Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత, అమెరికా ఉమ్మడి ప్రకటన

భారత, అమెరికా ఉమ్మడి ప్రకటన


భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జోసెఫ్  ఆర్ బైడెన్  జూనియర్  కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ స్వాగతం పలికారు. భారత, అమెరికా దేశాల మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ఇద్దరు నేతలు తిరిగి ధ్రువీకరించారు. 2023 జూన్ లో ప్రధానమంత్రి శ్రీ మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న చారిత్రక విజయాల అమలులో సాగుతున్న పురోగతిని ఉభయులు ప్రశంసించారు.

బహుముఖీన ప్రపంచ అజెండాలోని అన్ని అంశాలపై భారత-అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విశ్వాసం, పరస్పర అవగాహన ప్రాతిపదికన ముందుకు నడిపే కృషిని కొనసాగించాలని ఉభయులు తమ ప్రభుత్వాలకు పిలుపు ఇచ్చారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, సమ్మిళితత్వం, బహుముఖీనత, పౌరులందరికీ సమానావకాశాలు అనే ఉమ్మడి విలువలే ఉభయ దేశాల విజయాలకు కీలకమని వారు పునరుద్ఘాటించారు.  ఆ విలువలే ఉభయ దేశాల బంధాన్ని పటిష్ఠం చేస్తాయన్నారు.

భారత జి-20 అధ్యక్షతను అధ్యక్షుడు బైడెన్  ప్రశంసిస్తూ కీలక ఫలితాలు అందించగల వేదికగా జి-20 సామర్థ్యాన్ని మరింత  స్పష్టంగా ప్రదర్శించారని పేర్కొన్నారు. జి-20 పట్ల ఉభయ నాయకులు తమ కట్టుబాటును పునరుద్ఘాటిస్తూ న్యూఢిల్లీలో జరుగుతున్న జి-20 నాయకుల శిఖరాగ్ర సదస్సు సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడం, బహుముఖీన సహకారాన్ని విస్తరించడం, అన్ని దేశాలు ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి సమ్మిళిత ఆర్థిక విధానాలపై ప్రపంచం స్థాయిలో ఏకాభిప్రాయ సాధన ప్రత్యేకించి బహుముఖీన అభివృద్ధి బ్యాంకుల వ్యవస్థను పటిష్ఠం చేసి, స్థాయి పెంచడం వంటి అంశాలపై ఉమ్మడి లక్ష్యాలను మరింత ముందుకు నడిపే దిశగా మంచి ఫలితాలు సాధించగలదన్న విశ్వాసం  ప్రకటించారు.

స్వేచ్ఛాయుతం, బహిరంగం, సమ్మిళితంగా ఉంటూ ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని నిలబడగల విధంగా ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని తీర్చి దిద్దడంలో క్వాడ్  ప్రాధాన్యతను ప్రధానమంత్రి శ్రీ మోదీ, అధ్యక్షుడు బైడెన్ పునరుద్ఘాటించారు. 2024 సంవత్సరంలో భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న క్వాడ్  నాయకుల శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షుడు బైడెన్  ను ఆహ్వానించేందుకు ప్రధానమంత్రి శ్రీ మోదీ ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. 2023 జూన్ లో ఐపిఓఐలో చేరాలన్న అమెరికా నిర్ణయంతో పాటు ఇండో-పసిఫిక్ ఇనీషియేటివ్  పిల్లర్  ఆన్ ట్రేడ్ కనెక్టివిటీ అండ్ మారిటైమ్ ట్రాన్స్ పోర్ట్  వ్యవస్థకు సహనాయకత్వం వహించాలన్న అమెరికా నిర్ణయాన్ని భారతదేశం ఆహ్వానించింది.

ప్రపంచ పాలనా యంత్రాంగం మరింత సమ్మిళితం, ప్రాతినిథ్యం గలదిగా ఉండాలన్న అంశానికి మద్దతును కొనసాగిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండుకు అధ్యక్షుడు బైడెన్  తమ మద్దతును పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగానే 2028-29లో యుఎన్ఎస్ సిలో నాన్-పెర్మనెంట్ సీటుకు మరోసారి భారతదేశ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. యుఎన్  భద్రతా మండలి శాశ్వత, నాన్-పెర్మనెంట్ విభాగాలు రెండింటినీ విస్తరించడం సహా ఐక్యరాజ్య సమితి సంస్కరణల అజెండాకు మరింత సమగ్రత కల్పించేందుకు, తద్వారా సమకాలీన వాస్తవాలను మరింతగా  ప్రతిబింబించేలా చేయడానికి వ్యవస్థను సంస్కరించి, పటిష్ఠ పరచాల్సిన అవసరం ఉన్నదని ఉభయ నాయకులు మరోసారి దృఢ స్వరంతో ప్రకటించారు.

ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత లోతుగా పాదుకునేలా చేయడంలో టెక్నాలజీ పాత్ర కీలకంగా ఉంటుందని ప్రధానమంత్రి శ్రీ మోదీ, అధ్యక్షుడు బైడెన్   పునరుద్ఘాటించారు. ఉభయ దేశాల భాగస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య  సంస్థల పరస్పర విశ్వాసం, నమ్మకం ప్రాతిపదికన మరింత బహిరంగమైన, అందరికీ అందుబాటులో ఉండగల, సురక్షితమైన, ఎలాంటి ప్రతికూలతలనైనా తట్టుకోగల సాంకేతిక వ్యవస్థల నిర్మాణం కోసం ఇండియా-యుఎస్  ఇనీషియేటివ్  ఆన్  క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ (ఐసెట్) ద్వారా జరుగుతున్న కృషిని వారు కొనియాడారు. 2024 ప్రారంభంలో ఉభయ దేశాల భద్రతా సలహాదారుల స్థాయిలో జరుగనున్న వార్షిక ఐసెట్ సమీక్ష వరకు జోరును కొనసాగించేలా 2023 సెప్టెంబరులో ఐసెట్ మధ్యకాలిక సమీక్ష నిర్వహించాలని భారత్, అమెరికా నిర్ణయించాయి.  

చంద్రమండలం దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని విజయవంతంగా దింపినందుకు, తొలి సోలార్  మిషన్  ఆదిత్య-ఎల్ 1ను విజయవంతంగా ప్రయోగించినందుకు ప్రధానమంత్రి శ్రీ మోదీని, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్ర్తవేత్తలను అధ్యక్షుడు బైడెన్  అభినందించారు. ప్రస్తుతం పని చేస్తున్న భారత-అమెరికా సివిల్ అంతరిక్ష జాయింట్ వర్కింగ్  గ్రూప్  నకు అనుబంధంగా అంతరిక్ష సహకారంలో అన్ని రంగాల్లోనూ కొత్త శిఖరాలు చేరేందుకు వీలుగా వాణిజ్యపరమైన అంతరిక్ష సహకార వర్కింగ్  గ్రూప్  ఏర్పాటు చేసే దిశగా సాగుతున్న ప్రయత్నాలను ఉభయ నాయకులు ఆహ్వానించారు. అంతరిక్షం వెలుపల అన్వేషణల విభాగంలో మరింత లోతైన భాగస్వామ్యం కోసం విధివిధానాలు, సామర్థ్యాల నిర్మాణం, 2024లో అంతర్జాతీయ స్పేస్  స్టేషన్ లో ఉమ్మడి సహకారానికి శిక్షణపై ఇస్రో, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్  అడ్మినిస్ర్టేషన్ (నాసా) చర్చలు ప్రారంభించాయి. 2023 చివరికి మానవ అంతరిక్ష నౌక కోసం వ్యూహాత్మక యంత్రాంగం ఖరారుకు ప్రయత్నాలు కొనసాగిస్తారు. మైనర్  ప్లానెట్  సెంటర్ ద్వారా ఉల్కాపాతాలను గుర్తించే విభాగంలో భారతదేశం భాగస్వామ్యానికి అమెరికా మద్దతు ఇవ్వడం సహా ఉల్కాపాతాలు, భూమికి సమీపంలోకి వచ్చే ఖగోళ వస్తువుల నుంచి భూమండలాన్ని, అంతరిక్ష ఆస్తులను రక్షించుకునే విభాగంలో కూడా సహకరించుకోవాలని భారత, అమెరికా దేశాలు భావిస్తున్నాయి.

