భారతదేశం, జార్జియా ల మధ్య విమాన సేవల ఒప్పందం (ఎఎస్ఎ)పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం పౌర విమానయాన రంగంలో పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసిఎఒ) తాజా నిర్దేశాల ఆధారంగా ఏర్పడింది. ఈ రెండు దేశాల మధ్య గగనతల అనుసంధానాన్ని మెరుగుపరచడం దీని ఉద్దేశం. ప్రస్తుతానికి ఈ రెండు దేశాల మధ్య విమాన సేవల ఒప్పందమేదీ లేదు. ఏవైనా రెండు దేశాల మధ్య విమానయాన కార్యకలాపాలు సాగాలంటే విమానయాన సేవల ఒప్పందమనే చట్టబద్ధ చట్రం ఉండడం అవసరం.
రెండు దేశాల నడుమ గగనతల అనుసంధానాన్ని ఏర్పరచడంలో తాజా ఒప్పందం తోడ్పడుతుంది.
ఈ విమాన సేవల ఒప్పందంలోని ప్రధానాంశాలు కింది విధంగా ఉంటాయి:
అ) ఒకటి లేదా అంతకు మించి విమానయాన సంస్థలను ప్రకటించే ఇచ్చే హక్కు రెండు దేశాలకూ ఉంటుంది.
ఆ) భారతదేశ విమానయాన సంస్థలు ఇకపై దేశంలోని ఏ ప్రాంతం నుంచయినా జార్జియాలోని ఏ ప్రాంతానికైనా విమానాలను నడపవచ్చు. అయితే, జార్జియాకు చెందిన విమానయాన సంస్థలు భారతదేశంలోని ఆరు నగరాల… న్యూ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, గోవా విమానాశ్రయాలతో మాత్రమే ప్రత్యక్ష కార్యకలాపాలు నిర్వహించాలి. దీంతోపాటు గమ్యస్థానం అనంతర లేదా మధ్యంతర స్థానానికి మార్గం మార్చుకునే వెసులుబాటు రెండు పక్షాల విమానయాన సంస్థలకూ ఉంటుంది.
ఇ) విమానయాన సేవల విక్రయం, ప్రోత్సాహం కోసం రెండు దేశాలూ అనుమతించిన విమానయాన సంస్థలు ఆయా దేశాలలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉంటుంది.
ఈ) రెండు దేశాల్లోనూ అనుమతి పొందిన విమానయాన సంస్థలు పరస్పరం లేదా మూడో పక్ష (దేశం) సంస్థలతో సహకార మార్కెటింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. దీంతో భారతదేశానికి, జార్జియా కు మధ్య పరస్పర ప్రత్యక్ష అనుసంధానంతో పాటు మూడో దేశపు విమానయాన సంస్థల విమానాల ద్వారా కూడా గగనతల సంధానానికి వీలు కలుగుతుంది. రెండు దేశాల విమానయాన సంస్థలకు ఇది లాభసాటి ఎంపికలకు వీలు కల్పిస్తుంది.
ఈ విమానయాన సేవల ఒప్పందంతో భారతదేశంలో, జార్జియాలో పౌర విమానయాన రంగం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటక రంగాల పరంగా కార్యకలాపాలు మరింత జోరందుకుంటాయి. అలాగే రెండు దేశాల ప్రజల మధ్య ఆరోగ్యకరమైన సాంస్కృతిక ఆదాన ప్రదానాలు సాగుతాయి. దీనివల్ల నిరంతర అనుసంధానానికి తగిన పరిస్థితులు మెరుగుపడతాయి. దాంతోపాటు రెండు పక్షాల విమానయాన సంస్థల రక్షణ, భద్రతలకు పూర్తి హామీతో వాణిజ్యపరమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.