Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత వాతావరణ విభాగం (ఐఎండి)150వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్ర‌ధానమంత్రి ప్ర‌సంగం

భారత వాతావరణ విభాగం (ఐఎండి)150వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్ర‌ధానమంత్రి ప్ర‌సంగం


   భారత వాతావరణ విభాగం (ఐఎండి) 150వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేడు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘ఐఎండి’ సాగించిన ఈ 150 ఏళ్ల ప్ర‌యాణం దేశంలో ఆధునిక శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాల‌ సగర్వ పురోగమనానికి కూడా ప్ర‌తిబింబమని ఆయన అభివర్ణించారు. ఒకటిన్నర శతాబ్దాలుగా కోట్లాది భారతీయులకు సేవలందిస్తున్న ‘ఐఎండి’ ప్రస్థానం భారత శాస్త్రవిజ్ఞాన ప్రగతికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లుగా ఈ విభాగం సాధించిన విజయాలకు గుర్తుగా స్మారక తపాలాబిళ్లతోపాటు నాణాన్ని కూడా ఇవాళ ఆవిష్కరించామని శ్రీ మోదీ అన్నారు. భారత్‌ స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే 2047నాటికి ఈ సంస్థ భవిష్యత్తును విశదీకరించే ‘ఐఎండి దార్శనిక పత్రం-2047’ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించామని ఆయన పేర్కొన్నారు. ఒకటిన్నర శతాబ్దాల ‘ఐఎండి’ మహత్తర ప్రస్థానం సందర్భంగా దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు.
   ఈ 150 ఏళ్ల ప్రయాణంపై వేడుకలలో యువతరాన్ని కూడా మమేకం చేస్తూ జాతీయ వాతావరణ ఒలింపియాడ్‌ను ‘ఐంఎడి’ నిర్వహించిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఇందులో పాలుపంచుకున్న వేలాది విద్యార్థులకు దీనివల్ల వాతావరణ శాస్త్రంపై ఆసక్తి ఇనుమడిస్తుందని చెప్పారు. తన ప్రసంగానికి ముందు వేదిక వద్ద ప్రదర్శనల సమయంలో యువతతో తన సంభాషణను శ్రీ మోదీ ప్రస్తావిస్తూ- నేటి కార్యక్రమంలో పాల్గొన్న యువతరానికి అభినందనలు తెలిపారు.
   మకర సంక్రాంతి పర్వదినానికి కాస్త అటూఇటూగా 1875 జనవరి 15న ‘ఐఎండి’ ఆవిర్భవించిందని శ్రీ మోదీ గుర్తుచేశారు. “భారత సంప్రదాయంలో మకర సంక్రాంతికిగల ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే” అన్నారు. ఆ మేరకు గుజరాత్ వాసిగా ఇది తనకూ ఎంతో ఇష్టమైన పండుగని ఆయన పేర్కొన్నారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని ‘ఉత్తరాయనం’గా వ్యవహరిస్తామని, ఈ పర్వదినాన్నే మకర సంక్రాంతిగా నిర్వహించుకుంటామని వివరించారు. గగనంలో సూర్యగమనం ఉత్తరం వైపు మారడాన్ని ఇది సూచిస్తుందని చెప్పారు. దీంతో ఉత్తరార్ధగోళంలో సూర్యకాంతి క్రమంగా పెరుగుతూ పంటల సాగుకు రైతులు సిద్ధం కావడానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఈ రోజున దేశం నలుదిశల్లోనూ రకరకాల పేర్లతో, వివిధ సాంస్కృతిక రూపాల్లో వేడుకలతో ప్రజలు మకర సంక్రాంతి పండుగ చేసుకుంటారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
   “ఏ దేశంలోనైనా విజ్ఞాన సంస్థల పురోగమనమే శాస్త్ర విజ్ఞానంపై దానికిగల అవగాహనను ప్రతిబింబిస్తుంది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. ఆ సంస్థలలో పరిశోధన-ఆవిష్కరణలు న‌వ భారతావనికి స్వాభావికమని ఆయన వ్యాఖ్యానించారు. గడచిని దశాబ్ద కాలంలో ‘ఐఎండి’ మౌలిక సదుపాయాలు, సాంకేతికతలు అద్భుత స్థాయిలో విస్త‌రించాయని చెప్పారు. ఈ మేరకు డాప్లర్ వాతావరణ రాడార్లు, స్వయంచలిత వాతావరణ కేంద్రాలు, రన్‌వే వాతావరణ పర్యవేక్షణ వ్యవస్థలు, జిల్లాలవారీ వర్షపాత పర్యవేక్షణ కేంద్రాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. ఇవన్నీ అప్‌గ్రేడ్ అవ్వడంతో  దేశంలో వాతావరణ విజ్ఞానశాస్త్రం అంతరిక్ష, డిజిటల్ సాంకేతికతల నుంచి ఎంతో ప్రయోజనం పొందుతోందని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రకటించారు. అంటార్కిటికాలో ‘మైత్రి, భారతి’ పేరిట ఈ శాఖకు రెండు వాతావరణ పరిశీలన ప్రయోగశాలలు ఉన్నాయని తెలిపారు. గత సంవత్సరం సూపర్ కంప్యూటర్లు ‘ఆర్క్, అరుణిక”లను ప్రారంభించడాన్ని ప్రధాని గుర్తుచేశారు. ‘ఐఎండి’ విశ్వసనీయత పెరుగుదలను ఇది ప్రస్ఫుటం చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. భారత్‌ను వాతావరణ-స్మార్ట్ దేశంగా మార్చడమే ‘మిషన్ మౌసమ్’ ధ్యేయమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సుస్థిర భవితతోపాటు భవిష్యత్ సంసిద్ధతపై మన నిబద్ధతకు ఇదొక చిహ్నమని పేర్కొన్నారు. ఆ మేరకు దేశం అన్ని రకాల వాతావరణ పరిస్థితులనూ ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. ఆ మేరకు వాతావరణ-స్మార్ట్ దేశంగా మారడం లక్ష్యంగా ‘మిషన్ మౌసమ్’ను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.
