భారత ఇంధన వారోత్సవం–2025 సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. యశోభూమిలో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ.. ఇక్కడికి హాజరైన వారు ఇంధన వారోత్సవంలో భాగం మాత్రమే కాదని, భారత ఇంధన ఆశయాల్లోనూ అంతర్భాగమని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన విశిష్ట అతిథులు సహా సమావేశంలో పాల్గొన్న వారందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమంలో వారి పాత్ర కీలకమైనదని ఆయన అన్నారు.
21వ శతాబ్దం భారతదేశానిదేనని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు స్పష్టం చేస్తుండడాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన శ్రీ మోదీ.. ‘‘స్వీయ వృద్ధిని మాత్రమే కాదు… ప్రపంచ వృద్ధికి కూడా భారత్ చోదక శక్తిగా నిలుస్తోంది. అందులో ఇంధన రంగం గణనీయమైన పాత్ర పోషిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. వనరుల సద్వినియోగం– ఆవిష్కరణల దిశగా మేధావులను ప్రోత్సహించడం– ఆర్థిక బలంతోపాటు రాజకీయ స్థిరత్వం– ఇంధన వాణిజ్యాన్ని ఆకర్షణీయమూ, సులభతరమూ చేసే భౌగోళిక వ్యూహం– అంతర్జాతీయ సుస్థిరత పట్ల నిబద్ధత… అనే ఐదు అంశాలు భారత ఇంధన ఆకాంక్షలకు మూలాధారాలని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాలు దేశ ఇంధన రంగంలో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
వికసిత భారత్ కోసం వచ్చే రెండు దశాబ్దాలు కీలకమైనవని, రాబోయే ఐదేళ్లలో అనేక ముఖ్య విజయాలను సాధిస్తామని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, భారతీయ రైల్వేల్లో కర్బన ఉద్గారాలను శూన్యస్థితికి చేర్చడం, ఏటా అయిదు మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడం సహా భారతదేశం ముందు 2030 లోగా సాధించాల్సిన అనేక లక్ష్యాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్యాలు పెద్దవిగా కనిపించవచ్చని అంగీకరిస్తూనే, గత దశాబ్దంలో సాధించిన విజయాలు ఈ లక్ష్యాలను చేరుకోగలమన్న విశ్వాసాన్ని మనలో నింపాయన్నారు.
“పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి గత దశాబ్దంలో భారత్ ఎదిగింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. భారత సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గత పదేళ్లలో 32 రెట్లు పెరిగిందని, తద్వారా ప్రపంచంలో మూడో అతిపెద్ద సౌర విద్యుదుత్పాదక దేశంగా నిలిచిందని గుర్తు చేశారు. శిలాజేతర ఇంధన సామర్థ్యం మూడు రెట్లు పెరిగిందని, పారిస్ ఒప్పంద లక్ష్యాలను సాధించిన మొదటి జీ 20 దేశంగా భారత్ నిలిచిందని ఆయన తెలిపారు. ఇథనాల్ ను కలపడం విషయంలో భారత్ సాధించిన విజయాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ప్రస్తుతం అది 19 శాతానికి చేరిందనీ.. ఫలితంగా విదేశీ మారక నిల్వలు సమకూరాయని, రైతుల ఆదాయం పెరిగిందని, కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. ఈ ఏడాది అక్టోబరు నాటికి ఇరవై శాతం ఇథనాల్ సహిత ఇంధన సంకల్పాన్ని నెరవేర్చాలన్నది భారత్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 500 మిలియన్ టన్నుల పర్యావరణ హిత ముడి పదార్థాలతో భారత జీవ ఇంధన పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు. వీటితోపాటు జీ20కి భారత్ అధ్యక్షత వహించిన సమయంలో అంతర్జాతీయ జీవఇంధన కూటమిని నెలకొల్పిందనీ.. అది విస్తరిస్తూ వస్తోందని, ప్రస్తుతం 28 దేశాలతోపాటు 12 అంతర్జాతీయ సంస్థలు అందులో భాగస్వాములయ్యాయని చెప్పారు. ఈ కూటమి వ్యర్థాలను సంపదగా మారుస్తోందని, అత్యున్నత సంస్థలను (సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్) ఏర్పాటు చేస్తోందని అన్నారు.
