Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం (2024-2028) అమలుకు కార్యాచరణ ప్రణాళిక

భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం  (2024-2028) అమలుకు కార్యాచరణ ప్రణాళిక


   భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక అమలు దిశగా రెండు దేశాల ప్రధానమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా ద్వైపాక్షిక సహకారం వేగం పుంజుకోవడాన్ని 2024 ఆగస్టు 22న వార్సాలో సమావేశం సందర్భంగా వారిద్దరూ గుర్తించారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా 2024-28 మధ్య ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన-అమలుకు ఉభయపక్షాలూ అంగీకారానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో కింది ప్రాధాన్యాంశాల పరంగా ద్వైపాక్షిక సహకారానికి ప్రణాళిక మార్గనిర్దేశం చేస్తుంది:

రాజకీయ చర్చలు – భద్రత సహకారం

   రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య నిరంతర సంబంధాలు, సంభాషణలు క్రమబద్ధంగా సాగుతాయి. ఇందుకోసం వారు ద్వైపాక్షిక, బహుపాక్షిక వేదికలు రెండింటినీ ఉపయోగించుకుంటారు.

   ఐక్యరాజ్య సమితి తీర్మానాల మేరకు బహుపాక్షిక సహకారం దిశగా ప్రతి అంశం ప్రాతిపదికన పరస్పర ఆకాంక్షలకు మద్దతు తెలపడానికి ఉభయపక్షాలూ అంగీకరించాయి.

   విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రుల స్థాయిలో రెండు దేశాల మధ్య వార్షిక రాజకీయ చర్చల నిర్వహణకు రెండు పక్షాలూ అంగీకరించాయి.

   భద్రత-రక్షణ సహకారంపై క్రమబద్ధ సంప్రదింపుల దిశగా రెండుదేశాల్లోని సంబంధిత సంస్థల మధ్య సంబంధాలను ప్రోత్సహించాలని ఉభయపక్షాలు నిర్ణయించాయి. తద్వారా రక్షణ రంగ పరిశ్రమల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయి. అలాగే సైనిక పరికరాల ఆధునికీకరణ సహా ఇప్పటిదాకా దృష్టి సారించని అంశాలపైనా చర్చలకు వీలు కలుగుతుంది.

   రక్షణ సహకారంపై సంయుక్త కార్యాచరణ బృందం తదుపరి సమావేశాన్ని ఈ ఏడాదిలోనే నిర్వహించాలని రెండు పక్షాలు నిశ్చయించాయి.

వాణిజ్యం – పెట్టుబడులు

   అత్యాధునిక సాంకేతికతలు, వ్యవసాయం, వ్యవసాయ-సాంకేతికత (అగ్రిటెక్), ఆహార-సాంకేతికత, ఇంధనం, వాతావరణ మార్పు, హరిత సాంకేతికతలు, మౌలిక సదుపాయాలు, అత్యాధునిక నగరాలు, రక్షణ, ఆరోగ్య సంరక్షణ, ఔషధ/గనుల రంగాలు వగైరాలలో రెండు దేశాలకూగల అవకాశాలను ఉభయపక్షాలూ గుర్తించాయి. వీటన్నిటిలోనూ పరస్పర సహకారం దిశగా 2024 చివరన నిర్వహించే ‘ఆర్థిక సహకారంపై సంయుక్త కమిషన్’ (జెఇసిసి) తదుపరి సమావేశంలో మార్గాన్వేషణకు ఉభయపక్షాలూ నిశ్చయించాయి.

   ఈ నిర్ణయంలో భాగంగా ప్రతి ఐదేళ్లకు కనీసం రెండుసార్లు ‘జెఇసిసి’ సమావేశాల నిర్వహణకు కృషి చేయాలని అభిప్రాయపడ్డాయి. అవసరమైతే మరింత తరచుగానూ  సమావేశం కావాలని భావించాయి.