   దేశం ఉన్నత శిఖరాలను చేరడంలో మాత్రమేగాక సామాన్య జనజీవన సౌలభ్యం మెరుగుపరచడంలోనూ శాస్త్రవిజ్ఞానానికి ఔచిత్యం ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు ‘ఐఎండి’ తన ప్రయాణంలో ప్రతి ఒక్కరికీ కచ్చితమైన వాతావరణ సమాచారం అందించే విధంగా ముందడుగు వేసిందని ఆయన వ్యాఖ్యానించారు. తదనుగుణంగా ‘అందరికీ ముందస్తు హెచ్చరిక’ కార్యక్రమం ఇప్పుడు జనాభాలో 90 శాతానికిపైగా ప్రజలకు విస్తరించిందని ప్రధాని స్పష్టీకరించారు. దేశంలో గత-రాబోయే 10 రోజుల వాతావరణ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా పొందవచ్చునని, వాట్సాప్‌లో కూడా అంచనాలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘మేఘదూత్ మొబైల్ యాప్’ అన్ని స్థానిక భాషలలో వాతావరణ సమాచారం అందిస్తుందని ఆయన చెప్పారు. పదేళ్ల కిందట  రైతులు, పశుపోషకులలో 10 శాతం మాత్రమే వాతావరణ సంబంధిత సలహాలను వాడుకున్నారని, ఇప్పుడు 50 శాతానికిపైగా ప్రజలు వాడుకుంటున్నారని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఇప్పుడు మొబైల్ ఫోన్లలో పిడుగుపాటుపై ముందస్తు హెచ్చరికలు సాధ్యమేనని ఆయన ప్రస్తావించారు. గతంలో లక్షలాది మత్స్యకార కుటుంబాలు సముద్రంలో చేపల వేటకు వెళితే వారంతా తిరిగి వచ్చేదాకా అందరూ ఆందోళన పడేవారని గుర్తుచేశారు. కానీ, నేడు ‘ఐఎండి’ సహకారంతో మత్స్యకారులకు సకాలంలో హెచ్చరికలు అందుతున్నాయని ప్రధాని ప్రముఖంగా చెప్పారు. ఈ ప్రత్యక్ష సమాచార నవీకరణతో భద్రత పెరగడంతోపాటు వ్యవసాయం,  నీలి ఆర్థిక వ్యవస్థ తదితర రంగాలు కూడా బలోపేతం కాగలవన్నారు.
   “ఏ దేశంలోనైనా విపత్తు నిర్వహణ సామర్థ్యానికి వాతావరణ విజ్ఞానం అత్యంత కీలకం” అని శ్రీ మోదీ అన్నారు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావం తగ్గించడానికి ఈ విజ్ఞానం సామర్థ్యాన్ని గరిష్ఠంగా వాడుకోవాలన్నారు. భారత్‌ ఈ ప్రాధాన్యాన్ని సదా అర్థం చేసుకుంటూ వస్తున్నదని పేర్కొన్నారు. ఒకప్పుడు విపత్తు దుష్ప్రభావాలు అనివార్యమనే భావన ఉండేది కాగా, నేడు వాటికి సత్వర ఉపశమనం లభిస్తున్నదని స్పష్టం చేశారు. కచ్‌లోని కాండ్లాలో 1998నాటి  తుఫాను, 1999నాటి ఒడిశా లో సూపర్ సైక్లోన్ ఫలితంగా వేలాది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, విపరీతంగా ఆస్థి విధ్వంసం సంభవించిందని గుర్తుచేశారు. కానీ, ఇటీవలి కాలంలో అనేక పెద్ద తుఫానులు, విపత్తులు సంభవించినా మన దేశం చాలా సందర్భాల్లో ప్రాణనష్టం నివారణ, తగ్గింపులో విజయవంతమైందని ప్రధాని పేర్కొన్నారు. ఈ విజయాలలో వాతావరణ శాఖ కీలక  పాత్ర పోషించిందంటూ ప్రశంసించారు. శాస్త్రవిజ్ఞానం, సర్వసన్నద్ధతల ఏకీకరణతో కోట్లాది రూపాయల మేర ఆర్థిక నష్టాలను నివారించగలిగామని చెప్పారు. అలాగే ఆర్థిక వ్యవస్థలో పుంజుకోగల శక్తి ఇనుమడించిందని, దీంతో పెట్టుబడిదారులలో విశ్వాసం కూడా పెరిగిందని తెలిపారు.
