Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత-స్వీడన్‌ వాస్తవిక సాదృశ సదస్సులో ప్రధాని ప్రారంభోపన్యాసం

భారత-స్వీడన్‌ వాస్తవిక సాదృశ సదస్సులో ప్రధాని ప్రారంభోపన్యాసం


 

హాశయా… నమస్కారం!

ముందుగా కోవిడ్‌-19 కారణంగా స్వీడన్‌లో సంభవించిన ప్రాణనష్టానికి భారతదేశం తరఫున నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. అలాగే మొన్న స్వీడన్‌లో చోటు చేసుకున్న హింసాత్మక దాడులపై భారత పౌరుల తరఫున సంఘీభావం ప్రకటిస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడిన వారందరూ సత్వరం కోలుకోవాలని మేమంతా ప్రార్థిస్తున్నాం.

మహాశయా…

   భారత-నార్డిక్‌ తొలి శిఖరాగ్ర సదస్సును స్వీడన్‌ 2018లో నిర్వహించింది. ఆ సందర్భంగా నాకు స్టాక్‌హోమ్‌ను సందర్శించే వీలు కలిగింది. అదేవిధంగా త్వరలో జరగబోయే భారత-నార్డిక్‌ రెండో శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాను. ఇక గౌరవనీయులైన స్వీడన్‌ రాజదంపతులు 2019లో భారత పర్యటనకు రావడం మాకు దక్కిన గొప్ప గౌరవం. ఆ సమయంలో అనేక అంశాలపై వారితో నేను ఫలవంతమైన చర్చల్లో పాల్గొన్నాను. ఈ చర్చల్లో భాగంగా విద్యుత్‌ ప్లాంట్లలో వినియోగం కోసం పంట దుబ్బును దిమ్మలుగా మార్చే అంశంపై గౌరవనీయులైన రాజుగారు నేను సమీక్షించడం నాకు నేటికీ స్పష్టంగా జ్ఞాపకముంది. దీనికి సంబంధించిన ప్రయోగాత్మక కర్మాగారం చక్కగా పనిచేస్తున్నదని తెలిస్తే మీరంతా ఎంతో సంతోషిస్తారు. ఇప్పుడు మనం జీవద్రవ్యాల నుంచి బొగ్గు తయారీకి ఆ కర్మాగారాన్ని వినియోగించుకుంటూ ఉత్పాదనను విస్తృతం చేసే వీలుంది.

మహాశయా…

   కోవిడ్‌-19 సమయంలో ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయులలో సహకారం ప్రాముఖ్యాన్ని మేం గుర్తించాం. ఆ మేరకు కోవిడ్‌-19 మహమ్మారిపై ప్రపంచ దేశాల పోరాటానికి మద్దతుగా దాదాపు 150 దేశాలకు భారత్‌ మందులు, ఇతర అత్యవసర పరికరాలను అందజేసింది. అంతేకాకుండా ఆన్‌లైన్‌ శిక్షణ కార్యక్రమాల నిర్వహణద్వారా ఆసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల ముందువరుస ఆరోగ్య కార్యకర్తలతో, విధాన నిర్ణేతలతో అనుభవాలను పంచుకున్నాం. ఇక ఇప్పటిదాకా సుమారు 50దేశాలకు ‘భారత్‌ తయారీ’ టీకాలను అందుబాటులోకి తెచ్చాం. రానున్న కాలంలో మరిన్ని దేశాలకు టీకాల సరఫరాకు మేం కట్టుబడి ఉన్నాం.

మహాశయా…

   నేటి ప్రపంచ పరిస్థితుల నడుమ భావ సారూప్యంగల దేశాల మధ్య సమన్వయం, సహకారం, సమష్టి కృషికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, చట్ట నిబద్ధత, స్వేచ్ఛ, న్యాయం వంటి ఉమ్మడి విలువలు మన సంబంధాలను, పరస్పర సహకారాన్ని ఇంకా బలోపేతం చేస్తాయి. మన రెండు దేశాలకూ ప్రాధాన్యంగల వాతావరణ మార్పు సమస్యపై కాబట్టి దీని పరిష్కారానికి మీతో కలసి కృషిచేయాలని మేం భావిస్తున్నాం. భారత సంస్కృతిలో పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో సామరస్య జీవనానికే సదా ప్రాముఖ్యం ఉంటుంది.

   పారిస్‌ సదస్సు ఒప్పందంలో భాగంగా మేమిచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మేం కృతనిశ్చయంతో సాగుతున్నాం. ఈ లక్ష్యాలను సాధించడమేగాక వాటిని అధిగమించేందుకు కృషి చేస్తాం. ఈ నేపథ్యంలో నాటి హామీలను నెరవేర్చే దిశగా జి-20 దేశాల స్థాయిలో భారత్‌ చక్కని ప్రగతి సాధించిందని చెప్పవచ్చు. గత ఐదేళ్లలో మా పునరుపయోగ ఇంధన ఉత్పాదన సామర్థ్యం 162 శాతం పెరిగింది. ఈ క్రమంలో 2030నాటికి పునరుపయోగ ఇంధన సామర్థ్యాన్ని 450 గిగావాట్ల స్థాయికి చేర్చాలని లక్ష్యం నిర్దేశించుకున్నాం. మరోవైపు ‘ఎల్‌ఈడీ’ బల్బుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా మేము 30 మిలియన్‌ టన్నుల బొగ్గుపులుసు వాయు ఉద్గారాన్ని అరికట్టగలిగాం. ఈ పరిస్థితుల మధ్య అంతర్జాతీయ సౌర కూటమిలో చేరాలన్న స్వీడన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అదే తరహాలో త్వరలోనే విపత్తు ప్రతిస్పందక మౌలిక సదుపాయాల సంకీర్ణంలోనూ భాగస్వామి కావాల్సిందిగా స్వీడన్‌ను ఆహ్వానిస్తున్నాం.

మహాశయా…

   కోవిడ్‌ అనంతర స్థిరీకరణ, పునరుద్ధరణలో భారత-స్వీడన్‌ భాగస్వామ్యం ప్రముఖ పాత్ర పోషించగలదు. ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు, అంకుర సంస్థలు, పరిశోధన రంగాల్లో మన సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునే అవకాశాలున్నాయి. అత్యాధునిక నగరాలు, జలశుద్ధి, వ్యర్థాల నిర్వహణ, వర్తుల ఆర్థిక వ్యవస్థ, అత్యాధునిక గ్రిడ్లు, ఈ-రవాణా, డిజిటల్‌ రూపాంతరీకరణ తదితర రంగాల్లోనూ సహకార విస్తృతికి అపార అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి సాదృశ శిఖరాగ్ర సదస్సు మన సహకారానికి కొత్త కోణాలను జోడించగలదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.

మహాశయా…

   స్వీడన్‌ పౌరులతో స్నేహం దిశగా భారత్‌ అద్భుత పయనాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ మీ తొలి పలుకుల కోసం ఆహ్వానం పలుకుతున్నాను.

 

బాధ్యత పరిత్యాగ ప్రకటన: ప్రధానమంత్రి వాస్తవ ప్రసంగం హిందీలో సాగింది. ఇది ఆ ఉపన్యాసానికి సామీప్య అనువాదం.

***