ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఆహ్వానం మేరకు ఆగస్ట్ 23, 2024న భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉక్రెయిన్ దేశాన్ని సందర్శించారు. రెండు దేశాల మధ్యన 1992లో దౌత్యసంబంధాలు ఏర్పడిన తర్వాత భారతదేశ ప్రధాని ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే మొదటిసారి.
రాజకీయ సంబంధాలు
భవిష్యత్తులో ఇరు దేశాల మధ్యన ద్వైపాక్షిక సంబంధాలను సమగ్రమైన భాగస్వామ్యం నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యం వరకూ పెంపొందించడానికిగాను కలిసి పని చేయాలని ఇరువురు నేతలు పరస్పర ఆసక్తిని వ్యక్తం చేశారు.
పరస్పర నమ్మకం, గౌరవం, పారదర్శకతల మీద ఆధారపడి ఇరు దేశాల ప్రజలు లబ్ధి పొందేలా మరింతగా ద్వైపాక్షిక బంధాలను అభివృద్ధి చేయాలని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు.
గత మూడు దశాబ్దాలుగా గణనీయంగా బలపడిన ద్వైపాక్షిక సంబంధాల స్థిరమైన , సానుకూల పథాన్ని నాయకులు సమీక్షించారు. భారతదేశం, ఉక్రెయిన్ దేశాల మధ్యన క్రమం తప్పకుండా వివిధ స్థాయుల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు పోషించిన పాత్రను ప్రశంసించారు. జూన్ 2024లో అపులియాలో, మే 2023 జి 7 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో మేలో హిరోషిమాలో జరిగిన సమావేశం, మార్చి 2024లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి న్యూఢిల్లీ పర్యటన, భారతదేశ విదేశాంగ మంత్రి , ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి మధ్య బహుళ పరస్పర చర్చలు, టెలిఫోన్ సంభాషణలు, భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు – ఉక్రెయిన్ అధ్యక్షుని కార్యాలయ అధిపతి మధ్య జరిగిన సంభాషణలు, చర్చలు,.. పరస్పర అవగాహన, విశ్వాసం సహకారాన్ని పెంపొందించడం కోసం జూలై 2023లో కీవ్‌లో జరిగిన 9వ రౌండ్ విదేశాంగ కార్యాలయాల సంప్రదింపులు మొదలైనవన్నీ ఇరు దేశాల మధ్యన నిర్వహించిన పలు కార్యక్రమాలు.
ఎంతో ఉత్సాహంగా నిర్వహించిన వైబ్రాంట్ గుజరాత్ ప్రపంచ సదస్సు -2024లో, రైసినా డైలాగ్- 2024లో ఉక్రెయిన్ అధికారిక ప్రతినిధులు పాల్గొనడాన్ని ఇరు దేశాల నేతలు అభినందించారు.
సమగ్రమైన, న్యాయమైన, చిరకాల శాంతికోసం
ప్రాదేశిక సమగ్రత, దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించడం వంటి ఐక్యరాజ్యసమితి చార్టర్‌తో సహా అంతర్జాతీయ చట్టాలను సమర్థించడంలో మరింత సహకారం కోసం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షుడు శ్రీ జెలెన్ స్కీ తమ సంసిద్ధతలను పునరుద్ఘాటించారు. ఈ విషయంలో సన్నిహిత ద్వైపాక్షిక చర్చల ఆవశ్యకతను వారు అంగీకరించారు.
చర్చలు, దౌత్యం ద్వారా శాంతియుత పరిష్కారంపై దృష్టి పెట్టాలనే తన సూత్రప్రాయ వైఖరిని భారతదేశం పునరుద్ఘాటించింది. దీనిలో భాగంగా, జూన్ 2024లో స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్‌లో జరిగిన ఉక్రెయిన్ శాంతి సదస్సుకు భారతదేశం హాజరైంది.
