున్నాను. మీ గోవా సంద‌ర్శ‌న చిర‌కాలం గుర్తుండిపోయేది కావాల‌ని, మీ పూర్వికుల‌తో మిమ్మ‌ల్ని తిరిగి క‌లిపేదిగా నిల‌వాల‌ని నేను ప్ర‌త్యేకంగా ఆకాంక్షిస్తున్నాను.

ధ‌న్య‌వాదాలు.
మీకు మ‌రీ మరీ ధ‌న్య‌వాదాలు.

***