Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త 18వ లోక్‌స‌భ‌ ఎన్నికలలో విజయంపై ప్ర‌ధానమంత్రికి ప్రపంచ నేతల అభినందనలు


   భార‌త 18వ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో విజ‌యంపై ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నాయకులు అభినందనలు తెలిపారు. వారందరి శుభాకాంక్షల సందేశాలపై సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా శ్రీ మోదీ ధన్యవాదాలు తెలుపుతూ బదులిచ్చారు.

   ఈ మేరకు గణతంత్ర మాల్దీవ్స్ ప్రధాని గౌరవనీయ ప్రవింద్ కుమార్ జుగనాథ్ పోస్ట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

   ‘‘గౌరవనీయ ప్రవింద్ కుమార్ జుగనాథ్ గారూ! మీ హృదయపూర్వక అభినందన సందేశానికి నా ధన్యవాదాలు. మా ‘పొరుగుదేశాలకు ప్రాధాన్య విధానం’, ‘విజన్ సాగర్’లతోపాటు దక్షిణార్థ గోళ దేశాలపై మన నిబద్ధతల నడుమ మారిషస్ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే మన ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా మీతో సంయుక్త కృషికి నేను సదా సిద్ధంగా ఉంటాను’’ అని ప్రధానమంత్రి బదులిచ్చారు.

   అలాగే భూటాన్ ప్రధానమంత్రి మాననీయ షెరింగ్ టొబగే పోస్టుకు బదులిస్తూ:

   ‘‘హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన నా మిత్రులు మాననీయ ప్రధాని షెరింగ్ టోబగే గారికి  ధన్యవాదాలు. భారత్-భూటాన్ సంబంధాలు నానాటికీ విస్తరిస్తూ మరింత బలోపేతం కాగలవన్నది నా దృఢ విశ్వాసం’’ అని పేర్కొన్నారు.

   నేపాల్ ప్రధానమంత్రి కామ్రేడ్ ప్రచండ పోస్టుపై స్పందిస్తూ- ప్రధానమంత్రి ఇలా అన్నారు:

   ‘‘ప్రధానమంత్రి కామ్రేడ్ ప్రచండ గారూ… మీ శుభాకాంక్షలకు నా మన:పూర్వక ధన్యవాదాలు. భారత్‌-నేపాల్‌ దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతమయ్యే దిశగా మన సహకారం విస్తరించగలదని భావిస్తున్నాను’’ అని ఆశాభావం వెలిబుచ్చారు.

   శ్రీలంక ప్రధానమంత్రి గౌరవనీయ రణిల్ విక్రమసింఘే పోస్టుకు సమాధానమిస్తూ:

   ‘‘ధన్యవాదాలు గౌరవనీయ రణిల్ విక్రమసింఘే గారూ! భారత్-శ్రీలంక ఆర్థిక భాగస్వామ్యంపై మన రెండు దేశాల మధ్య నిరంతర సహకారం దిశగా కృషికి నేను సదా సిద్ధంగా ఉంటాను’’ అని పేర్కొన్నారు.

   అలాగే శ్రీలంక కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ మహింద రాజపక్ష పోస్టుపై ప్రతిస్పందిస్తూ-

   ‘‘నా మిత్రులైన మహింద రాజపక్ష గారూ! మీ శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు. భారత-శ్రీలంక భాగస్వామ్యం కొత్త శిఖిరాలకు చేరుతున్న నేపథ్యంలో మీ నిరంతర మద్దతును ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

   శ్రీలంక ఫీల్డ్ మార్షల్ శ్రీ శరత్ ఫోన్సెకా పోస్టుకు ప్రతిస్పందనగా ప్రధానమంత్రి ఇలా అన్నారు:

   ‘‘ధన్యవాదాలు శరత్ ఫోన్సెకా గారూ! శ్రీలంకతో మా సంబంధాలు ఎంతో ప్రత్యేకం. శ్రీలంక ప్రగతికి, బలోపేతానికి అక్కడి పౌరులతో మా సంయుక్త కృషికి మేం సదా సిద్ధంగా ఉంటాం’’ అని పేర్కొన్నారు.