భారతదేశ మద్దతును ఉక్రెయిన్ స్వాగతించింది. తదుపరి శాంతి శిఖరాగ్ర సమావేశంలో ఉన్నత స్థాయి భారతీయ భాగస్వామ్యం ప్రాముఖ్యతను ప్రత్యేకంగా పేర్కొంది.
ఉక్రెయిన్‌లో శాంతిపై నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో ఆమోదం పొందిన శాంతి విధివిదానాల ఉమ్మడి అధికారిక ప్రకటన అనేది చర్చలు, దౌత్యం , అంతర్జాతీయ చట్టాల ఆధారంగా శాంతిని ప్రోత్సహించే తదుపరి ప్రయత్నాలకు ఆధారం కాగలదని ఉక్రెయిన్ దేశం తెలిపింది.
మానవత్వంతో ఉక్రెయిన్ దేశం అందిస్తున్న ధాన్యం కార్యక్రమాలతో సహా ప్రపంచ ఆహార భద్రతకోసం జరుగుతున్న వివిధ ప్రయత్నాలను నాయకులు అభినందించారు. ప్రపంచ మార్కెట్లకు, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికాలో వ్యవసాయ ఉత్పత్తులను నిరంతరాయంగా, అడ్డంకులు లేకుండా సరఫరా చేయాల్సిన ప్రాముఖ్యతను వారు నొక్కిచెప్పారు.
విస్తృత స్థాయిలో అందరి ఆమోదం పొందే వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి , శాంతి పునరుద్ధరణకు దోహదపడేలా వాటాదారులందరి మధ్య నిజాయితీతో కూడిన , ఆచరణాత్మక చర్చలు అవసరమని ప్రధాని శ్రీ నరేందమోదీ పునరుద్ఘాటించారు. శాంతిని త్వరగా పునరుద్ధరించడానికి, అన్ని విధాలుగా సహకరించడానికి భారతదేశ సుముఖంగా ఉందని ప్రధాని శ్రీ మోదీ ప్రత్యేకంగా నొక్కి చెప్పారు.
ఆర్ధిక, శాస్త్ర, సాంకేతిక సహకారం
డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, తయారీ రంగం, హరిత ఇంధనం మొదలైన రంగాలలో బలమైన భాగస్వామ్యాన్ని అన్వేషించడమే కాకుండా, వ్యాపార వాణిజ్యాలు, వ్యవసాయం, మందుల తయారీ, రక్షణ రంగం, విద్యారంగం, శాస్త్ర సాంకేతికత , సంస్కృతి వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించడంపై నేతలు చర్చించారు. రెండు దేశాల వ్యాపారం, పరిశ్రమల రంగాల్లో మరింత విస్తృత సహకారాన్ని కూడా చర్చించారు.
రెండు దేశాల మధ్య భవిష్యత్తు ఆధారిత, బలమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి కావాల్సిన వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, పారిశ్రామిక , సాంస్కృతిక సహకారంపై భారతీయ-ఉక్రెయిన్ ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ (ఐజీసీ) ప్రాముఖ్యతను నాయకులు ప్రత్యేకంగా గుర్తించారు.
మార్చి 2024లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి భారతదేశ పర్యటన సందర్భంగా నిర్వహించిన ఐజీసీ సమీక్షను, 2024లో పరస్పర అనుకూలమైన సమయంలో ఐజీసీ 7వ సెషన్‌ను ముందుగా సమావేశపరిచే ఉద్దేశంతో జాయింట్ వర్కింగ్ గ్రూపుల సమావేశాలను నిర్వహించడానికి చేసిన కృషిని నేతలిద్దరు ప్రశంసించారు. ఐజీసీ కో-ఛైర్/చైర్‌పర్సన్‌గా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ నియామకాన్ని ఉక్రెయిన్ స్వాగతించింది.
ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్యన కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించిన సవాళ్ల కారణంగా 2022 సంవత్సరం నుండి భారత్, ఉక్రెయిన్ దేశాల మధ్యన వస్తుపరమైన వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యంలో గణనీయమైన తగ్గుదల కనిపించింది, ఈ నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పునరుద్ధరించడానికి సాధ్యమయ్యే అన్ని మార్గాలను అన్వేషించాలని ఐజీసీ కో-ఛైర్‌లను ఇరువురు నాయకులు ఆదేశించారు.ఈ పునరుద్ధరణ అనేది యుద్ధానికంటే ముందు స్థాయికి చేరుకోవడమే కాకుండా ఆయా వాణిజ్య ఆర్ధిక సంబంధాలు మరింతగా విస్తరించేలా బలోపేతంగా ఉండాలని సూచించారు.
భారతదేశం, ఉక్రెయిన్ మధ్య అధిక వాణిజ్య వ్యాపారాలు జరగడానికి వీలుగా ఏవైనా అడ్డంకులుంటే వాటిని తొలగించడమే కాకుండా, పరస్పర ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడుల కోసం సులభతర వ్యాపార (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రాముఖ్యతను నాయకులు నొక్కిచెప్పారు. జాయింట్ ప్రాజెక్టులు, సహకారాలు, వెంచర్‌లను అన్వేషించడానికి అధికారిక, వ్యాపార స్థాయులలో మరింత కృషిని ఇరు పక్షాలు ప్రోత్సహించాయి.
వ్యవసాయ రంగంలో ఇరుపక్షాల మధ్యవున్న బలమైన సంబంధాలను నాయకులు గుర్తు చేసుకున్నారు. ప్రమాణాలు , ధ్రువీకరణ ప్రక్రియల సమన్వయంతో సహా పరిపూరకరమైన రంగాలలో (కాంప్లిమెంటరీ ఏరియాస్) బలాల ఆధారంగా ద్వైపాక్షిచర్చలు, మార్కెట్ అందుబాటును మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను నేతలు గుర్తు చేసుకున్నారు
మందుల తయారీ రంగ ఉత్పత్తులలో సహకారాన్ని ఇరు దేశాల భాగస్వామ్యానికిగల బలమైన స్తంభాలలో ఒకటిగా నేతలిద్దరూ గుర్తించారు. పరీక్షలు, తనిఖీ, రిజిస్ట్రేషన్ విధానాలతో సహా మార్కెట్ల అందుబాటు, పెట్టుబడులను, జాయింట్ వెంచర్లను సులభతరం చేయాల్సిన ప్రాధాన్యతను నాయకులు పునరుద్ఘాటించారు. డ్రగ్స్ , ఫార్మాస్యూటికల్స్ పై సహకారాన్ని విస్తృతం చేసుకోవాలనే ఆకాంక్షను ఇరుపక్షాలు వ్యక్తం చేశాయి, ఇందులో శిక్షణ, ఉత్తమ పద్ధతుల భాగస్వామ్యం కూడా ఉంది. మందుల నియంత్రణపై
భారతదేశ ఆరోగ్యశాఖ, ఉక్రెయిన్ స్టేట్ సర్వీస్ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని , ఫార్మాస్యూటికల్ సహకారంపై ఆగస్టు 2024లో వర్చువల్ మోడ్‌లో జరిగిన భారత-ఉక్రెయిన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 3వ సమావేశాన్ని నేతలిద్దరూ స్వాగతించారు. . తక్కువ ఖర్చుతో కూడుకున్న నాణ్యమైన ఔషధాల సరఫరాకు భారతదేశం హామీ ఇవ్వడంతో భారతదేశాన్ని ఉక్రెయిన్ ప్రశంసించింది.
ద్వైపాక్షిక సంబంధాల చట్టపరమైన నిర్మాణాన్ని విస్తరించే పనిని వేగవంతం చేయడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి, ముఖ్యంగా పెట్టుబడుల పరస్పర రక్షణకు సంబంధించి , అకాడమిక్ డిగ్రీలు, టైటిళ్లలాంటి విద్యా పత్రాల పరస్పర గుర్తింపును సాధించడానికి ఈ పనిని చేయాలని భావించారు.
