Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత ఇంధన వారోత్సవాల (ఎనర్జీ వీక్) సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

భారత ఇంధన వారోత్సవాల (ఎనర్జీ వీక్) సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం


గౌరవ కేంద్ర మంత్రివర్గ సభ్యులు, మాన్యులు, రాయబారులు, వివిధ సంస్థల సీఈఓ లు, గౌరవ అతిథులు, ఇతర ప్రముఖులు, సోదర సోదరీమణులారా,

 

భారత ఇంధన వారోత్సవాల (ఎనర్జీ వీక్) సందర్భంగా దేశ, ప్రపంచ నలుమూలల నుంచి యశోభూమికి తరలివచ్చిన మీ అందరికీ నమస్కారాలు! మీరు ఈ ఇంధన వార్షికోత్సవానికే కాదు, భారత ఇంధన లక్ష్యాల్లోనూ భాగస్వాములు. మీ అందరికీ, అలాగే విదేశాల నుంచి విచ్చేసిన అతిథులందరికీ నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.  

 

 

మిత్రులారా,

 

21వ శతాబ్దం భారత్‌దేనని నేడు ప్రపంచ నిపుణులంతా చెబుతున్నారు. భారత్ తన సొంత వృద్ధిని మాత్రమే కాకుండా.. ప్రపంచ వృద్ధి రేటును కూడా నడిపిస్తోంది. మన ఇంధన రంగం ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారత్ ఇంధన లక్ష్యాలు ఐదు మూల స్తంభాలపై ఆధారపడి ఉన్నాయి: వీటిలో మొదటిది మనం ఉపయోగించుకుంటున్న మన వనరులు, రెండోది ఆవిష్కరణల దిశగా ప్రోత్సాహం అందుకుంటున్న మన మేధోసంపత్తి, మూడోది మనం కలిగి ఉన్న ఆర్థిక బలం, రాజకీయ స్థిరత్వం, అలాగే నాల్గోది భారత్ వ్యూహాత్మక భౌగోళిక అనుకూలతలు ఇంధన వాణిజ్యాన్ని మరింత ఆకర్షణీయం, సులభతరం చేయడం. ఐదోది, ప్రపంచ సుస్థిరత విషయంలో భారత్ నిబద్ధత. ఈ ఐదు అంశాలు భారత ఇంధన రంగంలో కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి.  

మిత్రులారా,

 

‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) సాధనలో రాబోయే రెండు దశాబ్దాలు చాలా కీలకమైనవి. రాబోయే ఐదేళ్లలో మనం అనేక ముఖ్యమైన మైలురాళ్లు దాటబోతున్నాం. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడం, భారత రైల్వేలు నికర జీరో కర్బన ఉద్గార లక్ష్యాన్ని చేరుకోవడం, ఏటా ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడం వంటి లక్ష్యాలు మనం నిర్దేశించుకున్నాం. ఈ లక్ష్యాలు ప్రతిష్టాత్మకంగా అనిపించినా, గత దశాబ్దంలో సాధించిన విజయాలు మనం వాటిని సాధిస్తామనే విశ్వాసాన్ని ఇస్తున్నాయి.

 

మిత్రులారా,

 

