Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతీయ పరిశ్రమ ల సమాఖ్య (సిఐఐ) వార్షిక సమావేశం ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం


నమస్కారం. ముందుగా 125 సంవ‌త్స‌రాలు విజ‌య‌వంతం గా పూర్తి చేసుకున్న సంద‌ర్భం లో మీకంద‌రికీ నా శుభాకాంక్ష‌లు. 125 సంవత్స‌రాల ప్ర‌యాణం అంటే సుదీర్ఘ‌మైన ప్రయాణం.  ఆ ప్ర‌స్థానం లో ఎన్నో మైలురాళ్లు ఉండి ఉంటాయి.  అలాగే మీరంద‌రూ ఎన్నో ఎగుడుదిగుడుల ను కూడా చూసి ఉంటారు.  ఒక సంస్థ‌ ను 125 సంవ‌త్స‌రాల కాలం న‌డ‌ప‌డం అంటే అది అతి పెద్ద స‌వాలు.  అప్ప‌టికి, ఇప్ప‌టికి అనేకమైన మార్పు లు చోటు చేసుకొన్నాయి.  ప్ర‌ధానం గా వ్య‌వ‌స్థ‌ లు ఎంతో మారిపోయాయి.  ఈ 125 సంవ‌త్స‌రాల ప్ర‌యాణం లో సిఐఐ ని ప‌టిష్ఠం చేయ‌డానికి కృషి చేసిన దిగ్గ‌జాలంద‌రికీ మొదట శుభాకాంక్ష‌లు తెలియ‌చేయాల‌నుకుంటున్నాను.  అలాగే  ప్ర‌స్తుతం మన మ‌ధ్య న భౌతికం గా లేని వారంద‌రికీ నా నివాళి. భ‌విష్య‌త్తు లో సార‌థ్య ప‌గ్గాల ను చేప‌ట్ట‌బోయే వారంద‌రికీ శుభ కామ‌న‌ లు.

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం వ‌ల్ల ఆన్ లైన్ కార్య‌క‌లాపాలు కొత్త అల‌వాటు గా మారిపోయాయి.  క‌ష్టాలు ఎదురైన‌ప్పుడ‌ల్లా ప్ర‌జ‌లు వాటి ని అధిగ‌మించే మార్గాల కోసం అన్వేషిస్తారు.  వారి అతి పెద్ద బ‌లం ఇదే.  ఈ రోజు న కూడా ఒక‌ ప్రక్క వైర‌స్ ను అదుపు చేయ‌డానికి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటూనే, మ‌రో ప్రక్క ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌నుగ‌డ‌ కు కూడా కృషి చేస్తున్నాము.  దేశ‌వాసుల ప్రాణాల‌ ను ర‌క్షించ‌డం తో పాటు ఆర్థిక కార్య‌క‌లాపాల లో స్థిర‌త్వాన్ని తీసుకు రావ‌డం, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ లో వేగాన్ని పెంచ‌డానికి కూడా కృషి చేయాలి.  ప్ర‌స్తుత ప‌రిస్థితి లో మీరంద‌రూ వృద్ధి ని పున‌రుద్ధ‌రించ‌డం గురించి మాట్లాడుతున్నారు.  అది అభినంద‌నీయం.  మ‌నం వృద్ధి ని తిరిగి సాధారణ స్థాయి కి తీసుకు రాగ‌ల‌ం అని నేను న‌మ్మ‌కం గా చెబుతున్నాను.  ప్ర‌స్తుత సంక్షోభ కాలం లో నేను ఇంత న‌మ్మ‌కం గా ఎలా చెప్ప‌గ‌లుగుతున్నాన‌ని మీకంద‌రికీ ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌వ‌చ్చు.

