Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత ప్రభుత్వ వైజ్ఞానిక అధికారులతో ప్రధాన మంత్రి సమావేశం

భారత ప్రభుత్వ వైజ్ఞానిక అధికారులతో ప్రధాన మంత్రి సమావేశం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత ప్రభుత్వ అగ్రగామి వైజ్ఞానిక అధికారులతో మంగళవారం నాడు సమావేశమయ్యారు.  ఆయనతో జరిగిన సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్, భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ ఆర్. చిదంబరమ్ లతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని వైజ్ఞానిక విభాగాలతో సంబంధమున్న కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.

 

వైజ్ఞానిక పరిశోధనల తాలూకు వేరువేరు రంగాలలో చోటు చేసుకొన్న పురోగతిని గురించి ప్రధాన మంత్రికి అధికారులు సంక్షిప్తంగా వివరించారు.

 

భారతదేశపు పురోగమనానికి, సమృద్ధికి విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం మరియు నవకల్పన లు కీలకమైనవని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.  మన దేశ సమస్యల పరిష్కారానికి విజ్ఞాన శాస్త్రాన్ని వినియోగించుకోవడమే విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞాన రంగానికి సంబంధించినంతవరకు ప్రభుత్వ ప్రాథమ్యం అని ఆయన చెప్పారు.

 

క్రీడలలో ప్రతిభను గుర్తించడాన్ని ఒక ఉదాహరణగా ప్రధాన మంత్రి చెబుతూ, పాఠశాల విద్యార్థులలో తెలివితేటలు గల, విజ్ఞాన శాస్త్రంలో ఉత్తమ ప్రతిభాన్వితులైన వారిని కనుగొనేటందుకు తగిన యంత్రాంగాలను రూపుదిద్దాలన్నారు.

 

అట్టడుగు స్థాయిలో బోలెడంత నవకల్పన చోటుచేసుకొంటోందని ఆయన అన్నారు.  సంస్థాగత సాంప్రదాయక అడ్డుగోడలను ఛేదించవలసిందిగా అధికారులకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.  కూకటివేళ్ల స్థాయిలో విజయవంతమైన నవకల్పనలను నమోదు చేసుకొని, వాటిని అనుకరించే యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ఆయన నొక్కిపలికారు.  ఈ సందర్భంలో, రక్షణ రంగ సిబ్బంది ఆవిష్కరించిన నవకల్పనలను గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

 

వ్యవసాయ రంగంలో, అధిక మాంసకృత్తులను కలిగినటువంటి పప్పు ధాన్యాలు, దృఢీకరించిన ఆహారాలు మరియు ఆముదంలో విలువ జోడింపు లను ప్రాథమ్య అంశాలుగా ప్రధాన మంత్రి గుర్తించి, వాటిని వేగవంతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు.

 

శక్తి రంగంలో, శక్తి దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకుగాను సౌర శక్తికి సంబంధించి అవకాశాలను గరిష్ఠ స్థాయిలో అన్వేషించాలని ప్రధాన మంత్రి సూచించారు.

 

సవాళ్లను అధిగమించడంలోను, భారతదేశంలోని సామాన్య మానవుల జీవితాలను మెరుగుపరచేందుకు పరిష్కార మార్గాలను కనుగొనడంలోను భారతీయ శాస్త్రజ్ఞుల యొక్క సామర్థ్యాల పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం 2022 కు 75 సంవత్సరాలు పూర్తి అవుతాయని, అప్పటికల్లా సాధించవలసిన లక్ష్యాలు ఏమిటనేది స్పష్టంగా నిర్దేశించుకోవాలని అధికారులను కోరారు.