గగనయాన్ కార్యక్రమ పరిధిని విస్తరించడం ద్వారా భారతీయ అంతరిక్ష కేంద్రం మొదటి యూనిట్ ను నిర్మించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. భారతీయ అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్ (బీఏఎస్ -1) అభివృద్ధికీ, అలాగే బీఏఎస్ నిర్మాణం, నిర్వహణ కోసం వివిధ సాంకేతిక పరిజ్ఞానాల ప్రదర్శన, ధ్రువీకరణ మిషన్లను చేపట్టడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. బీఏఎస్ లో నూతన పరిణామాలు, రాబోయే మిషన్లు, కొనసాగుతున్న గగనయాన్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి కావాల్సిన అదనపు అవసరాలను తీర్చేందుకు గగనయాన్ కార్యక్రమ పరిధినీ, నిధుల కేటాయింపులనూ సవరించారు.
బీఏఎస్ లో నూతన పరిణామాల విస్తృతి, రాబోయే మిషన్లను చేర్చడం, మానవ రహితంగా ఒక అదనపు ప్రయోగ రూపకల్పన, కొనసాగుతున్న గగనయాన్ లో ఉత్పన్నమయ్యే నూతన పరిణామాలకు కావలసిన అదనపు హార్డ్ వేర్ ఆవశ్యకతల దృష్ట్యా గగనయాన్ కార్యక్రమ విధి విధానాలను సవరించారు. సాంకేతికాభివృద్ధి, ప్రదర్శనకు గుర్తుగా ఎనిమిది మిషన్ల ద్వారా చేపట్టే ఈ మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమ సన్నాహలు– బీఏఎస్ -1 ఒకటో యూనిట్ ను ప్రయోగించడంతో అంటే, డిసెంబర్ 2028 నాటికి పూర్తవుతాయి.
మానవ అంతరిక్షయానాన్ని ముందుగా భూమి సమీప కక్ష్య (ఎల్ఈఓ) వరకు చేపట్టి, దీర్ఘకాలంలో దేశ మానవ అంతరిక్ష అన్వేషణా కార్యక్రమాలకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి పునాది వేయడమే 2018 డిసెంబరులో ఆమోదించిన గగనయాన్ కార్యక్రమ ఉద్దేశం. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం పని ప్రారంభించడం, 2040 నాటికి భారతీయుడు చంద్రుడిపై కాలుపెట్టడంతో పాటు, అంతరిక్షానికి సంబంధించిన అనేక ఇతర అంశాలపై ఈ అమృత కాలంలో దృష్టి సారించారు. ఎక్కువ సమయంపాటు కొనసాగే మానవ అంతరిక్ష యాత్రలు చేపట్టడానికి, చంద్రుడు తదనంతర అంతరిక్ష అన్వేషణకు అవసరమైన సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి అన్ని ప్రధాన అంతరిక్ష దేశాలు గణనీయమైన ప్రయత్నాలు చేస్తూ, పెట్టుబడులు పెడుతున్నాయి.
గగనయాన్ – పరిశ్రమలు, విద్యారంగం, ఇతర జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ఇస్రో నేతృత్వంలో జరిగే ఒక జాతీయ ప్రయోగం. ఇస్రోలో వ్యవస్థీకృతమై ఉన్న ప్రాజెక్టు నిర్వహణా యంత్రాంగం ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. దీర్ఘకాలంపాటు సాగే మానవ అంతరిక్ష యాత్రల కోసం కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, ప్రదర్శించడం దీని లక్ష్యం. ఇందుకోసం, కొనసాగుతున్న గగనయాన్ కార్యక్రమం కింద 2026 నాటికి ఇస్రో నాలుగు మిషన్లను చేపడుతుంది. అలాగే బీఏఎస్ మొదటి మాడ్యూల్ నిర్మాణం, వివిధ సాంకేతిక పరిజ్ఞానాల ప్రదర్శన, ధ్రువీకరణ కోసం నాలుగు మిషన్లను 2028 డిసెంబర్ నాటికి అభివృద్ధి చేస్తుంది.
భూమి సమీప కక్ష్య (లో ఎర్త్ ఆర్బిట్) కు చేపట్టే మానవ అంతరిక్ష యాత్రలకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలను దేశం సంపాదిస్తుంది. భారతీయ అంతరిక్ష కేంద్రం వంటి జాతీయ అంతరిక్ష–ఆధారిత సదుపాయం మూలంగా మైక్రోగ్రావిటీ ఆధారిత శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలు పెరుగుతాయి. ఇది సాంకేతిక మార్పులకు దారితీస్తుంది. పరిశోధన, అభివృద్ధి వంటి కీలక రంగాలలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. మానవ అంతరిక్ష కార్యక్రమంలో పారిశ్రామిక భాగస్వామ్యం, ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం అవసరమైన అంతరిక్షం, దాని అనుబంధ రంగాల్లో మరిన్ని ఎక్కువగా లభిస్తాయి. ఇప్పటికే ఆమోదించిన కార్యక్రమానికి అదనంగా రూ .11170 కోట్లు కేటాయించడంతో, సవరించిన గగనయాన్ కార్యక్రమానికి మొత్తం నిధులు రూ .20193 కోట్లకు పెరిగాయి.
దేశంలోని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు చేపట్టడానికి, మైక్రోగ్రావిటీ ఆధారిత శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముఖ్యంగా యువతకు ఈ కార్యక్రమం ఒక అపూర్వమైన అవకాశాన్ని అందిస్తుంది. ఫలితంగా వచ్చే ఆవిష్కరణలు, సాంకేతిక మార్పులు సమాజానికి ఎంతో మేలు చేస్తాయి.
***
Great news for the space sector! The Union Cabinet has approved the first step towards the Bharatiya Antariksh Station (BAS), expanding the Gaganyaan programme! This landmark decision brings us closer to a self-sustained space station by 2035 and a crewed lunar mission by 2040!…
— Narendra Modi (@narendramodi) September 18, 2024