ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆహ్వానంపై, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్– ధానీ 2025 ఫిబ్రవరి 17-18 తేదీలలో భారత్ లో అధికారిక పర్యటనకు విచ్చేశారు. అమీర్ వెంట మంత్రులు, అధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ పర్యటనలో పాల్గొంది. అమీర్ భారత్ లో పర్యటించడం ఇది రెండోసారి.
ఫిబ్రవరి 18 న గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ వద్ద అధికార లాంఛనాలతో అమీర్ కు స్వాగతం పలికారు. అమీర్ గౌరవార్థం ఆయనకు, ఆయన వెంట ఉన్న ప్రతినిధి బృందానికి రాష్ట్రపతి విందు ఏర్పాటు చేశారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 18న హైదరాబాద్ హౌజ్ లో అమీర్ తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఇరు దేశాల మధ్య గల చారిత్రక వాణిజ్య సంబంధాలను, రెండు దేశాల ప్రజల మధ్య గల ప్రగాఢ సంబంధాలను, దృఢంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య గల బహుముఖ సంబంధాలను మరింత విస్తరించాలన్న ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ‘ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్య ఏర్పాటు ఒప్పందం‘ పై సంతకాలు జరగడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
కొత్తగా కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, రాజకీయ, వాణిజ్య, పెట్టుబడులు, భద్రత, ఇంధనం, సంస్కృతి, విద్య, సాంకేతికత, సృజనాత్మకత, సుస్థిరత, ప్రజల మధ్య సంబంధాలతో సహా అన్ని రంగాలలో క్రమం తప్పకుండా, నిర్మాణాత్మక సహకారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇరు పక్షాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. సవరించిన ద్వంద్వ పన్నుల తొలగింపు ఒప్పందంపై సంతకాలు జరిగినందుకు ఇరు పక్షాలు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు, భారత్–ఖతార్ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపై చర్చలను వేగవంతం చేయడానికి అంగీకరించాయి.
వివిధ స్థాయిల్లో క్రమం తప్పకుండా జరుగుతున్న చర్చలు బహుముఖ ద్వైపాక్షిక సహకారానికి ఊతమిచ్చేందుకు దోహదపడ్డాయని ఇరు పక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. 2015 మార్చిలో విజయవంతంగా జరిగిన అమీర్ భారత్ పర్యటన, ఆ తరువాత 2016 జూన్, 2024 ఫిబ్రవరిలో ఖతార్ లో భారత ప్రధాని పర్యటనలను వారు గుర్తు చేసుకున్నారు. మంత్రుల స్థాయిలోనూ, సీనియర్–అధికారుల స్థాయిలోనూ క్రమం తప్పకుండా ద్వైపాక్షిక యంత్రాంగాల ద్వారా ఉన్నత స్థాయి చర్చలను కొనసాగించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సహకారానికి వ్యాపార, వాణిజ్యాలు బలమైన పునాదిగా ఉన్నాయని గుర్తించిన ఇరు పక్షాలు, ద్వైపాక్షిక వాణిజ్యంలో మరింత వృద్ధి, వైవిధ్యతకు ఉన్న అవకాశాలను అన్వేషించాలని అభిప్రాయపడ్డాయి. వ్యాపారం, వాణిజ్యంపై ప్రస్తుతం ఉన్న జాయింట్ వర్కింగ్ గ్రూప్ ను వ్యాపార, వాణిజ్య సంయుక్త కమిషన్ గా స్థాయి పెంచడాన్ని ఇరు పక్షాలు స్వాగతించాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను సమీక్షించడానికి, పర్యవేక్షించడానికి జాయింట్ కమిషన్ ఒక సంస్థాగత యంత్రాంగంగా ఉంటుంది. రెండు దేశాల వాణిజ్య, పరిశ్రమల మంత్రులు దీనికి నేతృత్వం వహిస్తారు.
రెండు దేశాల వ్యాపార, పారిశ్రామిక సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో 2025 ఫిబ్రవరి 13న జాయింట్ బిజినెస్ కౌన్సిల్ తొలి సమావేశం నిర్వహించడాన్ని వారు స్వాగతించారు.
