న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో గౌరవనీయ గణతంత్ర భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాననీయ గణతంత్ర బ్రెజిల్ సమాఖ్య అధ్యక్షులు లూయీ ఇనాసియో లూలా డిసిల్వా 2023 సెప్టెంబరు 10న సమావేశమయ్యారు.
భారత-బ్రెజిల్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం ఈ ఏడాది నిర్వహించుకోవడాన్ని వారిద్దరూ గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శాంతి, సహకారం, సుస్థిర ప్రగతి సాధన సహా ఉమ్మడి విలువలు-లక్ష్యాలు ప్రాతిపదికగా ద్వైపాక్షిక సంబంధాలు పురోగమించాయని నొక్కి చెప్పారు. బ్రెజిల్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతంతోపాటు అంతర్జాతీయ వ్యవహారాల్లో తమ విలక్షణ పాత్ర పోషణపై తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. వివిధ రెండు దేశాల మధ్య సంస్థాగత చర్చా యంత్రాంగాలు సాధించిన ప్రగతిపై ఉభయ పక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.
ఐక్యరాజ్య సమితి భద్రత మండలి (యుఎన్‌ఎస్‌సి)లో సమగ్ర సంస్కరణలపై తమ కట్టుబాటును ఇద్దరు దేశాధినేతలూ పునరుద్ఘాటించారు. మండలి విస్తరణ, వర్ధమాన దేశాల శాశ్వత-తాత్కాలిక సభ్యత్వాల పెరుగుదలసహా అంతర్జాతీయ శాంతి-భద్రతలకు ఎదురవుతున్న వర్తమాన సవాళ్లను ఎదుర్కోవడంలో దాని సామర్థ్యం, ప్రభావం, ప్రాతినిధ్యం, చట్టబద్ధతల మెరుగుదలకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. విస్తరించిన ‘యుఎన్‌ఎస్‌సి’’ో తమ దేశాల శాశ్వత సభ్యత్వం దిశగా పరస్పర మద్దతును కొనసాగిస్తామని వారిద్దరూ నొక్కిచెప్పారు.
జి-4, ఎల్.69 చట్రాల పరిధిలో బ్రెజిల్-భారత్ కలిసి పనిచేస్తూనే ఉంటాయని నేతలు పేర్కొన్నారు. భద్రత మండలి సంస్కరణలపై క్రమబద్ధ ద్వైపాక్షిక సమన్వయ సమావేశాల నిర్వహణకు వారు నిర్ణయించారు. ఐరాస భద్రత మండలి సంస్కరణలపై అంతర-ప్రభుత్వ చర్చల్లో ఎలాంటి ఫలితం రాకపోగా ప్రతిష్టంభన ఏర్పడటంపై వారిద్దరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత వ్యవధిలో నిర్దిష్ట ఫలితాల సాధన లక్ష్యంతో ఫలితం రాబట్టగల ప్రక్రియను అనుసరించాల్సిన తరుణం ఆసన్నమైందని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో 2028-2029కిగాను మండలిలో తాత్కాలిక సభ్యత్వంపై భారత్ అభ్యర్థిత్వానికి బ్రెజిల్ మద్దతిస్తుందని అధ్యక్షులు లూలా ప్రకటించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
సముచిత, నిష్పాక్షిక ఇంధన పరివర్తన అవసరాన్ని నాయకులిద్దరూ నొక్కిచెప్పారు. రవాణా రంగానికి సంబంధించి… ముఖ్యంగా వర్ధమాన దేశాలను కర్బనరహితం చేయడంలో జీవ ఇంధనాలు, బహుళ-ఇంధన వాహన వినియోగానికిగల కీలక పాత్రను వారు ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా జీవ ఇంధనానికి సంబంధించి ప్రభుత్వ-ప్రైవేట్ రంగాలతో కూడిన ద్వైపాక్షిక కార్యాచరణను వారు ప్రశంసించారు. అలాగే భారత జి-20 అధ్యక్షత కింద ప్రపంచ జీవ ఇంధన సంకీర్ణం (జిబిఎ) ప్రారంభం కావడం, రెండు దేశాలూ ఇందులో వ్యవస్థాపక సభ్యత్వం కలిగి ఉండటంపై అధినేతలిద్దరూ హర్షం వ్యక్తం చేశారు.
ప్రపంచంలో సుస్థిర ప్రగతితోపాటు పేదరికం-ఆకలి నిర్మూలన కృషిలో భాగంగా పరిష్కరించాల్సిన అతిపెద్ద సవాళ్లలో వాతావరణ మార్పు ఒకటని నాయకులిద్దరూ అంగీకారానికి వచ్చారు. తదనుగుణంగా వాతావరణ మార్పులపై ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడంతోపాటు మరింత లోతుగా, వైవిధ్యంతో అమలుపై తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అలాగే వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి తీర్మాన చట్రానికి (యుఎన్‌ఎఫ్‌సిసిసి) అనుగుణంగా రూపొందిన క్యోటో, ప్యారిస్ ఒప్పందాలు ప్రపంచంలో పటిష్టంగా అమలయ్యేలా సంయుక్తంగా కృషి చేయాలని నిర్ణయించారు. అలాగే వాతావరణంపై చర్యల దిద్దుబాటుకు ‘కాప్-28 నుంచి కాప్-30’ వరకూ ‘యుఎన్‌ఎఫ్‌సిసిసి’ బహుపాక్షిక ప్రక్రియ మార్గం సుగమం చేస్తుందని, ఆ దిశగా కలిసి పనిచేస్తామని వారు ప్రతినబూనారు.