గత పదేళ్లలో, భారత్ పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చెందింది. ఈ కాలంలో, మన సౌరశక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని 32 రెట్లు పెంచుకున్నాం. నేడు, సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ప్రపంచం లోనే మూడో అతిపెద్ద దేశంగా నిలిచింది. మన శిలాజేతర ఇంధన సామర్థ్యం మూడు రెట్లు పెరిగింది. పారిస్ ఒప్పందం లక్ష్యాలను అనుకున్న దానికంటే ముందుగానే చేరుకున్న మొదటి జీ20 దేశంగా భారత్ నిలిచింది. మనం మన లక్ష్యాలను త్వరగా చేరుకోగలమని నమ్మకంగా చెప్పడానికి ఒక ఉదాహరణ ఇథనాల్ మిశ్రమం. భారతదేశం ప్రస్తుతం 19 శాతం ఇథనాల్ మిశ్రమం వినియోగిస్తోంది, దీని ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతోంది, రైతుల ఆదాయం గణనీయంగా పెరగడం, కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు గణనీయంగా తగ్గడం కూడా సాధ్యమైంది. 2025 అక్టోబర్‌కి ముందే 20 శాతం ఇథనాల్ మిశ్రమం తప్పనిసరి చేసే దిశగా మేం పురోగమిస్తున్నాం. భారత్ బయోఫ్యూయల్స్ పరిశ్రమ వేగవంతమైన వృద్ధికి సిద్ధంగా ఉంది. మనకు 500 మిలియన్ మెట్రిక్ టన్నుల స్థిరమైన ఫీడ్‌స్టాక్ సామర్థ్యం ఉంది. భారత్ జీ20 అధ్యక్షత కాలంలో, గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ ఏర్పడి, క్రమంగా విస్తరిస్తూనే ఉంది, 28 దేశాలు, 12 అంతర్జాతీయ సంస్థలు దీనిలో చేరాయి. దీని ద్వారా వ్యర్థాలను సంపదగా మార్చడం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటు జరుగుతోంది.

 

 

 మిత్రులారా,

 

భారత్ తన హైడ్రోకార్బన్ వనరుల సామర్థ్యాన్ని పూర్తిగా అన్వేషించడానికి నిరంతర సంస్కరణలను అమలు చేస్తోంది. ప్రధాన ఆవిష్కరణలు, గ్యాస్ మౌలిక సదుపాయాల విస్తృత విస్తరణ కారణంగా, మన గ్యాస్ రంగం విస్తరిస్తోంది. ఇది మన ఇంధన రంగంలో సహజ వాయువు వాటాను పెంచింది. ప్రస్తుతం, భారత్ నాల్గో అతిపెద్ద శుద్ధి కేంద్రంగా ఉంది, అలాగే శుద్ధి సామర్థ్యాన్ని 20 శాతం పెంచడానికి కృషి జరుగుతోంది.

 

మిత్రులారా,

 

 

మన సెడిమెంటరీ బేసిన్లు అనేక హైడ్రోకార్బన్ వనరులను కలిగి ఉన్నాయి. వాటిలో చాలావరకు ఇప్పటికే గుర్తించినా, మరికొన్నింటిని కనుగొనాల్సి ఉంది. భారత్ అప్‌స్ట్రీమ్ రంగాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి, ప్రభుత్వం ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఎఎల్‌పి)ని ప్రవేశపెట్టింది. ప్రత్యేక ఆర్థిక మండలి లేదా సింగిల్-విండో క్లియరెన్స్ వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రభుత్వం ఈ రంగానికి సంపూర్ణ మద్దతును అందిస్తోంది. ఆయిల్‌ఫీల్డ్స్ రెగ్యులేషన్ & డెవలప్‌మెంట్ చట్టంలో సవరణల తరువాత, ఇప్పుడు విధానపరమైన స్థిరత్వం, లీజుల పొడగింపు, మెరుగైన ఆర్థిక నిబంధనల నుంచి సంబంధిత వర్గాలు ప్రయోజనం పొందుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ సంస్కరణలు సముద్ర ప్రాంతాల్లో చమురు, గ్యాస్ వనరుల అన్వేషణ, ఉత్పత్తిని సులభతరం చేయడంతో పాటు వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల నిర్వహణను సులభం చేస్తున్నాయి.