రెండు దేశాల మధ్య మరింత విస్తృతమైన, విభిన్నమైన వాణిజ్యాన్ని అభివృద్ధి చేసే వ్యూహాలను అన్వేషించాల్సిన అవసరాన్ని రెండు దేశాలూ అంగీకరించాయి. వస్తుసేవల వాణిజ్యానికి సంబంధించిన మార్కెట్ అందుబాటులో ఎదురయ్యే సమస్యలను ప్రాధాన్యతాధారితంగా పరిష్కరించాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాయి. ఈ మేరకు ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
భారత్, ఖతార్ దేశాలు బలమైన వ్యూహాత్మక సంబంధాలను కలిగి ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్న నేపథ్యంలో, భారత్ లో కార్యాలయాన్ని ప్రారంభించాలని ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఎ) తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశం స్వాగతించింది. పెట్టుబడుల జాయింట్ టాస్క్ ఫోర్స్ జూన్ 2024 లో, తన మొదటి సమావేశంలో సాధించిన పురోగతిపై ఇరు పక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. భారతదేశంలో పెట్టుబడులకు వివిధ మార్గాల గురించి ఆ సమావేశంలో చర్చించారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ సంస్థాగత పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించడంలో భారత్ తీసుకున్న చర్యలను ఖతార్ బృందం ప్రశంసించింది. మౌలిక సదుపాయాలు, సాంకేతికత, తయారీ, ఆహార భద్రత, లాజిస్టిక్స్, ఆతిథ్యం సహా ఇతర పరస్పర ప్రయోజన రంగాలలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్ లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని ఖతార్ ప్రకటించింది. పెట్టుబడుల వాతావరణాన్ని పెంపొందించడంలో ఖతార్ చేస్తున్న ప్రయత్నాలను, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు ఖతార్ తీసుకుంటున్న చర్యలను భారత్ అభినందించింది. వస్తుసేవలకు ప్రాంతీయ కేంద్రంగా ఖతార్ పాత్ర పెరుగుతోందని గుర్తిస్తూ, ఖతార్ కు గల వ్యూహాత్మక ప్రాధాన్యం, ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల విధానాలను అందిపుచ్చుకోవడానికి భారత్ ఆసక్తి వ్యక్తం చేసింది. పెట్టుబడులు, వాణిజ్య విస్తరణకు కొత్త అవకాశాలను అన్వేషించడానికి ఇరుదేశాల పెట్టుబడి సంస్థలు , ఆర్థిక సంస్థలు, వ్యాపార సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను ఇరు పక్షాలు గుర్తించాయి.
తమ తమ చట్టాలు, తాము భాగస్వాములుగా ఉన్న అంతర్జాతీయ ఒప్పందాల నిబంధనలకు అనుగుణంగా పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య,ఆర్థిక సహకారాన్ని విస్తరించి, మరింత బలోపేతం చేయడానికి రెండు దేశాలు అంగీకరించాయి. స్థిరమైన వృద్ధిని సాధించడానికి, వాణిజ్య వైవిధ్యానికి మార్పిడి ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచడానికి, క్రమ పద్ధతిలో, దీర్ఘకాలిక ప్రాతిపదికన పరస్పర సేవలను అందించడానికి రెండు దేశాలు సహకరించుకుంటాయి. అదనంగా, రెండు దేశాల ప్రైవేట్ రంగాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుల ఏర్పాటును ఆకర్షించడానికి, ప్రోత్సహించడానికి చర్యలు చేపడతాయి. ఇందుకు సంబంధించి 2025 ఫిబ్రవరి 18న జరిగిన జాయింట్ బిజినెస్ ఫోరం సమావేశాన్ని ఇరు పక్షాలు స్వాగతించాయి. ఇరు దేశాల వాణిజ్య, పరిశ్రమల మంత్రులు ఈ సమావేశాన్ని ప్రారంభించారు.
ఆర్థిక వృద్ధి లో వ్యాపారాల కీలక పాత్రను గుర్తించిన ఇరు పక్షాలు, వాణిజ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి, వైవిధ్యపరచడానికి, పెట్టుబడులను సులభతరం చేయడానికి వ్యూహాత్మక వేదికగా వాణిజ్య ప్రదర్శనల నిర్వహణ ప్రాముఖ్యతను అంగీకరించాయి. ఈ లక్ష్యాల సాధనలో భాగంగా, రెండు దేశాల ఎగుమతి ప్రోత్సాహక సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాలని రెండు దేశాలు అంగీకరించాయి. ఇది సంస్థలకు అవకాశాలను గుర్తించడం, మార్కెట్ సవాళ్లను అధిగమించడం, అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలలో పాల్గొనడాన్ని ప్రోత్సహించేందుకు మద్దతు ఇస్తుంది. ఈ కార్యక్రమం ఇరు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, ఉమ్మడి భాగస్వామ్యాలను అన్వేషించడానికి , వాణిజ్య సంబంధాలను సుస్థిర పరుచుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఖతార్ లోని క్యూఎన్ బీ పాయింట్స్ ఆఫ్ సేల్స్ లో భారతదేశ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యుపిఐ) అమలును ఇరు పక్షాలు స్వాగతించాయి. ఖతార్ దేశవ్యాప్తంగా కూడా భారత యుపిఐ అమలుపై ఆశాభావం వ్యక్తం చేశాయి.ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీలను పరస్పర కరెన్సీలతో నిర్వహించడాన్ని పరిశీలించడానికి వారు అంగీకరించారు. గిఫ్ట్ సిటీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా క్యూ ఎన్ బి విస్తరణను స్వాగతించారు.