అంతేకాకుండా ఐరాస తీర్మానం, ప్యారిస్ ఒప్పందం అంతిమ లక్ష్యాల సాధన కోసం అంతర్జాతీయ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా సమానత్వం, అత్యుత్తమ శాస్త్రవిజ్ఞాన సౌలభ్యం, వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వ కమిటీ (ఐపిసిసి) ఆరో అంచనాల నివేదిక (ఎఆర్6) వెలిబుచ్చిన ఆందోళనల తీవ్రత, అవసరాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. వాతావరణ మార్పుపై బహుపాక్షిక ప్రతిస్పందన ఇనుమడించేలా కృషి చేయడంపై తమ నిబద్ధతను వారు ప్రకటించారు. ఈ మేరకు వివిధ దేశాల్లో, దేశాల మధ్యగల అసమానతల పరిష్కారం సహా ఐరాసలోని 77 దేశాల కూటమి, చైనాతోపాటు ఐదు దేశాల ‘బేసిక్’ కూటమి దేశాలలో కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. కాగా, ‘బేసిక్’ కూటమికి బ్రెజిల్ అధ్యక్షతను భారత్ స్వాగతిస్తూ 2025లో ‘యుఎన్‌ఎఫ్‌సిసిసి’ కింద నిర్వహించే 30వ సమావేశానికి (కాప్-30) బ్రెజిల్ అధ్యక్షతను పూర్తిగా సమర్థించింది. మరోవైపు అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఎ), విపత్తు ప్రతిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సిడిఆర్‌ఐ)ల భాగస్వామ్యంతో తృతీయ ప్రపంచ దేశాల్లో ఉమ్మడి ప్రాజెక్టుల సంఖ్యను పెంచడానికి రెండు దేశాలూ అంగీకరించాయి.
ప్రపంచంలో ప్రధాన ఆహార ఉత్పత్తిదారులుగా రెండు దేశాల కీలక పాత్రను దేశాధినేతలిద్దరూ నొక్కిచెప్పారు. ఈ మేరకు రెండు దేశాల్లోనే కాకుండా ప్రపంచ ఆహార-పోషక భద్రత పరిరక్షణ లక్ష్యంగా సుస్థిర వ్యవసాయం-గ్రామీణాభివృద్ధిలో బహుపాక్షికంగానూ సహకార విస్తరణకు దృఢ సంకల్పం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అవరోధాల్లేని, సార్వత్రిక, విశ్వసనీయ ఆహార సరఫరా శ్రేణి అవసరాన్ని నాయకులిద్దరూ నొక్కిచెప్పారు. ఇందుకోసం బహుపాక్షిక వాణిజ్య నిబంధనలను సవ్యంగా పరిగణనలోకి తీసుకోవాలని, ఏకపక్ష పరిమితులు-స్వీయరక్షణ చర్యలతో వ్యవసాయ వాణిజ్యం ప్రభావితం కాకుండా చూడాలని అంతర్జాతీయ సమాజానికి వారిద్దరూ పిలుపునిచ్చారు. వ్యవసాయం, పశుసంవర్ధక ఉత్పత్తుల వ్యాపార సౌలభ్యం కోసం సంయుక్త సాంకేతిక కమిటీల ఏర్పాటుపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులలో ఇటీవలి వృద్ధిపై హర్షం ప్రకటిస్తూ, రెండు దేశాల మధ్య ఆర్థిక ఆదానప్రదానాల వృద్ధికి మరింత అవకాశం ఉందని వారు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ మేరకు తమతమ ఆర్థిక వ్యవస్థల స్థాయిని, పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంచుకోగల వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు. భారత్-మెర్కోసర్ కూటమి దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతుండటంపై ఇద్దరు దేశాధినేతలూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కూటమికి బ్రెజిల్ అధ్యక్షత నేపథ్యంలో ఆర్థిక భాగస్వామ్యాన్ని సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా భారత్-మెర్కోసర్ ప్రాధాన్య వాణిజ్యం ఒప్పందం (పిటిఎ) విస్తరణకు ఉమ్మడిగా కృషి చేసేందుకు వారు అంగీకరించారు. రెండు దేశాల ప్రైవేట్ రంగాల మధ్య సహకారం కోసం భారత్-బ్రెజిల్ వాణిజ్య వేదిక ఏర్పాటును వారు స్వాగతించారు.
