Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత వాతావరణ విభాగం (ఐఎండి)150వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్ర‌ధానమంత్రి ప్ర‌సంగం

భారత వాతావరణ విభాగం (ఐఎండి)150వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్ర‌ధానమంత్రి ప్ర‌సంగం


కేంద్ర మంత్రిమండ‌లిలో నా స‌హ‌చ‌రులు డాక్ట‌ర్ శ్రీ జితేంద్ర సింగ్‌, ‘డబ్ల్యుఎంఒ’ సెక్రటరీ జనరల్ గౌర‌వ‌నీయ ప్రొఫెసర్ సెలెస్టే సౌలో, వివిధ దేశాల నుంచి వచ్చిన అతిథులు, కేంద్ర భూవిజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ శ్రీ ఎం.రవిచంద్రన్‌, ‘ఐఎండి’ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శ్రీ మృత్యుంజయ్ మహాపాత్ర, ఇతర ప్రముఖులు, వివిధ విభాగాలు-సంస్థల శాస్త్రవేత్తలు, అధికారులు, సోదర‌సోద‌రీమణులారా!

   భారత వాతావరణ విభాగం (ఐఎండి) 150వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నేడు మ‌న‌మిక్క‌డ నిర్వ‌హించుకుంటున్నాం. ఈ 150 ఏళ్ల ‘ఐఎండి’ ప్ర‌యాణం దేశంలో ఆధునిక శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాల‌ సగర్వ పురోగమనాన్ని కూడా ప్ర‌తిబింబిస్తుంది. ఒకటిన్నర శతాబ్దాలుగా కోట్లాది భారతీయులకు సేవలందించ‌డ‌మే కాకుండా భారత శాస్త్రవిజ్ఞాన ప్రగతికి ‘ఐఎండి’ ప్రతీకగా నిలిచింది. ఈ విజయాలకు గుర్తుగా ఈ రోజున స్మారక తపాలాబిళ్ల ఆవిష్క‌ర‌ణ‌తోపాటు నాణాన్ని కూడా విడుదల చేశాం. అలాగే భారత్ స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే 2047నాటికి ఈ సంస్థ స్వ‌రూపాన్ని విశదీకరించే ‘ఐఎండి దార్శనిక పత్రం-2047’ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించుకున్నాం. ఇంత‌టి ఉజ్వ‌ల ఘ‌ట్టం నేప‌థ్యంలో మీ అంద‌రితోపాటు దేశ ప్ర‌జ‌లంద‌రికీ నా శుభాకాంక్ష‌లు. ఈ 150 ఏళ్ల ప్రయాణంపై వేడుకలలో యువతరాన్ని మమేకం చేస్తూ జాతీయ వాతావరణ ఒలింపియాడ్‌ను కూడా ‘ఐంఎడి’ నిర్వహించింది. ఇందులో పాలుపంచుకున్న వేలాది విద్యార్థులకు వాతావరణ విజ్ఞానంపై ఆసక్తి ఇనుమడిస్తుంది. ఈ యువ మిత్రులలో కొంద‌రితో సంభాషించే అవకాశం నాకు ఇవాళ లభించింది. అంతేకాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల యువత ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ట్లు అధికారులు నాకు చెప్పారు. ఈ వేడుక‌పై ఆసక్తి చూపినందుకు వారంద‌రికీ నా ప్రత్యేక అభినంద‌న‌లు. వీరితోపాటు ఒలింపియాడ్‌ విజేత‌లైన విద్యార్థుల‌కూ అనేకానేక అభినందనలు.

మిత్రులారా!

  మకర సంక్రాంతి పర్వదినానికి కాస్త అటూఇటూగా 1875 జనవరి 15న ‘ఐఎండి’ ఆవిర్భవించింది. భారత సంప్రదాయంలో మకర సంక్రాంతికిగల ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. గుజరాత్ వాసిగా ఇది నాకూ ఎంతో ఇష్టమైన పండుగ. ఎందుకంటే- మా రాష్ట్ర  ప్రజలంతా మేడపైకి చేరి, రోజంతా గాలిపటాలు ఎగురవేస్తూ ఉల్లాసంగా గడుపుతారు. అక్కడుండగా ఇలా వినోదించడం నాకెంతో ఇష్టంగా ఉండేది. కానీ, నేనిప్పుడు మీ మధ్య ఉన్నాను.

