రైల్వేల సంస్కరణకు సర్వీసుల ఏకీకరణ జరగాలని అనేక కమిటీలు సిఫార్సు చేశాయి
2019 డిసెంబర్ 7,8 తేదీలలో జరిగిన రైల్వే అధికారుల రెండు రోజుల “పరివర్తన్ సంఘోష్టి” సమ్మేళనంలో లభించిన మద్దతు, కుదిరిన ఏకాభిప్రాయం మేరకు సంస్కరణలు చేపట్టడం జరుగుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం భారతీయ రైల్వేల పరివర్తనకోసం సంస్థాగత పునర్నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ చారిత్రాత్మక సంస్కరణ భారతీయ రైల్వేలను భారత వికాస యాత్రకు తోడ్పడే వృద్ధి యంత్రంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికత సాధనకు దోహదం చేయగలదు.
చేపట్టే సంస్కరణలలో కొన్ని:
i. రైల్వేలో ప్రస్తుతం ఉన్న 8 గ్రూప్ ఏ సర్వీసులను ఇండియన్ రైల్వే మేనేజిమేంట్ సర్వీసు (ఐ ఆర్ ఎం ఎస్) పేరిట ఏకీకరించి కేంద్ర సర్వీసుగా మార్పు
ii. రైల్వే బోర్డు చైర్మన్ (సి ఆర్ బి) ఆధిపత్యంలో రైల్వే బోర్డును క్రియాత్మక పద్దతిలో నలుగురు సభ్యులు, కొందరు స్వతంత్ర సభ్యులతో పునర్వ్యస్థీకరిస్తారు
iii. ప్రస్తుతం ఉన్న ఇండియన్ రైల్వే మెడికల్ సర్వీసును (ఐ ఆర్ ఎం ఎస్) ఇండియా రైల్వే హెల్త్ సర్వీసుగా (ఐ ఆర్ హెచ్ ఎస్) మార్పు.
వచ్చే 12 సంవత్సరాలలో రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడి ద్వారా రైల్వేల ఆధునీకరణకు బృహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రతిపాదిత పెట్టుబడుల ద్వారా ప్రయాణీకుల భద్రత, రైళ్ళ వేగం పెంపు ఇతర సేవలు కల్పించాలన్నది సంకల్పం. ఇందుకోసం వేగం, ప్రమాణం మరియు ఎకీకృతంగా లాఘవంతో, దృఢచిత్తంతో చురుకుగా పనిచేసే సంస్థ అవసరం. ఎదురయ్యే సవాళ్ళను అది సమర్ధవంతంగా ఎడుర్కొగలగాలి. ఇప్పుడు చేపట్టిన సంస్కరణలు ప్రస్తుత ప్రభుత్వం కొన్నేళ్లుగా చేపడుతూవస్తున్న సంస్కరణల శ్రేణిలో భాగమే. రైల్వే బడ్జెటును సాధారణ వార్షిక బడ్జెటులో విలీనం చేయడం, జనరల్ మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లకు అధికారాలను ప్రదానం చేయడం, రైళ్ళు నడపడానికి పోటీ నిర్వాహకులను అనుమతించడం మొదలగునవి.
తదుపరి స్థాయి సవాళ్ళను ఎదుర్కోవడానికి మరియు ప్రస్తుతం ఉన్న సమస్యలను అధిగమించడానికి ఈ చర్య అవసరమైంది. విశ్వవ్యాప్తంగా రైల్వే వ్యవస్థలన్నీ కార్పొరేట్ల నిర్వహణలో ఉండగా భారతీయ రైల్వే మాత్రం ప్రభుత్వ ప్రత్యక్ష యాజమాన్యంలో నడుస్తోంది. దాని నిర్వహణకు ట్రాఫిక్, సివిల్, మెకానికల్,ఎలెక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికాం, స్టోర్స్, పర్సనల్ మరియు అక్కౌంట్స్ మొదలగు వివిధ శాఖలుగా వ్యవస్థీకరించడం జరిగింది. ఈ శాఖలాన్నీ పై నుంచి కింది వరకు వేరై ఉంటాయి. వీటికి సెక్రెటరీ స్థాయి అధికారి అధిపతిగా ఉంటారు. వారే రైల్వే బోర్డులో ఆ శాఖ సభ్యుడుగా ఉంటారు. ఈ విధంగా రైల్వేలో అట్టడుగు స్థాయి వరకు శాఖాపరమైన వ్యవస్థ కొనసాగుతుంది. ఇప్పుడు సర్వీసుల ఏకీకరణ వల్ల ఏకీకరణ వల్ల ‘శాఖీకరణ’ అంతమై రైల్వేలు సాఫీగా పనిచేయడానికి, సత్వర నిర్ణయాలు చేయడానికి, సంస్థ అభివృద్ధికి దోహదం చేసే పొందికైన దృష్టికల్పన మరియు హేతుబద్దమైన నిర్ణయాలను ప్రోత్సాహించడానికి దారితీస్తుంది.
రైల్వేలను సంస్కరించేందుకు సర్వీసుల ఏకీకరణ జరపాలని అనేక కమిటీలు సిఫార్సు చేశాయి. వాటిలో కొన్ని: ప్రకాశ్ టాండన్ కమిటీ (1994), రాకేశ్ మోహన్ కమిటీ (2001), శాం పిట్రోడా కమిటీ (2012) మరియు వివేక్ దేవరాయ్ కమిటీ (2015).