నా న‌మ్మ‌కాని కి అనేక కార‌ణాలు ఉన్నాయి.  భార‌త‌దేశాని కి గల సామ‌ర్థ్యాలు, విప‌త్తు నిర్వ‌హ‌ణ‌ పై నాకు న‌మ్మ‌కం ఉంది. భార‌త‌దేశం లో గల ప్ర‌తిభ, సాంకేతిక ప‌రిజ్ఞానాల‌ ను నేను విశ్వ‌సిస్తాను.  భార‌త‌దేశం యొక్క వినూత్న ఆవిష్కరణ జోరు ను, భార‌త‌దేశం యొక్క మేధ ను నేను న‌మ్ముతాను.  భార‌త‌దేశం యొక్క రైతులు, ఎమ్ఎస్ఎమ్ఇ లు, భార‌త‌దేశం యొక్క నవ పారిశ్రామికుల‌ పైన నాకు న‌మ్మ‌కం ఉంది.  మీ వంటి పారిశ్రామిక దిగ్గ‌జాల ను నేను విశ్వ‌సిస్తాను.  అందుకే వృద్ధి ని తిరిగి సాధించగలుగుతామ‌ని నేను చెప్ప‌గ‌లుగుతున్నాను. భార‌త‌దేశం త‌నదైన వృద్ధిరేటు ను తిరిగి పొంద‌గ‌లుగుతుంది.

మిత్రులారా,

మన అభివృద్ధి రేటు ను క‌రోనా మంద‌గింప‌చేసి ఉండ‌వ‌చ్చు.  కానీ ఇప్పుడే లాక్ డౌన్ ద‌శ‌ ను భార‌త్ అధిగ‌మించ‌డం తో పాటు కొత్త‌గా అన్ లాక్ దశ లో ప్రవేశించింది.  అన్ లాక్ ఒకటో ద‌శ‌ లోనే ఆర్థిక వ్య‌వ‌స్థ‌ లో ప‌లు విభాగాల‌ ను తెర‌వ‌గ‌లిగాము.  జూన్ 8వ తేదీ నుండి ఇంకా మరెన్నో తెరచుకోబోతున్నాయి.  ఆ ర‌కం గా వృద్ధి ని తిరిగి తీసుకురావ‌డం ఇప్పుడే మొదలయింది.

క‌రోనా వైర‌స్ క్ర‌మం గా విస్త‌రిస్తూ తన కోర‌ల‌ ను ప్ర‌పంచం చుట్టూ వ్యాపింప‌చేస్తున్న త‌రుణంలోనే భార‌త‌దేశం రంగం లోకి దిగి స‌కాలం లో స‌రైన చ‌ర్య‌లు తీసుకుంది.  ఇతర దేశాల‌ తో ప‌రిస్థితి ని పోల్చితే భార‌త‌దేశం ప్ర‌క‌టించిన లాక్ డౌన్ ప్ర‌భావం ఎంత విస్తృతం గా ఉన్న‌దీ మ‌నం గమనించగ‌లుగుతాము.  ఈ లాక్ డౌన్ కాలం లో భార‌త‌దేశం భౌతిక వ‌న‌రుల‌ ను సిద్ధం చేసుకోవ‌డ‌మే కాదు, మానవ వ‌న‌రుల‌ ను కూడా ప‌రిర‌క్షించుకుంది.  ఈ వాతావ‌ర‌ణం లో త‌రువాత ఏమిటి?  అనే ప్ర‌శ్న త‌లెత్తుతుంది.  పారిశ్రామిక రంగం నాయ‌కులు గా మీ అంద‌రి మ‌ది లో ఒక‌టే ప్ర‌శ్న మెదులుతుంది; అది  ప్ర‌భుత్వం ఇప్పుడు ఏం చేయ‌బోతోంది అనేది.  ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అభియాన్ పై కూడా మీలో కొన్ని ప్ర‌శ్న‌లు ఉండ‌వ‌చ్చు.  అది అత్యంత స‌హ‌జం, త‌ప్పు కూడా కాదు.

