భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య ఆడియో విజువల్ కో-ప్రొడక్షన్ కు సంబంధించిన ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఒప్పందం ప్రధాన అంశాలు :
· సినిమాలు, డాక్యుమెంటరీలు మరియు ఏనిమేషన్ చిత్రాల సహ నిర్మాణం ఈ ఒప్పందం పరిధిలోకి రానుంది.
· రెండు దేశాల సంబంధిత చట్టాలు మరియు నిబంధనావళికి అనుగుణంగా ఉండే ఏ జాతీయ ఆడియో-విజువల్ వర్క్ కు లభించే మాదిరి ప్రయోజనాలన్నీ ప్రతిపాదిత ఒప్పందానికి అనుగుణంగా రూపొందించిన ఆడియో-విజువల్ కో-ప్రొడక్షన్ కు కూడా లభించనున్నాయి.
· ఇది ఇరు దేశాల కళారూపాలు, సాంస్కృతిక రూపాల మార్పిడికి దారి తీస్తుంది. అంతే కాక, ఉభయ దేశాల ప్రజల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తుంది.
· మన సాఫ్ట్ పవర్ యొక్క సృజనాత్మకత శక్తిని చాటి చెప్పేందుకు కో-ప్రొడక్షన్ లు ఒక అవకాశాన్ని ప్రసాదిస్తాయి.
· ఆడియో-విజువల్ కో-ప్రొడక్షన్ రంగంలో నిమగ్నమయ్యే కళాకారులు, సాంకేతిక నిపుణులతో పాటు సాంకేతికేతర సిబ్బంది, ఇంకా నిర్మాణానంతర విధులను నిర్వర్తించే వారు, మార్కెటింగ్ విభాగం వారికి ఉపాధి అవకాశాలను కల్పించడానికి తోడ్పడుతుంది. తద్వారా రెండు దేశాల స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) పెరగగలదు.
· చిత్రీకరణ కోసం భారతీయ ప్రాంతాలను వినియోగించుకోవడమనేది భారతదేశానికి ప్రపంచంలో సినీ చిత్రీకరణకు ఎంపిక చేసుకోదగిన దేశంగా మరిన్ని అవకాశాలను అందివ్వగలదు.
భారతదేశం ఇంతవరకు ఇటలీ, యునైటెడ్ కింగ్ డమ్, జర్మనీ, బ్రెజిల్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, పోలండ్, స్పెయిన్, కెనడా, చైనా, ఇంకా.. రిపబ్లిక్ ఆఫ్ కొరియా లతో ఆడియో-విజువల్ కో-ప్రొడక్షన్ రంగంలో ఒప్పందాలను కుదుర్చుకుంది.
***