డిల్లీలో 2019 డిసెంబర్ 7,8 తేదీలలో జరిగిన రైల్వే అధికారుల రెండు రోజుల “పరివర్తన్ సంఘోష్టి” సమ్మేళనంలో ప్రతినిధుల నుంచి లభించిన మద్దతు, కుదిరిన ఏకాభిప్రాయం మేరకు ఈ సంస్కరణ చేపట్టడం జరుగుతోంది. రైల్వే అధికారుల మనోభావాలను గౌరవిస్తూ వారిలో విశ్వాసాన్ని పాదుకొల్పడానికి ఆ సమ్మేళనంలోనే రైల్వే బోర్డు అసాధారణ సమావేశాన్ని జరిపి ఈ సంస్కరణతో పాటు అనేక సంస్కరణలకు సిఫార్సు చేసింది.
తదుపరి రిక్రూట్మెంట్ సైకిల్ నుంచి గ్రూప్ ఏ సర్వీసుల ఏకీకరణ ద్వారా “ఇండియన్ రైల్వే మేనేజిమెంట్ సర్వీస్” (ఐ ఆర్ ఎం ఎస్) ఏర్పాటు చేయాలని ప్రతిపాదన. వచ్చే ఎంపిక సంవత్సరంలో నియామకాలకు వీలుగా కేంద్ర సిబ్బంది మరియు శిక్షణ శాఖ మరియు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లను సంప్రదించి కొత్త సర్వీసును సృష్టించడం జరుగుతుంది. దానివల్ల అవసరాలకు అనుగుణంగా రైల్వేలు ఇంజనీర్లను/ఇంజనీర్లు కాని వారిని ఎంపిక చేసుకొని ఉభయ వర్గాల వారికి ఉద్యోగ ఉన్నతికి సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుంది.
కేంద్ర సిబ్బంది మరియు శిక్షణ శాఖను సంప్రదించి రైల్వే మంత్రిత్వ శాఖ ఇందుకు సంబందించిన మార్గదర్శకాలను, సర్వీసుల ఏకీకరణ విధానాన్ని ప్రత్యామ్నాయ యంత్రాంగం ఆమోదం మేరకు
రూపొందిస్తుంది. ఈ ప్రక్రియ అంతా న్యాయంగా, పారదర్శకంగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆ ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ఏర్పాటుచేస్తుంది. మొత్తం ప్రక్రియ ఒక ఏడాదిలో పూర్తవుతుంది.
కొత్తగా నియమితులయ్యే అధికారులు సంస్థ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ మరియు ఇంజనీరింగ్ కాని క్షేత్రాలకు చెందినవారై ఉంటారు. వారి యోగ్యత, అభిరుచి మరియు విశేషాధ్యయనం మేరకు ఏదో ఒక రంగంలో ప్రత్యేకత సాధించడం ద్వారా పూర్తి అవగాహన పెంపొందించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయి బాధ్యతలు చేపట్టేలా వారిని తయారుచేయడం లక్ష్యం. సాధారణ యాజమాన్య / నిర్వహణ పదవులకు ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
రైల్వే బోర్డు ఏర్పాటు ఇకపైన శాఖాపరంగా ఉండదు, దాని బదులు క్రియాత్మక పద్దతిలో తక్కువ మందితో నిర్మాణం జరుగుతుంది. రైల్వే బోర్డుకు చైర్మన్ రైల్వే బోర్డు (సి ఆర్ బి) అధిపతిగా ఉంటారు. ఆయనే ప్రధాన కార్యనిర్వాహక అధికారి (సి ఇ ఓ). మరో నలుగురు సభ్యులు మౌలిక సదుపాయాలు, నిర్వహణ మరియు వ్యాపార వృద్ది, రైలు పెట్టెలు ఇంజను వగైరా మరియు ఆర్ధిక వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. బోర్డు చైర్మన్ ఉద్యోగశ్రేణిని నియంత్రించే అధికారి. ఆయన మానవ వనరులకు బాధ్యుడు. మానవ వనరుల (హెచ్ ఆర్) విభాగం డిజి ఆయనకు సహాయం అందిస్తారు. రైల్వే బోర్డులో 3 అగ్ర స్థాయి పోస్టులను తిరిగి ఇచ్చివేస్తారు. మిగిలిన పదవులన్నీ ఆయా అధికారులు పనిచేసే సర్వీసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా అప్పగించవచ్చు. బోర్డులో కొందరు స్వతంత్ర సభ్యులు కూడా ఉంటారు (వారి సంఖ్యను ఎప్పటికప్పుడు సమర్థాధికారి నిర్నయిస్తుంటారు). స్వతంత్ర సభ్యులు పరిశ్రమలు, ద్రవ్య వ్యవహారాలు, ఆర్ధికాంశాలు మరియు యాజమాన్యం వంటి క్షేత్రాలలో ఘనత వహించిన ప్రముఖులు, ఉన్నత స్థాయితో పాటు దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉన్న వారి ఉండాలి. రైల్వే బోర్డు వ్యుహాత్మక దిశానిర్దేశం చేసేందుకు స్వతంత్ర సభ్యులు సహాయ పడతారు. అధికారులను వారి వారి వేతనం మరియు హోదా ఆదారంగా పదవీ విరమణ జరిగేవరకు సర్దుబాటు చేసి పునర్నిర్మాణ బోర్డులోకి బదిలీలు జరిగినట్లు నిశ్చయం చేసుకుని బోర్డు ఆమోదించిన తరువాత పునర్నిర్మాణ బోర్డు కార్యకలాపాలు మొదలవుతాయి.
******