ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి – భారతీయ తపాలా చెల్లింపుల బ్యాంకు (I.P.P.B) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వంద శాతం భారత ప్రభుత్వ మూలధనంతో – తపాలా శాఖ కింద – ప్రభుత్వరంగ సంస్థ గా ఇది ఏర్పాటు కానుంది.
ప్రోజెక్టు మొత్తం వ్యయం 8 వందల కోట్ల రూపాయలు. దేశంలోని పౌరులందరూ – ముఖ్యంగా – సాంప్రదాయ బ్యాంకింగ్ కార్యకలాపాలు అందుబాటులో లేని – దేశ జనాభాలోని 40 శాతం మంది – ఈ ప్రోజెక్టు ద్వారా లబ్ది పొందుతారు. దశలవారీగా ఈ ప్రోజెక్టు దేశవ్యాప్తంగా ప్రారంభమౌతుంది. 2017 మార్చి కల్లా I.P.P.B. – భారతీయ రిజర్వుబ్యాంకు నుంచి లైసెన్స్ పొందుతుంది. 2017 సెప్టెంబరు నుంచి దేశవ్యాప్తంగా I.P.P.B. సేవలు అందుబాటులోకి వస్తాయి. 650 చెల్లింపుల బ్యాంకు శాఖలు, తపాలా కార్యాలయాలతో పాటు, ప్రాధమిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే మొబైల్ ఫోనులు, A.T.M. లు, PoS / m-PoS పరికరాలు వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సాధారణ చెల్లింపులు జరుగుతాయి.
బ్యాంకు శాఖలు లేని, బ్యాంకు సేవలు తక్కువగా అందుబాటులో ఉన్న గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి తో – ఈ ప్రోజెక్టులో క్రమంగా ఇతర ఆర్ధికపరమైన సేవలను కూడా చేర్చే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. సాధారణ బ్యాంకు చెల్లింపులు, జమ చేయడంతో పాటు – బీమా, మ్యూచువల్ ఫండ్స్, పింఛన్ లు, రుణాలు, క్రెడిట్ కార్డుల వంటి సేవలు ఇందులో ఉంటాయి. దీనివల్ల బ్యాంకింగ్ రంగంలో నిపుణులైన వారికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఆర్ధిక సేవల అవగాహన పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువమందికి అందుబాటులో ఉండే విషయంలో – ఇది ప్రపంచం లోనే అతి పెద్ద బ్యాంకు గా తయారవుతుంది. నగదు రహిత / తక్కువ నగదు లావాదేవీలతో నడిచే ఆర్ధిక వ్యవస్థను ఇది ప్రోత్సహిస్తుంది.
నేపధ్యం
I.P.P.B. ని ఏర్పాటు చేయాలనేది 2015-16 లో బడ్జెట్ ప్రకటనల్లో ఒకటిగా ఉంది. భారతీయ తపాలా చెల్లింపుల బ్యాంకు ఏర్పాటుచేయడానికి – తపాలా శాఖ – 2015 సెప్టెంబర్ లో భారతీయ రిజర్వు బ్యాంకు నుంచి – ప్రాధమిక ఆమోదం పొందింది. తపాలా శాఖకు అందుబాటులో ఉన్న network, వనరులు, విస్తరణ, పరపతి ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో, నాణ్యమైన ఆర్ధిక సేవలను, దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులకు – సులువుగా అందుబాటులో ఉండే విధంగా – భారతీయ తపాలా చెల్లింపుల బ్యాంకు కృషి చేస్తుంది.