భారతదేశం, ఫిజి ల మధ్య కొత్త విమాన సర్వీసుల ఒప్పందం (ఎ ఎస్ ఎ)పై సంతకాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
రెండు దేశాల మధ్య ఇప్పటికే అమలులో ఉన్న ఒప్పందంపై 1974 జనవరి 28 నాడు సంతకాలు జరగగా, దానిని నవీకరించవలసిన అవసరం ఏర్పడింది. పౌర విమానయాన రంగంలో తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, రెండు దేశాల మధ్య వైమానిక అనుసంధానాన్ని మెరుగుపరచే ధ్యేయంతో ఐసిఎఒ తాజా మూల పత్రానికి అనుగుణంగా ప్రస్తుత ఒప్పందాన్ని నవీకరించారు.
న్యాయం మరియు చట్టం మంత్రిత్వ వాఖ (న్యాయ సంబంధి వ్యవహారాల విభాగం), ఆర్థిక శాఖ (ఆర్థిక వ్యవహారాల విభాగం/రెవెన్యూ విభాగం), విదేశీ వ్యవహారాల శాఖ, వాణిజ్య విభాగం, పర్యటన మంత్రిత్వ శాఖలను సంప్రదించి ఏర్ సర్వీసెస్ అగ్రిమెంట్ ముసాయిదా ప్రతిని ఖరారు చేశారు.
ఏర్ సర్వీసెస్ అగ్రిమెంట్ ప్రధానాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
అ) ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ విమానయాన సంస్థలను రెండు దేశాలూ ఎంపిక చేయవచ్చు.
ఆ) ఈ ఒప్పందాల ఆధారంగా ఎంపిక చేసిన రెండు దేశాల విమాన సేవల సంస్థలు వైమానిక సేవల విక్రయం కోసం వాటి కార్యాలయాలను ఇతర దేశపు భూభాగంలో ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇ) రెండు దేశాలూ ఎంపిక చేసిన విమానయాన సంస్థలు వాటి మధ్య కుదిరిన అంగీకారానికి అనుగుణంగా నిర్దిష్ట మార్గాలలో విమానయాన సేవలందించేందుకు పారదర్శకమైన, సమాన అవకాశాలను కలిగి ఉంటాయి. ఈ మార్గాలను, విమాన రాకపోకల సంఖ్యను తరువాత నిర్ణయించనున్నారు.
ఈ) ఎంపిక చేసిన విమానయాన సంస్థ అంగీకరించిన సేవలకు హేతుబద్ధ స్థాయిలో వాణిజ్య అంశాల ప్రాతిపదికగా ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛను కలిగి ఉంటుంది.
ఉ) ప్రతిపాదిత విమానయాన సేవల సంస్థలు తమలో తాము లేదా ఇతరులతో లేదా మూడో పక్షంతో సహకార వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకోవచ్చు.
ఊ) వీటితో పాటు నిర్వహణ అనుమతి రద్దు లేదా తాత్కాలిక నిలిపివేత నిబంధనలను విమాన సర్వీసుల ఒప్పందం (ఎ ఎస్ ఎ)లో పొందుపరిచారు. అలాగే అంగీకరించిన సేవల నిర్వహణ, వ్యాపార అవకాశాల మార్గదర్శకాలను; రక్షణకు, భద్రతకు సంబంధించిన నిబంధనలను భారత విమాన సర్వీసుల ఒప్పందానికి అనుగుణంగా చేర్చారు.
ఎ) విమానయాన సేవల ఒప్పందానికి అనుబంధంగా ఉన్న ప్రస్తుత మార్గానుసూచి ని కూడా నవీకరించారు. మరింత మెరుగైన అనుసంధానం కోసం కొత్త విమానాశ్రయాలను చేర్చారు.
దీనివల్ల భారత విమానయాన సంస్థలు భారతదేశంలోని ఏ ప్రాంతం నుండి అయినా ఫిజీ లోని ఏ విమానాశ్రయానికైనా విమానాలను నడపవచ్చు. అయితే, ఫిజీ విమానాలు మాత్రం నేరుగా ఢిల్లీ, ముంబై, చెన్నైలతో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించుకునే వీలుంటుంది. అటుపైన భారత విమానయాన సంస్థలతో భాగస్వామ్యం ద్వారా బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్ లకు సేవలను కొనసాగించవచ్చు. అంతేకాకుండా కోచి, వారణాసి, అహ్మదాబాద్, అమృత్ సర్ లకూ దేశీయ కార్యకలాపాల భాగస్వామ్యంతో సర్వీసులను కొనసాగించవచ్చు.
***