మిత్రులారా!

  ఏ దేశంలోనైనా విజ్ఞాన సంస్థల పురోగమనమే శాస్త్ర విజ్ఞానంపై దానికిగల అవగాహనను ప్రతిబింబిస్తుంది. అయితే, అలాంటి సంస్థలలో పరిశోధన-ఆవిష్కరణలు న‌వ భారతావనికి స్వాభావికం. గడచిన దశాబ్దంలో ‘ఐఎండి’ మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానాల  విస్తరణ అత్యద్భుతం. ఈ మేరకు డాప్లర్ వాతావరణ రాడార్లు, స్వయంచలిత వాతావరణ కేంద్రాలు, రన్‌వే వాతావరణ పర్యవేక్షణ వ్యవస్థలు, జిల్లాలవారీ వర్షపాత పర్యవేక్షణ కేంద్రాల వంటి సదుపాయాల సంఖ్య అనేకరెట్లు పెరగడమేగాక ఉన్నతీకరణ కూడా చేపట్టారు. ఈ విజ్ఞానం పరంగా మనం ఇంతకుముందు ఎక్కడున్నామో… ఇప్పుడెంత ఎదిగామో డాక్టర్ జితేంద్ర సింగ్ గారు గణాంక సహితంగా మీకు వివరించారు. మరోవైపు అంతరిక్ష, డిజిటల్ సాంకేతికతల నుంచి కూడా వాతావరణ విజ్ఞానశాస్త్రం ఎంతో ప్రయోజనం పొందుతోంది. అంటార్కిటికాలో ఇప్పుడు ‘మైత్రి, భారతి’ పేరిట ఈ శాఖకు రెండు వాతావరణ పరిశీలన ప్రయోగశాలలు ఉన్నాయి. గత సంవత్సరమే సూపర్ కంప్యూటర్లు ‘అర్క, అరుణిక”లను ప్రారంభించాం. దీంతో ‘ఐఎండి’ విశ్వసనీయత మరింత పెరిగింది. భవిష్యత్తులో ఎలాంటి వాతావరణ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్‌ సంసిద్ధం కావాలి… భారత్‌ వాతావరణ-స్మార్ట్ దేశంగా మారాలి. అందుకే, ‘మిషన్ మౌసమ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సుస్థిర భవితతోపాటు రానున్న రోజుల్లో దేన్నయినా పరిష్కరించుకోగల సంసిద్ధతపై మన నిబద్ధతకు ఇదొక నిదర్శనం.

మిత్రులారా!

  దేశం ఉన్నత శిఖరాలను చేరడంలో మాత్రమేగాక సామాన్య జనజీవన సౌలభ్యం, జీవన నాణ్యతలను మెరుగుపరచడంలోనూ శాస్త్ర విజ్ఞానానికి ఔచిత్యం ఉంటుంది. ఈ ప్రమాణం పరంగా ప్రతి ఒక్కరికీ కచ్చితమైన వాతావరణ సమాచారం అందించేలా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ‘ఐఎండి’ ఎంతో ముందంజ వేసింది. కాబట్టే ‘అందరికీ ముందస్తు హెచ్చరిక’ కార్యక్రమం ఇప్పుడు జనాభాలో 90 శాతానికిపైగా ప్రజలకు విస్తరించింది. గడచిన-రాబోయే 10 రోజుల వాతావరణ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా నేడు పొందవచ్చు. అంతేగాక వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమంలోనూ అంచనాలు అందుబాటులో ఉంటాయి. అలాగే ‘మేఘదూత్ మొబైల్ యాప్’ ప్రారంభంతో దేశమంతటా అన్ని స్థానిక భాషలలో వాతావరణ సమాచారం లభిస్తోంది. పదేళ్ల కిందట  రైతులు, పశుపోషకులలో 10 శాతం మాత్రమే వాతావరణ సంబంధిత సలహాలను వినియోగించుకోగా ఇప్పుడు 50 శాతానికిపైగా ప్రజలు వాడుకుంటున్నారు. దీన్నిబట్టి ఈ మొబైల్‌ యాప్‌ ప్రభావం స్పష్టమవుతోంది. ఈ రోజున పిడుగుపాటుపై మొబైల్ ఫోన్ల ద్వారా ముందస్తు హెచ్చరికలు కూడా అందుతున్నాయి. గతంలో లక్షలాది మత్స్యకార కుటుంబాలు సముద్రంలో చేపల వేటకు వెళితే వారంతా తిరిగి వచ్చేదాకా అందరూ ఆందోళన పడేవారు. కానీ, నేడు ‘ఐఎండి’ సహకారంతో మత్స్యకారులకూ సకాలంలో హెచ్చరికలు అందుతున్నాయి. ఈ ప్రత్యక్ష సమాచార నవీకరణతో ప్రజలకు భద్రత పెరగడమే కాకుండా నీలి ఆర్థిక వ్యవస్థ వంటి ఇతర రంగాలు కూడా బలోపేతం అవుతున్నాయి.