ఎలాంటి ప్రతికూలతలనైనా తట్టుకోగల ప్రపంచ సెమీ కండక్టర్  సరఫరా వ్యవస్థల నిర్మాణంలో సహకారానికి మద్దతు అందించాలని నాయకులు పునరుద్ఘాటించారు. దీనికి సంబంధించిన పరిశోధన, అభివృద్ధి విస్తరణకు మైక్రోచిప్  టెక్నాలజీ  ఇంక్ 30 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్  చేయడంతో పాటు భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి, ఇంజనీరింగ్ కార్యకలాపాల విస్తరణపై రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశంలో 4 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్  చేసేందుకు అడ్వాన్స్  డ్ మైక్రో డివైస్  ప్రకటించింది. 2023 జూన్ లో అమెరికన్  కంపెనీలు మైక్రాన్, లామ్  రీసెర్చ్, అప్లైడ్  మెటీరియల్స్  చేసిన ప్రకటనల అమలుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల ఉభయ నాయకులు సంతృప్తి ప్రకటించారు.

వెండర్లు, ఆపరేటర్ల మధ్య మరింత లోతైన ప్రభుత్వ-ప్రైవేటు సహకారంలో తొలి అడుగుగా సురక్షితమైన, విశ్వసనీయమైన టెలీకమ్యూనికేషన్ల వ్యవస్థ, ఎలాంటి  ప్రతికూలతలనైనా తట్టుకోగల సరఫరా వ్యవస్థల నిర్మాణం, డిజిటల్  ఇంక్లూజన్  కోసం భారత్ 6జి అలయెన్స్, అలయెన్స్ ఫర్ టెలీకమ్యూనికేషన్స్  ఇండస్ర్టీ సొల్యూషన్స్ నిర్వహణలోని  నెక్స్ట్  జి మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానించారు. ఓపెన్  రాన్, 5జి/6జి టెక్నాలజీల విభాగంలో పరిశోధన, అభివృద్ధి సహకారం కోసం రెండు జాయింట్  టాస్క్  ఫోర్స్  ల ఏర్పాటును వారు ఆమోదించారు. వీటిని క్షేత్ర స్థాయిలో ప్రవేశపెట్టడానికి ముందు అమెరికాకు చెందిన ఓపెన్  రాన్  తయారీ  సంస్థ భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ టెలికాం ఆపరేటర్  వద్ద 5జి ఓపెన్  రాన్ ను ప్రయోగాత్మక ప్రాతిపదికపై అమలుపరుస్తారు. అమెరికన్  రిప్, రిప్లేస్  మెంట్  ప్రోగ్రామ్  లో భారతీయ కంపెనీల భాగస్వామ్యం కోసం నాయకులు ఎదురు చూస్తున్నారు. అమెరికాలో రిప్,  రిప్లేస్  పైలట్ లో భారతదేశం సహకారాన్ని అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానించారు.

అంతర్జాతీయ క్వాంటమ్ మార్పిడి అవకాశాలకు వీలు కల్పించేందుకు క్వాంటమ్  విభాగంలో కూడా ద్వైపాక్షికంగాను, క్వాంటమ్  ఎంటాంగిల్మెంట్  ఎక్స్ఛేంజ్  ల ద్వారా భారతదేశంతో ఉమ్మడిగా పని చేసేందుకు ఆసక్తిని అమెరికా పునరుద్ఘాటించింది.  క్వాంటమ్  ఎకనామిక్  డెవలప్  మెంట్  కన్సార్షియం సభ్య హోదాలో  కోల్కతాకు చెందిన ఎస్.ఎన్.బోస్  నేషనల్  సెంటర్ ఫర్  బేసిక్  సైన్సెస్ భాగస్వామ్యాన్ని అమెరికా ఆహ్వానించింది. అంతే కాదు, చికాగో  క్వాంటమ్  ఎక్స్ఛేంజి ఒక అంతర్జాతీయ భాగస్వామిగా బొంబాయికి చెందిన ఇండియన్ ఇన్  స్టిట్యూట్  ఆఫ్  టెక్నాలజీ (ఐఐటి) చేరుతోంది.

బయో టెక్నాలజీ, బయో మాన్యుఫాక్చరింగ్  ఇన్నోవేషన్స్ విభాగంలో శాస్ర్తీయ, సాంకేతిక పరిశోధనల సహకారానికి అమెరికాకు చెందిన నేషనల్  సైన్స్  ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్), భారతదేశానికి చెందిన బయోటెక్నాలజీ శాఖ మధ్య కుదిరిన అంగీకారాన్ని కూడా నాయకులు ప్రశంసించారు. సెమీ కండక్టర్  పరిశోధన, కొత్త తరం కమ్యూనికేషన్  వ్యవస్థలు, సైబర్   సెక్యూరిటీ, సుస్థిరత, హరిత టెక్నాలజీలు, ఇంటెలిజెంట్  రవాణా వ్యవస్థల విభాగాల్లో  విద్యా, పారిశ్రామిక సహకారానికి ఎన్ఎస్ఎఫ్, భారతదేశానికి చెందిన ఎలక్ర్టానిక్స్, ఐటి శాఖ చేసిన ప్రతిపాదనను కూడా వారు ఆహ్వానించారు.  