మిత్రులారా,

క‌రోనా వైర‌స్ నేప‌థ్యం లో ఆర్థిక వ్య‌వ‌స్థ‌ కు కొత్త శ‌క్తి ని క‌ల్పించ‌డం అత్యంత ప్ర‌ధాన‌మైన అంశాల లో ఒక‌టి.  అందుకోస‌మే త‌క్ష‌ణం తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌ ను ప్ర‌భుత్వం చేప‌ట్టింది.  పైగా దీర్ఘ‌కాలం లో దేశాని కి ఉప‌యోగ‌క‌రం గా ఉండే నిర్ణ‌యాల ను ప్ర‌భుత్వం తీసుకుంది.

మిత్రులారా,

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పేదల కు తక్షణ ప్రయోజనం కల్పించడానికి ఎంతో సహాయకారి గా ఉంది.  ఈ పథకం లో భాగం గా దాదాపు 74 కోట్ల మంది లబ్ధిదారుల కు రేషన్ అందించడం జరిగింది.  వలస పోయిన శ్రామికుల కు ఉచిత రేషన్ ను కూడా అందజేయడమైంది.  అంతేకాదు, ఇప్పటి వరకు నిరుపేద కుటుంబాల కు 53,000 కోట్ల రూపాయల కు పైగా ఆర్థిక సహాయాన్ని అందించడమైంది. మహిళలు, దివ్యాంగులు, కార్మికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దాని వల్ల లబ్ధి ని పొందారు.  లాక్ డౌన్ కాలం లో ప్రభుత్వం 8 కోట్ల గ్యాస్ సిలిండర్ లను పేదల కు ఉచితం గా అందజేసింది.  ప్రైవేటు రంగం లోని రమారమి 50 లక్షల మంది ఉద్యోగుల ఖాతాల కు ప్రభుత్వం 24 శాతం ఇపిఎఫ్ చందా ను కూడా జమ చేసింది.  వారి ఖాతాల లో సుమారు 800 కోట్ల రూపాయల వరకు జమ చేయడమైంది.

మిత్రులారా,

స్వయంసమృద్ధ భారత్ నిర్మాణం, భారత ఆర్థిక వ్యవస్థ ను వేగవంతమైన అభివృద్ధి లో తిరిగి ప్రవేశపెట్టడానికి ఐదు అంశాలు- నిశ్చయం, సమ్మిళితత్వం, పెట్టుబడి, మౌలిక వసతుల కల్పన, నూతన ఆవిష్కరణ లు- అత్యంత ప్రధానం. ఆ దిశ గా మేం ఇటీవల తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వివరాలు మీ ముందుంచుతున్నాను.  ఈ నిర్ణయాల తో మేము ప్రతి ఒక్క రంగాన్ని భవిష్యత్ అవసరాల కు దీటు గా తయారుచేయగలిగాము. ఈ రోజు న భారతదేశం
వృద్ధి ఆధారిత భవిష్యత్తు దిశ గా పెద్ద అడుగు ను వేయడానికి సిద్ధం గా ఉంది.  మిత్రులారా, సంస్కరణలంటే మాకు ఎంపిక ప్రాతిపదిక న తీసుకునే చర్య కానేకాదు.  మా వరకు సంస్కరణలంటే ఒక క్రమపద్ధతి, ప్రణాళికాబద్ధత, సమన్వయం, పరస్పర అనుసంధానం, భవిష్యత్ దృష్టికోణం కలిగి ఉండాలి.