ఇంధన మౌలిక సదుపాయాల్లో వాణిజ్యం, పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించడం, ఇంధనంపై జాయింట్ టాస్క్ ఫోర్స్ తో సహా తరచూ ఇరు దేశాలకు చెందిన సంబంధిత వాటాదారుల సమావేశాలతో ద్వైపాక్షిక ఇంధన సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
సరిహద్దు ఉగ్రవాదం సహా అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన ఇరువురు నేతలు ద్వైపాక్షిక, బహుపాక్షిక యంత్రాంగాల ద్వారా ఈ ముప్పును ఎదుర్కోవడానికి పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. సమాచార, నిఘా భాగస్వామ్యం, అనుభవాలు, అత్యుత్తమ విధానాలు, సాంకేతికతలను మెరుగుర్చుకోవడం అలాగే పరస్పరం పంచుకోవడం, సామర్థ్యాలను పెంపొందించుకోవడం, చట్టాల అమలుతో పాటు, మనీలాండరింగ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, అలాగే ఇతర అంతర్జాతీయ నేరాలను నిరోధించడంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనీ ఇరుదేశాల నేతలు నిర్ణయించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం అలాగే సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు సైబర్‌స్పేస్‌ను ఉపయోగించడం వంటి చర్యలను సమర్థంగా ఎదుర్కోవడానికి సైబర్ భద్రతలో సహకారాన్ని మరింత ప్రోత్సహించే మార్గాలపై ఇరుపక్షాల నేతలు చర్చించారు. భద్రత, చట్టాల అమలు కోసం ఏర్పాటైన సంయుక్త కార్యాచరణ కమిటీ తరచూ సమావేశమవ్వాల్సిన ప్రాముఖ్యతను వారు ప్రధానంగా ప్రస్తావించారు.
ద్వైపాక్షిక సంబంధాల్లో ఆరోగ్యరంగ సహకారం అత్యంత కీలకమని అభిప్రాయపడిన ఇరుపక్షాలు, ఈ ప్రాధాన్య రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం పట్ల తమ నిబద్ధతను వ్యక్తం చేశాయి. ఆరోగ్యరంగంలో సంయుక్త కార్యాచరణ బృందం సేవలు సహా కోవిడ్-19 మహమ్మరి సమయంలో ద్వైపాక్షిక సహకారాన్ని ఇరుపక్షాలు ప్రశంసించాయి. ఖతార్ కు భారత ఔషధ ఉత్పత్తులు, వైద్యపరికరాల ఎగుమతులను పెంచడానికి భారత్ సుముఖత వ్యక్తం చేసింది. అలాగే జాతీయ కంపెనీలు, ఔషధ ఉత్పత్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయాలనే కోరికను ఇరుదేశాలు ప్రస్తావించాయి.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, అంకురసంస్థలు, కృత్రిమ మేధ సహా సాంకేతిక, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం పట్ల ఇరుపక్షాలు ఆసక్తి వ్యక్తం చేశాయి. డిజిటల్ రంగంలో ఇ–గవర్నెన్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి అలాగే అత్యుత్తమ విధానాలను పంచుకోవడం కోసం గల మార్గాలను వారు చర్చించారు. 2024-25లో ఖతార్ లోని దోహాలో జరిగే వెబ్ సదస్సుల్లో భారత అంకురసంస్థలు పాల్గొనడాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి.
ఆహార భద్రత, సప్లయి చెయిన్స్ భద్రతల ప్రాముఖ్యత గురించి ప్రధానంగా ప్రస్తావించిన ఇరుపక్షాలు, ఆయా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి.
