Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశంలో సుజుకి వ్య‌వ‌స్థాప‌న‌కు 40 ఏళ్లు నిండిన సందర్భంగా గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

భారతదేశంలో సుజుకి వ్య‌వ‌స్థాప‌న‌కు 40 ఏళ్లు నిండిన సందర్భంగా గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం


   భారతదేశంలో సుజుకి వ్య‌వ‌స్థాప‌న‌కు 40 ఏళ్లు నిండిన సందర్భంగా గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్‌లో జపాన్ రాయబారి గౌరవనీయ సతోషి సుజుకి, గుజరాత్ ముఖ్యమంత్రి, శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంటు సభ్యుడు, శ్రీ సి.ఆర్.పాటిల్, రాష్ట్ర మంత్రి శ్రీ జగదీష్ పంచాల్, సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రస్తుత అధ్యక్షుడు శ్రీ టి.సుజుకి మాజీ అధ్యక్షుడు శ్రీ ఒ.సుజుకి, మారుతి-సుజుకి చైర్మన్ శ్రీ ఆర్.సి.భార్గవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొనగా, జపాన్‌ ప్రధానమంత్రి మాననీయ ఫుమియో కిషిడా పంపిన వీడియో సందేశం ప్రదర్శించబడింది.

   సందర్భంగా జపాన్‌ ప్రధాని కిషిడా శుభాకాంక్షలు తెలియజేస్తూ- నాలుగు దశాబ్దాలుగా మారుతి-సుజుకి పురోగమనం భారత-జపాన్ల మధ్య బలమైన ఆర్థిక సంబంధాలకు నిదర్శనంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. భారత మార్కెట్ సామర్థ్యాన్ని గుర్తించడంపై సుజుకి యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. “భారత ప్రజల అవగాహన, ప్రభుత్వ మద్దతు వల్లనే ఈ విజయం సాధ్యమైందని నా అభిప్రాయం. ఇక ప్రధానమంత్రి మోదీ బలమైన నాయకత్వ నిర్దేశంలో తయారీ రంగానికి మద్దతుగా ఇటీవల పలు చర్యలు చేపట్టడంతో భారత ఆర్థిక వృద్ధి మరింత వేగం పుంజుకుంటోంది” అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ దేశానికి చెందిన అనేక కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులకు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయని వెల్లడించారు. భారత-జపాన్ స్నేహబంధానికి 70 ఏళ్లు పూర్తికావడం కూడా ఈ సంవత్సరం ప్రాముఖ్యాన్ని స్పష్టం చేస్తున్నదని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ప్రధాని మోదీతో సంయుక్తంగా ‘భారత-జపాన్‌ వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని’ మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు ‘స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ ప్రాంతం’ సాకారం దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని నేను నిశ్చయానికి వచ్చాను” అని ప్రకటించారు.

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌సంగిస్తూ- సుజుకి కార్పొరేష‌న్‌తో అనుబంధంగల ప్ర‌తి ఒక్క‌రినీ అభినందించారు. “భారతదేశంలోని అనేక కుటుంబాలతో సుజుకి అనుబంధం 40 ఏళ్లనుంచీ బలంగా కొనసాగుతోంది” అని ఆయన పేర్కొన్నారు. “మారుతి-సుజుకి విజయం  భారత-జపాన్‌ బలమైన భాగస్వామానికి నిదర్శనం. గత ఎనిమిదేళ్లలో, మన రెండు దేశాల మధ్య సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరాయి. నేడు గుజరాత్-మహారాష్ట్ర మధ్య బుల్లెట్ రైలు నుంచి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బనారస్‌లోని రుద్రాక్ష కేంద్రం దాకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు భారత-జపాన్ స్నేహానికి నిదర్శనాలు” అని ప్రధానమంత్రి వివరించారు. అలాగే “ఈ స్నేహం విషయంలో మన మిత్రుడు, జపాన్‌ మాజీ ప్రధాని దివంగత షింజో అబెను ప్రతి భారతీయుడూ కచ్చితంగా గుర్తుకు తెచ్చుకుంటాడు” అని ప్రధాని పేర్కొన్నారు. అబే సాన్  గుజరాత్‌కు వచ్చి కొంత సమయం ఇక్కడ గడిపడాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన రాకను గుజరాత్ ప్రజలు అప్పుడప్పుడూ ఎంతో ప్రేమగా జ్ఞప్తికి తెచ్చుకుంటుంటారని చెప్పారు. “మన రెండు దేశాలను మరింత సన్నిహితం చేయడానికి సాగిన ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం జపాన్‌ ప్రస్తుత ప్రధాని కిషిడా కూడా తనవంతు కృషి చేస్తున్నారు” అని వివరించారు.