మిత్రులారా!

  ఏ దేశంలోనైనా విపత్తు నిర్వహణ సామర్థ్యానికి వాతావరణ విజ్ఞానం అత్యంత కీలకం. విపత్తుల నిర్వహణతో ముడిపడిన అనేకమంది నేడిక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావం తగ్గించాలంటే ఈ విజ్ఞాన సామర్థ్యాన్ని మనం గరిష్ఠంగా పెంచుకోవాలి. కాబట్టే, భారత్ ఈ ప్రాధాన్యాన్ని సదా అర్థం చేసుకుంటూ వస్తున్నది. ఒకప్పుడు విపత్తు దుష్ప్రభావాలను మన తలరాతగా భావించే వాళ్లం. కానీ, ఇప్పుడు విపత్తుల దిశను మళ్లించడంలో విజయం సాధించాం. దాదాపు రెండున్నర దశాబ్దాలకు ముందు కచ్‌లోని కాండ్లాలో 1998నాటి తుఫాను ఎంతటి విధ్వంసం సృష్టించిందో ఒకసారి గుర్తుచేసుకోండి. అప్పట్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా 1999నాటి ఒడిషా సూపర్ సైక్లోన్ ఫలితంగా వేలాదిగా ప్రజలు మరణించారు. అయితే, ఇటీవలి కాలంలో అనేక పెద్ద తుఫానులు, విపత్తులు సంభవించినా చాలా సందర్భాల్లో ప్రాణనష్టం నివారణ-తగ్గింపులో మన దేశం విజయం సాధించింది. ఈ విజయాలలో వాతావరణ శాఖదే కీలక పాత్ర. శాస్త్రవిజ్ఞానం, సర్వసన్నద్ధతల ఏకీకరణతో కోట్లాది రూపాయల విలువైన ఆర్థిక నష్టాలను నివారించగలిగాం. అలాగే ఆర్థిక వ్యవస్థలోనూ పుంజుకునే సామర్థ్యం ఇనుమడించింది.. దీంతో పెట్టుబడిదారులలో విశ్వాసం పెరిగి, నా దేశానికి ఎంతో ప్రయోజనం ఒనగూడింది. నిన్న నేను సోనమార్గ్‌లో ఉన్నాను… వాస్తవానికి ఆ కార్యక్రమం అంతకుముందే ఖరారైంది. కానీ, ‘ఐఎండి’ ఇచ్చిన సమాచారంతో అది నాకు తగిన సమయం కాదని తేలింది. అటుపైన ‘సర్‌.. ఈ నెల 13వ తేదీన అనుకూల వాతావరణం ఉంటుంది’ అని చెప్పింది. అందుకే, నిన్న ఆ కార్యక్రమానికి నేను వెళ్లగలిగాను. అక్కడ ఉష్ణోగ్రత మైనస్‌ 6 డిగ్రీలుగా ఉంది. అయినప్పటికీ నేను పూర్తి సమయం అక్కడే గడిపాను. చక్కగా ఎండకాసింది తప్ప, ఒక్క మబ్బుతునక కూడా కనిపించలేదు. వాతావరణ విభాగం ఇచ్చిన ఈ సమాచారం వల్ల నా కార్యక్రమాన్ని సజావుగా పూర్తిచేసుకుని రాగలిగాను.

మిత్రులారా!