హైడ్రోకార్బన్ వనరుల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడం కోసం భారత్ నిరంతరం సంస్కరణలు చేపడుతోందన్న శ్రీ మోదీ.. ముఖ్యమైన ఆవిష్కరణలు, గ్యాస్ వంటి మౌలిక సదుపాయాలను విస్తరించడం ఆ రంగంలో వృద్ధికి దోహదపడుతున్నాయని, దేశ ఇంధన మిశ్రమంలో సహజ వాయువు వాటాను పెంచుతున్నాయని తెలిపారు. భారత్ ప్రస్తుతం నాలుగో అతిపెద్ద శుద్ధి కేంద్రం (రిఫైనింగ్ హబ్)గా ఉందని, ఆ సామర్థ్యాన్ని 20 శాతం పెంచుకోవడానికి కృషిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
భారత అవక్షేప బేసిన్లలో అనేక హైడ్రోకార్బన్ వనరులున్నాయని, వాటిలో కొన్నింటిని ఇప్పటికే గుర్తించామని, మరికొన్నింటిని పరిశీలించాల్సి ఉందని చెబుతూ, భారత చమురు, గ్యాస్ పారిశ్రామిక రంగాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడం కోసం ఓపెన్ ఏకరేజ్ లైసెన్సింగ్ విధానాన్ని (ఓఏఎల్పీ) ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లను ప్రారంభించడం, ఒకే చోట అన్ని సేవలూ లభించే వ్యవస్థ ఏర్పాటు సహా ఈ రంగానికి ప్రభుత్వం సమగ్ర సహకారాన్ని అందించిందని ఆయన ఉద్ఘాటించారు. చమురు క్షేత్రాల నియంత్రణ, అభివృద్ధి చట్టానికి చేసిన మార్పుల వల్ల సంబంధిత భాగస్వాములకు విధానపరమైన స్థిరత్వం, లీజుల పొడిగింపు లభించడంతోపాటు ఆర్థిక నిబంధనలనూ అవి మెరుగుపరుస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. సముద్రరంగంలో చమురు గ్యాస్ వనరుల అన్వేషణకు, ఉత్పత్తిని పెంచడానికీ, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను నిర్వహించడానికీ ఈ సంస్కరణలు దోహదపడతాయన్నారు.
అనేక ఆవిష్కరణలు, పైప్ లైన్ మౌలిక సదుపాయాల విస్తరణ కారణంగా భారత్ లో సహజవాయువు సరఫరా పెరుగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనివల్ల సమీప భవిష్యత్తులోనే సహజవాయువు వినియోగం పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ రంగాల్లో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు.
“మేకిన్ ఇండియా, స్థానిక సరఫరా శ్రేణులపైనే భారత్ ప్రధానంగా దృష్టి సారించింది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. పీవీ మాడ్యూళ్లు సహా వివిధ రకాల హార్డ్ వేర్లను భారతదేశంలో తయారు చేయడానికి అనేక అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా తయారీ రంగానికి భారత్ చేయూతనిస్తోందని, తద్వారా సౌర పీవీ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యం గత పదేళ్లలో 2 నుంచి దాదాపు 70 గిగావాట్లకు పెరిగిందని ప్రధానమంత్రి తెలిపారు. అత్యున్నత నాణ్యతతో సౌర పీవీ మాడ్యూళ్ల తయారీని ప్రోత్సహిస్తూ.. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ఈ రంగాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చిందని ఆయన అన్నారు.
బ్యాటరీ, నిల్వ సామర్థ్యం రంగాల్లో ఆవిష్కరణ, తయారీలకు గణనీయమైన అవకాశాలున్నాయన్న ప్రధానమంత్రి.. రవాణా రంగంలో ఎలక్ట్రిక్ విధానాన్ని అవలంబించే దిశగా భారత్ వేగంగా పురోగమిస్తోందన్నారు. భారత్ వంటి పెద్ద దేశం అవసరాలకు తగినట్టుగా ఈ రంగంలో సత్వర చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుత బడ్జెట్ లో హరిత ఇంధనానికి చేయూతనిచ్చేలా అనేక ప్రకటనలున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన పలు వస్తువులను ప్రాథమిక కస్టమ్స్ సుంకాల నుంచి ప్రభుత్వం మినహాయించిందని తెలిపారు. కోబాల్ట్ పౌడర్, లిథియం–అయాన్ బ్యాటరీ వ్యర్థాలు, సీసం, జింక్, ఇతర కీలక ఖనిజాలు ఇందులో ఉన్నాయి. దేశంలో బలమైన సరఫరా శ్రేణిని నిర్మించడంలో జాతీయ కీలక ఖనిజాల మిషన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. లిథియమేతర బ్యాటరీ వ్యవస్థను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుత బడ్జెట్ అణు ఇంధన రంగానికి తెరతీసిందని, ఇంధన రంగంలో ప్రతీ పెట్టుబడి యువతకు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోందని, పర్యావరణ హితంగా ఉద్యోగావకాశాలను సృష్టిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
“భారత ఇంధన రంగాన్ని బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ప్రజలను సాధికారులను చేస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సామాన్య కుటుంబాలను, రైతులను ప్రభుత్వం ఇంధనోత్పత్తిదారులుగా మార్చిందని వ్యాఖ్యానించారు. గతేడాది ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని, ఇది ఒక్క విద్యుదుత్పత్తికే పరిమితం కాదని తెలిపారు. ఈ పథకం సౌర రంగంలో కొత్త నైపుణ్యాలను సృష్టిస్తోందని, కొత్త సేవా వ్యవస్థను రూపొందిస్తోందని, పెట్టుబడి అవకాశాలను పెంచుతోందని ఆయన పేర్కొన్నారు.
వృద్ధికి ఊతమిచ్చే, ప్రకృతిని సుసంపన్నం చేసే ఇంధన పరిష్కారాలను అందించడంలో భారత నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ దిశగా కచ్చితమైన ఫలితాలను ఇంధన వారోత్సవం ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ లో ఉద్భవిస్తున్న ప్రతీ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Sharing my remarks at the @IndiaEnergyWeek. https://t.co/LR166lIqyF
— Narendra Modi (@narendramodi) February 11, 2025
***
MJPS/SR
Sharing my remarks at the @IndiaEnergyWeek. https://t.co/LR166lIqyF
— Narendra Modi (@narendramodi) February 11, 2025