ఎలాంటి ప్రతికూలతలనైనా తట్టుకోగల టెక్నాలజీ విలువ ఆధారిత వ్యవస్థల నిర్మాణం, డిఫెన్స్  పారిశ్రామిక వ్యవస్థల అనుసంధానతకు కట్టుబాటును పునరుద్ఘాటిస్తూ భారత, అమెరికా పరిశ్రమలు, ప్రభుత్వ, విద్యా సంస్థల మధ్య మరింతగా సాంకేతిక భాగస్వామ్యం, కో-డెవలప్  మెంట్, కో-ప్రొడక్షన్ అవకాశాలకు దోహదపడే ప్రోత్సాహక విధానాలు, నియంత్రణల అమలుకు పాలనా యంత్రాంగాలు చేస్తున్న కృషిని నాయకులు ఆహ్వానించారు. 2023 జూన్ లో ప్రారంభించిన ద్వైపాక్షిక వ్యూహాత్మక వాణిజ్య చర్చల పరిధిలో అంతర్  ఏజెన్సీ పర్యవేక్షణ యంత్రాంగం కృషిని వారు ఆహ్వానించారు.

కనీసం కోటి డాలర్ల ప్రారంభ పెట్టుబడితో  ఇండియా-యుఎస్ గ్లోబల్  చాలెంజెస్  ఇన్  స్టిట్యూట్ ఏర్పాటు కోసం కౌన్సిల్  ఆఫ్  ఇండియన్ ఇన్  స్టిట్యూట్స్  ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి కౌన్సిల్), అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీస్ (ఎఎయు) అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని  నాయకులు ఆహ్వానించారు. సుస్థిర ఇంధనాలు, వ్యవసాయం, ఆరోగ్యం, మహమ్మారులపై పోరాట సంసిద్ధత; సెమీ కండక్టర్  టెక్నాలజీ, తయారీ; అడ్వాన్స్  డ్  మెటీరియల్స్, టెలీకమ్యూనికేషన్లు, కృత్రిమ మేథ, క్వాంటమ్  సైన్స్  సహా సైన్స్  అండ్ టెక్నాలజీలో కొత్త విభాగాల్లో అధ్యయనానికి ఎఎయు, ఐఐటి సభ్య సంస్థలు సహా సభ్యత్వాలు లేని విద్యా సంస్థలను కూడా ఒకే వేదిక పైకి తెచ్చి భాగస్వాములను చేసేందుకు ఈ గ్లోబల్  చాలెంజెస్  ఇన్  స్టిట్యూట్  కృషి చేస్తుంది. న్యూయార్క్  విశ్వవిద్యాలయం-టాండన్, ఐఐటి కాన్పూర్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ సెంటర్ వంటి సంస్థల మధ్య విద్యా రంగ భాగస్వామ్యాలు,  బఫెలోలోని స్టేట్  యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్, ఐఐటి ఢిల్లీ, కాన్పూర్, జోధ్  పూర్, బిహెచ్ యు వంటి సంస్థల మధ్య క్రిటికల్, ఎమర్జింగ్  టెక్నాలజీల విభాగంలో పెరుగుతున్న బహుళ సంస్థల సహకార విద్యా భాగస్వామ్యాలను నాయకులు ఆహ్వానించారు.

2030 నాటికి డిజిటల్  లింగ వ్యత్యాసం తొలగింపునకు జి-20 కట్టుబాటులో భాగంగా డిజిటల్  ఎకానమీలో లింగపరమైన డిజిటల్ వ్యత్యాసాన్ని తొలగించే ప్రయత్నాల ప్రాధాన్యాన్ని నాయకులు పునరుద్ఘాటించారు. డిజిటల్ లింగ వ్యత్యాసం తొలగింపునకు ప్రభుత్వాలు, ప్రైవేట్  రంగ కంపెనీలు, ఫౌండేషన్లు, పౌర సమాజ, బహుముఖీన సంస్థల సహకారం కోసం మహిళా డిజిటల్  ఎకానమీ ఇనీషియేటివ్ కు వారు మద్దతు ప్రకటించారు.

