Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత-గ్రీస్ ప్రధానమంత్రుల సమావేశం

భారత-గ్రీస్ ప్రధానమంత్రుల సమావేశం


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏథెన్స్‌’లో 2023 ఆగస్టు 25న గ్రీస్‌ ప్రధాని గౌరవనీయ ‘కిరియాకోస్‌ మిత్సోతాకిస్‌’తో  సమావేశమయ్యారు. దేశాధినేతలిద్దరూ ముఖాముఖి స్థాయితోపాటు ప్రతినిధుల స్థాయి సమావేశాల్లో చర్చలు నిర్వహించారు. గ్రీస్‌ దేశంలో కార్చిచ్చు చెలరేగి అపార ప్రాణ-ఆస్తి నష్టం సంభవించడంపై ప్రధాని మోదీ ఈ సందర్భంగా  సంతాపం ప్రకటించారు. కాగా, ఇటీవల ‘చంద్రయాన్‌’ విజయాన్ని గ్రీస్‌ ప్రధాని మిత్సోతాకిస్‌ మానవాళికే విజయంగా అభివర్ణిస్తూ ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.

   ఇద్దరు దేశాధినేతల మధ్య వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, డిజిటల్ చెల్లింపులు, షిప్పింగ్, ఫార్మా, వ్యవసాయం, వలసలు-చలనశీలత, పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి, సంస్కృతి, విద్య, ప్రజల మధ్య సంబంధాలుసహా ద్వైపాక్షిక భాగస్వామ్యంలోని వివిధ కోణాలు స్పృశిస్తూ చర్చలు సాగాయి. ఐరోపా సమాఖ్య, ఇండో-పసిఫిక్, మధ్యధరా ప్రాంతాల అంశాలుసహా వివిధ బహుపాక్షిక అంశాలపైనా వారిద్దరూ చర్చించారు. అంతర్జాతీయ చట్టాలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను ప్రపంచ దేశాలన్నీ గౌరవించాల్సిన అవసరాన్ని వారిద్దరూ నొక్కిచెప్పారు. భారత్‌-గ్రీస్‌ స్నేహబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మలచుకోవడంపై ఉభయపక్షాలూ ఏకాభిప్రాయానికి వచ్చాయి.

*****