శాస్త్ర, సాంకేతిక సహకారంపై భారతదేశం ఉక్రెయిన్ దేశాల మధ్య ఒప్పందాన్ని విజయవంతంగా అమలు చేయడాన్ని నేతలిద్దరూ గుర్తించారు. శాస్త్ర, సాంకేతిక సహకారంపై భారతీయ-ఉక్రెయిన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమర్థవంతమైన పనితీరును నేతలిద్దరూ గుర్తించారు. ద్వైపాక్షిక పరిశోధన ప్రాజెక్టులను పూర్తి చేయడాన్ని, క్రమబద్ధమైన మార్పిడిని , కార్యక్రమాలను నిర్వహించడాన్ని ఇరుపక్షాలు ప్రోత్సహించాయి. ముఖ్యంగా ఐసీటీ, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ సర్వీసెస్, బయోటెక్నాలజీ, నూతన వస్తువులు, హరిత ఇంధనం, ఎర్త్ సైన్సెస్ వంటి రంగాలలో జరుగుతున్న పనిని ఇరుపక్షాలు ప్రోత్సహించాయి.. జూన్ 20 2024న శాస్త్ర, సాంకేతిక సహకారంపై జరిగిన జాయింట్ వర్కింగ్ గ్రూప్ 8వ సమావేశాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి.
రక్షణ రంగ సహకారం
భారతదేశం, ఉక్రెయిన్ మధ్య రక్షణ సహకారం ప్రాముఖ్యతను ఇరు దేశాల నేతలు నొక్కి చెప్పారు.
రెండు దేశాలలో రక్షణ సంస్థల మధ్య బలమైన సంబంధాలను నెలకొల్పడానికి చేస్తున్న కృషిని కొనసాగించాలని నాయకులు అంగీకరించారు. భారతదేశంలో తయారీ , అభివృద్ధి చెందుతున్న అంశాలలో ఉమ్మడి సహకారాలు, భాగస్వామ్యంతో సహా 2012లో జరిగిన రక్షణ సహకార ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేసిన సైనిక-సాంకేతిక సహకారంపై భారత-ఉక్రెయిన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశాన్ని, సమీప భవిష్యత్తులో, భారతదేశంలో నిర్వహించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.
సాంస్కృతికపరంగాను, ప్రజల మధ్యన సంబంధాలు
భారతదేశం, ఉక్రెయిన్ దేశాల మధ్య శాశ్వత స్నేహంలో భాగంగా, సాంస్కృతికంగా ప్రజల మధ్య సంబంధాలు పోషించిన కీలక పాత్రను ఇరు దేశాలు గుర్తించాయి. ద్వైపాక్షిక సాంస్కృతిక సహకార కార్యక్రమం ముగింపును, భారతదేశం , ఉక్రెయిన్ దేశాలలో సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించాలనే నిర్ణయాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి.
సాంస్కృతిక సంబంధాల భారతీయ మండలి వారి జనరల్ కల్చరల్ స్కాలర్‌షిప్ స్కీమ్ కింద అందించే ఉపకార వేతనాలతోసహా, ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో ఆపరేషన్ కింద ఇచ్చే ఉపకార వేతనాలను, ప్రజల మధ్యన ఇచ్చిపుచ్చుకోవడాలను, సాంస్కృతిక మార్పిడిని కొనసాగించడంతోపాటు దాన్ని మరింత విస్తరించాల్సిన ప్రాముఖ్యతను నాయకులు నొక్కిచెప్పారు.
ఇరు దేశాల పౌరుల విద్యా అవసరాలను తీర్చేందుకు వీలుగా ఆయా ఉన్నత విద్యా సంస్థల శాఖలను పరస్పరం ప్రారంభించే అవకాశాలను అన్వేషించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
ఉక్రెయిన్‌లోని ప్రవాస భారతీయులు రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను, ప్రజల మధ్య సంబంధాలను అభివృద్ధి చేసేందుకు చేస్తున్న కృషిని నాయకులు అభినందించారు.