   ద్వైపాక్షిక వాణిజ్య సమతౌల్యం సాధించే దిశగా కృషి చేయాలని, రెండు దేశాల మధ్య వాణిజ్యం-పెట్టుబడుల సంబంధిత లావాదేవీలు సజావుగా సాగేలా అన్ని సమస్యలకూ పరిష్కారం కనుగొనాలని నిర్ణయించాయి.

   సరఫరా శ్రేణి పునరుత్థాన శక్తిని పెంచడం, వాణిజ్య పరాధీనతతో ముడిపడిన నష్టాల తగ్గింపుపై దృష్టి సారించడం ద్వారా ఆర్థిక భద్రతలో సహకారం మెరుగుకు కృషి చేయాలని ఉభయపక్షాలూ అంగీకారానికి వచ్చాయి.

వాతావరణ మార్పు.. ఇంధనం.. గనులు, శాస్త్ర-సాంకేతిక రంగాలు

   వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, మరియు వ్యర్థ జల నిర్వహణకు సుస్థిర, పర్యావరణ హిత సాంకేతిక పరిష్కారాన్వేషణలో సహకార విస్తరణకు ఉభయ పక్షాలు నిర్ణయించాయి.

   ఇంధన భద్రతలో చారిత్రకంగా దేశీయ వనరులపై రెండు దేశాలూ ఆధారపడటాన్ని ఉభయ పక్షాలూ గుర్తించాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ ప్రభావాల ఉపశమనం దిశగా పరిశుభ్ర బొగ్గు సాంకేతికత సహకారాన్వేషణసహా పరిశుభ్ర ఇంధన విధానాల రూపకల్పనలో సంయుక్త కృషికి నిర్ణయించాయి.

   ఆవిష్కరణలు-కీలక ఖనిజాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతుండటాన్ని గుర్తిస్తూ, అత్యాధునిక మైనింగ్ వ్యవస్థలు, ఆధునిక యంత్రాలు-పరికరాలు, అగ్రశ్రేణి భద్రత ప్రమాణాలు, మైనింగ్ సంబంధిత పరిశ్రమల మధ్య ఆదానప్రదానం, సహకార విస్తృతిని ప్రోత్సహించాలని ఉభయపక్షాలూ నిర్ణయించాయి.

   అంతరిక్షం, వాణిజ్య అంతరిక్ష పర్యావరణ వ్యవస్థల సురక్షిత, సుస్థిర, సురక్షిత వినియోగానికి ప్రోత్సాహం దిశగా సహకార ఒప్పందం సత్వర ఖరారుకు రెండు పక్షాలు అంగీకరించాయి. దీంతోపాటు మానవ, రోబోటిక్ అన్వేషణను ప్రోత్సహించాలని కూడా నిర్ణయించాయి.

   అంతర్జాతీయ ఇంధన సంస్థ  (ఐఇఎ)లో సభ్యత్వంపై భారత్ ఆకాంక్షను పోలాండ్ గుర్తించింది.

రవాణా – అనుసంధానం

   రవాణా రంగంలో మౌలిక సదుపాయాల కల్పన రంగంలో సహకారానికి మార్గాన్వేషణపై ఉభయ పక్షాలూ అంగీకరించాయి.

   అలాగే తమతమ దేశాలు, సంబంధిత ప్రాంతాల మధ్య అనుసంధానంతోపాటు విమానయాన సంధానం పెంచుకోవడంపై చర్చలకు కృషి చేయాలని ఉభయపక్షాలూ నిర్ణయానికి వచ్చాయి.

