Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్-న్యూజిలాండ్ సంయుక్త పత్రికా సమావేశం సందర్భంగా ప్రధాని ప్రకటన

భారత్-న్యూజిలాండ్ సంయుక్త పత్రికా సమావేశం సందర్భంగా ప్రధాని ప్రకటన


గౌరవనీయులైన ప్రధానమంత్రి లగ్జాన్,
ఇరు దేశాల ప్రతినిధులకు,
మీడియా మిత్రులకు,
నమస్కారం!
కియా ఓరా!

న్యూజిలాండ్ ప్రధానమంత్రి లగ్జాన్, ఆయన ప్రతినిధి బృందానికి హృదయపూర్వకంగా భారత్‌కు స్వాగతం పలుకుతున్నాను. ప్రధానమంత్రి లగ్జాన్‌కు ఈ దేశంతో సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఆక్లాండ్‌లో హోలీ పండుగను ఆనందోత్సాహాలతో ఆయన ఎలా జరుపుకొన్నారో కొన్ని రోజుల కిందటే మనమందరం చూశాం. భారత్‌ పర్యటన సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆయన వెంట వచ్చిన ప్రతినిధులను బట్టి, న్యూజిలాండ్ లో నివసిస్తున్న భారత సంతతి ప్రజల పట్ల ప్రధాని లగ్జాన్‌కు ఎంతటి ఆప్యాయతాభిమానాలు ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది. ఆయనలాంటి యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రతిభావంతుడైన నాయకుడు ఈ ఏడాది రైజీనా డైలాగ్‌కు ముఖ్య అతిథిగా రావడం సంతోషదాయకం.

మిత్రులారా,

ద్వైపాక్షిక సంబంధాల్లోని వివిధ అంశాలపై ఈ రోజు మేం నిశితంగా చర్చించాం. రక్షణ, భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతోపాటు సంస్థాగతీకరించాలని నిర్ణయించాం. సంయుక్త విన్యాసాలు, శిక్షణ, నౌకాశ్రయ సందర్శనలతోపాటు ద్వైపాక్షిక రక్షణ పారిశ్రామిక సహకారం కోసం ఓ ప్రణాళికను రూపొందించబోతున్నాం. హిందూ మహాసముద్రంలో సముద్ర భద్రత కోసం ఉమ్మడి టాస్క్ ఫోర్స్-150లో మన నావికా దళాలు కలిసి పనిచేస్తున్నాయి. అంతేకాకుండా, న్యూజిలాండ్ నావికా దళానికి చెందిన నౌక రెండు రోజుల్లో ముంబయి పోర్టుకు చేరుకోబోతుండడం సంతోషాన్నిచ్చే విషయం.

మిత్రులారా,

రెండు దేశాలకు పరస్పరం ప్రయోజనం చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపాలని మేం నిర్ణయించాం. ఇది ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల సామర్థ్యాన్ని పెంచుతుంది. పాడి, ఆహార శుద్ధి, ఫార్మా రంగాల్లో పరస్పర సహకారం, పెట్టుబడులను ప్రోత్సహిస్తాం. పునురుత్పాదక ఇంధనం, కీలకమైన ఖనిజాల రంగంలో పరస్పర సహకారానికి మేం ప్రాధాన్యమిస్తున్నాం. అటవీ, ఉద్యాన రంగాల్లో సంయుక్త కృషి జరుగుతుంది. ప్రధాని వెంట వచ్చిన పెద్ద వ్యాపార ప్రతినిధి బృందం… భారత్‌లో ఉన్న సరికొత్త అవకాశాలను అన్వేషించి, అర్థం చేసుకోగలరని నేను నమ్ముతున్నాను.

మిత్రులారా,

అది క్రికెటయినా, హాకీ అయినా లేదా పర్వతారోహణ అయినా.. క్రీడల్లో రెండు దేశాల మధ్య సుదీర్ఘ అనుబంధం ఉంది. క్రీడల్లో శిక్షణ, క్రీడాకారులను మార్చుకోవడంతో పాటు స్పోర్ట్స్ సైన్స్, సైకాలజీ, మెడిసిన్ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసేందుకు అంగీకరించాం. రెండు దేశాల మధ్య ఉన్న వందేళ్ల క్రీడా సంబంధాలను 2026లో ఘనంగా నిర్వహించాలని మేం నిర్ణయించాం.

మిత్రులారా,

న్యూజిలాండ్లో నివసిస్తున్న భారతీయ సమాజం ఆ దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి విలువైన సహకారం అందిస్తోంది. అక్రమ వలసలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు నైపుణ్యాలున్న కార్మికులను తరలించే ప్రక్రియను సులభతరం చేసే ఒప్పందంపై పనిచేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం. యూపీఐ అనుసంధానాన్ని మెరుగుపరచడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, పర్యాటకాన్ని పెంపొందించే అంశాలపై సైతం దృష్టి సారిస్తాం. విద్యారంగంలోనూ మా సంబంధాలు సుదీర్ఘమైనవి. భారత్‌లో క్యాంపస్‌లను నెలకొల్పేందుకు న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాలను మేం ఆహ్వానించాం.

మిత్రులారా,

మేం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా.. ఐక్యంగా నిలబడతాం. 2019, మార్చి 15న క్రిస్ట్‌చర్చ్ పై జరిగిన ఉగ్రదాడి అయినా, 2008, నవంబర్ 26న ముంబయిలో జరిగిన దాడి అయినా, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి దాడులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదం, వేర్పాటు వాదం, అతివాద శక్తులను ఎదుర్కొనేందుకు కలసి పోరాడతాం. ఈ అంశంలో, న్యూజిలాండ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కొన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి మా ఆందోళనలను తెలియజేశాం. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యాకలాపాలను నివారించేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మేం విశ్వాసంతో ఉన్నాం.

మిత్రులారా,

స్వేచ్చాయుతమైన, స్పష్టమైన, భద్రతతో కూడిన, శ్రేయస్కరమైన ఇండో-పసిఫిక్‌‌ కూటమికి మేం మద్ధతిస్తున్నాం. మేం అభివృద్ధి విధానాన్ని విశ్వసిస్తాం. విస్తరణవాదాన్ని కాదు. ఇండో-పసిఫిక్ కూటమిలో చేరుతున్న న్యూజిలాండ్‌కు మేం స్వాగతం పలుకుతున్నాం. అంతర్జాతీయ సౌర కూటమిలో సభ్యత్వంతో పాటు సీడీఆర్ఐలో న్యూజిలాండ్ చేరికపై శుభాకాంక్షలు తెలుపుతున్నాం.

మిత్రులారా,

చివరగా, రగ్బీ భాషలో చెప్పాలంటే – రెండు దేశాల మధ్య సంబంధాల్లో గొప్ప భవిష్యత్తుకు మేం ఇద్దరం ‘ఫ్రంట్ అప్’‌లో సిద్ధంగా ఉన్నాం. సంయుక్తంగా ముందుకు సాగడానికి, ఉజ్వలమైన భాగస్వామ్యానికి బాధ్యత వహించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మా భాగస్వామ్యం రెండు దేశాల ప్రజలకు మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యంగా మేం నిరూపించగలమని విశ్వసిస్తున్నాం.

ధన్యవాదాలు!

సూచన: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***