  అంతర్జాతీయంగా ఒక దేశ ప్రతిష్ఠకు అక్కడి శాస్త్రవిజ్ఞాన ప్రగతి, దాని సంపూర్ణ సద్వినియోగాలే కొలబద్దలు. వాతావరణ విజ్ఞానంలో పురోగమనంతో మన విపత్తు నిర్వహణ సామర్థ్యం నేడు బలోపేతమైంది. దీంతో యావత్ ప్రపంచం ప్రయోజనం పొందుతోంది. మన ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ వ్యవస్థ నేడు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాలకూ సమాచారం ఇస్తోంది. మన పొరుగు దేశాల్లో ఎప్పుడు… ఏ సంక్షోభం తలెత్తినా తక్షణ సాయానికి మనమే తొలుత ముందడుగేస్తాం. దీంతో ప్రపంచంలో భారత ప్రతిష్ఠ ఇనుమడించి ‘విశ్వబంధు’గా పేరొచ్చింది. ఇందుకుగాను ‘ఐఎండి’ శాస్త్రవేత్తలకు నా ప్రత్యేక అభినందనలు.

మిత్రులారా!

  ఇవాళ ‘ఐఎండి’ 150వ వార్షికోత్సవం నేపథ్యంలో వేల ఏళ్ల భారత వాతావరణ విజ్ఞాన,  నైపుణ్య, అనుభవాల ఘన చరిత్రను ప్రస్తావిస్తున్నాను. ముఖ్యంగా గత 150 ఏళ్ల వ్యవస్థాగత స్వరూపం గురించి స్పష్టీకరిస్తాను. వాస్తవానికి దీనికన్నా ముందే మనకు వాతావరణ జ్ఞానం, సంప్రదాయాలు వేళ్లూనుకున్నాయి. దీన్ని గురించి తెలుసుకోవడం… ప్రత్యేకించి మన విదేశీ అతిథులకు ఆసక్తికరం కాగలదు. అదేమిటంటే- మానవ పరిణామాన్ని ప్రభావితం చేసిన ప్రాథమికాంశాలలో ఇదీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వాతావరణం, పర్యావరణాన్ని అర్థం చేసుకోవడానికి నిరంతరం కృషి చేశారని చరిత్ర మనకు చెబుతోంది. ఇందులో భాగంగా వేల ఏళ్లకిందటే వాతావారణంపై వ్యవస్థాగత అధ్యయనం, పరిశోధనలు చేసిన దేశం భారత్‌. ఆ మేరకు మనకు లిఖితపూర్వక సంప్రదాయ విజ్ఞానంతోపాటు అది ఎప్పటికప్పుడు మెరుగుపడుతూ వచ్చింది. వేదాలు, సంహితలు, సూర్య సిద్ధాంతం వంటి ప్రాచీన జ్యోతిశ్శాస్త్ర గ్రంథాలలో వాతావరణంపై భారత సంప్రదాయ జ్ఞానం పొందుపరబడింది. తమిళనాడు సంగమ సాహిత్యం, ఉత్తర భారతంలో ‘ఘాఘ్ భద్దరీ’ జానపద సాహిత్యంలో వాతావరణ విజ్ఞానంపై విస్తృత సమాచారం మనకు లభ్యమవుతుంది. అయితే, ప్రాచీన కాలంలో వాతావరణ విజ్ఞానం ఓ ప్రత్యేక శాఖ కాదు. ఖగోళ గణన, వాతావరణ అధ్యయనాలు, జంతు ప్రవర్తన, సామాజిక అనుభవాలతోనూ ఇది ముడిపడి ఉండేది. గ్రహగతుల గురించి గణితశాస్త్ర పరంగా మన దేశం కృషి గురించి ప్రపంచమంతటికీ తెలుసు. మన రుషులు గ్రహ మండలాన్ని, వాటి గమనాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. రాశిచక్రాలు, నక్షత్ర రాశులు, వాతావరణ సంబంధిత గణన చేశారు. మేఘాల రకాలు, స్వరూపంపై అధ్యయనంతో రూపొందిన ‘కృషి పరాశర్, బృహత్  సంహిత’ వంటి గ్రంథాల్లో దీన్ని మనం చూడవచ్చు. ‘కృషి పరాశర్‌’ గ్రంథం ఉటంకించిన శ్లోకం ఇలా చెబుతుంది:

अतिवातम् च निर्वतम् अति उश्नम् चाति सीतलम् अत्य-भ्रंच निरभ्रंच शाद विधाम मेघ लक्ष्णम्॥

