ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం భారతదేశం, నెదర్లాండ్స్ మధ్య గల ద్వైపాక్షిక సామాజిక భద్రత ఒప్పందం (ఎస్ఎస్ఎ)లో “నివాస దేశం” సూత్రాన్ని చేరుస్తూ చేసిన ఆ ఒప్పందంలో చేసిన సవరణకు ఆమోదం తెలిపింది.
సవరించిన ఎస్ఎస్ఎ ను గురించి భారతదేశ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా నెదర్లాండ్స్‌కు తెలియజేసిన తేదీ తరువాత మూడో నెల నుండి అమలులోకి వస్తుంది. దీని వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. అంతేగాక రెండు దేశాల్లో విదేశీ కార్యకలాపాల వ్యయాన్ని తగ్గించడం ద్వారా వ్యాపార సౌలభ్యానికి వెసులుబాటు కల్పించి భారత, డచ్ కంపెనీల లాభదాయకత, స్పర్థాత్మక స్థితిపై సానుకూల ప్రభావం చూపుతుంది. రెండు దేశాల మధ్య పెట్టుబడుల ప్రవాహానికి కూడా ఈ సామాజిక భద్రత ఒప్పందం ప్రోత్సాహమిస్తుంది.
ఈ సామాజిక భద్రత ఒప్పందం 2010 జూన్ నుండి విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో, నెదర్లాండ్స్‌లో పనిచేస్తున్న భారతీయులకు ఎన్నో విధాల లబ్ధి చేకూరింది.
• ఐరోపా సమాఖ్య వెలుపలి నుంచి సామాజిక భద్రత ప్రయోజనాల ఎగుమతిపై 2013 జనవరి 1 నుంచి నెదర్లాండ్స్ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.
• కొత్త సామాజిక భద్రత చట్టం (నివాస దేశం సవరణతో) ప్రకారం లబ్ధి మొత్తం లేదా అర్హులైన లబ్ధిదారు (డచ్ దేశస్థుడు)కు చెల్లింపు భత్యం అతడు ప్రస్తుతం నివసిస్తున్న దేశంలోని జీవన వ్యయానికి తగినట్లు సర్దుబాటు చేయబడుతుంది.
• డచ్ దేశపు కొత్త చట్టం ప్రకారం సామాజిక భద్రత లబ్ధి ఎగుమతి లేదా బట్వాడా మొత్తాన్ని ఆతిథ్య (డచ్ దేశస్థుడు నివసించే) దేశం జీవన వ్యయానికి అనుగుణంగా (ప్రపంచ బ్యాంకు గణాంకాలను ప్రతిబింబించేలా) నమోదు చేస్తారు.
• డచ్ దేశపు కొత్త చట్టం సాధారణ పరిస్థితులలో నెదర్లాండ్స్‌లో పనిచేస్తున్న భారతీయ కార్మికులకు వర్తించదు. ప్రస్తుత భారత- నెదర్లాండ్స్ సామాజిక భద్రత ఒప్పందం ప్రకారమే వారు లబ్ధి పొందుతారు. ఎందుకంటే, ఏవో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప అది ఐరోపా సమాఖ్య వెలుపల నివసిస్తున్న డచ్ దేశస్థులకు మాత్రమే పరిమితం.
• అయితే, “నివాస దేశం” సూత్రం భారతీయులకు అనువర్తించే అవకాశాలు చాలా స్వల్పం. అవి ఏమిటంటే:
§ భారతీయ కార్మికుడు నెదర్లాండ్స్‌లో మరణించి, అతని భార్య/పిల్లలు భారతదేశంలో నివసిస్తున్నప్పుడు
§ భారతీయ కార్మికుడు నెదర్లాండ్స్‌లో పనిచేస్తుండగా అంగ వైకల్యానికి గురై స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు
నెదర్లాండ్స్ కొత్త సామాజిక భద్రత చట్టాన్ని అమలులోకి తెచ్చిన నేపథ్యంలో తమ జాతీయ చట్ట విధివిధానాల మేరకు రెండు దేశాల మధ్య గల సంబంధిత ఒప్పందాన్ని సవరించాల్సివున్నందున అందుకు అంగీకరించాల్సిందిగా నెదర్లాండ్స్ విజ్ఞప్తి చేసింది. ఈ మార్పునకు అనుగుణంగా ప్రస్తుతం ఆ ఒప్పందంలో సవరణ చేశారు.
పూర్వరంగం
• భారతదేశం, నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సామాజిక భద్రత ఒప్పందం (ఎస్ఎస్ఎ)పై 2009 అక్టోబరు 22న సంతకాలు చేయగా, 2010 జూన్ 15 నుంచి అది అమలులోకి వచ్చింది.
• రెండు దేశాల అధికార పరిధిలో రెండు వైపులా వాటా సమకూర్చడం నుండి ఈ ఒప్పందం మినహాయింపునిస్తుంది. పోగుపడిన సామాజిక భద్రత లబ్ధిని రెండు దేశాల అధికారపరిధి మధ్య (స్వయం ఉపాధిలో ఉన్న వారు సహా) ఎగుమతి చేయడానికి, సేవా కాలాలను సమీకృతం చేయడానికి వీలు కల్పిస్తుంది.
• నెదర్లాండ్స్‌లో 2013 జనవరి 1 నుండి కొత్త సామాజిక భద్రత చట్టం అమలులోకి వచ్చింది. అప్పటి నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేసే కొన్ని సామాజిక భద్రత ప్రయోజనాలకు “నివాస దేశం” సూత్రాన్ని వర్తింపజేయడం ప్రారంభించింది.
• నెదర్లాండ్స్‌కు వెలుపల నివసించే డచ్ దేశస్థులు సామాజిక భద్రత ప్రయోజనాలను ఎగుమతి చేయడంలో సమానత్వం తెచ్చేందుకు వీలు కల్పించడమే ఈ సూత్రం లక్ష్యం.
• 18 దేశాలతో భారతదేశం ద్వైపాక్షిక సామాజిక భద్రత ఒప్పందాలు కుదుర్చుకొని అమలు చేస్తోంది. ఈ దేశాలలో ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, హంగరి, జపాన్, లగ్జెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, స్వీడన్, స్విట్జర్ లాండ్, దక్షిణ కొరియా ఉన్నాయి.