మా దృష్టి లో, ‘సంస్కరణ’ అంటే నిర్ణ‌యాలు తీసుకోగల, వాటికి తార్కిక‌మైన ముగింపు ను ఇవ్వగల సాహ‌సాన్ని క‌లిగి ఉండ‌డ‌మే.  అది ఐబిసి కావచ్చు, బ్యాంకు విలీనాలు, జిఎస్ టి, ఫేస్ లెస్ ఇన్ కమ్ ట్యాక్స్ అసెస్ మెంట్ విధానం కావచ్చు.. మేము ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించే వ్యవస్థ ను అందుబాటులోకి తెచ్చి ప్రైవేటు రంగానికి అవకాశాలు పెంచగల వాతావరణాన్ని కల్పించడానికి ప్రాధాన్యాన్ని ఇస్తున్నాము.  అందుకే ప్రభుత్వం విధానపరమైన సంస్కరణల ను చేపట్టింది.  వ్యవసాయ రంగం విషయానికే వస్తే, స్వాతంత్ర్యం సిద్ధించిన కాలం లో రూపొందించిన విధానాలు, నిబంధన ల కారణం గా రైతుల ను మధ్యదళారీ ల కరుణాకటాక్షాల కు ఎదురు చూసే పరిస్థితి ని కల్పించాయి.  దశాబ్దాల తరబడి రైతులకు జరిగిన అన్యాయాన్ని తొలగించేందుకు మా ప్రభుత్వం సుముఖత ను ప్రదర్శించింది.

ఎపిఎమ్ సి యాక్టు లో మార్పులు చేసిన తరువాత ఇప్పుడు రైతులు కూడా హక్కుల ను పొందారు.  రైతాంగం ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎవరికి అమ్మాలనుకుంటే వారికి దిగుబడులను విక్రయించవచ్చును.  ఈ రోజు న రైతు దేశం లోని ఏ రాష్ట్రానికైనా తన ఫలసాయాన్ని తీసుకుపోయి విక్రయించుకోవచ్చు. తమ వ్యవసాయ దిగుబడులు గిడ్డంగుల్లో భద్రపరుచుకుని ఇలెక్ట్రానిక్ ట్రేడింగ్ ద్వారా అమ్ముకోవచ్చును.  ఒక్క సారి ఆలోచించండి, అగ్రి బిజినెస్ కు ఎన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయో.  అలాగే మిత్రులారా, మన కార్మికుల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకొని కార్మిక సంస్కరణల ను చేపట్టడం ద్వారా ఉపాధి అవకాశాల ను విస్తరిస్తున్నాము.

ప్రైవేటు రంగం భాగస్వామి కాగల వ్యూహాత్మకేతర రంగాల ను పెట్టుబడులకు తెరవడమైంది. ఎన్నో సంవత్సరాలు గా పెండింగు లో ఉన్న డిమాండుల ను పరిగణన లోకి తీసుకొని “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్” బాట లో కీలక నిర్ణయాలను తీసుకొంటున్నాము.  మిత్రులారా, భారతదేశం ప్రపంచంలోనే అత్యధికం గా బొగ్గు నిల్వలు కలిగిన మూడో దేశం గా ఉంది.  అలాగే మీ వంటి సాహసోపేతులైన, కష్టించి పని చేయగల వ్యాపారవేత్తలు భారతదేశాని కి ఉన్నారు. అలాంటప్పుడు వెలుపలి నుండి బొగ్గు ను ఎందుకు దిగుమతి చేసుకోవాలి?  కొన్ని సందర్భాల లో ప్రభుత్వం, మరికొన్ని సందర్భాల లో విధానాలు అడ్డు గా నిలుస్తున్నాయి.  అందుకే బొగ్గు రంగాన్ని ఈ అవరోధాల నుండి విముక్తం చేసే కృషి ని మొదలుపెట్టాము.

ఇప్పుడు బొగ్గు రంగం లో వాణిజ్యపరమైన తవ్వకాల ను అనుమతించడమైంది.  పాక్షికం గా అన్వేషించిన కోల్ బ్లాక్ లను కూడా అలాట్ చేసేందుకు అనుమతుల ను మంజూరు చేశాము.  అలాగే, ఖనిజాల తవ్వకంలో  కంపెనీలు ఇప్పుడు గనుల తవ్వకం తో పాటు ఏకకాలం లో అన్వేషణ పనులను కూడా చేపట్టవచ్చును.  ఆ రంగం తో సంబంధం ఉన్న వారికి ఈ నిర్ణయాల దీర్ఘకాలిక ప్రభావాల ను గురించి బాగా తెలుసును.

