భారతదేశానికి, చిలీ కి మధ్య అమలులో ఉన్న ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ (పి టి ఎ) ను విస్తరించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
చిలీ కి భారతదేశం జరుపుతున్న ఎగుమతులు వైవిధ్యభరితమైనవి. చిలీ అందజేస్తున్న పలు విధాలైన టారిఫ్ శ్రేణిని పరిగణనలోకి తీసుకొంటే, విస్తరించిన పి టి ఎ భారతదేశానికి గొప్ప ప్రయోజనాన్ని కలగజేయగలదు. విస్తరించిన పి టి ఎ లో భాగంగా, 1798 టారిఫ్ లైన్స్ లపై 30 శాతం నుంచి 100 శాతం శ్రేణి మార్జిన్ ఆఫ్ ప్రిఫరెన్స్ (ఎమ్ ఒ పి) తో ప్రత్యేక సౌకర్యాలను ప్రతిపాదించింది. భారతదేశం కూడా చిలీకి 1031 టారిఫ్ లైన్ లపై 8 అంకెల స్థాయిలో 10 శాతం నుంచి 100 శాతం శ్రేణి ఎమ్ ఒ పి ని తో ప్రత్యేక సౌకర్యాలను ప్రతిపాదించింది. ప్రతిపాదిత విస్తరించిన పి టి ఎ లో భాగంగా, భారతదేశం నుంచి చిలీకి జరిగే ఎగుమతులలో 86 శాతం ఎగుమతులు ప్రత్యేక సౌకర్యాలకు నోచుకోగలవు. ఇది మన ఎగుమతులు సమీప భవిష్యత్తులో రెట్టింపు అయ్యేందుకు దోహదం చేయగలదు.
భారతదేశం, చిలీ ల మధ్య ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ (పి టి ఎ) పై 2006 మార్చి నెలలో సంతకాలు జరిగాయి. ఆ పి టి ఎ 2007 ఆగస్టు నుంచి అమలు లోకి వచ్చింది. 2006-07 లో భారతదేశ ఎగుమతుల గమ్య స్థానాలలో చిలీ 51 వ స్థానంలో నిలచింది. 2006-07 లో ద్వైపాక్షిక
వ్యాపారం 2.3 బిలియన్ యు ఎస్ డాలర్ల మేర నమోదైంది. 2007 సెప్టెంబరు లో పి టి ఎ అమలులోకి వచ్చిన తరువాత వ్యాపారంలో చురుకుదనం పెరిగింది. 2006-07 నుంచి 2014-15 మధ్య కాలంలో ద్వైపాక్షిక వ్యాపారం 58.49 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2014-15 లో ద్వైపాక్షిక వ్యాపారం 3.65 బిలియన్ యు ఎస్ డాలర్ల వద్ద నిలువగా, ఇందులో ఎగుమతులు 0.57 బిలియన్ యు ఎస్ డాలర్లు గాను, దిగుమతులు 3.08 బిలియన్ యు ఎస్ డాలర్లు గాను ఉన్నాయి.
చిలీతో భారతదేశానికి స్నేహపూర్వకమైన సంబంధాలు ఉన్నాయి. అంతర్జాతీయ చర్చావేదికలలో భారతదేశానికి చిలీ సహకారాన్ని అందిస్తూ వస్తోంది. భారతదేశానికి, చిలీ కి మధ్య అమలవుతున్న పి టి ఎ ను విస్తరించడం వల్ల ఈ రెండు దేశాల మధ్య వ్యాపారంతో పాటు ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు కూడా పెరగగలవు. ఈ విస్తరణ భారతదేశం-చిలీ సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయి కాగలుగుతుంది. పైపెచ్చు, భారతదేశం, ఎల్ ఎ సి దేశాల మధ్య నెలకొన్న సంప్రదాయ సౌహార్ద సంబంధాలను సుసంఘటితం చేయగలదు కూడా.