భారత్-బ్రెజిల్ సంయుక్త సైనిక కసరత్తులు, ఉన్నతస్థాయి రక్షణ ప్రతినిధుల మధ్య చర్చలు, రెండు దేశాల రక్షణ రంగ ఆదానప్రదానాల్లో గణనీయ పారిశ్రామిక భాగస్వామ్యం తదితర అంశాల్లో రెండు దేశాల మధ్య రక్షణరంగ సహకారంపై దేశాధినేతలిద్దరూ హర్షం వ్యక్తం చేశారు.
అధునాతన సాంకేతిక రక్షణ ఉత్పత్తుల సంయుక్త తయారీ, సరఫరా శ్రేణి ప్రతిరోధక పెంపు వంటి ప్రాజెక్టులు చేపట్టేందుకు సరికొత్త సహకార విస్తరణకు మార్గాన్వేషణ చేయాల్సిందిగా రెండు దేశాల్లోని రక్షణ పరిశ్రమలకు వారు సూచించారు. భారత-బ్రెజిల్ సామాజిక భద్రత ఒప్పందం అమలుకు వీలుగా దేశీయ విధివిధానాలు ఖరారు కావడంపై అధినేతలు సంతృప్తి ప్రకటించారు.
చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగడం ద్వారా చంద్రయాన్-3 సాధించిన చారిత్రక విజయాన్ని అధ్యక్షులు లూలా ప్రశంసించారు. అలాగే భారత తొలి సౌర ప్రయోగం ‘ఆదిత్య-ఎల్ 1’ సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అంతరిక్ష అన్వేషణ రంగంలో గొప్ప మైలురాళ్లుగా నిలిచే ఈ రెండు ముఖ్యమైన విజయాలపై భారతదేశానికి అభినందనలు తెలిపారు. భారత్-బ్రెజిల్- దక్షిణాఫ్రికా (ఐబిఎస్‌ఎ) కూటమి 20వ వార్షికోత్సవం నేపథ్యంలో- మూడు భాగస్వామ్య దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చల విస్తతిపై అంగీకారానికి వచ్చారు. అంతేకాకుండా బహుపాక్షిక-బహుళ పాక్షిక అంతర్జాతీయ వేదికలపై దక్షిణార్థ గోళ దేశాల ప్రయోజనాల పరిరక్షణ, పెంపు దిశగా ‘ఐబిఎస్‌ఎ’ వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పారు. అలాగే ‘ఐబిఎస్‌ఎ’కి బ్రెజిల్ అధ్యక్షతపై ప్రధాని మోదీ పూర్తి మద్దతు ప్రకటించారు.
దక్షిణాఫ్రికాలో ఇటీవలి ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సానుకూల నిర్ణయాలు తీసుకోవడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో సంస్కరణలకు మద్దతు బలోపేతం, మరింతగా కూడగట్టడంపై ఏకాభిప్రాయం కుదరడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక ‘బ్రిక్స్’ కూటమిలో సభ్యత్వం స్వీకరించాల్సిందిగా మరో ఆరు దేశాలను ఆహ్వానించడాన్ని శిఖరాగ్ర సదస్సు ఆమోదించింది.
భారతదేశం జి-20 అధ్యక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించడంపై ప్రధానమంత్రి మోదీని అధ్యక్షులు లూలా అభినందించారు. అలాగే 2023 డిసెంబరు నుంచి బ్రెజిల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో భారత్‌కు అన్నివిధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. జి-20 అధ్యక్ష బాధ్యత నిర్వర్తించే అవకాశం వరుసగా వర్ధమాన దేశాలకు లభించడంపై నాయకులిద్దరూ హర్షం ప్రకటించారు. ఈ పరిణామం ప్రపంచ పాలన క్రమంలో దక్షిణార్థ గోళ దేశాల ప్రభావాన్ని ఇనుమడింపజేస్తుందని వారు అభిప్రాయపడ్డారు. బ్రెజిల్ అధ్యక్షత నేపథ్యంలో ‘ఐబిఎస్‌ఎ’లోని మూడు దేశాలతో జి-20 త్రయం ఏర్పాటు కావటంపై వారు సంతృప్తి ప్రకటించారు.
***
PM @narendramodi and President @LulaOficial held a productive meeting in Delhi focusing on enhancing India-Brazil ties across diverse domains, including agriculture, commerce and more. The PM also extended best wishes for Brazil's forthcoming G20 Presidency. pic.twitter.com/OzS0zZplir
— PMO India (@PMOIndia) September 10, 2023
Excellent meeting with President @LulaOficial. Ties between India and Brazil are very strong. We talked about ways to boost trade and cooperation in agriculture, technology and more. I also conveyed my best wishes for Brazil’s upcoming G20 Presidency. pic.twitter.com/XDMjLdfyUi
— Narendra Modi (@narendramodi) September 10, 2023
Uma excelente reunião com o Presidente @LulaOficial. Os laços entre a Índia e o Brasil estão muito fortes. Falámos sobre formas de estimular o comércio e a cooperação na agricultura, tecnologia e muito mais. Também transmiti os meus melhores votos para a próxima presidência do… pic.twitter.com/YTxwaz690Q
— Narendra Modi (@narendramodi) September 10, 2023