అంతరిక్షం, ఎఐ, యాక్సిలరేటెడ్ రక్షణ పారిశ్రామిక సహకారం వంటి విభిన్న రంగాల్లో సహకారం విస్తరణ ద్వారా భారత-అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామ్యాన్ని లోతుగా పాదుకునేలా చేయడానికి ప్రధానమంత్రి శ్రీ మోదీ, అధ్యక్షుడు బైడెన్ తమ కట్టుబాటును పునరుద్ఘాటించారు.

భారతదేశంలో జిఇ ఎఫ్-414 జెట్ ఇంజన్ల తయారీ కోసం జిఇ ఏరోస్పేస్, హిందుస్తాన్  ఏరోనాటికల్  లిమిటెడ్ (హెచ్ఏఎల్) మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు  ప్రారంభించేందుకు, 2023 ఆగస్టు 29 నాటి కాంగ్రెస్  నోటిఫికేషన్  ప్రాసెస్  ను పూర్తి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను; కో-ప్రొడక్షన్, టెక్నాలజీ బదిలీ చర్యలు వేగవంతం చేసే చర్యలకు మద్దతు ఇవ్వడాన్ని నాయకులు ఆహ్వానించారు.

2023 ఆగస్టులో అమెరికా నౌకాదళం, మజగాన్  డాక్  షిప్  బిల్డర్స్ లిమిటెడ్ మధ్య కుదిరిన తాజా  ఒప్పందం పరిధిలో రెండో మాస్టర్  షిప్ రిపేర్ ఒప్పందం పూర్తి చేయడాన్ని నాయకులు ప్రశంసించారు. యుద్ధ రంగంలో ముందువరుసలో నిలిపే అమెరికన్  నౌకాదళం నౌకలు, విమానాలు, ఇతర పరికరాల మెయింటెనెన్స్, మరమ్మత్తులకు భారతదేశాన్ని వర్థమాన హబ్  గా తీర్చి దిద్దేందుకు ఉభయ వర్గాలు అంగీకరించాయి. భారతదేశానికి చెందిన రిపేర్, మెయింటెనెన్స్, ఓవర్  హాల్ సామర్థ్యాలు, విమాన వ్యవస్థల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అమెరికన్  పరిశ్రమ మరింత కట్టుబాటు ప్రకటించడాన్ని నాయకులు ఆహ్వానించారు.

భారత, అమెరికా దేశాలు ఉమ్మడిగా ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లను పరిష్కరించడంలో అమెరికా, భారత రక్షణ రంగాల ఇన్నోవేటివ్  ప్రయత్నాలను పెంపొందించే విస్తృత సహకార అజెండా ఏర్పాటు కోసం భారత-అమెరికా రక్షణ యాక్సిలరేషన్ ఎకో సిస్టమ్ (ఇండస్-ఎక్స్) టీమ్  చేస్తున్న కృషిని నాయకులు ప్రశంసించారు. ఇందులో భాగంగానే ఇండస్-ఎక్స్ పెన్ స్టేట్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంలో ఐఐటి కాన్పూర్  లో అకాడమియా స్టార్టప్ పార్టనర్ షిప్ కార్యక్రమం నిర్వహించింది. అలాగే 2023 ఆగస్టులో యుఎస్  యాక్సిటరేటర్  మెసర్స్ హాకింగ్ 4 అలీస్ (హెచ్4ఎక్స్), ఐఐటి హైదరాబాద్  భాగస్వామ్యంలో భారత స్టార్టప్  లకు జాయింట్  యాక్సిలరేటర్  ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. డిఫెన్స్  ఎక్సలెన్స్  లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ల ప్రకటనను, భాగస్వామ్య రక్షణ టెక్నాలజీ సవాళ్ల కోసం అమెరికన్ రక్షణ శాఖ  డిఫెన్స్  ఇన్నోవేషన్  యూనిట్ ప్రారంభ ప్రకటనను ఉభయ వర్గాలు ఆమోదించారు. భాగస్వామ్య రక్షణ టెక్నాలజీ సవాళ్లకు పరిష్కారాలు అభివృద్ధి చేసేందుకు స్టార్టప్ లను ఆహ్వానిస్తారు.