ఇరు దేశాల సాంస్కృతిక కార్యక్రమాల్లో పరస్పరం పాలుపంచుకోవడం, సాంస్కృతిక సంస్థల మధ్య ప్రభావవంతమైన భాగస్వామ్యాలకు ఊతమివ్వడం ద్వారా సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఇరుపక్షాలు ప్రస్తావించాయి. పరస్పర పోటీలు, క్రీడాకారుల సందర్శనలు, కార్యశాలలు, సెమినార్లు అలాగే సమావేశాలను నిర్వహించడం, ఇరు దేశాల క్రీడా ప్రచురణలు పరస్పరం పంచుకోవడం సహా క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సైతం వారు నిర్ణయించారు. ఈ విషయంగా, సమీప భవిష్యత్తులో భారత్–ఖతార్ సంస్కృతి, స్నేహం అలాగే క్రీడా సంవత్సర వేడుకలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఇరు పక్షాలు స్వాగతించాయి.
ఇరుదేశాల ఉన్నత విద్యాసంస్థల మధ్య సంస్థాగత సంబంధాలు, పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం సహా విద్యారంగంలో సహకారం అత్యంత ముఖ్యమైనదిగా ఇరుపక్షాలు అభివర్ణించాయి. విద్యా సంస్థల మధ్య మెరుగైన సంబంధాలపై కూడా వారు దృష్టి సారించారు. విద్యాపరమైన సహకారం, ఉమ్మడి పరిశోధన, విద్యార్థులు, స్కాలర్స్ మధ్య చర్చలు అలాగే ఇరుదేశాల విశ్వవిద్యాలయాల మధ్య సహకారం సహా విద్యాసంస్థల మధ్య పరస్పర సహకారాన్ని మెరుగుపర్చుకోవడం గురించి ఇరుదేశాలు ప్రధానంగా ప్రస్తావించాయి.
శతాబ్దాలుగా ఇరుదేశాల ప్రజల మధ్య కొనసాగుతున్న సంబంధాలు చారిత్రాత్మక భారత్–ఖతార్ సంబంధాలకు మూలాధారమని ఇరు పక్షాలు వ్యాఖ్యానించాయి. ఖతార్ లోని భారతీయులు తమ ఆతిథ్య దేశ పురోగతికి అందించిన సహకారాన్ని ప్రశంసిస్తూ, వారు శాంతియుతమైన, కష్టపడి పనిచేసే స్వభావంతో తమ దేశంలో ఎంతో గౌరవం పొందుతున్నారని ఖతార్ పేర్కొంది. ఖతార్ లో ప్రధాన, శక్తిమంతమైన వర్గంగా ఉన్న భారతీయుల సంక్షేమం, శ్రేయస్సుకు కృషి చేస్తున్న ఖతార్ ను భారత్ ప్రత్యేకంగా ప్రశంసించింది. అలాగే ఖతార్ జాతీయుల కోసం ఇ–వీసా సౌకర్యాన్ని విస్తరిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్నీ ఖతార్ స్వాగతించింది.
ఉపాధి కోసం వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, మానవ వనరుల రంగంలో దీర్ఘకాలిక, చారిత్రక సహకార ప్రాముఖ్యతను ఇరుపక్షాలు ప్రధానంగా ప్రస్తావించాయి. ప్రవాసులు, వలస కార్మికులు, వారి గౌరవం, భద్రత అలాగే సంక్షేమానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కార్మిక, ఉపాధి రంగాలపై ఏర్పాటు చేసిన సంయుక్త కార్యాచరణ కమిటీ తరచూ సమావేశాలు నిర్వహించాలని ఇరుపక్షాలు తీర్మానించాయి.
మధ్యతూర్పు ప్రాంతంలో భద్రతా పరిస్థితులు సహా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరు పక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయి. అంతర్జాతీయ వివాదాల శాంతియుత పరిష్కారం కోసం చర్చలు, దౌత్యం ముఖ్యమైనవని స్పష్టం చేశాయి. యూఎన్, ఇతర బహుపాక్షిక వేదికల్లో ఇరుదేశాల అద్భుతమైన సమన్వయాన్ని ఇరుపక్షాలు ప్రశంసించాయి.
భారత్–జీసీసీ సహకారాన్ని పెంపొందించడానికి మద్దతునివ్వడం అలాగే ఖతార్ అధ్యక్షతన రియాద్‌లో గతేడాది సెప్టెంబర్ 9న విదేశాంగ మంత్రుల స్థాయి వ్యూహాత్మక చర్చల కోసం తొలి భారత్–జీసీసీ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన ఖతార్‌కు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. వ్యూహాత్మక చర్చలతో తొలి భారత్–జీసీసీ మంత్రివర్గ సమావేశం సాధించిన ఫలితాలను ఇరు పక్షాలు స్వాగతించాయి. ఇటీవల ఆమోదించిన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ప్రకారం భారత్–జీసీసీ సహకారాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు ఖతార్ పూర్తి మద్దతును ప్రకటించింది.
