ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం భారత ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం సవరించిన నమూనాకు ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న భారత ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం (బీ ఐ టీ) స్థానంలో ఇది అమలులోకి వస్తుంది. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాలు (సీ ఈ సీ ఏ లు), సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలు ( సీ ఈ పీ ఏ లు), స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్ టీ ఏ లు) వంటి వాటికి అనుగుణంగా ఇప్పటికే అమలులో ఉన్న బిఐటిల పునర్ నవీకరణకు జరిగే చర్చలతో పాటు భవిష్యత్తులో కుదుర్చుకోనున్న బీ ఐ టీ లకు కూడా ఈ కొత్త నమూనా వర్తిస్తుంది.
ఈ కొత్త నమూనా బీ ఐ టీ దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్లు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టే భారత ఇన్వెస్టర్లకు అంతర్జాతీయంగా అమలులో ఉన్న విధి విధానాలకు అనుగుణంగా తగు రక్షణలు కల్పిస్తుంది. ఇన్వెస్టర్ల హక్కులు, ప్రభుత్వ బాధ్యతల మధ్య సమతూకాన్ని తీసుకువస్తుంది.
చట్టపరంగా సమస్యలు పరిష్కరించుకునేందుకు ఒక వేదికను ఏర్పాటు చేయడంతో పాటు, ఎలాంటి వివక్ష లేకుండా స్వేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని ఇనుమడింపచేస్తుంది. ఎఫ్ డీ ఐ లకు భారత్ ను ఆకర్షణీయమైన గమ్యంగా మార్చడంతో పాటు విదేశాలకు వెళ్ళే భారతీయ ఎఫ్ డీ ఐ లకు కూడా అవసరమైన రక్షణలు బీ ఐ టీ కల్పిస్తుంది.
పెట్టుబడులకు ఎంటర్ ప్రై జ్ ఆధారిత నిర్వచనం ఇవ్వడం, చక్కని విధానాల ద్వారా వివకు తావు ఉండని, జాతీయ స్థాయి కార్యాచరణ, మరింత మెరుగులు దిద్దిన ఇన్వెస్టర్ల వివాదాల పరిష్కార యంత్రాంగం, వివాదాల పరిష్కారానికి అంతర్జాతీయ న్యాయస్థానాలకు పోయే ముందు దేశీయంగా పరిష్కార యంత్రాంగాలను ఆశ్రయించే అవకాశం కల్పించడం, ట్రై బ్యునళ్ళ అధికారాలను నగదు పరమైన పరిహారానికి మాత్రమే పరిమితం చేయడం ఈ కొత్త బీ ఐ టీ ప్రధాన లక్షణాలు. ప్రభుత్వానికి గల నియంత్రణాపరమైన అధికారాలు చెక్కు చెదరకుండా చూసేందుకు ప్రభుత్వ వస్తు సమీకరణ, సబ్సిడీలు, నిర్బంధ లైసెన్సులు వంటి వాటికి కొత్త బీ ఐ టీ మినహాయింపులు ఇచ్చింది.
నేపథ్యం :
తొలి బీ ఐ టీ పై భారత ప్రభుత్వం 1994 మార్చి 14వ తేదీన సంతకం చేసింది. అప్పటి నుంచి ఇప్పటికి 83 దేశాలతో ప్రభుత్వం బీ ఐ టీ లను కుదుర్చుకుంది. ఈ బీ ఐ టీలన్నింటి పైనా భారత నమూనా బీ ఐ టీ 1993కి అనుగుణంగా చర్చలు జరిగాయి.
1993 నుంచి సామాజిక పరమైన, ఆర్థిక పరమైన మార్పులు అనేకం చోటు చేసుకున్నాయి. విదేశీ పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వ నియంత్రణలు రూపొందాయి. కేంద్ర, రాష్ర్టాల స్థాయిలో పెట్టుబడులను నియంత్రించే పలు చట్టాలు వచ్చాయి. అలాగే అంతర్జాతీయంగాను, సార్వత్రికంగాను, పెట్టబడిదారులు- ప్రభుత్వాల మధ్య ఏర్పడే వివాదాల పరిష్కార ట్రై బ్యునళ్ళ పరంగాను ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.