   శ్రీలంక ప్రతిపక్ష నేత శ్రీ సజిత్ ప్రేమదాస పోస్టుకు బదులిస్తూ ప్రధానమంత్రి ఇలా అన్నారు:

   ‘‘మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు సజిత్ ప్రేమదాస గారూ! శ్రీలంకతో మా సంబంధాలు ప్రత్యేకమైనవి మాత్రమేగాక సాదర సౌభ్రాత్ర భావనతో సాగుతుంటాయి. మేము అనుసరిస్తున్న ‘పొరుగుదేశాలకు ప్రాధాన్య విధానా’నికి అనుగుణంగా మన అవినాభావ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం!’’ అని పేర్కొన్నారు.

   ఇటలీ ప్రధానమంత్రి శ్రీమతి జార్జియా మెలోని పోస్టుకు ప్రత్యుత్తరమిస్తూ:

   ‘‘ప్రధానమంత్రి జార్జియా మెలోని గారూ! మీ శుభాకాంక్షలకు నా హృదయపూర్వ ధన్యవాదాలు. మన ఉమ్మడి విలువలు, పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా భారత-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై  మేం కట్టుబడి ఉన్నాం. అలాగే ప్రపంచ శ్రేయస్సు కోసం సంయుక్త కృషికి సదా సిద్ధంగా ఉంటాం’’ అని పేర్కొన్నారు.

   మాల్దీవ్స్ అధ్యక్షులు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జూ పోస్ట్‌పై స్పందిస్తూ:

   ‘‘ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జూ గారూ! ధన్యవాదాలు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాల్దీవ్స్ మా పొరుగు దేశం మాత్రమేగాక ఎంతో విలువైన భాగస్వామి. మన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా మీతో సన్నిహిత సహకారం కోసం నేను ఎదురుచూస్తున్నాను’’ అని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

   మాల్దీవ్స్ ఉపాధ్యక్షులు గౌరవనీయ హుసేన్ మొహమ్మద్ లతీఫ్ పోస్టుకు జవాబిస్తూ:

   ‘‘ఉపాధ్యక్షులు సెంబే గారూ! మీ శుభాకాంక్షల సందేశానికి నా ధన్యవాదాలు. మన ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత విస్తరించే దిశగా సంయుక్త కృషిని కొనసాగిద్దాం’’ అని పేర్కొన్నారు.

   మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ నషీద్ పోస్టుపై స్పందిస్తూ:

   ‘‘మొహమ్మద్ నషీద్ గారూ! మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. భారత-మాల్దీవ్స్ మధ్య సంబంధాల విస్తరణలో మీ నిరంతర మద్దతు ఎంతో విలువైనదని మేం భావిస్తాం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

   మాల్దీవ్స్ రాజకీయవేత్త, ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ మాజీ అధ్యక్షుడు గౌరవనీయ అబ్దుల్లా షాహిద్ పోస్టుకు బదులిస్తూ-

   ‘‘అబ్దుల్లా షాహిద్ గారూ! మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు. మాల్దీవ్స్‌తో  మా బంధం కొత్త శిఖరాలను చేరగలదన్న మీ ఆకాంక్షతో మేం ఏకీభవిస్తున్నాం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

   జమైకా ప్రధానమంత్రి గౌరవనీయ ఆండ్రూ హోల్నెస్ పోస్టుకు ప్రతిస్పందనగా- ప్రధానమంత్రి ఇలా అన్నారు:

   ‘‘ప్రధానమంత్రి ఆండ్రూ హోల్‌నెస్‌కి ధన్యవాదాలు. భారత-జమైకాల ప్రజల మధ్య సౌహార్దతతో శతాబ్దాలుగా మన సంబంధాలు కొనసాగుతున్నాయి. రెండు దేశాల ప్రజల సంక్షేమం దిశగా మీతో  సంయుక్త కృషికి నేను సదా సిద్ధం’’ అని పేర్కొన్నారు.

   బార్బడోస్ ప్రధానమంత్రి శ్రీమతి మియా అమోర్ మోట్లీ పోస్టుకు బదులిస్తూ:

   ‘‘ప్రధానమంత్రి మియా అమోర్ మోట్లీ గారికి నా ధన్యవాదాలు. మన రెండు దేశాల ప్రజా సంక్షేమం కోసం భారత-బార్బడోస్ బలమైన భాగస్వామ్యం దిశగా మీతో సంయుక్త కృషికి నేను సదా సంసిద్ధుడనై ఉంటాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***