అన్ని విభాగాల్లోనూ భారత సాయుధ దళాల ఇంటెలిజెన్స్, గూఢచర్య, రికనైజాన్స్ (ఐఎస్ఆర్) సామర్థ్యాలను పెంచే రిమోట్  గా నడిపించే 31 జనరల్  ఆటమిక్స్ ఎంక్యు-9బి (16 స్కై గార్డియన్, 15 సీ గార్డియన్) విమానాల కొనుగోలుకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ అభ్యర్థన లేఖ జారీ చేయడాన్ని అధ్యక్షుడు బైడెన్  ఆహ్వానించారు.

జాతీయ వాతావరణ, ఇంధన పరివర్తన, ఇంధన భద్రత అవసరాలు తీర్చడంలో అణు ఇంధనం కీలక వనరు అని పునరుద్ఘాటిస్తూ ప్రధానమంత్రి శ్రీ మోదీ, అధ్యక్షుడు బైడెన్  అణు ఇంధనం, కొత్త తరానికి చెందిన చిన్న మాడ్యులర్  రియాక్టర్  టెక్నాలజీల ఉమ్మడి అభివృద్ధిలో భారత-అమెరికా సహకారం విస్తరణకు చర్చలు ముమ్మరం కావడాన్ని ఆహ్వానించారు. అణు సరఫరా బృందంలో భారతదేశం సభ్యత్వానికి అమెరికా తన కట్టుబాటును పునరుద్ఘాటిస్తూ ఈ లక్ష్యసాధనలో ఒకే తరహా భావాలు గల భాగస్వాములను కూడగట్టుకుని ముందుకు సాగేందుకు అంగీకరించింది.

2023 ఆగస్టులో జరిగిన భారత-అమెరికా పునరుత్పాదక ఇంధన టెక్నాలజీల కార్యాచరణ వేదిక (ఆర్ఇ-టాప్) ప్రారంభ సమావేశాన్ని నాయకులు ఆహ్వానించారు. ఈ వేదికపై ఉభయ దేశాలు లాబ్ నుంచి లాబ్ సహకారం; ఇన్నోవేటివ్  టెక్నాలజీల్లో ప్రయోగాలు,  పరీక్షలు; పునరుత్పాదక ఇంధనం, సంబంధిత టెక్నాలజీల అభివృద్ధిలో విధానపరమైన,  ప్రణాళికా భాగస్వామ్యాలు; పెట్టుబడులు, ఇంక్యుబేషన్, ఔట్  రీచ్ ప్రోగ్రామ్  లు; కొత్త, వర్థమాన పునరుత్పాదక టెక్నాలజీలు, ఇంధన వ్యవస్థల విభాగంలో శిక్షణ, నైపుణ్యాభివృద్ధి విభాగాల్లో సహకరించుకుంటారు.

రవాణా వ్యవస్థలో కర్బన వ్యర్థాలు తొలగించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ విద్యుత్  మొబిలిటీ రంగం విస్తరణకు భారతదేశంలో జరుగుతున్న పురోగతిని నాయకులు ఆహ్వానించారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు నిదుల సమీకరణ ద్వారా పేమెంట్  సెక్యూరిటీ యంత్రాంగం ఏర్పాటుకు ఉమ్మడి మద్దతును ప్రకటించారు. ఇది భారతదేశం ప్రకటించిన పిఎం ఇ-బస్ సేవా కార్యక్రమం కింద 10,000 మేడ్ ఇన్ ఇండియా విద్యుత్  బస్సుల కొనుగోలు, అనుబంధ చార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. ఇ-మొబిలిటీ ప్రపంచ సరఫరా వ్యవస్థను వైవిధ్యభరితంగా తీర్చి దిద్దడంలో ఉభయ వర్గాలు కలిసి పని చేయాలన్న కట్టుబాటు ప్రకటించాయి.