   గుజరాత్‌లో  13 ఏళ్ల కిందట సుజుకి ప్రవేశాన్ని, సుపరిపాలనకు నమూనాగా ఈ రాష్ట్రం తననుతాను రుజువు చేసుకోవడాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. “సుజుకి సంస్థకిచ్చిన హామీని గుజరాత్‌ నిలబెట్టుకున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. సుజుకి కూడా అంతే గౌరవంగా గుజరాత్ ఆకాంక్షలను నెరవేర్చింది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమోటివ్ కూడలిగా గుజరాత్‌ అవతరించింది” అన్నారు. గుజ‌రాత్-జ‌పాన్ మ‌ధ్య సంబంధాల గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఇది రెండు దేశాల దౌత్య కోణానికి అతీతమైనదిగా ప్రధాని పేర్కొన్నారు. “నాకు గుర్తున్నంతవరకూ 2009లో ‘ఉజ్వల గుజరాత్‌’ సదస్సు ప్రారంభమైన నాటినుంచి రాష్ట్రంతో భాగస్వామ్య దేశంగా జపాన్‌ తన అనుబంధాన్ని కొనసాగిస్తోంది” అని ప్రధానమంత్రి అన్నారు. జపాన్‌ పెట్టుబడిదారులకు స్వదేశంలోనే ఉన్నామన్న అనుభూతి కలిగే విధంగా గుజరాత్‌లో ‘సూక్ష్మ జపాన్‌’ సృష్టికి తాను సంకల్పించానని ఆయన గుర్తు చేసుకున్నారు. దీన్ని సాకారం చేసేందుకు అనేక చిన్నచిన్న చర్యలు తీసుకున్నామని తెలిపారు. అందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్‌ కోర్సులు, జపాన్‌ వంటకాలు రుచిచూపించే రెస్టారెంట్లు, జపాన్‌ భాషకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి వంటి ప్రయత్నాలను ఈ సందర్భంగా ఉదాహరించారు.  “జపాన్ విషయంలో మన చర్యలు సదా హుందాగా.. గౌరవంతో కూడినవి కాబట్టే సుజుకి సహా దాదాపు 125 జపాన్ కంపెనీలు గుజరాత్‌లో పనిచేస్తున్నాయి” అని గుర్తుచేశారు. సుజుకితో పాటు దాదాపు 125 జపాన్ కంపెనీలు గుజరాత్‌లో పనిచేస్తున్నాయి” అని ఆయన చెప్పారు. అహ్మదాబాద్‌లోని ‘జెట్రో’ (JETRO) నడుపుతున్న సహాయ కేంద్రం అనేక కంపెనీలకు తక్షణ సౌకర్యాలను అందిస్తోందని పేర్కొన్నారు. అలాగే జపాన్-భారత తయారీ శిక్షణ సంస్థ చాలా మందికి శిక్షణ ఇస్తోందని తెలిపారు. గుజరాత్ అభివృద్ధి ప్రయాణంలో ‘కైజెన్’ పోషించిన పాత్రను ప్రధాని ప్రశంసించారు. ‘కైజెన్’ సంబంధిత అంశాలను తాను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) సహా ఇతర శాఖలలోనూ అమలు చేశామని ప్రధానమంత్రి చెప్పారు.