మిత్రులారా,

ప్రభుత్వం కదులుతున్న క్రమాన్ని బట్టి గనుల రంగం, ఇంధన రంగం, పరిశోధన, సాంకేతిక విజ్ఞానం ఏ రంగమైనా కావచ్చు.. ప్రతి ఒక్క రంగంలో యువత కు, పరిశ్రమ కు ఎన్నో అవకాశాలు అందుబాటు లో ఉన్నాయి.  అవే కాదు, ఇప్పుడు వ్యూహాత్మక రంగాల లో కూడా ప్రైవేటు భాగస్వామ్యం వాస్తవం లోకి రాబోతోంది.  మీరు అంతరిక్షం లో పెట్టుబడి పెట్టాలనుకున్నా లేదా అణు శక్తి రంగం లో కొత్త అవకాశాలు అన్వేషించాలనుకున్నా అద్భుతమైన అవకాశాలు మీకు పూర్తి స్థాయి లో అందుబాటు లో ఉన్నాయి.

మిత్రులారా,

మీ అందరికీ బాగా తెలుసు, దేశం లోని లక్షలాది ఎమ్ఎస్ఎమ్ఇ యూనిట్ లు ఆర్థిక రంగాని కి చోదక శక్తులు.  మన భారత జిడిపి కి వారు ఎంతో పెద్ద వాటా ను అందిస్తున్నారు.  వారందించే వాటా 30 శాతం వరకు ఉంది.  ఎమ్ఎస్ఎమ్ఇల నిర్వచనంపై స్పష్టత ఇవ్వాలని ఎంతో కాలంగా కోరుతున్నారు. ఆ ఆకాంక్ష ఇప్పటికి నెరవేరింది. ఇప్పుడు ఎమ్ఎస్ఎమ్ఇ లు ఎటువంటి చింత లేకుండా అభివృద్ధి చెందవచ్చును.  ఎమ్ఎస్ఎమ్ఇ హోదా ను నిలబెట్టుకొనేందుకు మార్గాల కోసం అన్వేషించవలసిన అవసరం లేదు.  ఇప్పుడు 200 కోట్ల రూపాయల వరకు విలువ గల ముడిపదార్ధాల సమీకరణ కు ఇక గ్లోబల్ టెండర్ లు పిలవవలసిన అవసరం లేదు.  ఈ నిర్ణయం ఎమ్ఎస్ఎమ్ఇ లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి కి ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది.  చిన్న పరిశ్రమల కు  ఈ చర్య ఎన్నో అవకాశాల ను ఆవిష్కరిస్తుంది.  ఒక రకంగా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజి ఎమ్ఎస్ఎమ్ఇ రంగం అనే యంత్రాని కి ఇంధనం గా నిలుస్తుంది.

మిత్రులారా,

ఈ నిర్ణయాల ప్రాసంగికత ను గురించి తెలుసుకోవాలంటే నేటి ప్రపంచ పరిస్థితి ని తెలుసుకోవలసిన, అవగాహన చేసుకోవలసిన ప్రాధాన్యం ఉంది.  ఈ రోజు న ప్రపంచ దేశాలన్నీ ఒక దాని మద్దతు కోసం మరొకటి ఆధారపడుతున్నాయి.  వాటిలో మరో దేశం కూడా అందుబాటు లోకి రావలసిన అవసరం ఉంది.  ఒక్కసారి పాత ఆలోచన లు, పాత విధానా లు, పాత ఆచారాలు ఎంత సమర్థవంతం గా ఉన్నాయో కూడా ఆలోచన కు వస్తుంది. అప్పుడు నేటి విధానాల పై సహజం గానే ఆలోచన వెళ్తుంది. అటువంటి సందర్భాల లో భారతదేశంపై ప్రపంచం అంచనా లు మరింతగా పెరిగాయి.  ఈ రోజు న భారతదేశంపై ప్రపంచ విశ్వాసం ఎంతగానో పెరిగింది. మీరు చూసే ఉంటారు, కరోనా సంక్షోభం కాలం లో ఒక దేశాని కి మరొక దేశం సహాయం చేయడం అత్యంత కష్టం గా ఉన్న వాతావరణం లో 150కి పైగా దేశాల కు చికిత్సపరమైన సరఫరాల ను భారతదేశం సమకూర్చింది.