ఉగ్రవాదం

   స్వరూప-స్వభావాలకు అతీతంగా అన్నిరకాల ఉగ్రవాదాన్ని ఉభయపక్షాలూ నిర్ద్వంద్వంగా ఖండించాయి. ఉగ్రవాద దుశ్చర్యలకు ఆర్థిక, ప్రణాళికల పరంగానే కాకుండా వారికి ఆశ్రయమివ్వడం వంటి చర్యలతో అటువంటి దుష్టశక్తులకు ఏ దేశమూ స్వర్గధామం కారాదని స్పష్టం చేశాయి. ఐక్యరాజ్య సమితి భద్రత మండలి ఆంక్షల కమిటీ 1267 తీర్మానం కింద రూపొందిన జాబితాలోని మూకలు, వాటికి అనుబంధంగా ఉన్న వ్యక్తులు, ఉగ్రవాదుల నిరోధానికి పటిష్ట కృషి చేయాలని నిర్ణయించాయి.

సైబర్ భద్రత

   ఏ దేశంలోనైనా ఆర్థిక-సామాజిక ప్రగతిలో సైబర్ భద్రతకు కీలక ప్రాధాన్యం ఉందనే వాస్తవాన్ని ఉభయపక్షాలూ గుర్తించాయి. ఈ దిశగా ‘ఐసిటి’ సంబంధిత రంగాల్లో సన్నిహిత/ పరస్పర ఆదానప్రదానాల పెంపునకు అంగీకరించాయి. ఇందులో భాగంగా సైబర్ దాడులపై అంతర్జాతీయ సహకారం, శాసన/నియంత్రణ పరిష్కారాలు, న్యాయ/పోలీసు కార్యకలాపాలు, సైబర్ నిరోధం-నివారణ-ప్రతిస్పందనల మీద ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. తదనుగుణంగా సైబర్-దాడులపై అవగాహన కల్పన/శిక్షణ కార్యక్రమాలు, శాస్త్ర-సాంకేతిక రంగాల్లో పరిశోధన-ఆవిష్కరణసహా వ్యాపార-ఆర్థిక రంగాలపరంగానూ ఆదానప్రదానాలకు ప్రాధాన్యం ఉంది.

ఆరోగ్యం

   ఆరోగ్య రంగ సహకార బలోపేతంలో భాగంగా పరస్పర ప్రయోజన అంశాలపై సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, పంచుకోవడం, ఆరోగ్య నిపుణుల మధ్య పరిచయాలు పెంచడం, రెండు దేశాల ఆరోగ్య సంస్థల మధ్య సహకారానికి మద్దతివ్వడం వంటి కార్యకలాపాల కీలక పాత్రను ఉభయ పక్షాలూ అంగీకరించాయి.

ప్రజల మధ్య సంబంధాలు-సాంస్కృతిక సహకారం

   సామాజిక భద్రతపై ఒప్పందం అమలుకు ఉభయపక్షాలూ సంయుక్తంగా కృషి చేస్తాయి. దీనికి అనుగుణంగా అంతర్గత చట్టపరమైన విధానాల ఖరారుకు రెండు దేశాలూ చర్యలు తీసుకుంటాయి.

   రెండు దేశాల సాంస్కృతిక సంస్థలు, సంఘాల మధ్య సహకార బలోపేతానికి రెండు పక్షాలూ నిర్ణయించాయి. ఈ మేరకు కళాకారులు, భాషా నిపుణులు, పండితులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధుల మధ్య పరస్పర ఆదానప్రదానం బలోపేతానికి కృషి చేస్తాయి. అంతేకాకుండా మేధావులు, నిపుణుల మధ్య సహకారం, సంప్రదింపులకు తగిన మార్గాన్వేషణ చేస్తాయి.

   ఉన్నత విద్యలో సహకార బలోపేతం దిశగా సంబంధిత కార్యకలాపాల నిర్వహణలో రెండు వైపులా విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేలా ఉభయ పక్షాలు సంయుక్తంగా కృషి చేస్తాయి. అందులో భాగంగా రెండు దేశాల్లోని విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యం ఏర్పరచుకునేలా సంబంధిత అధికారులను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి.

