ఉత్పాదక వస్తువుల ఉప రంగాలు సహా తయారీ రంగంలో టెక్నాలజీ రిసోర్సింగ్ కు సంబంధించి సాంకేతిక విజ్ఞాన సంబంధ బదలాయింపుపై జర్మనీకి చెందిన స్టీన్ బీస్ జి ఎమ్ బి హెచ్ సి ఒ. కె జి తో ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు) పై సంతకాలు జరిగిన సంగతిని మంత్రిమండలి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. జర్మనీ లోని హనోవర్ లో హనోవర్ మెస్సీ పారిశ్రామిక ప్రదర్శన- 2016 జరిగిన సందర్భంగా ఏప్రిల్ 25, 2016 నాడు ఎమ్ ఒ యు పైన సంతకాలయ్యాయి.
యూరోప్ లో అప్లయిడ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ కు పేరు తెచ్చుకొన్న సంస్థ స్టీన్ బీస్ జి ఎమ్ బి హెచ్. ఇది తయారీ రంగంలో గుర్తించిన ప్రాజెక్టులను అమలు చేయడంలో ఒక టెక్నాలజీ రిసోర్స్ పార్ట్ నర్ గా వ్యవహరించనుంది. ఎమ్ ఒ యు లో పేర్కొన్న ప్రకారం ఈ కింది రంగాలలో సహకారం లభించే అవకాశం ఉంది :
అ) ప్రత్యేక సాంకేతికతల ఆకృతి కల్పన;
ఆ) నిర్దిష్ట ఉత్పాదక వస్తువుల ఉప రంగాలకు సాంకేతిక విజ్ఞాన సంబంధి మార్గసూచీ రూపకల్పన;
ఇ) ఉత్పాదక వస్తువుల సముదాయం తాలూకు టెక్నాలజీ స్టేటస్ యొక్క అసెస్ మెంట్;
ఈ) సాంకేతిక విజ్ఞాన సంబంధి కార్యక్రమాలలో సహకారం; ఇంకా..
ఉ) భారతదేశంలో ఇప్పటికే పనిచేస్తున్న సాంకేతిక విజ్ఞాన సంస్థల స్థాయిని మెరుగుపరచడం / కొత్త సంస్థలను ఏర్పాటు చేయడం మరియు ఇతర సాంకేతిక విజ్ఞాన సంబంధిత సహకారాన్ని, సమన్వయాన్ని అందించడం.
భారతీయ ఉత్పాదక వస్తు రంగంలోని పారిశ్రామిక సాంకేతిక విజ్ఞాన ప్రాజెక్టుల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే ఒక సాధనమే ఈ ఎమ్ ఒ యు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు, ఉత్పాదక వస్తువుల రంగ యూనిట్ లకు సాంకేతిక విజ్ఞాన సంబంధమైన అంతరాలను గుర్తించడంలో, వాటిని పూడ్చుకోవడంలో స్టీన్ బీస్ జి ఎమ్ బి హెచ్ సామర్థ్యాలు, ప్రావీణ్యం సులభంగా అందుబాటులోకి వచ్చే విధంగాఒక వేదికను ఈ ఎమ్ ఒ యు ఏర్పరుస్తుంది.