మిత్రులారా,

భారతదేశాన్ని యావత్తు ప్రపంచం ఒక విశ్వసనీయమైన మరియు ఆధారపడదగిన భాగస్వామ్య దేశం గా పరిగణిస్తోంది. ఆ సామర్థ్యం, బలం, శక్తి మనకు ఉన్నాయి.

భార‌త‌దేశం పై ప్ర‌పంచం పెంచుకొన్న న‌మ్మ‌కం నుండి పూర్తి స్థాయి లో లాభాన్ని పొందేందుకు ఈ రోజు న భారత పారిశ్రామిక రంగం సిద్ధం కావాలి.  మీ అంద‌రి బాధ్యత అది. ‘‘భార‌త్ లో త‌యారీ’’ అంటే న‌మ్మ‌కం, నాణ్యత, పోటీ సామ‌ర్థ్యం అని నిరూపించ‌డం ఒక సంస్థ గా సిఐఐ బాధ్యత అది.  మీరు రెండు అడుగులు ముందుకు వేస్తే మీకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం నాలుగు అడుగులు ముందుకు వేస్తుంది. మీ అందరి వెంట నేను ఉంటానని ప్రధాన మంత్రి గా నేను హామీ ని ఇస్తున్నాను.  భారత పరిశ్రమ కాలానుగుణం గా కదలవలసిన తరుణం ఇది.  నన్ను నమ్మండి, ‘‘వృద్ధి ని పునరుద్ధరించడం’’ అంత కష్టం ఏమీ కాదు.  ఇప్పుడు భారత పారిశ్రామిక రంగాని కి ముందు ఉన్న స్పష్టమైన బాట ఆత్మనిర్భర్ భారత్; అదే స్వయం సమృద్ధ భారతదేశం.  స్వయంసమృద్ధ భారతదేశాని కి అర్థం భారతదేశం మరింత బలపడి మరి ప్రపంచాన్ని హత్తుకోగలదిగా రూపొందడమే.

స్వయంసమృద్ధ భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తో పూర్తి గా అనుసంధానం కాగలుగుతుంది, మద్దతు గా నిలవగలుగుతుంది.  అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, స్వయంసమృద్ధ భారతదేశం అంటే వ్యూహాత్మక రంగాల కోసం కూడా మనం ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు.  స్వయం సమృద్ధ భారతదేశం అంటే అత్యంత శక్తివంతమైన, ప్రపంచ శక్తి గా అవతరించగల పరిశ్రమల అభివృద్ధి..ఉపాధి అవకాశాలను పెంచడం, ప్రజల కు సాధికారిత ను కల్పించడం, దేశ భవిష్యత్తు కు అవసరం అయిన పరిష్కారాల కోసం అన్వేషించడమూను.  మనం ఇప్పుడు స్థానిక అవసరాల ను తీర్చగలిగినటువంటి మరియు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ లో భారతదేశం యొక్క వాటా ను పెంచగలిగినటువంటి అత్యంత శక్తివంతమైన సరఫరా వ్యవస్థ ను నిర్మించేందుకు పెట్టుబడి ని పెట్టవలసివుంది.  సిఐఐ వంటి దిగ్గజ వ్యవస్థ లు ఈ ప్రచార ఉద్యమం లో సరిక్రొత్త పాత్ర ను పోషించేందుకు ముందుకు రావాలి.  దేశీయ ఆశల కు ఇంధనం గా నిలవగల విజేతలు గా తయారుకావాలి. దేశీయ పరిశ్రమల పునరుజ్జీవాని కి మీరు సహాయకారి కావాలి.  వృద్ధి లో తదుపరి స్థాయి కి చేరడానికి అవసరమైన సహాయాన్ని, మద్దతు ను అందించాలి.  ప్రపంచ విపణి కి విస్తరించడానికి పరిశ్రమల కు మీరు సహాయం అందించాలి.