   పరస్పర అవగాహన పెంపు, ద్వైపాక్షిక సాంస్కృతిక సంబంధాల బలోపేతంలో విద్య/భాషా- సాంస్కృతిక ఆదానప్రదానాల ప్రాధాన్యాన్ని ఉభయ పక్షాలు నొక్కిచెప్పాయి. ఈ మేరకు భారత్, పోలాండ్ దేశాల భాషలు, సంస్కృతి అధ్యయనాలలో హిందీ, ఇతర భారతీయ అధ్యయనాల పాత్రను కూడా గుర్తించాయి. ఇందుకు అనుగుణంగా భార‌త్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలలో పోలిష్ భాష బోధనపై ‘పోలిష్ నేషనల్ ఏజెన్సీ ఫర్ అకడమిక్ ఎక్స్ఛేంజ్’, సంబంధిత భారతీయ సంస్థల మధ్య ఒప్పందం కోసం కృషి చేయాలని నిర్ణయించాయి.

   పర్యాటక రంగంలో సహకార విస్తృతి ద్వారా రెండు వైపులా పర్యాటక ప్రవాహ విస్తరణ కొనసాగుతుంది. ఇందులో భాగంగా వివిధ పర్యాటక కార్యక్రమాల నిర్వహణతోపాటు ప్రభావశీలురు, ప్రయాణ సౌలభ్య కల్పన సంస్థల కోసం కుటుంబ పర్యటనల ఏర్పాటు, రెండు దేశాల్లో పర్యాటక రంగ ప్రదర్శనలు, రోడ్‌షోలలో పాల్గొనడం వంటివి చేపడతారు.

   ద్వైపాక్షిక దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం నేపథ్యంలో రాయబార కార్యాలయాల ద్వారా రెండు దేశాల్లో సాంస్కృతిక ఉత్సవాలను పరస్పరం నిర్వహిస్తారు. దీనికి సంబంధించి సంప్రదింపుల అనంతరం ఈ ప్రత్యేక కార్యక్రమాల తేదీలు ఖరారవుతాయి.

ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉభయ పక్షాలు విద్యార్థుల ఆదానప్రదానాన్ని ప్రోత్సహిస్తాయి. తద్వారా యువతరం మధ్య పరస్పర అవగాహన కలుగుతుంది.

భారత్-ఐరోపా సమాఖ్య (ఇయు)

   ప్రపంచవ్యాప్తంగా శాంతి, సుస్థిరత, సౌభాగ్యాలను ప్రోత్సహించడంలో భారత్, ఐరోపా సమాఖ్యలకు కీలక పాత్ర ఉన్నందున భారత్-ఇయు వాణిజ్యం-పెట్టుబడి చర్చలు, వాణిజ్యం- కార్యాచరణల ప్రారంభం, ముగింపు కార్యక్రమాలకు రెండు దేశాలూ మద్దతిస్తాయి. టెక్నాలజీ కౌన్సిల్ (టిటిసి) సహా వాణిజ్యం, కొత్త సాంకేతికతలు, భద్రతల పరంగా భారత్-ఇయు వ్యూహాత్మక భాగస్వామ్య ప్రగతికి భారత్-ఇయు అనుసంధాన భాగస్వామ్యం అమలుకు కృషి చేస్తాయి.

భవిష్యత్ పథం

   నిర్దేశిత పంచవర్ష కార్యాచరణ ప్రణాళిక అమలును ఉభయ పక్షాలూ క్రమబద్ధంగా పర్యవేక్షిస్తాయి. ఈ దిశగా కార్యకలాపాల సమీక్ష, నవీకరణలో వార్షిక రాజకీయ సంప్రదింపులు ప్రాథమిక వ్యవస్థగా ఉంటుంది. అవసరమైతే ఈ ప్రణాళికను మరో ఐదేళ్లు పొడిగించడంపై విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రులు నిర్ణయం తీసుకుంటారు.

 

***