2022 సంవత్సరం ప్రారంభ నెలల్లో ఉక్రెయిన్ నుండి భారతీయ విద్యార్థుల తరలింపులో చేసిన సహాయానికి, ఉక్రెయిన్‌కు తిరిగి వచ్చిన భారతీయ పౌరులతోపాటు , విద్యార్థులందరికి భద్రత , క్షేమాన్ని అందిస్తున్నందుకు ఉక్రెయిన్ దేశానికి భారతదేశం తన కృతజ్ఞతలను పునరుద్ఘాటించింది. భారతీయ పౌరులు, విద్యార్థులకు సులభమైన వీసా, రిజిస్ట్రేషన్ సౌకర్యాలపై ఉక్రెయిన్ తన నిరంతర మద్దతును కొనసాగించాలని భారతదేశం అభ్యర్థించింది.
భారతదేశం ఉక్రెయిన్‌కు అందించిన మానవతా సహాయం పట్ల ఉక్రెయిన్ పక్షం భారతదేశానికి కృతజ్ఞతలు తెలియజేసింది. రెండు దేశాల మధ్య హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లపై అవగాహన ఒప్పందాన్ని స్వాగతించింది. ఇది భారతదేశం అందించే గ్రాంట్ సహాయం ద్వారా, పరస్పరం అంగీకరించిన ప్రాజెక్టుల అభివృద్ధికి వీలు కల్పిస్తుంది.
ఉక్రెయిన్ పునర్నిర్మాణం, పునరుద్ధరణలో భారతీయ కంపెనీల ప్రమేయాన్ని తగిన రీతిలో పొందడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
నాయకులిద్దరూ తీవ్రవాదాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా ఈ ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యతను పేర్కొంటూ, ఉగ్రవాదం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా వాటి అన్ని రూపాలు, వ్యక్తీకరణలతో రాజీలేని పోరాటం చేయాలని నేతలిద్దరూ పిలుపునిచ్చారు.
సమకాలీన ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని ఇరు పక్షాలు పిలుపునిచ్చాయి. అది అంతర్జాతీయ శాంతి , భద్రత సమస్యలను పరిష్కరించడంలో మరింత చొరవ చూపాలని, ప్రభావవంతంగా, సమర్ధవంతంగా పని చేయాలని ఇరుపక్షాల నేతలు పిలుపునిచ్చారు. సంస్కరణలతో కూడిన, విస్తరించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి ఉక్రెయిన్ తన మద్దతును పునరుద్ఘాటించింది.
ఉక్రెయిన్ దేశం అంతర్జాతీయ సౌర వేదికలో (ఐఎస్ ఏ) ఎప్పుడు చేరుతుందా అని తాము ఎదురు చూస్తున్నట్టు భారత్ తెలిపింది.
ద్వైపాక్షిక సంబంధాల మొత్తం స్పెక్ట్రమ్‌పై నాయకుల సమగ్ర చర్చలు , భాగస్వామ్య ఆసక్తి తో కూడిన ప్రాంతీయ ,ప్రపంచ సమస్యలపై అభిప్రాయాల మార్పిడి అనేది భారతదేశం-ఉక్రెయిన్ సంబంధాల్లోని లోతును, పరస్పర అవగాహనను, నమ్మకాన్ని ప్రతిఫలించింది.
పర్యటన సందర్భంగా తనకు, తన ప్రతినిధి బృందానికి ఉక్రెయిన్ అందించిన సాదరమైన ఆతిథ్యానికిగాను అధ్యక్షుడు శ్రీ జెలెన్ స్కీకి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాలకు అనుకూలమైన సమయంలో భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ జెలెన్ స్కీని ఆహ్వానించారు.
****
Sharing my remarks during meeting with President @ZelenskyyUa. https://t.co/uqnbBsHfmf
— Narendra Modi (@narendramodi) August 23, 2024