అంటే- అధిక లేదా అల్ప వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతల వంటివి మేఘాల లక్షణాలతోపాటు వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయని అర్థం. దీన్నిబట్టి ఆధునిక యంత్ర పరికరాలేవీ లేని ఆ రోజుల్లో పండితులు నిర్వహించిన విస్తృత పరిశోధనలతోపాటు వారి లోతైన జ్ఞానం, అంకితభావం మనకు అవగతం కాగలవు. సముద్రం, వాతావరణానికి సంబంధించి శతాబ్దాల కిందటి గుజరాత్ నావికుల పరిజ్ఞానంపై రూపొందించిన “ప్రీ-మోడరన్ కచ్ నావిగేషన్ టెక్నిక్స్ అండ్ వాయేజెస్” పుస్తకాన్ని కొన్నేళ్ల కిందట నేను ఆవిష్కరించాను. అలాగే దేశంలోని గిరిజన వర్గాలకు కూడా సుసంపన్న అనుభవ జ్ఞాన వారసత్వం ఉంది. ప్రకృతిపైనా, జంతు ప్రవర్తన మీద వారి లోతైన అధ్యయనం, అవగాహనే ఇందుకు కారణం.

   ఓ యాభయ్యేళ్ల కిందటి నా అనుభవాన్ని ఈ సందర్భంగా వివరిస్తాను. అప్పట్లో విహార యాత్ర కోసం గిర్ అడవికి వెళ్లాను. అప్పట్లో ప్రభుత్వం గిరిజన బాలలకు ప్రతి నెలా రూ.30 సాయంగా అందించేది. అది గమనించి… “ఇదేంటి ఈ పిల్లాడికి డబ్బు ఎందుకిస్తున్నారు?”  అని ఆరా తీశాను. ఆ బాలుడికి ఓ ప్రత్యేక సామర్థ్యం ఉందని, అడవిలో ఎక్కడో దూరంలో కార్చిచ్చు చెలరేగినా అందరికన్నా ముందు ఆ ముప్పును అతడు పసిగట్టగలడని అక్కడివారు చెప్పారు. వెంటనే అతడు సంబంధిత ప్రభుత్వ సిబ్బందికి సమాచారం చేరవేసేవాడని, కాబట్టే అతనికి గుర్తింపునిస్తూ రూ.30 ఇస్తుంటామని చెప్పారు. ఏ వైపు నిప్పంటుకున్నా, ఆ వాసనను పసిగట్టి, ‘సర్‌… అటువైపు నుంచి వాసన తెలుస్తోంది’ అని చెప్పేవాడు.

మిత్రులారా!

   ఈ విధంగా నిరూపిత సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో మేళవించాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. ఈ దిశగా మరిన్ని పరిశోధనలు చేయడానికి తరుణమిదే.

మిత్రులారా!

   ‘ఐఎండి’ వాతావరణ సూచనల్లో కచ్చితత్వం ఎంత పెరిగితే వాటి ప్రాధాన్యం కూడా అంతగా   పెరుగుతుంది. రాబోయే కాలంలో వివిధ రంగాలు, పరిశ్రమలు సహా దైనందిన జీవితంలోనూ ‘ఐఎండి’ సమాచార వినియోగంతోపాటు డిమాండ్ కూడా పెరుగుతుంది. కాబట్టి, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలపై హెచ్చరిక వ్యవస్థల రూపకల్పన సహా భవిష్యత్‌ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని కృషి కొనసాగాలి. ఆ మేరకు శాస్త్రవేత్తలు, విద్యార్థి పరిశోధకులు, ‘ఐఎండి’ వంటి సంస్థలు వినూత్న ఆవిష్కరణల దిశగా శ్రమించాలి. ప్రపంచ మానవాళి సేవ, భద్రతలో భారత్ కీలక పాత్ర పోషించగలదు. ఈ స్ఫూర్తితో ‘ఐఎండి’ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించగలదని నేను విశ్వసిస్తున్నాను. చివరగా ‘ఐఎండి’ 150 ఏళ్ల ప్రస్థానంతోపాటు వాతావరణ శాస్త్ర ప్రగతిలో పాలుపంచుకున్న వారందరికీ మరొకసారి నా అభినందనలు. అదేవిధంగా ఒకటిన్ననర శతాబ్దంలో ఈ పురోగమనాన్ని వేగిరపరచిన వారందరూ కూడా అభినందనీయులే. ఆ మేరకు కార్యక్రమానికి హాజరైనవారితో పాటు మనతో లేనివారిని స్మరించుకుంటున్నాను. మరోసారి, మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సమీప స్వేచ్ఛానువాదం.