   “ప్రపంచంలో ఒక దేశ ప్రతిష్ఠకు అక్కడి శాస్త్రవిజ్ఞాన ప్రగతి, దాని సంపూర్ణ సద్వినియోగం కొలబద్ద” అని ప్రధానమంత్రి అన్నారు. వాతావరణ విజ్ఞానంలో పురోగమనంతో మన విపత్తు నిర్వహణ సామర్థ్యం బలోపేతమైందని చెప్పారు. తద్వారా యావత్‌ ప్రపంచం ప్రయోజనం పొందుతున్నదని తెలిపారు. మన ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ వ్యవస్థ నేడు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాలకు కూడా సమాచారం ఇస్తున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ‘విశ్వబంధు’గా పేరు తెచ్చుకున్న భారత్‌, అందుకు తగినట్లుగానే ప్రకృతి విపత్తులు, సంక్షోభ సమయాల్లో ఇతర దేశాలకు చేయూతనివ్వడంలో సదా ముందువరుసలో ఉంటుందని చెప్పారు. దీంతో అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ఠ ఇనుమడించిందని చెప్పారు. ఈ ఘనతలు  సాధించడంలో గణనీయ కృషి చేశారంటూ ‘ఐఎండి’ శాస్త్రవేత్తలను ఆయన కొనియాడారు.
   ‘ఐఎండి’ 150వ వార్షికోత్సవం నేపథ్యంలో భారత వాతావరణ విజ్ఞాన ఘన చరిత్రను శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. వాతావరణం మానవ పరిణామాన్ని ప్రభావితం చేసిన ప్రాథమికాంశమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వాతావరణం, పర్యావరణాలను అర్థం చేసుకోవడానికి నిరంతరం కృషి చేశారని చరిత్ర మనకు చెబుతోందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా వేదాలు, సంహితలు, సూర్య సిద్ధాంతం వంటి పురాతన గ్రంథాలలో వాతావరణంపై భారత సంప్రదాయ జ్ఞానం పొందుపరచారని  తెలిపారు. అంతేకాకుండా ఇది నిరంతరం మెరుగుపడుతూ లోతుగా అధ్యయనం కూడా సాగిందని స్పష్టం చేశారు. తమిళనాడు సంగమ సాహిత్యం, ఉత్తర భారతంలో ‘ఘాఘ్‌ భద్దరీ’ జానపద సాహిత్యంలో వాతావరణ విజ్ఞానంపై విస్తృత సమాచారం ఉందని శ్రీ మోదీ ఉటంకించారు. ప్రాచీన కాలంలో వాతావరణ విజ్ఞానాన్ని ప్రత్యేక శాఖగా పరిగణించలేదన్నారు. ఖగోళ గణన, వాతావరణ అధ్యయనాలు, జంతు ప్రవర్తన, సామాజిక అనుభవాలతో ఇది ముడిపడి ఉండేదని చెప్పారు. మేఘాల రకాలు, స్వరూపాలపై అధ్యయనంతో రూపొందిన ‘కృషి పరాశర్, బృహత్ సంహిత’ వంటి గ్రంథాలను ప్రధాని ప్రస్తావించారు. అలాగే గ్రహస్థానాలపై గణిత శాస్త్ర కృషిని కూడా గుర్తుచేశారు. అధిక లేదా అల్ప వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతల వంటివి మేఘాల లక్షణాలతోపాటు వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయని ‘కృషి పరాశర్‌’ వివరించినట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆధునిక యంత్ర పరికరాలేవీ లేని ఆ రోజుల్లో పండితులు నిర్వహించిన విస్తృత పరిశోధనలను ప్రస్తావిస్తూ వారి లోతైన జ్ఞానం, అంకితభావాన్ని ప్రస్తుతించారు. ఈ విధంగా నిరూపిత సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో మేళవించాల్సిన ఆవశ్యకతను ప్రధాని స్పష్టం చేశారు. ఈ దిశగా మరిన్ని పరిశోధనలు చేయాలని కూడా కోరారు. ఈ సందర్భంగా శతాబ్దాల నాటి గుజరాత్ నావికుల సముద్ర పరిజ్ఞానంపై రూపొందించిన “ప్రీ-మోడరన్ కచ్‌ నావిగేషన్ టెక్నిక్స్ అండ్ వాయేజెస్” పుస్తకాన్ని కొన్నేళ్ల కిందట తాను ఆవిష్కరించినట్లు ఆయన గుర్తుచేశారు. ప్రకృతిపైనా, జంతు ప్రవర్తన మీద లోతైన అవగాహన సహా దేశంలోని గిరిజన వర్గాలకుగల ఘనమైన అనుభవ జ్ఞాన వారసత్వాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. సమకాలీన శాస్త్రీయ పద్ధతులతో ఈ జ్ఞానంపై మరింత లోతైన అధ్యయనం ద్వారా వాటిని ఏకీకృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