పెట్టుబడుల సమీకరణ వ్యయాలు తగ్గించుకునేందుకు, కొత్తగా పునరుత్పాదక ఇంధనం, బ్యాటరీ స్టోరేజి, ఎమర్జింగ్  గ్రీన్  టెక్నాలజీ ప్రాజెక్టులు అభివృద్ధి చేయడానికి అవసరమైన పెట్టుబడి వేదికల సృష్టికి భారత్, అమెరికా అంగీకరించాయి. ఇందులో భాగంగా భారతదేశానికి చెందిన నేషనల్ ఇన్వెస్ట్  మెంట్ అండ్ ఇన్  ఫ్రాస్ట్రక్చర్  ఫండ్, అమెరికాకు చెందిన డెవలప్  మెంట్  ఫైనాన్స్  కార్పొరేషన్ లెటర్స్  ఆఫ్  ఇంటెంట్ ను మార్చుకున్నాయి. దీని ద్వారా 50 కోట్ల డాలర్ల పెట్టుబడితో పునరుత్పాదక మౌలిక వసతుల పెట్టుబడి నిధిని ఏర్పాటు చేస్తారు.

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) వద్ద భారత, అమెరికా దేశాల మధ్య ఏడవది, చివరిది అయిన వివాదం పరిష్కారం కావడాన్ని నాయకులిద్దరూ ప్రశంసించారు.  2023 జూన్  లో ఆరు వివాదాల పరిష్కారం అనంతరం ఈ వివాదం కూడా  పరిష్కారమయింది.

భారత-అమెరికా వాణిజ్య చర్చల కింద ఆకాంక్షాపూరితమైన ‘‘ఇన్నోవేషన్  హ్యాండ్ షేక్’’  కార్యక్రమం అభివృద్ధిని నాయకులు ఆహ్వానించారు. దీని కింద రెండు ప్రధాన కార్యక్రమాలు (ఒకటి ఇండియాలో, మరొకటి అమెరికాలో) నిర్వహిస్తారు. ఉభయ దేశాల ఇన్నోవేషన్ వ్యవస్థల మధ్య అనుసంధానం ఏర్పాటుకు ప్రైవేట్  ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్  సంస్థలు, కార్పొరేట్  పెట్టుబడి శాఖలు, ప్రభుత్వ అధికారులను ఒకే వేదిక  పైకి తెస్తుంది.

కేన్సర్ పరిశోధన, నివారణ, నిరోధం, నిర్వహణలో ద్వైపాక్షిక సహకారం విస్తరణను నాయకులు ఆహ్వానిస్తూ 2023 నవంబరులో భారత-అమెరికా కేన్సర్  డైలాగ్  ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. సౌకర్యాలు అందుబాటులో లేని పట్టణ, గ్రామీణ సమాజాల్లో కేన్సర్  కేర్  పటిష్ఠతకు; కేన్సర్  జెనోమిక్స్, కొత్త డయాగ్నస్టిక్స్, థెరప్యూటిక్స్ అభివృద్ధిలో ప‌రిజ్ఞానం విస్తరణకు చర్చలు కేంద్రీకరిస్తారు. 2023 అక్టోబరులో వాషింగ్టన్  డిసిలో జరుగనున్న అమెరికా-భారత ఆరోగ్య చర్చలను గురించి  ప్రస్తావిస్తూ ఉభయ దేశాల మధ్య శాస్ర్తీయ, నియంత్రణ, ఆరోగ్య సహకారం పటిష్ఠతకు ఉమ్మడి కట్టుబాటును ప్రకటించారు.  

అమెరికన్ రక్షణ శాఖకు చెందిన పిఓడబ్ల్యు/ఎంఏఐ అకౌంటింగ్  ఏజెన్సీ, ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎన్ఎస్ఐ) మధ్య అవగాహన ఒప్పందం పునరుద్ధరణను నాయకులు ఆహ్వానించారు. రెండో ప్రపంచ యుద్ధంలో సేవలందించి అమరులైన అమెరికా సర్వీస్ సభ్యుల నిక్షేపాల రికవరీకి ఇది అవకాశం కల్పిస్తుంది.

ఉభయ ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యా  సంస్థల మధ్య అత్యున్నత స్థాయి సహకారం విస్తరణకు ప్రధానమంత్రి శ్రీ మోదీ, అధ్యక్షుడు బైడెన్ కట్టుబాటును ప్రకటించారు. సముజ్వలమైన, సుపంసన్న భవిష్యత్తుకు;  ప్రపంచ సంక్షేమానికి పాటు పడడానికి; స్వేచ్ఛాయుత, బహిరంగ, సమ్మిళిత, ప్రతికూలతను తట్టుకునే  భారత-పసిఫిక్ ప్రాంతం కోసం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుస్థిర భారత-అమెరికా భాగస్వామ్యం కోసం కృషి చేసేందుకు కూడా అంగీకరించారు.

 

***