   విద్యుత్‌ వాహనాలకుగల విశిష్టతలను వివరిస్తూ- అవి నిశ్శబ్దంగా పనిచేస్తాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. వాహనం రెండు చక్రాలదైనా, నాలుగు చక్రాలదైనా ఎలాంటి శబ్దం చేయదని చెప్పారు.  “ఈ నిశ్శబ్దం కేవలం దాని ఇంజనీరింగ్ విశిష్టతలోనే కాకుండా దేశంలో నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికేది ఉంటుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్‌ వాహన పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే ప్రభుత్వ కృషిలో భాగంగా విద్యుత్‌ వాహన కొనుగోలుదారులకు వివిధ ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఈ మేరకు ఆదాయపు పన్నులో రాయితీ, రుణ ప్రక్రియను సరళీకరణ వంటి అనేక చర్యలు అనేకం చేపట్టినట్లు తెలిపారు. “సరఫరా పెంపు దిశగా వాహన-విడిభాగాల తయారీ రంగానికి ‘ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకం’ (పీఎల్‌ఐ) వంటి పథకాలు ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాం” అని ప్రధానమంత్రి వెల్లడించారు. అలాగే పటిష్ట విద్యుత్‌ వాహన ఛార్జింగ్ మౌలిక వసతుల కల్పనకు అనువుగా అనేక విధాన నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. “ఇందులో భాగంగా 2022 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో బ్యాటరీ మార్పిడి విధానం ప్రవేశపెట్టాం” అని ప్రధాని చెప్పారు. అలాగే “సరఫరా.. డిమాండ్.. పర్యావరణ వ్యవస్థల బలోపేతంతో విద్యుత్‌  వాహన రంగం కచ్చితంగా పురోగమిస్తుంది” అన్నారు.

   వాతావరణ మార్పుపై ‘కాప్‌-26’ సదస్సు సందర్భంగా భారతదేశం 2030 నాటికల్లా శిలాజేతర ఇంధన వనరుల నుంచి తన స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 50 శాతాన్ని సాధించగలదని ప్రకటించినట్లు ప్రధాని గుర్తుచేశారు. అదేవిధంగా “మనం 2070 నాటికి ‘నికర శూన్య’ ఉద్గారస్థాయిని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని ప్రధానమంత్రి తెలిపారు. మారుతి-సుజుకి కూడా జీవ ఇంధనం, పెట్రోల్‌-డీజిల్‌లో ఇథనాల్ మిశ్రమం, హైబ్రిడ్ విద్యుత్‌ వాహనాల తయారీపైనా కృషి చేస్తుండటంపై ప్రధాని హర్షం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘కంప్రెస్డ్ బయోమీథేన్ గ్యాస్‌’ సంబంధిత ప్రాజెక్టు పనులను కూడా సుజుకి ప్రారంభించాలని ఆయన  సూచించారు. ఆరోగ్యకర పోటీ, అనుభవాల ఆదానప్రదానానికి మెరుగైన వాతావరణం సృష్టించబడాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. “ఇది దేశానికి, వాణిజ్యానికీ ప్రయోజనకరం కాగలదు” అని ఆయన అన్నారు. “రాబోయే 25 సంవత్సరాల అమృత కాలంలో భారతదేశం తన ఇంధన అవసరాల్ల స్వయం సమృద్ధి సాధించడమే మా లక్ష్యం. ఇంధన వినియోగంలో ప్రధాన వాటాదారు రవాణా రంగం కాబట్టి, ఈ రంగంలో ఆవిష్కరణలు, కృషి మన ప్రాథమ్యాలుగా ఉండాలి. తద్వారా మనం ఈ లక్ష్యాన్ని సాధించగలమని నాకు నమ్మకముంది” అని ఆయన తన ప్రసంగం ముగించారు.

నేపథ్యం

   కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో సుజుకి సంస్థకు సంబంధించిన రెండు కీలక ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు- వీటిలో… గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో నిర్మించనున్న ‘సుజుకి మోటార్ గుజరాత్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ తయారీ’ కర్మాగారం, హర్యానాలోని ఖర్ఖోడాలో మారుతి-సుజుకి రూపొందిస్తున్న వాహన తయారీ కేంద్రం ఉన్నాయి. కాగా, గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో సుజుకి మోటార్ గుజరాత్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ తయారీ కర్మాగారం దాదాపు రూ.7,300 కోట్లతో ఏర్పాటవుతోంది. ఇక్కడ విద్యుత్‌ వాహనాల కోసం ‘అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ’లు తయారు చేస్తారు. ఇక హర్యానాలోని ఖర్ఖోడాలో ఏర్పాటయ్యే వాహన తయారీ కేంద్రం ఏటా 10 లక్షల ప్రయాణిక వాహనాలను తయారు చేయగలదు. ఈ కేంద్రం తొలిదశ పనులను రూ.11,000 కోట్లతో చేపడుతున్న నేపథ్యంలో అన్ని దశలూ పూర్తయ్యాక ప్రపంచంలో ఒకేచోటగల అతిపెద్ద ప్రయాణిక వాహన తయారీ కేంద్రంగా ఇది రికార్డులకెక్కుతుంది.