   ఇక ‘ఐఎండి’ వాతావరణ సూచనల్లో కచ్చితత్వం మరింత పెరిగితే వాటి ప్రాధాన్యం కూడా  పెరుగుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వివిధ రంగాలు, పరిశ్రమలు సహా దైనందిన జీవితంలోనూ ‘ఐఎండి’ సమాచారానికి డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు. భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలపై హెచ్చరిక వ్యవస్థల రూపకల్పన సహా భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని కృషి కొనసాగాలని ప్రధాని స్పష్టీకరించారు. శాస్త్రవేత్తలు, విద్యార్థి పరిశోధకులు, ‘ఐఎండి’ వంటి సంస్థలు వినూత్న ఆవిష్కరణల దిశగా శ్రమించాలని చెప్పారు. చివరగా- ప్రపంచ మానవాళి సేవ, భద్రతలో భారత్‌ కీలక పాత్ర పోషించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఐఎండి’ 150 ఏళ్ల ప్రస్థానంలో, వాతావరణ శాస్త్ర ప్రగతిలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు తెలుపుతూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.
   కేంద్ర భూవిజ్ఞానశాస్త్రాల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్, ప్రపంచ వాతావరణ సంస్థ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ సెలెస్టే సౌలో తదితర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

   ఈ వేడుకలలో భాగంగా- భారత్‌ను ‘వాతావరణ సంసిద్ధ-వాతావరణ సాంకేతిక’ దేశంగా రూపొందించే ధ్యేయంతో రూపొందించిన ‘మిషన్‌ మౌసమ్‌’ను ప్రధాని ప్రారంభించారు. అత్యాధునిక వాతావరణ పరిశీలన సాంకేతిక పరిజ్ఞానాలు-వ్యవస్థలతోపాటు అధిక సాంద్రతగల వాతావరణ విశ్లేషణ చిత్రాలు, భవిష్యత్తరం రాడార్లు-ఉపగ్రహాల రూపకల్పన సహా అధిక సామర్థ్యంగల కంప్యూటర్ల తయారీ వంటి లక్ష్యాల సాధన ఈ కార్యక్రమంలో అంతర్భాగంగా ఉంటుంది. అలాగే వాతావరణం-సంబంధిత అంచనా ప్రక్రియలపై అవగాహన మెరుగుదల, దీర్ఘకాలిక వాతావరణ నిర్వహణ, కార్యకలాపాల వ్యూహాత్మక రూపకల్పనలో తోడ్పడే వాయు నాణ్యత సమాచార సేకరణపైనా ‘మిషన్‌ మౌసమ్‌’ దృష్టి సారిస్తుంది.
   అంతేకాకుండా వాతావరణ ప్రతిరోధకత, వాతావరణ మార్పులతో సంధానం దిశగా రూపొందించిన ‘ఐఎండి దార్శనిక పత్రం-2047ను ఆయన ఆవిష్కరించారు. వాతావరణ అంచనా, నిర్వహణ, శీతోష్ణస్థితి మార్పు సమస్యల ఉపశమన ప్రణాళికలు ఇందులో భాగంగా ఉంటాయి.
   ‘ఐఎండి’ 150వ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా గత 150 ఏళ్లలో ఈ విభాగం సాధించిన విజయాలు, దేశాన్ని వాతావరణ ప్రతిరోధకంగా తీర్చిదిద్దడంలో దాని కృషి, వివిధ వాతావరణ-శీతోష్ణస్థితి సంబంధిత సేవల ప్రదానంలో ప్రభుత్వ సంస్థల పాత్ర వగైరాలను వివరిస్తూ అనేక కార్యక్రమాలు, కార్యకలాపాలు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు.
 

****