 

 

మిత్రులారా,

 

దేశంలో అనేక ఆవిష్కరణలు, విస్తరిస్తున్న పైప్‌లైన్ మౌలిక సదుపాయాల కారణంగా, సహజ వాయువు సరఫరా పెరుగుతోంది. ఫలితంగా, రాబోయే సంవత్సరాల్లో సహజ వాయువు వినియోగం కూడా పెరగనుంది, ఈ రంగంలో అనేక పెట్టుబడి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

 

మిత్రులారా,

 

భారత్ ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియాకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది, స్థానిక సరఫరా విభాగాలను బలోపేతం చేస్తోంది. భారత్‌లో పీవీ మాడ్యూల్స్‌తో సహా వివిధ రకాల హార్డ్‌వేర్ తయారీకి విస్తృత అవకాశాలు ఉన్నాయి. మేం స్థానిక తయారీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. గత దశాబ్దంలో, భారత్ సౌర పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యం 2 గిగావాట్ల నుంచి దాదాపు 70 గిగావాట్లకు పెరిగింది. ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకం ఈ రంగాన్ని మరింత ఆకర్షణీయంగా చేసింది, అధిక సామర్థ్యం గల సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీకి ఊతమిచ్చింది.

 

 

మిత్రులారా,

 

బ్యాటరీ, నిల్వ సామర్థ్య రంగాల్లో ఆవిష్కరణలు, తయారీ రెండింటికీ అపారమైన అవకాశాలు ఉన్నాయి. భారత్ ఎలక్ట్రిక్ మొబిలిటీ దిశగా వేగంగా అడుగులేస్తోంది. ఇంత పెద్ద దేశ అవసరాలను తీర్చడానికి, బ్యాటరీ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యం విషయాల్లో మన కృషిని మరింత వేగవంతం చేయాల్సి ఉంది. అందుకే, ఈ ఏడాది బడ్జెట్‌లో హరిత ఇంధనాన్ని ప్రోత్సహించే అనేక ప్రకటనలు ఉన్నాయి. కోబాల్ట్ పౌడర్, లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాలు, సీసం, జింక్ వంటి ఇతర సంక్లిష్ట ఖనిజాలతో సహా ఈవీ, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి సంబంధించిన వివిధ భాగాలపై ప్రభుత్వం సాధారణ కస్టమ్స్ సుంకాలను తొలగించింది. దేశంలో బలమైన సరఫరా వ్యవస్థను నెలకొల్పడంలో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ కీలక పాత్ర పోషిస్తుంది. అదనంగా, మేం నాన్-లిథియం బ్యాటరీ రంగ అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నాం. ఈ బడ్జెట్ అణు విద్యుత్ రంగానికి కూడా పెద్దపీట వేసింది. ఇంధన రంగంలో పెట్టుబడులు యువతకు అనేక పర్యావరణ హితమైన కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి.

మిత్రులారా,

 

భారత ఇంధన రంగంలో అన్ని వర్గాల ప్రజలకు అవకాశం కల్పించడం ద్వారా ఈ రంగాన్ని మరింత శక్తిమంతం చేస్తున్నాం. సాధారణ కుటుంబాలను, రైతులను ఇంధన తయారీదారులుగా మార్చాం. గతేడాది మేం ప్రధాన్‌మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభించాం. ఈ పథకం పరిధి కేవలం ఇంధన ఉత్పత్తికి మించినది. ఇది సౌర రంగంలో కొత్త నైపుణ్యాలను పెంపొందిస్తోంది, నూతన సేవారంగాన్ని ఆవిష్కరిస్తోంది, మీ కోసం పెట్టుబడి అవకాశాలను పెంచుతోంది.

 

 

మిత్రులారా,

 

మన ప్రకృతిని సుసంపన్నం చేస్తూనే మన వృద్ధికి శక్తినిచ్చే ఇంధన పరిష్కారాలను అందించడానికి భారత్ కట్టుబడి ఉంది. ఈ ఇంధన వారోత్సవాలు ఈ దిశగా నూతన మార్గాలకు దారి తీస్తాయని నేను విశ్వసిస్తున్నాను. మీరంతా భారత్‌లో ఈ దిశగా ప్రతీ అవకాశాన్ని అన్వేషించి వాటిని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు.

 

 

ధన్యవాదాలు.

 

 

***