మిత్రులారా,

అటువంటి వస్తువులన్నీ ఈ రోజు న దేశం లోనే తయారు చేయాలి (మేడ్ ఇన్ ఇండియా); అవి ప్రపంచం కోసం తయారు కావాలి (మేడ్ ఫర్ ద వరల్డ్).  దేశం యొక్క దిగుమతుల ను  మనం ఎలా తగ్గించుకోగలం?  ఏయే క్రొత్త లక్ష్యాల ను నిర్దేశించుకోవచ్చు?  అన్ని రంగాల లో ఉత్పాదకత ను పెంచే విధం గా మనం లక్ష్యాల ను నిర్దేశించుకొని తీరాలి.  మీ నుండి అటువంటి అంచనాలే దేశాని కి ఉన్నాయి, నేడు ఈ సందేశాన్నే పరిశ్రమ కు నేను ఇవ్వదలచుకొన్నాను.

మిత్రులారా,

భారతదేశాన్ని తయారీ కేంద్రం గా మార్చడానికి, ప్రధాన ఉపాధి కల్పన శక్తి గా తీర్చి దిద్దడానికి ‘మేక్ ఇన్ ఇండియా’ ను ఒక మాధ్యమం గా చేసుకొని మీ వంటి సంస్థల తో చర్చించిన అనంతరం పలు ప్రాధాన్య రంగాల ను గుర్తించడమైంది. ఫర్నిచర్, ఎయర్ కండిషనర్స్, లెదర్, ఇంకా పాదరక్షల రంగాల లో పని ఇప్పటికే ప్రారంభం అయింది.  ఎయర్ కండిషనర్స్ కు దేశం లో ఉన్న డిమాండు లో 30 శాతం మనం దిగుమతి చేసుకొంటున్నాము.  ఆ దిగుమతుల ను వీలైనంతగా తగ్గించుకోవాలి.  లెదర్ ఉత్పత్తులలో రెండో పెద్ద ఉత్పత్తి దేశం అయినప్పటికీ ప్రపంచ ఎగుమతుల లో మన వాటా చాలా తక్కువ గా ఉంది.

మిత్రులారా,

మనం ఎంతో చక్కని పురోగతి ని సాధించగల రంగాలంటూ అనేకం ఉన్నాయి.  ఇటీవలి సంవత్సరాల లో మీ వంటి మిత్రుల సహాయం తో వందే భారత్ వంటి ఆధునిక రైళ్ల కోచ్ ల ను దేశం లోనే నిర్మించుకొన్నాము.  ఈ రోజు న మన దేశం మెట్రో కోచ్ ల ను కూడా ఎగుమతి చేస్తోంది.  అలాగే మొబైల్ ఫోన్ లు కావచ్చు, రక్షణ ఉత్పత్తులు కావచ్చు.. అన్నిటిలో దిగుమతి పై ఆధారపడటాన్ని తగ్గించుకొనే ప్రయత్నాన్ని చేస్తున్నాము.  మూడే నెలల వ్యవధి లో మీరు వందల కోట్ల రూపాయల విలువ గల వ్యక్తిగత సంరక్షణ పరికరాల (పిపిఇ) పరిశ్రమ ను అభివృద్ధి చేశారన్న విషయం చెప్పడానికి ఈ రోజున నేను గర్విస్తున్నాను.  మూడు నెలల క్రితం వరకు దేశం లో ఒక్క పిపిపి కిట్ కూడా తయారయ్యేది కాదు.  ఈ రోజు న భారతదేశం రోజు కు 3 లక్షల పిపిఇ కిట్ లను ఉత్పత్తి చేస్తోంది.  మన పరిశ్రమ అంత శక్తివంతమైనది.  ప్రతి ఒక్క రంగం లో మీకు ఆ సామర్థ్యం ఉంది.  అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ లో గల పెట్టుబడి అవకాశాలన్నిటి ని పూర్తి స్థాయి లో ఉపయోగించుకోవాలని, రైతుల తో భాగస్వామ్యాల ను ఏర్పాటు చేసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను.  ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల లో స్థానికం గా వ్యవసాయ ఉత్పత్తుల క్లస్టర్స్ ను అభివృద్ధి పరచడం కోసం అవసరమైన మౌలిక సదుపాయాల ను అభివృద్ధి చేస్తున్నాము.  సిఐఐ సభ్యులందరికీ అటువంటి అవకాశాలు అనేకం ఉన్నాయి.

