Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్ 76వ గణతంత్ర దినోత్సవం.. ప్రపంచ నేతల శుభాకాంక్షలు.. ప్రధానమంత్రి ధన్యవాదాలు


భారత్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు వ్యక్తం చేశారు.

సామాజిక  మాధ్యమం ఎక్స్‌లో నేపాల్ ప్రధాని పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధాని ప్రతిస్పందిస్తూ:
‘‘ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ (@kpsharmaoli),  మీరు ఆప్యాయంగా తెలియజేసిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు. భారత్ గణతంత్రంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న క్రమంలో, మనం మన రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న చరిత్రాత్మక బంధాలకు  కూడా ఎంతో ప్రాధాన్యాన్నిస్తున్నాం.ఈ అనుబంధం రాబోయే కాలంలో కూడా మరింత బలపడుతూ ఉంటుందని నేను నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు.

మాల్దీవులు అధ్యక్షుడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధాని సమాధానాన్నిస్తూ:
‘‘అధ్యక్షుడు శ్రీ మొహమ్మద్ ముయిజూ (@MMuizzu), భారత్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. భారత్, మాల్దీవుల మధ్య దీర్ఘకాలంగా భాగస్వామ్యం వర్ధిల్లుతోందంటూ మీరు వ్యక్తం చేసిన భావనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ మైత్రిని, సహకార బంధాన్ని మరింత గాఢంగా మలచుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని పేర్కొన్నారు.

భూటాన్ ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధానమంత్రి బదులిస్తూ:
‘‘భారత గణతంత్రం 75 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా నా మిత్రుడు ప్రధాని శ్రీ శెరింగ్ తోబ్‌గే (@tsheringtobgay) , మీరు అందించిన ఆత్మీయ శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేం కూడా భారత్, భూటాన్ ల మధ్య గల అద్వితీయ, ప్రత్యేక భాగస్వామ్యానికి అత్యధిక ప్రాముఖ్యాన్నిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

నేపాల్ మాజీ ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధానమంత్రి ప్రత్యుత్తరాన్నిస్తూ:
‘‘భారత్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరందించిన శుభాకాంక్షలకుగాను శ్రీ శేర్ బహాదుర్ దేవ్‌బా (@SherBDeuba), మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఇరు దేశాల ప్రజల మధ్య చాలా కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న మిత్రపూర్వక సంబంధాలు మరింత బలపడాలని నేను కోరుకొంటున్నాను’’ అని పేర్కొన్నారు.

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధాని స్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘భారత్ గణతంత్ర దినోత్సవం సందర్బంగా  శ్రీ ఇబ్రహీం సోలిహ్ (@ibusolih), మీరు తెలిపిన హృదయపూర్వక శుభాకాంక్షలకుగాను ఇవే ధన్యవాదాలు.’’

*****

MJPS/SR/SKS