ఐక్యరాజ్యసమితి సంస్కరణల నేపథ్యంలో, ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో కీలకమైన అంశంగా, సమకాలీన వాస్తవాలను ప్రతిబింబిస్తూ యూఎన్ కేంద్రంగా సంస్కరించిన, ప్రభావవంతమైన బహుపాక్షిక వ్యవస్థ ప్రాముఖ్యతను ఇరువురు నేతలు ప్రధానంగా ప్రస్తావించారు. భద్రతా మండలి సహా యూఎన్‌లో సంస్కరణల అవసరం ఎంతగానో ఉందని ఇరుపక్షాలు స్పష్టం చేశాయి. ఐక్యరాజ్యసమితి, దాని ప్రత్యేక సంస్థలు, కార్యక్రమాల్లో సమన్వయంతో కూడిన ప్రయత్నాల ద్వారా, అలాగే యూఎన్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీల) సాధనను ముందుకు తీసుకెళ్లేందుకు సాంకేతిక సహకారం అందించడం ద్వారా ఉమ్మడి ప్రపంచ సవాళ్లను పరిష్కరించాల్సిన ప్రాముఖ్యతను ఇరుపక్షాలు ప్రస్తావించాయి. బహుళపక్ష వేదికల్లో ఒకరి అభ్యర్థిత్వాన్ని మరొకరు సమర్ధించడం సహా, ఐక్యరాజ్యసమితిలో సన్నిహిత సహకారం కోసం పరస్పర మద్దతు విషయంలో ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
ఈ పర్యటన సందర్భంగా, బహుముఖ ద్వైపాక్షిక సంబంధాన్ని పెంపొందించుకోవడంతో పాటు మరిన్ని రంగాల్లో సహకారానికి మార్గం సుగమం చేసేందుకు ఇరుదేశాల మధ్య కింది ఒప్పందాలు జరిగాయి:
· ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఒప్పందం
· ద్వంద్వ పన్నులను నివారించుటకు, ఆదాయంపై పన్నులు, దాని ప్రోటోకాల్‌కు సంబంధించి ఆర్థిక ఎగవేతలను నివారించుటకు సవరించిన ఒప్పందం
· ఆర్థిక, రాజ్యసంబంధ సహకారం కోసం ఇరుదేశాల ఆర్థిక మంత్రుల మధ్య అవగాహన ఒప్పందం
· యువజన, క్రీడా రంగాల్లో సహకారం కోసం అవగాహన ఒప్పందం
· డాక్యుమెంట్స్, అర్కైవ్స్ విషయంలో సహకారం కోసం అవగాహన ఒప్పందం
· ఇన్వెస్ట్ ఇండియా, ఇన్వెస్ట్ ఖతార్ మధ్య అవగాహన ఒప్పందం
· భారత పరిశ్రమల సమాఖ్య, ఖతార్ వ్యాపారవేత్తల సంఘం మధ్య అవగాహన ఒప్పందం
తనకు, తమ ప్రతినిధి బృందానికి ఆత్మీయ ఆతిథ్యం అందించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఖతార్ అధినేత కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటన భారత్, ఖతార్ మధ్య బలమైన స్నేహం, సహకార బంధాలను పునరుద్ఘాటించింది. ఈ భాగస్వామ్యం మరింత ముందుకుసాగుతూనే ఉంటుందనీ, అలాగే ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తూ ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వానికి దోహదపడుతుందని ఇరుదేశాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
***
Had a very productive meeting with my brother, Amir of Qatar H.H. Sheikh Tamim Bin Hamad Al Thani, earlier today. Under his leadership, Qatar has scaled new heights of progress. He is also committed to a strong India-Qatar friendship. This visit is even more special because we… pic.twitter.com/XQXM7ZkS6N
— Narendra Modi (@narendramodi) February 18, 2025
Trade featured prominently in our talks. We want to increase and diversify India-Qatar trade linkages. Our nations can also work closely in sectors like energy, technology, healthcare, food processing, pharma and green hydrogen.@TamimBinHamad pic.twitter.com/7WAmUHRanH
— Narendra Modi (@narendramodi) February 18, 2025