మిత్రులారా,

వ్యవసాయం, మత్స్యరంగం, ఫూడ్ ప్రాసిసెంగ్, పాదరక్షలు, ఫార్మా.. ఒకటేమిటి.. భిన్న రంగాల లో కొంగొత్త అవకాశాలు మీ కోసం తెరచుకుని ఉన్నాయి.  నగరాల లోని వలస శ్రామికుల కు ప్రభుత్వం ప్రకటించిన అద్దె వసతి నిర్మాణం లో మీ అందరి చురుకైన భాగస్వామ్యాన్ని నేను ఆహ్వానిస్తున్నాను.

మిత్రులారా,

మా ప్రభుత్వం దేశాభివృద్ధి పయనం లో ప్రైవేటు రంగాన్ని కీలక భాగస్వామి గా పరిగణిస్తోంది.  ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో మీ అందరి పాత్ర ఎంతో కీలకం.  నేను మీ అందరితో, ఇతర భాగస్వాములతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉంటాను; ఇది కొనసాగుతుంది.  ప్రతి ఒక్క రంగాని కి చెందిన సవివరమైన అధ్యయనం తో మీరు ముందుకు రండి; ఏకాభిప్రాయాన్ని సాధించండి; నూతన భావన లకు ఊపిరులు ఊదండి, పెద్ద గా ఆలోచించండి. మనందరం కలిసికట్టుగా దేశ గతి ని మార్చగల మరిన్ని వ్యవస్థాత్మక సంస్కరణల ను చేపడుదాము.

మనం క‌లిసిక‌ట్టుగా ఒక స్వ‌యంస‌మృద్ధమైనటువంటి భార‌తదేశాన్ని నిర్మిద్దాము. మిత్రులారా, రండి.. దేశాన్ని స్వ‌యంస‌మృద్ధం చేస్తామ‌నే ప్ర‌తిన ను పూనండి.  ఆ సంక‌ల్పాన్ని సాకారం చేయ‌డానికి మీ శ‌క్తి ని అంతటి ని ఉప‌యోగించండి.  ప్ర‌భుత్వం మీతో నిలుస్తుంది.  మీరంద‌రూ ఈ ల‌క్ష్యాల సాధన విష‌యం లో ప్ర‌భుత్వం తో కల‌వాలి.  మీరు విజ‌యాన్ని సాధిస్తారు, మ‌నం సఫలత ను సాధిస్తాము, దేశం నూతన శిఖ‌రాల‌ కు చేరుతుంది, స్వ‌యం స‌మృద్ధం అవుతుంది.  125 సంవ‌త్స‌రాల ను పూర్తి చేసుకున్న సంద‌ర్భం లో సిఐఐ ని నేను మ‌రో మారు అభినందిస్తున్నాను. అనేకానేక ధ‌న్య‌వాదాలు.

**