Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం-వియత్ నామ్ నేతల వర్చువల్ సమిట్

భారతదేశం-వియత్ నామ్ నేతల వర్చువల్ సమిట్


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వియత్ నామ్ సమాజవాది గణతంత్రం ప్రధాని శ్రీ గుయెన్ జువాన్ ఫుక్ తో ఒక శిఖరాగ్ర సమ్మేళనాన్ని వర్చువల్ పద్ధతి లో నిర్వహించారు.

ప్రస్తుతం అమలవుతున్న ద్వైపాక్షిక సహకారపూర్వక కార్యక్రమాలను ఇద్దరు ప్రధాన మంత్రులు సమీక్షించారు.  వారు ప్రాంతీయ అంశాలను గురించి, ప్రపంచ అంశాలను గురించి కూడా చర్చించారు.  శిఖర సమ్మేళనం సాగిన క్రమం లో భారతదేశం-వియత్ నామ్ సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యం భావి పురోగతి కి మార్గదర్శనం చేయడానికి ఉద్దేశించిన ‘శాంతి, సమృద్ధి మరియు ప్రజల కోసం సంయుక్త దృష్టికోణం’ అనే ఒక పత్రాన్ని ఆమోదించడం జరిగింది.  ఈ సంయుక్త  దృష్టికోణ పత్రాన్ని అమలు చేయడానికి 2021-2023 మధ్య కాలానికి గాను ఒక కార్యాచరణ ప్రణాళిక పై సంతకాలు పూర్తి కావడాన్ని కూడా ఇరువురు నాయకులూ స్వాగతించారు.

రెండు దేశాల మధ్య సన్నిహితత్వం గల రంగాలన్నిటిలోను ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవడానికి ప్రాముఖ్యం ఇవ్వవలసి ఉంది అని నేతలు స్పష్టం చేశారు.  ఉభయ దేశాలలో జాతీయ అభివృద్ధి ప్రాధమ్యాల కు మద్దతును ఇవ్వాలని, శాంతియుతమైన, స్థిరమైన, భద్రమైన, స్వేచ్ఛాయుతమైన, అన్ని వర్గాలను కలుపుకొనిపోయే, నియమాలపై ఆధారపడివుండే ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ఆవిష్కరించాలి అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించే దిశ లో కలసికట్టుగా కృషి చేయాలి అంటూ వారు సమ్మతి ని వ్యక్తం చేశారు.

వారు కోవిడ్-19 మహమ్మారి సహా ప్రపంచ ఉమ్మడి సవాళ్ల విషయం లో సహకారాన్ని పటిష్టపర్చుకోవడానికి వారి వచనబద్ధత ను కూడా  పునరుద్ఘాటించారు.  మహమ్మారి నిరోధానికి ఉద్దేశించిన టీకామందులను అందుబాటులోకి తీసుకువచ్చేటట్టు చూడటం లో క్రియాశీల సహకారాన్ని కొనసాగించాలని అంగీకరించారు.  అనేక ప్రపంచ అంశాలపై, ప్రాంతీయ అంశాలపై ఒకే మాదిరి ఆలోచనల బలమైన పునాది ప్రాతిపదికన భారతదేశం, వియత్ నామ్ లు ఐక్య రాజ్య సమితి భద్రత మండలి తో పాటు బహు పక్ష వేదికల లో సన్నిహితం గా సమన్వయం తో పనిచేయాలని నేత లు నిర్ణయించారు.  భారతదేశం, వియత్ నామ్ లు 2021 వ సంవత్సరం లో ఐక్య రాజ్య సమితి భద్రత మండలి లో ఏక కాలం లో సేవలను అందించనున్నాయి.

భారతదేశ ‘ఇండో- పసిఫిక్ ఓశన్స్ ఇనిశియేటివ్’ కు, ఆసియాన్ కు చెందిన ‘అవుట్ లుక్ ఆన్ ఇండో- పసిఫిక్’ కు మధ్య సముద్ర సంబంధి అధికార పరిధి లో ఒకే మాదిరి ఆలోచనల పై ఆధారపడిన నూతన, ఆచరణీయ సహకారానికి గల అవకాశాలను అన్వేషించాలని, ఆ ప్రాంతం లో అన్ని పక్షాల కు ఉమ్మడి భద్రత, ఉమ్మడి సమృద్ధి, ఉమ్మడి వృద్ధి లక్ష్య సాధనకు ఈ విధం గా కృషి చేయాలని ప్రధానులిద్దరూ అంగీకారాన్ని వ్యక్తం చేశారు.  

త్వరిత గతి న ప్రభావాన్ని ప్రసరించే పథకాలు, ఐటిఇసి కార్యక్రమాలు, ఇ-ఐటిఇసి (e-ITEC) కార్యక్రమాలు, పిహెచ్ డి ఫెల్ శిప్ స్ వంటి కార్యక్రమాల కు తోడు వియత్ నామ్ తాలూకు ఎస్ డిజిస్, డిజిటల్ కనెక్టివిటి, వారసత్వ సంరక్షణ ప్రయాసల కు మద్దతిచ్చే పథకాల ద్వారా వియత్ నామ్ తో భారతదేశం తన అభివృద్ధి, సామర్థ్య పెంపుదల సంబంధి భాగస్వామ్యాన్ని కొనసాగించ గలదంటూ ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.  
 
వియత్ నామ్ కు భారత ప్రభుత్వం అందజేసిన 100 మిలియన్ యుఎస్ డాలర్ విలువైన డిఫెన్స్ లైన్ ఆఫ్ క్రెడిట్ విజయవంతంగా అమలుకావడం, అలాగే వియత్ నామ్ లోని నిన్హ్ థువాన్ ప్రాంతం లో స్థానిక సముదాయం ప్రయోజనం కోసం ఉద్దేశించిన భారతదేశం ఇచ్చిన ఆర్థిక సహాయం ద్వారా ఏడు అభివృద్ధి పథకాలు పూర్తి కావడం పట్ల  ఇద్దరు ప్రధాన మంత్రులు ప్రశంస లు కురిపించారు.

భారతీయ పురాతత్వ సర్వేక్షణ (ఎఎస్ఐ) ఇటీవల వియత్ నామ్ లో ‘మై సన్ టెంపల్’ పరిసరాల తాలూకు జీర్ణోద్ధరణ, సంరక్షణ కార్యాలను పూర్తి చేయడం పట్ల ప్రధాన మంత్రి ప్రత్యేకంగా సంతృప్తి ని వ్యక్తం చేస్తూ, వియత్ నామ్ లో ఇలాంటివే ఇతర పథకాల విషయం లోనూ సేవలను అందించగలం అంటూ ప్రస్తావించారు.

 

***